Author: Siri
•Friday, December 09, 2011
చాలా  రోజుల తర్వాత మళ్ళిఒక పాట  రికార్డ్ చేసాను ...ఈ పాట Rainbow చిత్రం లోనిది .



Author: Siri
•Wednesday, October 20, 2010
 "వెంకట్ నువ్వే లేకపోతే కావ్యను సముదాయించడం చాలా కష్టం అయ్యేది. నా స్నేహితుడు ఒకడు వాళ్ళ గురువుగారి ఆశ్రమానికి రమ్మని చెప్తున్నాడు. మీరందరూ కావ్యను బాగా చూసుకుంటారు అని నమ్మకంతోనే నేను కొన్ని రోజులు ఆశ్రమం వెళ్ళొద్దామని అనుకుంటున్నాను. మనసుకి కాస్త ప్రశాంతత కలుగుతుందని నా ఆశ. ఈ సమయంలో కావ్యకు మనుషుల మధ్యలో ఉండటం చాలా అవసరం. కావ్యను రేపే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. నేను రాగానే వచ్చి మిమ్మలిని కలుస్తాను" అని అన్నారు. 

         వెంకట్ సరే అని తల ఊపి ఆయన చేతి మీద చేతిని వేసి ధైర్యం చెప్పాడు. 



***        ***        ***        ***

         చూస్తుండగానే వారాలు, నెలలు దొర్లిపోయాయి. కావ్య కొంచెం కొంచెంగా మామూలు మనిషి అయ్యింది. కానీ కడుపులో బిడ్డ తన్నినప్పుడల్లా జరిగినవన్నీ తలచుకొని తల్లడిల్లిపోయింది కావ్య. జీవితం అస్తవ్యస్తంగా తోచినపుడల్లా వెంకట్, కావ్య అత్తయ్య అక్కున చేర్చుకొని ఊరట కలిగించారు. అన్నిటి కన్నా నానమ్మ ఒళ్ళో పడుకొని పుట్టబోయే బిడ్డ మీదనే తన ధ్యాస అంతా పెట్టుకొని తనకి తాను బ్రతకడం నేర్చుకొంది కావ్య. 

         జీవితంలో ప్రతీ ఒక్క అనుభవం ఒక్కో రకమైన పాఠాన్ని నేర్పుతుంది. బాధను అధిగమించడమే ముఖ్యం అనుకొని ఇప్పటివరకు దేని గురించి పట్టించుకోలేదు కావ్య. కానీ బాధను కొంచెం కొంచెంగా అధిగమించడం అలవాటు చేసుకున్న కావ్యకు ఇప్పుడు తన జీవితం ఏంటి అన్న ప్రశ్న మొదలు అయ్యింది. 

         ఆ ప్రశ్న హరిణి రూపంలో పెరిగి పెద్దదయ్యి కావ్యను ఆలోచనలో పడేసింది. 

         హరిణి రావడమే హడావుడి మొదలు అయిపోతుంది. ఈ సారి ఎలాగైనా తన చిన మామగారి కూతురి సంబంధం గురించి తండ్రితో మాట్లాడాలి అని నిర్ణయంతో వచ్చింది. 

         లోపల కావ్యను చూడాగానే నొసలు చిట్లించింది. మాట వరసకు పలకరించి లోపలకు వెళ్ళిపోయింది. తల్లి కనిపించడంతో నెమ్మదిగా తన పని మొదలుపెట్టింది. 

         "అమ్మా ఇంకా కావ్యను ఎన్ని రోజులు ఉంచుకుందామని ఇక్కడ?" అని అడిగింది నెమ్మదిగా. 

         "ఎన్ని రోజులేమిటే? అది ఇంక ఇక్కడే ఉంటుంది. దానికి మనం తప్ప ఇంకెవరున్నారు" అని వెంకట్ తల్లి విసుగ్గా చూసింది హరిణి వైపు. 
"ఏదో కొన్ని రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోతే పర్వాలేదు. రేపు పురుడు పుణ్యం అని ఎన్నో ఉంటాయి. అదీ కాకుండా వెంకట్ కి పెళ్ళి అయితే ఆ వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉండదూ? ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ మంచిది. కావాలంటే కాస్త డబ్బు సాయం చెయ్యండి" అని సలహా విసిరేసింది.

         "ఏమిటే ఆ మాటలు? అదెక్కడికి పోతుంది ఈ సమయంలో. కొంచెం కూడా దయా, జాలీ లేకుండా మాట్లాడకు. కావ్య వింటే బాధ పడుతుంది" అంది ఆవిడ నమ్మ లేనట్టు.

         "ఏమిటమ్మా నేను అన్నదాంట్లో తప్పు? రేపు వెంకట్ కు పెళ్ళి అయ్యి మీరు అన్నయ్య దగ్గరకు సింగపూర్ వెళ్ళిపోతే కావ్యను చూసేది ఎవరు? రేపు తన వల్ల మన కుటుంబంలో ఎలాంటి సమస్య రాకూడదు అనే చెప్తున్నాను. కావాలంటే ఏదన్నా రెండవ పెళ్ళివాడు ఎవరన్నా ఉన్నారేమో చూసి పెళ్ళి చేసేయ్యండి. ఏదో చుట్టరికాలు అని చూసుకుంటే తరువాత బాధ పడాల్సి ఉంటుంది" అని అంది.

         "ముగ్గురి పిల్లలిని ఒకలాగే పెంచాను కదే? నీకు ఇలాంటి పాడు బుద్ధి ఎక్కడ నుంచి వచ్చింది? ఇప్పుడు అంటే అన్నావు కానీ మళ్ళీ అనకు. కావ్య మనలో ఒకతి. నీకు నీ అన్నదమ్ములంటే ఎంత అభిమానమో నాకూ అంతే అభిమానం నా అన్నయ్య మీద ఉంది. ఆయన ప్రాణంతో సమానమైన కావ్య నాకు ముఖ్యం. నీకు చుట్టరికాలు అన్నీ అవసరానికి పనికొచ్చే వస్తువులా కనిపించొచ్చు. ఈ విషయంలో నువ్వు మాట్లాడకపోవడమే మేలు. మీ నాన్నగారు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా నువ్వు ఏదో ఒకటి మొదలు పెట్టకు. అర్థం అయ్యిందా?" అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది.

         హరిణికి ఉక్రోషంతో ముఖం మాడ్చుకుంది.

         గదిలోనుండి బయటకు వచ్చిన హరిణికి కావ్య కనిపించింది. ఒక్కసారి ఏదో తప్పు చేసినట్లు చూపులు మరల్చుకొంది హరిణి. హరిణి పక్కగా వచ్చి నిల్చొంది కావ్య. హరిణి భుజం మీద చెయ్యి వేసింది. హరిణి తల్లితో అన్న మాటలు కావ్య చెవిలో పడ్డాయి. కానీ ఈ సారి హరిణి మాటలు కావ్యను కలవర పెట్టలేదు.

         "వదినా! నువ్వు అత్తయ్యతో అన్న మాటలు అన్నీ విన్నాను. కానీ నాకు నీ మీద ఏ మాత్రం కోపం లేదు. నువ్వు బావ మీద ప్రేమతో అతని జీవితం బాగుండాలని తాపత్రయం పడుతున్నావు.అది నేను అర్థం చేసుకోగలను. నీకు నేను చేసిన ప్రమాణం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. నువ్వు కంగారు పడకు. మామయ్య గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. రేపే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను" అని కావ్య అనడంతో హరిణి కావ్య వైపు చూసింది. ఇంక ఏమి చెప్పడానికి లేనట్టు వెళ్ళిపోయింది హరిణి.

         కావ్యకు తన జీవితం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టుగా అనిపించింది.

         "ఎంత విచిత్రమైనది జీవితం? అంతా సవ్యంగా జరుగుతుందని, జరగాలని తలుస్తాము. జీవితం సవ్యంగా కాకుండా గాడి తప్పితే దానిని ఎదుర్కునే శక్తినే కోల్పోతాము. అమ్మా, నాన్న ఇలా జరుగుతుంది అని ఊహించి కూడా ఉండరు. తన తోటి వాళ్ళంతా చదువు అని ఆరాట పడుతుంటే తను మాత్రం జీవితం అంటే అవగాహన లేకుండానే ఉండిపోయింది. ఇప్పుడు తన బాధ్యత ఎవరిది అని ఆలోచించాల్సిన స్థితిలో ఉండిపోయింది. ఇలా బంధాలు ఏర్పరుచుకొని ఆ బంధాలు విడిపోతే జీవితంలో ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ఇలా ఎప్పుడూ ఎవరోకరి మీద ఆధారపడి జీవించడంలోనే సుఖం, స్వర్గం అని నమ్మింది" అని మనసులో అనుకుంది కావ్య.

         ఒకరకంగా హరిణి తనలో ప్రేరణ కలిగించినందుకు కావ్య సంతోషించింది. కానీ ఇంత మంది తనను ప్రేమించే వాళ్ళు చుట్టూ అల్లుకున్ని ఉన్నా తను ఓంటరి అన్న భావం కావ్యలో కలిగింది. ఆ భావం లోంచి ఒక భయం.

         "కానీ తనిప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఏం చేస్తుంది? తనకు చదువు కూడా పూర్తి కాలేదు. తనకి ఏదన్నా ఉద్యోగం కావాలన్నా ఎవరిస్తారు? ఏదో కొంత డబ్బు, ఇల్లు ఉన్నా అది ఎన్ని రోజులకు సరిపోతుంది? ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళక తప్పదు. ఈ రోజు జాలితో తనను చేరదీసినా రేపు ఏదోక రోజు తనను భారంగా భావిస్తే తను తట్టుకోగలదా? ఎన్ని రోజులు మాత్రం అత్తయ్య, బావా అని చనువుగా ఉండగలదు?" అని ప్రశ్నించుకుంది.

         అన్ని ప్రశ్నలకు సమాధానం తను ఇక్కడనుండీ తొందరగా వెళ్ళిపోవడమే అని నిర్ణయించుకుంది.

         అనుకోవడమే తడవుగా బట్టలు సర్దడం మొదలుపెట్టింది. పక్కనే మూలుగుతూ కావ్య నానమ్మ లేచి కూర్చుంది. ఆవిడ కొడుకు, కోడలు పోయిన దగ్గర నుండి ఒక్కసారిగా జబ్బు పడ్డట్టు అయిపోయింది. ఎప్పుడూ లేనిది రోజంతా మంచంలోనే గడుపుతోంది.

         "ఏమ్మా కావ్యా ఎందుకు బట్టలు సర్దుతున్నావు?" అని అంది దగ్గుతూ.

         "అదేం లేదు నానమ్మ. మావయ్యగారిని చూసొద్దామని అనిపిస్తోంది. కొన్ని రోజులు వెళ్ళి వస్తాను. నువ్వు పడుకో నానమ్మ" అని పట్టుకొని కూర్చుంది.

         "ఎన్ని రోజులు ఉంటావు? రెండు రోజుల్లో వచ్చేస్తావా? లేదంటే నేను కూడా వచ్చేస్తాను నీతో. నన్ను మాత్రం వదిలి పెట్టి వెళ్ళిపోకు" అంది కావ్య ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని. 

 "వచ్చేస్తాను నానమ్మ. మామయ్య గారు పాపం ఒక్కరు ఉన్నారు కదా? ఆయన ఇక్కడికి వచ్చి ఉండలేరు కదా? కొన్ని రోజులు ఉండి వస్తాను" అని అప్పటికి సమాధాన పరిచింది.

         నిజం చెప్తే ఆవిడ ససేమిరా ఒప్పుకోదని కావ్యకు తెలుసు. ఆవిడను తీసుకెళ్ళి తనతో పాటు బాధలు పెట్టడం ఇష్టం లేక కావ్య ప్రస్తుతానికి నిజం చెప్పకుండా దాచింది. ఎవ్వరికీ తెలియకుండా రాజారాం గారికి ఫోన్ చేసింది కావ్య. వీలైనంత తొందర్లో వచ్చి తీసుకెళ్ళమని చెప్పింది.


***        ***        ***        ***        

         సాయంత్రం హడావుడిగా బట్టలు సర్దుకొని బయలుదేరిపోయింది హరిణి. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కావ్య అత్తయ్య మాత్రం దూరంగా కూర్చొని తనకేమి పట్టనట్టు పువ్వులు మాల కట్టుకుంటోంది. అది చూసి హరిణికి ఇంకా ఉక్రోషం ఎక్కువయ్యింది.

         "సరే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నా కన్నా మిగతా వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. కనీసం ఉండమని చెప్పమని కూడా అనడం లేదు" అంది తల్లి వంక గుర్రుగా చూస్తూ.

         వెంకట్ లోపలకు రాగానే హరిణి మాటలు గట్టిగా వినిపించాయి.

         "అక్కా ఎక్కడికి బయలుదేరావు?" అని అడిగాడు.

         "ఇంకెక్కడికి? మా ఇంటికే. ఇక్కడ నా మాట వినే వాళ్ళు లేరు" అంది హరిణి కోపంగా.

         "సరే ఇప్పుడు ఎలా వెళ్తావు? బావగారు రాగానే వెళ్ళిపోదువు" అని బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు.

         "అయినా నీ సంగతి చెప్పు. ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? వాళ్ళు ఎన్ని రోజులని ఎదురు చూస్తారు? ఏదొక సమాధానం చెప్పాలి కదా?" అని నిలదీసింది.

         "అక్కా అదంతా తరువాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కాదు" అన్నాడు వెంకట్.

         "మరి ఎప్పుడురా మాట్లాడేది? ఆ కావ్య వచ్చిన దగ్గర నుంచి నీలో మళ్ళీ మార్పు వచ్చింది. ఇలా దాని కోసం ఏడుస్తూ ఎన్ని రోజులు గడుపుతావు? నీ గురించి ఆలోచించు" అంది కోపంగా.

 వెంకట్ చివుక్కున వెనక్కి తిరిగి చూసాడు. మళ్ళీ ఇంతలోనే సర్దుకొన్నాడు.

         "ఇప్పుడు కావ్య సంగతి ఎందుకు? నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను. వాళ్ళకి కంగారుగా ఉంటే వేరే సంబంధం చూసుకోమని చెప్పెయ్యి" అని ఖచ్చితంగా చెప్పేసాడు.

         "ఇదంతా కావ్య వల్లే కదూ? దాని జీవితం ఇలా అయిపోయినందుకు నువ్వు ఎన్ని రోజులు బాధపడతావు? నువ్వు కావ్యను ఇంకా ప్రేమిస్తున్నావా?" అని అంది వెంకట్ చెయ్యి పట్టుకొని.

         "అక్కా" అని గట్టిగా ఏదో అనబోయాడు.

         కానీ ఎదురుగా నిల్చొన్న రాజారాం గారిని చూసి ఒక్క నిముషం అవాక్కయ్యాడు. మరు నిముషంలో తేరుకొని లోపలకు రమ్మని ఆహ్వానించాడు. కాఫీ ఫలహారాలు అయ్యాక వచ్చిన విషయం చెప్పారు ఆయన. కావ్య అత్తయ్య, వెంకట్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

         "కావ్యను నాతో తీసుకెళదామని వచ్చాను. నిన్న కావ్య ఫోన్ చేసి చెప్పింది. ఈ రోజే సాయంత్రానికి రిజర్వేషన్ చేయించుకొని వచ్చాను" అని చెప్పవలసిందంతా చెప్పేసారు.

         అక్కడ పరిస్థితి అసహనంగా మారింది. రాజారాం గారికి సమాధానం చెప్పలేని స్థితి. ఎవరు ఏమి మాట్లాడాలి అన్న మీమాంసలో ఉండగా కావ్య బయటకు వచ్చింది.

         కావ్యను చూడాగానే రాజారాం గారి ముఖంలో సంతోషం కనిపించింది. కావ్య వెంకట్ వైపు చూసింది. వెంకట్ మాత్రం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. వెనక నుంచి కృష్ణవేణి కొడుకు భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తట్టింది "నాకు నీ బాధ అర్థం అయ్యింది" అన్నట్టు.

         "విశ్రాంతి తీసుకోండి బాబాయ్ గారు. నేను బయటకు వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు వెంకట్.

         ఇంక బాగుండదు అని కావ్య అత్తయ్య రాజారాం గారితో మాటలు కలిపింది. కావ్య తలుపుకి ఆనుకొని వెళ్ళిపోతున్న వెంకట్ వంక చూస్తూ నిల్చొంది.


***        ***        ***        ***

         మంచం మీద పడుకొని నిద్రపోతున్న నానమ్మ కాళ్ళకి నమస్కరించింది కావ్య. కళ్ళల్లో రాబోతున్న కన్నీళ్ళను ఆపుకొని బయటకు వచ్చిన కావ్యకు ఎదురుగా అత్తయ్య కనిపించేసరికి ఆగిపోయింది.
 "ఏమిటిది కావ్యా? ఒక్క సారి ఇక్కడే ఉండిపోతాను అని చెప్పు. ఇప్పుడే వెళ్ళి మీ మావగారితో మాట్లాడి వస్తాను" అని అంది .

         "వద్దు అత్తయ్యా. నేను వెళ్ళాలి. నన్ను ఆశీర్వదించండి" అని నమస్కరించింది.

         "నిన్ను ఉండిపొమ్మని చెప్పే అధికారం లేదు. ఆపే శక్తి లేదు. ఎక్కడున్నా సంతోషంగా ఉండు. నేను, వెంకట్ మధ్యలో వచ్చి వెళ్తాము" అని దగ్గరగా తీసుకొంది.

         బయలుదేరే ముందు వెంకట్ వచ్చాడు. స్టేషన్ చేరుకుని సామాన్లు లోపల పెట్టేవరకు వెంకట్ తో మాట్లాడే అవకాశం దొరకలేదు కావ్యకు.

         "నేను ఇప్పుడే ఒక ఫోన్ చేసి వస్తాను. రేపు పక్కింటి వాళ్ళను పాలు పోయించుకొమ్మని చెప్పాలి" అని రాజారాం అనడంతో సరే అని తల ఊపింది కావ్య.

         "ఇదిగో పళ్ళు తీసుకొచ్చాను. ఇంకేదన్నా కావాలా కావ్యా?" అని అడిగాడు వెంకట్.

         వద్దు అన్నట్టు తల ఊపింది కావ్య.

         "ప్రతిసారీ ఇలా నీకు ఏదో విధంగా వీడ్కోలు చెప్పక తప్పటం లేదు. ఇప్పుడు ఇంత కంగారుగా ఫోన్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమిటి కావ్యా?" అని అన్నాడు వెంకట్.

         "నువ్వు ఇదివరకు అనేవాడివి గుర్తు ఉందా బావా? నీ కోసం నువ్వు జీవించడం నేర్చుకో అని. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నువ్వు చెప్పిన మాట వింటున్నందుకు సంతోషించాలి నువ్వు" అంది కావ్య.

         "కానీ ఒక్కదానివి వెళ్ళి ఏం చేస్తావు?" ప్రశ్నించాడు వెంకట్.

         "ఏమో అక్కడికి వెళ్ళాక ఆలోచించాలి. లేదంటే తిరిగి మీ దగ్గరకే వస్తాను. ఇంకెక్కడికి వెళ్తాను" అని అంది చిన్నగా నవ్వి.

         "సరే కానీ నేను ప్రతి వారం వచ్చి చూసి వెళ్తాను. నువ్వు మాత్రం దానికి అడ్డు చెప్పకూడదు" అని అన్నాడు వెంకట్.

         సరే అన్నట్టు తల ఊపింది కావ్య.

 "నువ్వు కూడా నాకు ఒక ప్రమాణం చెయ్యాలి బావా. వదిన చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి. ఇంట్లో అందరికి సంతోషం కలగచెయ్యాలి" అని అంది అభ్యర్థనగా.

         ఇంతలో రాజారాం గారు రావడంతో ఇద్దరి మధ్య సంభాషణకి తెర పడింది.


***        ***        ***        ***

         సమయం ఎవరి కోసం ఆగదు. తన పని తను చేసుకు పోతుంది. కావ్య కూడా సమయంతో పాటూ కదలడం నేర్చుకొంది. చూస్తూనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకున్నట్టుగానే కిరణ్ ఆశించిన ప్యాకేజ్ కంపెనీ తనే ప్రారంభించింది కావ్య. చూడడానికి చిన్నదే అయినా కావ్యకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది.

         ఆఫీస్ లో తన గదిలో కూర్చున్న కావ్యకు గత రెండు సంవత్సరాలుగా తను పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఒక పెద్ద కంపెనీకి కావల్సిన ప్యాకేజింగ్ మెటీరియల్ కి సంబంధించి పెద్ద ఆర్డర్ రావడంతో పట్టలేని సంతోషంలో ఉండగా తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం వినిపించింది.

         "ఎస్ కమిన్" అని తలెత్తి చూడకుండానే అంది కావ్య.

"ఏమ్మా మమ్మలిని మర్చిపోయావా? ఎవరు వచ్చారో కూడా చూడనంత పని ఏమిటి?" అని పావని లోపలకు వచ్చింది. కావ్య చిన్నగా నవ్వింది.

         "మా పాప పుట్టినరోజు. రేపు సాయంత్రం చిన్న పార్టి. నిన్ను పిలుద్దామని వచ్చాను. మావయ్య గారిని, నానమ్మగారిని తీసుకొని తప్పకుండా రావాలి. పని ఉంది అని సాకు చెప్పకు" అని కూర్చుంది.

         "తప్పకుండా వస్తాను. ఏదైనా నీ తరువాతే కదా పావని? మీరే లేకపోతే నేను ఈ స్థితికి వచ్చేదాన్ని కాదు" అంది కావ్య.

         "ఇందులో నేను చేసింది ఏమి లేదు. నువ్వే కష్టాలను ఎదుర్కొని సాధించావు. ఇలా సహాయం అందించే వాళ్ళు చాలా మందికి చుట్టూ ఉన్నా, నీలా ధైర్యంగా జీవించడం అందరి వల్లా కాదు. ఏదొక సాకు చెప్పుకొని తమ మీద తామే జాలిపడి జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కానీ నిన్ను చూసాక నాకు నీ స్నేహితురాలినని చెప్పుకోడానికి చాలా గర్వంగా ఉంది" అని సంతోషంగా చూసింది పావని.

 పావని వెళ్ళిపోయాక కావ్య గతాన్ని తలచుకుంటూ ఉండిపోయింది.

         "ఆ రోజు రాజమండ్రి నుండి బయలుదేరి వచ్చాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి తనది. అయినా ఏదో పట్టుదల తనని ముందుకు నడిపించింది. పదే పదే బావ చెప్పిన మాటలు, తనని తాను వెతుక్కుంటూ
వచ్చేసింది. ముందు రాగానే సగంలో నిలిపేసిన చదువు పూర్తి చెయ్యాలి అని పరీక్షలు రాసింది. కిరణ్ పని చేసిన కంపెనీలోకే వెళ్ళి పని చెయ్యడానికి సిద్ధం అయ్యింది. అక్కడ మిగతా ఆడవాళ్ళతో చేరి పని నేర్చుకుంది. చదువు పూర్తయ్యి కిరణ్ ఆశించినట్టుగానే లోన్ సంపాదించి ఈ రోజు తన నలుగురుకి పని ఇవ్వగలిగింది. ఇప్పుడు ఏదో ప్రశాంతత. జీవితంలో ఎంతో నేర్చుకుంది. అన్నిటికన్నా ఒకరు తన కోసం ఏదో చెయ్యాలి అన్న ఆలోచనే లేకుండా తనకు తానే జీవితాన్ని అదుపులోకి తెచ్చుకుంది. కానీ ఇంకా ఏదో ఒక వెలితి జీవితంలో" అని ఆలోచనలో ఉండగా ఫోన్ మోగింది.

         "కావ్యా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? ఇక్కడ నీ కూతురు గొడవ చేస్తోంది" అని కావ్య నానమ్మ ఫోన్ చేసింది.

         "ఇదిగో వచ్చేస్తున్నాను" అని ఫోన్ పెట్టేసి బయలుదేరింది కావ్య.

         కావ్య వచ్చిన కొన్ని రోజులకే కావ్య నానమ్మ మనవరాలి కోసం వచ్చేసింది.

         "నాకు కాస్త చద్దన్నం పెట్టు చాలు కావ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేను" అని కన్నీళ్ళు పెట్టుకోవడంతో కావ్య కాదనలేదు. ఆవిడే కావ్యకు పురుడు పోసి దగ్గరుండి చూసుకొంది. కావ్యలో ధైర్యం, ఉత్సాహం చూసి ఆవిడలో కొత్త ఊపిరి వచ్చింది. ఏదో ఒక్క ఆధారం చాలు మనిషిలో జీవించడానికి ఆశ మొలకెత్తడానికి.

         కావ్య ఇంట్లోకి ప్రవేశించగానే రెండు కాళ్ళకు అడ్డు పడి చుట్టుకు పోయింది సంవత్సరం వయసు ఉన్న అఖిల. కావ్య కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొంది. రాజారాంగారు చేతిలో మంచి నీళ్ళ గ్లాస్ తో, కావ్య నానమ్మ ఇంకో చేతిలో అన్నం తో నిండిన కంచం తో పరిగెత్తుకొని వచ్చారు ఆయాసపడుతూ.

         "ఇక్కడున్నావా పిల్ల పిడుగా? ఇల్లంతా తిప్పించావు కదే?" అని ఆగిపోయారు.

         వాళ్ళిద్దరిని అలా చూసిన కావ్యకు మనసులో ఒక ఆనందం.

         "అలా ఏడిపించొచ్చా తాతయ్యను? మంచి పిల్లవు కదూ?" అని ఇద్దరి చేతిలోనుండి తీసుకొని తినిపించడం ప్రారంభించింది. 



రాజారాం గారు వెళ్ళి పడక కుర్చీలో వాలిపోయారు.

         "ఇదిగో కావ్యా చెప్పడం మర్చిపోయాను. అత్తయ్య ఫోన్ చేసింది. బావకి నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. అందరిని రమ్మని మరీ మరీ చెప్పింది" అని చెప్పడంతో కావ్య నానమ్మ వంక ఒకసారి చూసి సమాధానం చెప్పకుండా ఉండిపోయింది.

         "ఏమిటి వెళ్ళేది ఉందా లేదా? చూసి ఎన్ని రోజులయ్యిందో? వెంకట్ ని కూడ ఇక్కడికి రావద్దు అని నిక్కచ్చిగా చెప్పేసావు. వాడొక పిచ్చి వెధవ. ఈ కాలంలో అయినవాళ్ళు, అభిమానం అంటూ తిరుగుతుంటాడు" అని సణుక్కుంది నానమ్మ.

         "నానమ్మ నీకు అక్కడే ఉండాలి అని అనిపిస్తే అక్కడే ఉండిపోకపోయావా? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? రేపు నీకు టికెట్ తీసుకుంటాను. వెళ్ళి పెళ్ళి అయ్యాక రా" అని వంటింట్లోకి నడిచింది కావ్య.

         "అవునులే ముసలిదాన్ని నా మాటలు ఎవరికి పట్టవు. ఏదో ఒక మూల పడి ఉండాల్సిన దానిని" అని చిన్న బుచ్చుకుంది.

         అది గమనించిన కావ్య ఆవిడ దగ్గరగా వచ్చి కౌగలించుకుంది.

         "నానమ్మ నీకు తెలుసు కదా నా పరిస్థితి. నేను దూరంగా ఉంటేనే అక్కడ అంతా సవ్యంగా నడుస్తుంది. ఇప్పుడు నేను అక్కడకు వచ్చి ఏదన్నా గొడవలు జరిగితే? అందుకే నువ్వు వెళ్ళి వచ్చెయ్యి. పెళ్ళి సమయానికి నేను మామయ్య గారు వస్తాము, సరేనా?" అని బుజ్జగించింది.

         "కావ్యా నేను ఒకటి చెప్పనా? నువ్వు కోపగించుకోవుగా?" అని నానమ్మ అనడంతో అడగమనట్టు తల ఊపింది.

         "ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఒప్పుకుంటే నేను అత్తయ్యతో మాట్లాడతాను. బావకు నువ్వంటే ప్రాణం. అందరూ సంతోషంగా ఉండొచ్చు" అని అంది చిన్నగా నానమ్మ.

         "దేని గురించి ?"అని ప్రశ్నార్థకంగా చూసింది కావ్య.

         "నువ్వు ఇలానే ఉండిపోతావా? నువ్వు మళ్ళీ బావని పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు?" అని మనసులోని మాట చెప్పింది నానమ్మ.

         "నానమ్మా" అని నమ్మలేనట్టు చూసింది కావ్య.
  "లేదు నానమ్మ, ఇంక అలాంటి ఆలోచనలు అసలు రానివ్వకు. అది జరిగే పని కాదు. ఇప్పుడు కొత్తగా నువ్వొక తుఫాన్ సృష్టించకు. నాకు తెలియకుండా నువ్వు ఏదన్నా చెయ్యాలని చూసావో నా ముఖాన్ని మళ్ళీ చూడవు. ఈ పెళ్ళి ఆటంకం లేకుండా జరగాలి " అని అంది తీవ్రంగా చూస్తూ.

         "నాకు తెలుసు నీకు చిన్నప్పటి నుండి బావ అంటే ఎంత ఇష్టమో. బావకు నువ్వంటే ప్రాణం. ఒకరికి ఒకరు ఏమి చెప్పుకోకుండానే ఏవేవో జరిగి పోయాయి. జీవితాలు మారిపోయాయి. ఇప్పుడైనా నాకు ఇది కావాలి అని అడిగే ధైర్యం లేదు మీ ఇద్దరికి. ఏ పెద్దవాళ్ళు మిమ్మలిని అర్థం చేసుకోకుండా మీ జీవితాల్ని రాయాలి అనుకున్నారో వాళ్ళ కోసం ఈ అర్థం పర్థం లేని త్యాగాలు ఎందుకు?" అని ప్రశ్నించింది నానమ్మ.

         "లేదు నానమ్మా ఇది త్యాగం కాదు. ఇది విధి. ఏది ఎలా జరగాలో అంతా ముందే రాసి ఉంటుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు నాకు అఖిల భవిష్యత్తు ముఖ్యం. అది తప్ప ఇంక నాకేమి వద్దు. ఇంక ఇప్పుడు నాకు తోడు కావాలి అని అనుకోవడం లేదు. బావనైనా సుఖంగా ఉండనీ. ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇప్పుడు జరిగేదే అందరికి సరైనది. ఇప్పుడు నువ్వు ఏదో చెయ్యాలి అని జరిగేదాన్ని ఆపడానికి ప్రయత్నించకు. నా మీద ఒట్టే" అని అభ్యర్థనగా చూసింది కావ్య.

         "సరే ఇప్పటి వరకు నేను ఏం చెయ్యగలిగాను? ఇప్పుడు కూడా చూస్తూ ఉండడమే తప్ప ఏం చెయ్యగలను?" అని కావ్య తల నిమిరింది నానమ్మ.

***        ***        ***        ***

         అక్కడ రాజమండ్రిలో, జరగబోయే నిశ్చితార్థానికి హడావుడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంకట్ తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతూ ఉండగా తల్లి రావడంతో తలెత్తి చూసాడు.

         "కావ్య ఇంకా రాలేదామ్మా?" అని అడిగాడు.

         "లేదురా అమ్మమ్మ ఒక్కత్తే వచ్చింది. అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చాడు. ఏదో పని ఉందిట పెళ్ళికి వస్తాను అని చెప్పిందట" అంది.

         ఏమి సమాధానం చెప్పకుండా మళ్ళీ పుస్తకంలో మునిగిపోయాడు.

         "ఏమిట్రా ఇది? ఇలా ఎవరింట్లోనో చుట్టం లాగా కూర్చున్నావు? నీకు కాబోయే భార్య నీతో ఏదో మాట్లాడాలి అని అడిగింది. ఒకసారి వెళ్ళి మాట్లాడిరా" అని చెప్పేసి బయటకు వెళ్ళేందుకు లేచింది. 



 వెళ్ళబోతున్న ఆవిడను వెంకట్ చేయి పట్టుకొని ఆపాడు.

         ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది.

         "నీకు సంతోషమేగా?" అని అన్నాడు తల్లి ముఖంలోకి చూసి.

         "నీ సంతోషంలోనే నా సంతోషం ఉందిరా. నీ మనసులో ఏమున్నా నాకు చెప్పు. రేపు అన్నయ్యతో పాటు మేము సింగపూర్ వెళ్ళిపోతాము. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ఒక ముడి వేసి వెళ్తే అదొక తృప్తి. అందుకే ఈ పెళ్ళికి సమ్మతించాను. ఇప్పటికైనా మనసులో ఉన్నది నాకు చెప్పు. నీకు ఈ పెళ్ళి పూర్తి సమ్మతం ఉంటేనే జరుగుతుంది. లేదంటే నేను నీతో ఇక్కడే ఉండిపోతాను" అని జవాబు కోసం చూసింది.

         వెంకట్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. భర్త పిలవడంతో కొడుకు వంక నిస్సహాయంగా చూసింది.

         "నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి తీవ్రంగా ఆలోచించు. ఇదే జీవితం నీకు ఇచ్చే ఆఖరి అవకాశం. ఈ చాన్స్ మళ్ళీ దొరకదు. ఒక్కసారి స్వప్న ఏదో మాట్లాడాలి అని అంది. వెళ్ళి మాట్లాడిరా" అని చెప్పేసి వెళ్ళిపోయింది.

***        ***        ***        ***

         వెంకట్ వెళ్ళేసరికి అతని కోసమే స్వప్న ఎదురు చూస్తూ ఉంది. లోపలకు వెళ్ళిన వెంకట్ కి హరిణి, బావగారు అక్కడే ఉండటాన్ని చూసి ఏదో ముఖ్యమైన విషయం అని అర్థం అయ్యింది.

         "ఏంటి బావగారు? ఏదో మాట్లాడాలి అన్నారు అని అమ్మ చెప్పింది" అని వెంకట్ మొదలుపెట్టాడు.

         హరిణి తన భర్త వంక కోపంగా చూసింది.

         "నేనే మాట్లాడాలి అని చెప్పాను" అని స్వప్న ముందుకు వచ్చింది.

         "మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" అని సందిగ్ధంగా చూసింది.

         "ఏదైనా సరే, నిర్మొహమాటంగా చెప్పండి" అని అన్నాడు వెంకట్.
"మీకు మనసులో ఎలా ఉందో నాకు తెలియదు కానీ, ఈ పెళ్ళి నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నన్ను మనస్పూర్తిగా ఇష్టపడే వాడు నాకు భర్తగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు కోరుకున్నవాళ్ళను ఇంకా దూరం చేసుకోకండి" అని అంది స్వప్న.

         స్వప్న చెప్పిన మాటలు విని ఆశ్చర్యంగా చూసాడు వెంకట్.

         తను చెప్పాల్సింది చెప్పేసి వెంకట్ వంక చూసి "మీకు జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అని వెళ్ళిపోయింది.

         వెంకట్ ఏం జరుగుతోందో అర్థం కానట్టు ఉండిపోయాడు.

         వెంకట్ బావగారు దగ్గరగా వచ్చి కూర్చున్నారు.

         "ఇప్పటివరకు మీ అక్క చెప్పినవి అన్నీ నమ్మి దేనినీ ప్రశ్నించకుండా తను చెప్పినట్లే నడుచుకున్నాను. కానీ ఈ రోజు నేను చెయ్యలేనిది స్వప్న చేసి చూపింది. సరైన నిర్ణయమే తీసుకుంది. పెళ్ళి అనేది మన కోసం చేసుకోవాలి. ఇతరుల కోసం కాదు. ఇతరుల సంతోషం కోసం చేసుకుంటే అది ఎప్పుడూ మనలని బాధిస్తుంది. నిన్న బామ్మ గారు రాత్రి నాతో, స్వప్నతో మాట్లాడినప్పుడు నాకు ఈ విషయం అర్థమయ్యింది. స్వప్న తెలివైనిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంది. ఇప్పుడు నీ వంతు. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ధైర్యంగా అడుగు వెయ్యి" అని భుజం మీద తట్టి లేచాడు.

         "పద ఇక వెళ్దాము. అందరినీ ట్రైన్ ఎక్కించాలి. ఆ పనులేవో చూద్దాం " అని హరిణి వంక చూసాడు ఆమె భర్త.

         హరిణి తల దించుకొని భర్త వెనకాలే వెళ్ళిపోయింది.

         నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళందరిని పంపించి వచ్చారు. వెంకట్ తల్లి మనసులోనే సంతోషించింది. కానీ పైకి కనిపించకుండా తల్లి వంక చూసింది. ఆవిడ కళ్ళతోనే ధైర్యం చెప్పింది. వెంకట్ గదిలో నుండి బయటకు రావడంతో అందరూ అతని వంక ఒక్కసారిగా తిరిగి చూసారు.

         వెంకట్ ఎవరి వంకా చూడకుండా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దడం మొదలు పెట్టాడు.

         పిల్లిలా వెంకట్ వెనకాలే వెళ్ళి తలుపు చాటున నిల్చొన్నారు వెంకట్ తల్లి, అమ్మమ్మ.
 "ఎక్కడికో ప్రయాణం? మాకు చెప్తే మేమూ వస్తాము కదా ?" అని చిన్నగా నవ్వు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసాడు వెంకట్.

         తల్లి, అమ్మమ్మ గుమ్మం దగ్గర ఉండడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు.

         "ఇంక మీ అందరి ఆటలు సాగవు. మీకన్నా పెద్ద మనిషి రాబోతోంది" అని అన్నాడు గట్టిగా.

         అతను అఖిల గురించి మాట్లాడుతున్నాడని అర్థమయ్యింది ఇద్దరికి. పట్టలేనంత సంతోషంతో పరిగెట్టుకొని వచ్చారు. "నిజమా" అని నమ్మలేనట్టు చూసారు.

         "అవును అమ్మమ్మా. ఈ సారి నా కూతురితోనే వస్తాను" అని ఒక నిశ్చయంతో అన్నాడు వెంకట్.

         "ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది చెప్పరా కావ్యకు. మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము" అని అంది అమ్మమ్మ.

         బయట తండ్రి ఎదురు పడడంతో ఆగిపోయాడు వెంకట్. ఏం చెప్పాలో అని ఆలోచిస్తుండగా ఆయనే ఒక అడుగు ముందుకు వేసి భుజం మీద చిన్నగా తట్టి నవ్వారు.

         "తొందరగా తీసుకొని వచ్చెయ్యి" అని అన్నారు.

         ఆయన అంగీకారం తెలపడంతో పట్టలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెంకట్. అందరి అంగీకారం లభించడంతో ధైర్యంతో ముందుకు నడిచాడు.






                           (సమాప్తం)
Author: Siri
•Friday, October 08, 2010
నేను ఈ వారం కధ కాస్త ఆలస్యంగా పోస్ట్ చెయ్య్డానికి ఒక కారణం ఉంది ...రెండు వారాల క్రితం ఇలాంటి ఒక  శుక్రువారం (sept24th) నా మేనకోడలు మూడేళ్ళ అనన్య కార్ ప్రమాదం లో చనిపోయింది ...ఈ కధ రాసినప్పుడు నాకు తెలియదు నేను ఇలాంటి ఒక సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని .. నా చిన్న తమ్ముడు ఆంబులన్స్ నుండి ఫోన్  చేసి "అక్కా అనన్య చనిపోయింది " అన్న మాటలే నాకు పదే పదే వినిపిస్తున్నాయి ...కధ లో చెప్పినట్టుగా వాళ్ళకు జీవించడానికి కారణాలు చెప్పవలసి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ...ఎప్పుడు వార్తల్లో ఎమన్నా జరిగితే అయ్యో అనుకొని మనకు జరగవులే అనుకున్నాను ...కానీ ఇంటి ముందు ఆడుతూ పాడుతూ బాల్ కోసం వెళ్ళి ఎదురుంటి కారు కింద పడి ఇలా చిట్టి తల్లి ప్రాణం విడుస్తుందని  కనీసం ఊహించను కూడా ఊహించలేదు.


మీ అందరికి తన గురించి చెప్పాలని ఉంది నాకు ...అందమైన కుటుంబం వాళ్ళది ..అమ్మా నాన్న ,మూడేళ్ళ అనన్య ,తనకి ఒక చిన్ని తమ్ముడు..చూసిన వాళ్ళందరు ముచ్చట పడేలా .అనన్య అందమైనది ,చాలా తెలివైనది ,ఎంద అందంగా పాడుతుందో .ఒక్కసారి మనం పాడి వినిపిస్తే చాలు అది యే భాష అయినా సరే పాడేస్తుంది .మాటలు కూడా పూర్తిగా రాకున్నా పాటలు మాత్రం ఒక్క తప్పు లేకుండా పాడుతుంది. అందరు దానికి మేనత్త పోలికలు అని అంటుంటే నేను ఎంత మురిసిపోయేదాన్నో. రెండేళ్ళ వయసులో తను ప్రపంచం లో అన్ని ప్రదేశాలు మాప్ లో గుర్తించేది . తల్లి తో తెలుగులో ,తండ్రితో మా అందరితో తమిళం లో మాట్ళాడేది . మూడు వారాలుగా ప్రీ స్కూల్ కి వెళ్ళడం మరియు టీవీ ద్వారా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకుంది.  ప్రేమని చూపించడం లో తన నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను . తన దగ్గరకి వెళ్ళినప్పుడల్లా చేతులతో హత్తుకొని ఎన్నో ముద్దులు పెట్టేది. ఇప్పుడు ఇంక ఎంత పిలిచినా తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయింది . జీవితం ఆగదు .మిగతా వారి కోసం మనం ముందుకు నడవక తప్పదు .గుండెల్లో తనని పెట్టుకొని తన ముద్దు మాటలు అల్లరి నవ్వు తలచుకుంటూ తను లేని బాధను అనుభవిస్తూ బ్రతకడం నేర్చుకోవాలి.


అందరికి చిన్న విన్నపం ..ఎప్పుడైనా మీరు కార్ నడిపేటప్పుడు కాస్త ఆలోచించండి .కోపంగా కానీ లేదా ఎదో ఒక ఆలొచనతో కానీ ఫోన్ లో మాట్లాడుతు కానీ ఎప్పుడు కార్ నడపవద్దు .ఏ మాత్రం అజాగ్రత్త్త గా ఉన్నా ఎన్నో అనర్ధాలు జరగవచ్చు .అందరికి ఇలా జరుగుతుందని కాదు .కానీ ఇంకొకరికి ఎవరికీ ఇలాంటివి జరగ కూడదు అన్న తపనతోనే ఈ అభ్యర్ధన. చిన్న పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశాలలో మరింత జాగ్రత్త గా ఉండాల్సిన భాధ్యత అందరికీ ఉంది . 







Author: Siri
•Friday, October 08, 2010
 "ఆ వచ్చేవాళ్ళు ఇంట్లోకి కూడా వస్తారే, లోపలకి వచ్చి కూర్చో" అని నవ్వింది కావ్య మేనత్త. 

         అయినా కావ్య మాత్రం ఎదురు చూస్తూనే ఉంది. చిన్న పిల్లలాగా ఏదో తెలియని ఆరాటం, ఉత్సాహం ఉరకలు వేసాయి. జీవితంలో బాధలన్నీ తొలగి మంచిరోజులు వస్తున్నాయి అని అనిపించింది కావ్యకు. చిన్నగా పొట్టని తడిమి చూసుకొని ఏదో పులకింతకు లోనయ్యింది. వెళ్ళిన బావ ఎంతకూ రాకపోవడంతో కంగారు ఎక్కువయ్యింది కావ్యకి. 

         "ట్రైన్ కాస్త ఆలస్యంగా వస్తోందేమో, కంగారు పడకు" అని కావ్య అత్తయ్య చెప్తూనే ఉన్నా కావ్యలో ఆరాటం ఎక్కువయ్యింది. కొంత సేపటికి పోన్ మ్రోగటంతో ఆత్రుతగా వెళ్ళి చూసింది. 

         "ఇదిగో కావ్యా, బావ మాట్లాడుతాడట" అని కృష్ణవేణి ఫోన్ కావ్య చేతికిచ్చింది. 

         "హలో" అని అంది కంగారుగా కావ్య. 

         "కావ్యా! మామయ్య వాళ్ళు రాలేదు. సరైన సమయానికి ట్రైన్ అందుకోలేకపోయినట్టు ఉన్నారు. ఇప్పుడే కిరణ్ తో మాట్లాడాను. డ్రైవర్ ఎలాగూ ఉన్నాడు. నేను వెళ్ళి వాళ్ళను తీసుకుని వచ్చేస్తాను. నువ్వు కంగారు పడకు, సరేనా?" అని పెట్టేసాడు వెంకట్. 

         కావ్యకు కంగారు ఇంకా ఎక్కువయ్యింది. 

         "ట్రైన్ సమయానికి అందుకోకపోవడం ఏమిటి? కిరణ్ ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు" అని ఆలోచనలు చుట్టుముట్టాయి కావ్యకు. తల్లి తండ్రులకు,కిరణ్ కి ఫోన్ చేసి చూసింది. ఎక్కడా పోన్ ఎత్తలేదు. 

         "అయ్యో అమ్మా వాళ్ళ ఫోన్ పాడయ్యింది అని కిరణ్ చెప్పాడు కదా? మామయ్యగారు ఊరెళ్తున్నారు కదా అని ఈయన కూడా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటాడు" అని మనసులోనే అనుకుని పోన్ పెట్టేసింది. 

         "కనీసం ఒక్కసారి నాకు పోన్ చేసి చెప్పొచ్చు కదా ఆ విషయం" అని విసుక్కుంది కావ్య. 

         కిరణ్ కావ్యకు పోన్ చెయ్యకుండా వెంకట్ కి ఎందుకు చేసాడో అర్థం కాలేదు కావ్యకు. ఏవేవో చెడు ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. 



 "ఛ! ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను?" అని మనసులో వస్తున్న ఆలోచనలను మళ్ళించడానికి చూసింది. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక రాత్రంతా జాగరణే చేసింది.

***        ***        ***        ***

         మర్నాడు పొద్దున్న లేచి బావ పోన్ ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసింది. కిరణ్ ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యనందుకు చిరాకు పడింది కావ్య. మధ్యాహ్నం ఎప్పటికో కార్ వచ్చిన అలికిడి వినిపించి బయటకు పరిగెత్తుకొని వచ్చింది కావ్య. కార్ లోనుండి వెంకట్ మాత్రమే దిగడం చూసింది.

         "ఏం బావా అమ్మా వాళ్ళేరి?" అని చుట్టూరా చూసింది.

         "కావ్యా! అమ్మా వాళ్ళు వస్తున్న కార్ కి చిన్న ప్రమాదం జరిగింది. ఏమి కంగారు పడకు. అంతా బాగానే ఉంది. నిన్ను తీసుకెళ్ళాలనే వచ్చాను పదా" అని అన్నాడు వెంకట్ గబ గబా.

         కావ్య మాటా మంతి లేకుండా నిలబడి పోయింది.

         "నువ్వు ఇలా కంగారు పడితే ఎలా? ముందు బట్టలు సర్దుకో పదా" అని గట్టిగా అనేసరికి ఈ లోకం లోకి వచ్చింది కావ్య.

         "ఏమయ్యింది దెబ్బలు తగల్లేదు కదా? నిన్న అందుకే ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు ఎత్తలేదు. చెప్పు బావా దెబ్బలు ఎక్కువ తగల్లేదు కదా" అని వెంకట్ ని పట్టి కుదిపేసింది.

         "అదేం లేదు నువ్వు కంగారు పడకు. నీకు మంచిది కాదు" అని సముదాయించాడు వెంకట్.

         కావ్య బట్టలు సర్దుకోడానికి లోపలకు వెళ్ళిపోయింది.

         "అందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా..." అని అరిచాడు గట్టిగా ఎవరు కనిపించకపోయేసరికి. లోపలకు వెళ్ళిన కావ్యను చూసి కంగారుగా కావ్య అత్తయ్య వచ్చింది.

         "ఏమిటిది కంగారుగా వచ్చావు? ఏమయ్యింది? అన్నయ్య వాళ్ళంతా ఏరి? మళ్ళీ ఎక్కడికి ప్రయాణం?" అని అంది వెంకట్ సర్దడం చూసి.

         కావ్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిని పక్కగా తీసుకెళ్ళాడు.


 "మామయ్య వాళ్ళకి చిన్న ప్రమాదం జరిగింది స్టేషన్ కి వస్తుండగా. హాస్పిటల్ లో ఉన్నారు ఇప్పుడు. నేను కావ్యను తీసుకెళ్తాను. అందరికి చెప్పి నువ్వూ బయలుదేరి వచ్చెయ్యి. మీరు అందరూ తొందరగా బయలుదేరి వెనకాలే వచ్చేయండి" అని అన్నాడు తన బట్టలు నాలుగు సర్దుకుంటూ.

         "ఒరేయ్ నాకు కంగారుగా ఉంది. అన్నయ్యకు ఏమి జరగలేదు కదా?" అని అంది గాభరాగా.

         "అమ్మా అరిచి గొడవ చెయ్యకు. అన్నీ ఇప్పుడు చెప్పలేను. తొందరగా వచ్చేయండి. దయచేసి ఇప్పుడు ఏమి అడగొద్దు" అన్నాడు వెంకట్.

         ఇంకేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది వెంకట్ తల్లి.

         "అమ్మా కావ్యను కాస్త ఏదన్నా తినేలా చూడు" అని చెప్పాడు తల్లి వంక చూస్తూ.

         రాత్రంతా నిద్రపోని వాడిలా వాడిపోయి ఉన్నట్టు ఉంది వెంకట్ ముఖం.

         "సరే" అని లోపలకు వెళ్ళి ఇద్దరికి తినడానికి తీసుకొచ్చింది.

         "నా ఫలహారం నా గదిలో పెట్టమ్మా" అని చెప్పడంతో ఒక ప్లేట్ అక్కడ పెట్టేసి కావ్యకు ఇవ్వడానికి వెళ్ళిపోయింది.

         కావ్యను తీసుకొని బయలుదేరాడు వెంకట్.

         "వెళ్ళొస్తాను అత్తయ్య. అక్కడ ఎలా ఉన్నారో? అందరిని చూసేదాకా నా మనసు కుదుట పడదు" అని చెప్పి వెళ్ళి కార్లో కూర్చొంది కావ్య.

         ఒక్క నిముషం ఆగి తల్లి వంక చూసాడు వెంకట్. వెంకట్ చెప్పకపోయినా ఏదో దాస్తున్నాడు అని అనిపించింది ఆవిడకు.

         "తొందరగా వచ్చేయండి" అని చెప్పి ముందుకు కదలిపోయాడు వెంకట్.

         అన్నీ విసిరి పారేసిన బట్టలు సర్దడానికి వెంకట్ గదిలోకి వచ్చింది వెంకట్ తల్లి కృష్ణవేణి.

         "తను పెట్టిన ఫలహారం అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వెంకట్. ఇంత కంగారుగా వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఏదో జరగరానిది జరిగే ఉంటుంది" అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. 



దారి పొడుగునా వెంకట్ ఎక్కడికో చూస్తూ మౌనంగానే ఉండిపోయాడు. ఏదన్నా అడగాలన్నా మాట్లాడాలన్నా బెరుకుగా అనిపించింది కావ్యకు. ఆలోచిస్తూనే కళ్ళు మూసుకొని పడుకుంది. వెంకట్ కావ్య వైపు తిరిగి చూసాడు. పసిపాపలా ఉన్న కావ్యను చూసి భారంగా ఊపిరి తీసుకొని వదిలాడు.

         "రాబోయే తూఫాన్ నుండి కావ్యను ఎలా కాపాడుకోవాలి? చిన్న విషయాలు తట్టుకోలేని కావ్యను ఎలా ఓదార్చాలి?" అని పదే పదే ప్రశ్నించుకున్నాడు.

         ఎన్ని సార్లు ఆలోచించినా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దేనినైనా ఎదుర్కునే ధైర్యం కావ్యకు ప్రసాదించమని మనసులోనే వేడుకున్నాడు. తెల్లవారుతుండగా హైదరాబాద్ చేరుకున్నారు. వెళ్ళే దారిలో ఆపి కావ్యకు తినడానికి తీసుకొచ్చాడు వెంకట్.

         "ఇప్పుడిదంతా ఎందుకు బావా ఇంటికి వెళ్ళిపోతాము కదా కొంచెం సేపటిలో? అమ్మ చేతి వంట తినొచ్చు" అని అంది కావ్య.

         "లేదు కావ్య నిన్న ఎప్పుడో తిన్నావు" అని చేతిలో పెట్టేసరికి మారు మాట్లాడకుండా తినేసింది. ముందు ఆకలి అనిపించకపోయినా కొంచెం తిన్న తరువాత ఆకలి అనిపించింది.

         "ఇంకా బయలుదేరుదామా బావా? అమ్మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు" అనేసరికి కావ్య వైపు చూసాడు వెంకట్.

         "కావ్యా ....." అని ఎదో చెప్పబోయాడు వెంకట్. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఏదో నిర్ణయించుకొని "ఊ ..పద " అని కార్ ఎక్కాడు.

         కొంచం సేపటికి ఒక గుడి ముందు కార్ ఆగేసరికి ప్రశ్నార్థకంగా చూసింది కావ్య.

         "ఇంటికి వెళ్ళకుండా ఏమిటిది బావా? పొద్దున్నే స్నానం కూడా చెయ్యకుండా గుడికి తీసుకొచ్చావేమీటి?" అని ఆశ్చర్యంగా చూసింది.

         "పద కావ్యా చెప్తాను" అని కార్ డోర్ తెరిచాడు.

         అయోమయంగా వెంకట్ వెనకాలే నడిచింది.

         పూర్తిగా తెల్లవారలేదు. ఇలాంటి సమయంలో వెంకట్ ఇంటికి వెళ్ళకుండా గుడికి ఎందుకు వచ్చాడు అని విచిత్రంగా అనిపించినా అంత కంటే ఏదో భయం వెన్నంటి వణికించింది. 



  వెనకాలే వెళ్ళి వెంకట్ పక్కన కూర్చొంది. రెండు చేతుల్లో ముఖం దాచుకొని తల వంచుకొని కూర్చున్నాడు వెంకట్.

         "బావా ఏమయ్యింది? ఎందుకలా ఉన్నావు" అని అడిగింది కావ్య వణికే స్వరంతో.

         వెంకట్ తలెత్తి కావ్య వంక చూసాడు. ఎప్పుడు లేనిది వెంకట్ కళ్ళల్లో కన్నీళ్ళు జల జలా రాలాయి. కావ్య కంగారుగా చూసింది.

         "నాకు భయంగా ఉంది బావా. ఇంటికి వెళ్ళిపోదాము పదా" అని అంది వెంకట్ చేతిని పట్టుకొని.

         ఇంక ఇంత కంటే ఆలస్యం చెయ్యకూడదు అని వెంకట్ నిర్ణయించుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు కావ్యకు చెప్పేయ్యాలి అని అనుకున్నాడు.

         "కావ్యా జీవితంలో ఎన్నో జరుగుతాయి. కానీ అన్నిటి కన్నా బాధాకరమైనది మన వాళ్ళని పోగొట్టుకోవడమే. అలా అని నీకు ఎవరూ లేరని నువ్వు అనుకోకు. నీకు మేమందరం ఉన్నాము. నువ్వు ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది" అని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయాడు. కావ్య వంక చూడలేక మళ్ళీ రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

         "ఏమిటి బావా అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అమ్మా వాళ్ళకు ఏమీ అవ్వలేదు కదా" అని కంగారుగా అంది కావ్య.

         ఏదో జరగ కూడనిది జరిగింది అని చూచాయగా అనిపించినా మనసు మొండికేసింది చెడుగా ఆలోచించడానికి. వెంకట్ కావ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

         "కావ్యా ఏది జరిగినా నువ్వు మనోధైర్యాన్ని కోల్పోనని నా మీద ప్రమాణం చెయ్యి" అని తన తల మీద కావ్య చేతిని ఉంచాడు.

         "ఊఁ.." అని మాత్రం అనగలిగింది కావ్య.

         వెంకట్ చేతులు వణుకుతుండడం గమనించి గుండె వేగంగా కొట్టుకుంది కావ్యకు.

         "కావ్యా! మామయ్య, అత్తయ్య, కిరణ్ ముగ్గురూ మనలని వదిలి పెట్టి వెళ్ళిపోయారు. శాశ్వతంగా వెళ్ళిపోయారు కావ్యా. ఊరు వచ్చేటప్పుడు ఆటో ఆక్సిడెంట్ అయ్యి ముగ్గురూ...." అని ఇంక చెప్పలేక ఆగిపోయాడు కావ్య రెండు చేతులని గట్టిగా పట్టుకొని. 



 ఒక్క క్షణం చలనం లేకుండా అలా చూస్తూ ఉండిపోయింది కావ్య. వెంకట్ నుండి తన చేతులు ఒక్కసారి వెనక్కి తీసుకుంది. మరుక్షణం నిశ్శబ్దాన్ని చీలుస్తూ గుండె పగిలేలా గట్టిగా అరిచింది కావ్య. గుండెల్లోని బాధను తట్టుకోలేనంతగా రోదించింది.

         వెంకట్ కి ఆమె బాధను ఆపే శక్తి లేదు. ఆ క్షణంలో ఆమెతో పాటు రోదించడం తప్ప ఏమి చెయ్యలేకపోయాడు. కావ్యను దగ్గరగా తీసుకొని తన గుండెలకు హత్తుకున్నాడు. కావ్య ఎంతగా ఏడ్చినా బాధను తట్టుకోలేకపోతోంది. ఒక్కసారి వెంకట్ వడిలో స్పృహ తప్పి పడిపోయింది. కావ్యను ఎత్తుకొని తీసుకొచ్చి కార్ లో కూర్చోపెట్టాడు వెంకట్.

         "డ్రైవర్ పదా" అని అన్నాడు.

         ఇద్దరిని దూరం నుండి గమనించిన డ్రైవర్ కళ్ళల్లోనూ కన్నీళ్ళు కదలాడాయి.

         "మామయ్య గారి ఇంటికేనా అండి బాబు?" అని అన్నాడు డ్రైవర్.

         అవునన్నట్లు వెంకట్ తల ఊపడంతో కార్ ముందుకు పోనిచ్చాడు డ్రైవర్.

***        ***        ***        ***

         జీవితంలో తట్టుకోలేని ఎదురు దెబ్బ తగిలి కుమిలిపోయింది కావ్య. జీవితంలో ముఖ్యమైన ముగ్గురినీ కన్నీటితో వీడ్కోలు చెప్పేసింది. తలచి తలచి కన్నీరు ప్రవాహంలా పొంగి చివరకు కళ్ళు ఎడారులయ్యాయి.

         కళ్ళు మూసినా తెరిచినా కన్నవాళ్ళ మాటలే చెవిలో ధ్వనిస్తున్నాయి. తను పుట్టి పెరిగిన ఇంట్లో ఉండడానికే భీతిగా ఉంది కావ్యకు. ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు. కావ్య అత్తయ్య వాళ్ళు కూడా ఇంక బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. కావ్యను ఒంటరిగా వదలడం ఇష్టం లేక "కావ్యను, అమ్మమ్మను తీసుకొని రెండు రోజుల్లో వస్తాను" అని వెంకట్ అనడంతో కావ్య అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు.

         కావ్య తిండీ, నిద్ర అంతా మరిచిపోయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా నేల మీద పడుకొని ఉండిపోయింది. కావ్య నానమ్మ, రాజారాం గారు చెరొక మూల దిక్కు తోచకుండా కూర్చుండిపోయారు. వెంకట్ కావ్యకు తినడానికి తీసుకొచ్చాడు.



  "కావ్యా" అని పిలిచాడు.

         కావ్య తిరిగి చూడకుండా అలాగే పడుకొని ఉండిపోయింది.

         "కావ్యా పదిరోజులయ్యింది నువ్వు సరిగ్గా భోజనం చేసి. కాస్త తిను. నువ్వు తింటే అమ్మమ్మ వాళ్ళు తింటామని కూర్చున్నారు" అని అన్నాడు.

         "వద్దు బావా నా వల్ల కాదు. నేను ఇంక బతికి ఏం చెయ్యాలి? ఇంక జీవితంలో ఏం సుఃఖం మిగిలి ఉందని?నా వల్ల కాదు" అని అంది నిరాశగా.

         ఎంత బ్రతిమాలినా కావ్య వినిపించుకోలేదు. వెంకట్ పదే పదే తినమని అడుగుతూనే ఉన్నాడు. కావ్యకు బాధతో కూడిన కోపం వచ్చింది.

         "ఏం బావా నీకు తిండి తినడం తప్ప నా బాధ గురించి కొంచెం కూడా పట్టించుకోవా? ఇప్పుడు తినకపోతే చచ్చిపోతానా? అలా చచ్చిపోతే ఇంకా హాయి. కాస్త విషం ఇవ్వు చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు బావా" అని పిచ్చి పట్టినట్టు అరిచింది.

         అంతా ప్రశాంతంగా వింటూనే ఉన్నాడు వెంకట్.

         "కావ్య ఒక్కసారి నాతోరా" అని అన్నాడు కావ్య చేయి పట్టుకొని.

         "ఏమిటిది బావా చెయ్యి వదులు. నన్ను ఇలా వదిలెయ్యి" అని విదిలించుకోబోయింది.

         అయినా వినిపించుకోలేదు వెంకట్. గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు.

         "అటు చూడు కావ్యా. వడలిపోయి, అలసిపోయి ఉన్న రెండు ప్రాణాలు. కళ్ళ ఎదురుగా తమ కన్న కొడుకులని పోగొట్టుకొని జీవితంలో అనుభవించకూడని బాధను అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా విషం ఇచ్చెయ్యమంటావా? నీకు ముందు ఇంత జీవితం ఉండి, నీకు నీ బిడ్డ రూపంలో ఒక తోడు ఉండి కూడా బతకలేక చచ్చిపోతాను అంటున్నావు. ఇంక జీవితంలో ఏ ఆశ లేని వాళ్ళు ఎందుకు బ్రతికి ఉండాలి? అలా చూస్తే జీవితంలో ఎవరోకరిని పోగొట్టుకొన్నవాళ్ళందరూ చచ్చిపోవడమే మార్గం అయితే ముందు వీళ్ళకే విషం ఇవ్వాలి" అని అన్నాడు.

         "బావా ?"అని విస్తుపోయి చూసింది వెంకట్ వైపు.

  "నిన్ను బాధపెట్టాలనో ఎత్తి చూపాలనో ఇది చెప్పలేదు కావ్యా. నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఇప్పుడు చాలా అవసరం. నువ్వు ఒంటరిదానివి కాదు. నీలో పెరుగుతున్న నీ బిడ్డ బాధ్యత నీకే ఉంది. చూడు కావ్యా ఆ ముసలివాళ్ళు ఇద్దరూ జీవితపు చరమాంకంలో ఉన్నారు. ఇంక వాళ్ళకు మిగిలిన కొద్ది కాలం ఏం ఆశతో బ్రతుకుతారు? నువ్వూ నీకు పుట్టబోయే బిడ్డే వాళ్ళకి కొత్త ఆశని కలిగిస్తుంది. వాళ్ళు జీవించడానికి ఒక మార్గం అవుతుంది. నువ్వు వాళ్ళ కోసం ధైర్యంగా ఉండాలి" అని చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు వెంకట్.

         కావ్య వెనకాలే వచ్చి అన్నంతో ఉన్న కంచాన్ని చేతిలోకి తీసుకొంది. గబ గబా తినడం ప్రారంభించింది. తింటు తింటూనే మధ్యలో ఆగి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది.

         "నా వల్ల కావడం లేదు బావా. ఈ గదుల్లో అమ్మ గొంతు, నాన్న నడుస్తున్న శబ్దం, కిరణ్ నవ్వులే వినిపిస్తున్నాయి" అని అంది చేతిలోని కంచాన్ని కింద పెట్టి.

         వెంకట్ కింద పెట్టిన కంచాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చేతితో ముద్దలు చేసి కావ్యను తినమని కళ్ళతోనే అభ్యర్థించాడు. కావ్య మారు మాట్లాడకుండా తినడం ప్రారంభించింది. ఏమి చెయ్యాలో పాలిపోని పరిస్థితిలో వెంకట్ ధైర్యంతో చెప్పే మాటలే ఆమె మంత్రించినట్టు వింటోంది. కావ్య అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో బయటకు వచ్చాడు వెంకట్.

         రాజారాం గారు పడక కుర్చీలో వాలి పడుకొని ఉన్నారు. వెంకట్ వచ్చిన అలికిడి అవడంతో తిరిగి చూసారు.

         "ఇంకా పడుకోలేదా బాబాయ్ గారు?" అని పక్కన కూర్చున్నాడు.

         "సుఃఖమైన నిద్రపోయి చాలా రోజులయ్యింది. శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది. కానీ మనసు అలసిపోతే నిద్ర దరికే చేరదు" అని పైకి చూస్తూ విరక్తిగా నవ్వారు రాజారాంగారు.

         వెంకట్ కి ఆయనని అలా చూసేసరికి చాలా జాలి కలిగింది. అందరి కన్నా ఎక్కువగా జీవితంలో కోల్పోయింది ఆయనే అని అనిపించింది. కావ్యను, అమ్మమ్మను రాజమండ్రి తీసుకెళ్ళే విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించాడు వెంకట్.

         "బాబాయ్ గారు! మీరు అనుకోనంటే ఒక మాట. మిమ్మలిని అందరినీ కొన్ని రోజులు రాజమండ్రి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి దూరంగా కొన్ని రోజులు ఉంటే మనసు కాస్త కుదుట పడుతుంది" అని మనసులోని మాట చెప్పాడు వెంకట్. 



( ఇంకా ఉంది)





Author: Siri
•Sunday, September 19, 2010
కావ్య ట్రైన్ దిగేసరికి వెంకట్ ఎదురొచ్చాడు. 

         "ఎలా ఉన్నావు కావ్యా?" అని అడిగాడు చేతిలో సామాన్లు తీసుకొని. 

         అన్నీ కుశల ప్రశ్నలడిగాక వెంకట్ వెనకాలే వెళ్ళింది కావ్య. కావ్యను కార్ ఎక్కించి డ్రైవర్ కి చెప్పి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. 

         "ఏం బావా నువ్వూ రావచ్చుగా" అని అంది వెంకట్ చేతిని పట్టుకోబోయి. 

         "లేదు కావ్యా నాకు కొంచెం పని ఉంది. చూసుకొని వస్తాను నువ్వు వెళ్ళు" అని అన్నాడు నెమ్మదిగా చేతిని వెనక్కి తీసుకుంటూ. 

         డ్రైవర్ వంక తిరిగి చూసి "అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇందాక వచ్చిన రోడ్డు బాగాలేదు. ఇంకో దారిలో తీసుకెళ్ళు" అని జాగ్రత్తలు చెప్పాడు. 

         కార్ ముందుకు కదలడంతో కావ్య సర్దుకొని కూర్చుంది. ఇదివరకు ఎప్పుడొచ్చినా ఒక్క క్షణం కూడా ఎక్కడికీ వెళ్ళకుండా చుట్టూరా తిరిగేవాడు. కానీ వెంకట్ లో ఏదో మార్పు కావ్య గమనించింది. కిరణ్ తో ఎంతో చనువుగా ఉన్నా కావ్యను మాత్రం తప్పించుకొని తిరుగుతున్నట్టు కావ్యకు అనిపించింది. 

         "అయినా తన పిచ్చి కానీ, తను పెళ్ళి చేసుకొని హాయిగా తనకంటూ ఒక ప్రపంచం ఏర్పరుచుకొని, బావ ఇంకా తననే తలుచుకోవాలని తనకే తెలియకుండా మనసులో ఆశించడం ఎంత పొరబాటు?" అని తనను తాను విశ్లేషించుకుంది. అసలు అలా ఊహించుకునే హక్కును కోల్పోయింది అన్న విషయం గుర్తుకు రాగానే గుండె ఝల్లుమంది. 

         "ఇప్పటివరకు ఏదో ప్రవాహంలా అన్నీ సంఘటనలు జరిగిపోయాయి. ఏదీ పూర్తిగా ఆలోచించే సమయం కూడా లేకపోయింది. ఎవరైనా దూరం అయినప్పుడే వారి విలువ తెలిసొస్తుంది. ఇప్పుడు అదే ఊరిలో చిన్నప్పటి ఙ్ఞాపకాలు కలవరపెడుతున్నాయి. మెదడు పరిస్థితులకు అలవాటు పడినా వెంకట్ కళ్ళ ముందుకు రాగానే మనసే మొండికేస్తుంది" అని ఆలోచనల్లో ఉన్న కావ్యకు హారన్ శబ్దం వినిపించి ఉలిక్కిపడింది. 

         తాను ఇదివరకటికన్నా ఇప్పుడే వెంకట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని అనిపించింది కావ్యకు. "ఇక నుంచి కాస్త మనసుని అదుపులో పెట్టుకోవాలి" అనుకుని లోపలకు వెళ్ళింది. 

         కావ్య వాళ్ళ అత్తయ్య ఎదురు వచ్చి కావ్యను కౌగలించుకొంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. 


"పెళ్ళి అయ్యాక ఇంకా అందంగా తయారయ్యావు నువ్వు. నా దిష్టే తగిలేలా ఉంది" అని లోపలకు తీసుకెళ్ళింది.

         "ఇంట్లో ఎవ్వరూ లేరా అత్తయ్యా? అంతా నిశ్శబ్దంగా ఉంది" అని చుట్టూరా చూసింది.

         "ఎవరు ఉంటారు. అందరికి పనులు. అందరూ చివరి నిముషంలో వస్తారు. నువ్వు నా మీద అభిమానంతో ముందు వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

         "ఛ! అదేంటి అత్తయ్య ఎందుకు బాధపడతావు? ఎక్కడెక్కడ నుండో రావాలి అంటే సమయం పడుతుంది కదా. ఈ రెండు రోజులు నీతో పూర్తిగా గడిపే అవకాశం నాకు ఉంటుంది కదా" అని అంది కావ్య ప్రేమగా.

         "సరే స్నానం చేసిరా, వేడిగా పెసరట్టు ఉప్మా తిందువు గానీ" అనేసరికి ఉత్సాహంగా చూసింది కావ్య.

         "ఈ రెండు రోజులు నీ చేత అన్ని రకాలూ చేయించుకుంటాను" అని అంది చిన్న పిల్లలాగా.

         "నీకు కాకపోతే ఇంకెవరకు చేస్తాను. నాతోనే ఉండిపోతావనుకున్నా. నువ్వు పెళ్ళి చేసుకొని మమ్మలిని అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోయావు" అని అంది బాధగా.

         కావ్య చిన్న బుచ్చుకోవడం చూసి అలా అని ఉండకూడదు అని అనుకుంది ఆవిడ.

         "ఛా! నేను ఒకదాన్ని ఏదో ఒకటి అనేస్తాను. అన్నీ మర్చిపో. హాయిగా ఉండూ. నీకు కావలిసినవన్ని చేసిపెడతాను. అందరూ వెళ్ళిపొయినా నువ్వూ కిరణ్ ఇంకో పదిరోజులు ఉండివెళ్ళాలి సరేనా?" అని అంది నవ్వుతూ.

         పొద్దున్నంతా అత్తయ్యతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేసింది. సాయంత్రం అయినా వెంకట్ జాడ కనిపించలేదు. తోచక వెంకట్ పెంచుకున్న పావురాలు చూసి వద్దామని వెళ్ళింది కావ్య. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. ఇదివరకు ఎంతో అందంగా పెంచి ఉన్న మొక్కలు వాడిపోయి సంరక్షణ లేకుండా కనిపించాయి. కావ్య మనస్సు చివుక్కుమంది. లోపలకు పరుగెత్తుకెళ్ళింది కావ్య.

         "అత్తయ్యా పావురాలు ఏమయ్యాయి? అన్నీ అలా చిందర పందరగా ఉన్నాయి ఏంటి?" అని అడిగింది.
 "ఏం చెప్పేది కావ్యా? వెంకట్ లో ఇదివరకు ఉత్సాహం లేదు. అసలు పొద్దున్న వెళ్ళిన వాడు ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. వాడిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. పైకి ఏమి చెప్పడు. మాకు షష్టిపూర్తి చెయ్యాలని ఆశపడుతున్నాడు. కానీ వాడికి ఒక పెళ్ళి చేసి చూసి సంతోషించాలి అన్న నా ఆశ ఆశగానే ఉండిపోతోంది. పెద్దవాడు రఘు మమ్మలని వచ్చేయ్యమని అడుగుతున్నాడు. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే రేపు పిల్లలు వస్తే చూసేవాళ్ళు ఉండరూ అని. కాని ఇక్కడ వీడిని ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళేది? వాడిని ప్రేమతో చూసుకునే ఒక మనిషి కావాలి కదా? కానీ పెళ్ళి మాట ఎత్తితే ఇప్పుడప్పుడే వద్దు అంటాడు. వాడి స్నేహితులందరికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలతో సుఖంగా ఉన్నారు. వీడు మాత్రం పెళ్ళి లేకపోతే బతకలేనా అని అంటూ వేదాంతం చెప్తాడు. దేని మీదా అమితంగా ప్రేమను పెట్టుకోకూడదూ మళ్ళీ వదిలి వెళ్ళిపోతే తట్టుకోలేను అని ఆ పావురాలను విడిచిపెట్టేసాడు. ఏదో తన పని, తన పుస్తకాలతో కాలం గడుపుతూ ఉంటాడు. నువ్వైనా కాస్త చెప్పి చూడు. నువ్వు అడిగితే కాదూ అని అనడని నా అభిప్రాయం" అని అంది కావ్య చేయి పట్టుకొని అభ్యర్ధనగా.

         "సరే అత్తయ్య నేను మాట్లాడతాను. నువ్వు బెంగ పెట్టుకోకు" అని సర్ది చెప్పింది కావ్య.

         వెంకట్ తండ్రి రావడంతో ఇద్దరూ లేచారు.

         "ఏమ్మా కావ్యా ఎలా ఉన్నావు? కిరణ్ రాలేదా?" అని బాగానే పలకించారు కావ్యను చూసి.

         మామయ్య ఆప్యాయంగా పలకరించడంతో ఎంతో ఆనందంగా అనిపించింది కావ్యకు.

         "పద కావ్యా, నీకు మామయ్యకూ భోజనం వడ్డిస్తాను" అని అంది కావ్య వాళ్ళ అత్తయ్య.

         "లేదు అత్తయ్య ఆకలి లేదు. బావ వచ్చాక తింటాను" అని కూర్చుండి పోయింది కావ్య.

         "సరే" అని వెళ్ళిపోయారు లోపలకు ఇద్దరూ.

         వెంకట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కావ్య. చల్లగా ఉండడంతో కావ్యకు చిన్నగా కునుకు పట్టేసింది.

         ఏదో అలికిడి వినిపించి ఉలిక్కిపడి లేచింది కావ్య. 



గేట్ తీసుకొని వెంకట్ లోపలకు వస్తూ కనిపించాడు. ఆవులిస్తూ లేచింది కావ్య.

         "ఏమిటి బావా ఇంతసేపు ఏం చేస్తున్నావు?" అని అంది విసుగ్గా.

         "స్నేహితులు ఉండిపొమ్మంటేను ఉండిపోయాను. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు?" అని అడిగాడు కావ్య వంక చూస్తూ.

         నిద్ర మత్తుతో ఉన్న కావ్య ఇంకా అందంగా కనిపించింది. చీరలో కావ్యను మొదటి సారి చూస్తున్నట్టు అనిపించింది. పెళ్ళి అలంకారంలో ఆనాడు చూసాడు కానీ, ఏ అలంకారం లేకుండా విశ్వనాథ్ సినిమాలో నాయికలా ఎప్పుడూ లేనంత అందంగా అనిపించింది వెంకట్ కి. అలా చూడడం తప్పని గ్రహించి చూపులు మరల్చుకున్నాడు.

         "పదా అందరూ నిద్రపోయారు. నువ్వూ నేను కలిసి తిందాము" అని లోపలకు వెళ్ళబోయింది కావ్య.

         "నాకు ఆకలి లేదు. అక్కడ తినేసి వచ్చాను. నువ్వు వెళ్ళి తినేసి పడుకో" అని అన్నాడు తన గదిలోకి వెళ్ళిపోతూ.

         "నేను ఒక్కదాన్నీ తినాలా? నేను పడుకుంటాను పోయి. అయినా మీ ఇంటికి వచ్చి నిన్ను బతిమాలుకోవాల్సి వస్తోంది" అని అంది కోపంగా.

         "అంటే మా ఇంట్లో నీకు మర్యాదలు చెయ్యాలా? లేకపోతే ఏం చేస్తారు అమ్మగారు?" అని అన్నాడు వెంకట్ తలుపు దగ్గర చేతులు కట్టుకొని నిల్చొని.

         "ఏం చేస్తాము? అయ్యో అంత దూరం నుండి వస్తే ఎవరూ పట్టించుకోలేదే అని మంచినీళ్ళు తాగి పడుకుంటాను. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది" అంది కావ్య నీరసంగా మొహం పెట్టి.

         "సరే నాకు ఆ పాపం వద్దు కానీ కొంచెం తింటాను పదా" అని అన్నాడు వెంకట్ వెనకాలే నడుస్తూ.

         గబగబా ఇద్దరికి వడ్డించి కూర్చుంది కావ్య. పక్కనే కూర్చొని కావ్య వంకే చూస్తూ ఉండిపోయాడు వెంకట్.

         "తిను బావా ఏంటి ఆలోచిస్తున్నావు?" అని కావ్య అనేసరికి తినడం ప్రారంభించాడు.

         భోజనం అయ్యేవరకు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. చేయి కడిగేసుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోబోయాడు వెంకట్.

 "బావా నీతో కొంచెం మాట్లాడాలి" అని పిలిచింది కావ్య.

         "రేపు అందరూ వస్తే మళ్ళీ మాట్లాడే సమయం దొరకదు" అంది.

         "సరే చెప్పు ఏంటి సంగతి?"అని అన్నాడు వరండాలోకి వెళ్తూ.

         కావ్య కూడా వెనకాలే వెళ్ళి గోడకు ఆనుకొని నిల్చొంది.

         "ఏంటి ఎదో చెప్పాలని అన్నావు? ఏమి చెప్పకుండా అలా నిల్చొన్నావు?" అన్నాడు కావ్య వంక చూస్తూ.

         "ఇదివరకులా ఎందుకో నాతో నువ్వు మాట్లాడడం లేదు, తప్పించుకొని తిరుగుతున్నావు" కంప్లెయింట్ చేస్తున్నట్టు అంది కావ్య.

         "నీకలా అనిపిస్తోందా?" అని అన్నాడు వెంకట్ తిరిగి ఇంకో వైపు చూస్తూ.

         "అనిపించడం కాదు అదేగా నిజం? కోపం ఏమి లేదు అని పెద్ద ఉత్తరం రాసావు. మరి పొద్దున్న నుండి నన్ను అలా పంపించేసి ఎక్కడికి వెళ్ళిపోయావు?" అంది కావ్య కోపంగా.

         ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు వెంకట్.

         "ఏం బావా నువ్వు ఇంటికి కూడా రావడం లేదంట కదా? అత్తయ్య ఎంత బాధపడిందో తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావు, ఇది నీకేమైనా బాగుందా? అత్తయ్య చెప్పిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని నువ్వూ హాయిగా ఉండొచ్చుగా?" అని కోపంగా చూసింది కావ్య.

         "ఎక్కడ నుంచి నేర్చుకున్నావు ఇన్ని మాటలు? మీ అమ్మాయిలు పెళ్ళి అవ్వగానే ఎవ్వరికి పెళ్ళి చేద్దామా అని చూస్తుంటారు. అదేం లేదు కావ్యా, అమ్మ అలానే అంటుంది. ఆవిడకు నా మీద అమితమైన ప్రేమ. ఏమి లేకపోయినా ఏదో ఉంది అని బాధపడుతుంది" అని అన్నాడు వెంకట్ నవ్వుతూ.

         "మరి పొద్దున్న వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడం?" అని చురుగ్గా చూసింది కావ్య.

         "ఇదిగో నీ పెత్తనం ఇక్కడ చెల్లదు. ఇంక కిరణ్ మీద చలాయించుకో" అని అన్నాడు వెంకట్ ఆటపట్టిస్తూ.

         చివుక్కున తలెత్తి చూసింది కావ్య. ఒక్కసారి ఇద్దరి చూపులు కలిసి విడిపోయాయి. కావ్య తల దించుకొని మౌనంగా ఉండిపోయింది. కళ్ళల్లో కనీ కనిపించని కన్నీటి పొర కదలాడింది. అది వెంకట్ గమనించనే గమనించాడు. దగ్గరగా వచ్చి నిల్చొన్నాడు.

 "ఆ కళ్ళల్లో కన్నీళ్ళు తట్టుకోవడం నా వల్ల కాదు. ఇదిగో లెంపలు వేసుకున్నా చూడు" అని లెంపలు వేసుకున్నాడు వెంకట్.

         చిన్నగా నవ్వింది కావ్య.

         "ఇప్పుడు ఇలా మాట్లడుతావు, మళ్ళీ కనిపించకుండా పోతావు. ఎప్పుడైనా వచ్చినా కిరణ్ తో మాట్లాడి వెళ్ళిపోతావు. నీకు నా మీద కోపం లేకపోతే ఎందుకలా చేస్తావు?" అని సూటిగా చూసింది కావ్య.

         మళ్ళీ దూరంగా వెళ్ళి నిల్చొన్నాడు వెంకట్.

         "ఏం బావా నేను ఏదన్నా తప్పుగా అడిగానా?" అని అడిగింది కావ్య.

         "లేదు కావ్యా ఏమి తప్పు లేదు. నీకు తెలుసా కావ్యా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను దేని మీద ఎక్కువ ప్రేమ ఆశ పెట్టుకోలేదు. చిన్నప్పుడు కుక్క పిల్ల కావాలి అని అన్నప్పుడు, ఎక్కడికైనా వెళితే అది బెంగ పెట్టుకుంటుందిరా వద్దు అని చెప్పింది అమ్మ. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డ అమ్మ కూడా నీ విషయంలో ఏం చెప్పాలో తెలియక తిక మక పడుతోంది. నాకే తెలియకుండా నువ్వు నా మనసంతా నిండిపోయావు. నువ్వు ఎదురు పడినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతాను. నా మనసులోని భావాలు ఎవరి కళ్ళల్లోనైనా పడితే, దానివల్ల నిన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నా, లేదా నీకు ఏదన్నా ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేను. అందుకే దూరంగా ఉన్నానే తప్ప నీ మీద అభిమానం తగ్గి కాదు. నా మనసులో ఉన్నది అంతా సమయం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నా. కానీ సమయం నాకన్నా వేగంగా పరిగెడుతుంది అని దానిని అందుకోలేనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నాకు కొంచెం సమయం పడుతుంది. నా పెళ్ళి ఇప్పుడు ముఖ్యం కాదు. ఏదో చేసుకోవాలి కదా అని తొందరపడి చేసుకొని ఆ వచ్చే వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక అమ్మ మాట కాదన్నాను. నీకు ,అమ్మకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. నీకు, అమ్మకు అందులోనే సంతోషం ఉంటే అలానే చేస్తాను. సరేనా? ఇంక చాలా పొద్దు పోయింది. వెళ్ళి పడుకో" అని అన్నాడు వెంకట్.

         "అయితే నా మీద ప్రమాణం చెయ్యి" అని చెయ్యి ముందుకు చాచింది కావ్య.

         "ఏమిటి చిన్న పిల్లలాగా" అని వెంకట్ అన్నా కావ్య ఊరుకోలేదు.

         "సరే నేను పెళ్ళి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు అని అంటే తప్పకుండా చేసుకుంటాను, సరేనా? ఇంక హాయిగా పడుకో" అని ప్రమాణం చేసాడు వెంకట్.

         "అబ్బా నిద్ర రావడం లేదు. కాసేపు కబుర్లు చెప్పు. నీతో ఇలా మాట్లాడే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో" అని కూర్చుంది కావ్య.

కిరణ్ బిజినెస్ చేసే విషయం, తన స్నేహితురాలు గురించి అన్నీ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోయింది కావ్య. తన ఆశలను, సంతోషాలను చెప్తుంటే వెంకట్ వింటూ ఉండిపోయాడు.

***        ***        ***        ***

         రెండు రోజుల్లో ఒక్కొక్కరుగా రావడంతో హడావుడి మొదలు అయ్యింది. అత్తయ్యకు చేదోడు వాదోడుగా కావ్య అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. హరిణి పిల్లలు రావడంతో ఇల్లంతా ఒకటే సందడి.

         కావ్యకు ఎన్నో రోజుల తరువాత ఇలా నవ్వుతూ గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పెళ్ళి అయిపోయినందుకో ఏమో హరిణి కూడ కావ్యను కాస్త నవ్వుతూనే పలకరించింది. ఆలా కాస్త నవ్వుతూ మాట్లాడినందుకే కావ్య పొంగిపోయింది. ఎప్పుడూ లేనిది మొదటి సారిగా తనకూ తోబుట్టువులు ఉండి ఉంటే బాగుండు అనిపించింది. అందరిని చూస్తూ గడిపేసింది. కిరణ్ జ్ఞాపకం రావడంతో గదిలోకి వెళ్ళి ఫోన్ చేసింది.

         "ఏంటీ నేను ఇక్కడ ఒకడిని ఉన్నాను అని మర్చిపోయావా?" అని ఆట పట్టించాడు కిరణ్.

         "అందుకే నేను రాను అన్నాను. మీరే బలవంతంగా పంపించారు" అని అంది కావ్య కోపగించుకుంటూ.

         "అబ్బా నీకు కోపం వెంటనే వచ్చేస్తుంది కదా? ఊరికే అన్నాను. హాయిగా సంతోషంగా ఉండు. రేపు సాయంత్రం బయలుదేరి వస్తున్నాము. మీ అమ్మగారిని, నాన్నగారిని, బామ్మగారిని జాగ్రత్తగా తీసుకొని వస్తాను. మీ నాన్నగారు ఇందాకే వచ్చి వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఫోన్ పనిచెయ్యటం లేదు అని చెప్పారు. నువ్వేదైనా చేస్తావేమో అని చెప్పమన్నారు. ఇంకేమన్నా తేవాలంటే చెప్పు తెచ్చేస్తాను" అని అన్నాడు కిరణ్.

         "మరి మామయ్యగారు ఒక్కరిని వదిలేసి వస్తారా? పాపం ఒక్కరు ఏం చేస్తారు? ఎలాగోలా చెప్పి ఆయన్ను కూడా తీసుకు రండి" అని అంది కావ్య.

         "నాన్నకు ఇదంతా అలవాటే కదా కావ్య? నేను చదువుకున్నన్ని రోజులూ ఒక్కరే ఉన్నారు. నువ్వేమి బెంగ పెట్టుకోకు. ఇదిగో నాన్న కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడు" అని తండ్రి చేతికిచ్చాడు కిరణ్.

         "కావ్య మీ మీద బెంగ పెట్టుకుంది నాన్నా" అని నవ్వాడు కిరణ్.

         "కావ్యా! ఏమి పర్వాలేదు తల్లీ. నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది. అందుకే ఉండిపోయాను. బెంగ పెట్టుకోకు. రెండు రోజుల్లో వచ్చేస్తారుగా?" అని చెప్పి పెట్టేసాడు.
  రాజారాం మనసులోనే పొంగిపోయారు. భార్య పోయిన తరువాత ఇంత ప్రేమగా ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కావ్య చూపించే ప్రేమ ఆప్యాయతలో జీవితంలో కొత్త సంతోషం కనిపించింది. పెళ్ళితో కొడుకు జీవితమే కాకుండా తన జీవితం కూడా కొత్త మలుపు తిరిగిందని ఆయనకు అనిపించింది. ఇప్పటివరకు జీవితంలో ఒక్కో క్షణం ఎంతో భారంగా గడిచింది. కావ్య రాకతో ప్రతీ ఉదయం ఒక్క కొత్త ఆశతో ఎదురు చూస్తునట్టు అనిపించింది. కూర్చుని పత్రిక చదువుతున్న కిరణ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తట్టారు. తలపై చేయి ఉంచి దీవించారు. తండ్రి సంతోషంగా ఉండడం గమనించిన కిరణ్ కూడా తండ్రి వంక చూసి నిర్మలంగా నవ్వాడు. ఒకరికొకరికి ఏమి చెప్పుకోకుండానే మనసులోని ఆనందాన్ని చిన్న నవ్వుతో పంచుకున్నారు ఇద్దరూ.

***        ***        ***        ***

         పొద్దున్నే లేచి తయారయ్యింది కావ్య. ఏమిటో కిరణ్ ని వదిలేసి వచ్చి ఒక నాలుగు రోజులే అయినా ఏదో ఎన్నో రోజులయినట్టు అనిపించింది. అందరూ ఆ రోజు పట్టిసీమ వెళ్ళాలని అనుకొని ప్రయాణం అయ్యారు. కావ్య పెద్ద బావా వాళ్ళు అందరూ రావడంతో సరదాగా తిరిగి రావాలని కావ్య అత్తయ్య అందరికీ తినడానికి పులిహోర, దద్దోజనం తయారు చేసింది. కావ్యకు ఎందుకో కాస్త నలతగా ఉండడంతో వెళ్ళ బుద్ది కాలేదు. అదే విషయం కావ్య అత్తయ్యకి చెప్పింది. ఆవిడ కూడా కావ్యకు తోడుగా ఉండిపోడానికి నిశ్చయించుకుంది.

         "లేదు అత్తయ్య నేను ఒక్కదాన్నే ఉండగలను. మీరు అందరూ సరదాగా వెళ్ళి రండి" అని కావ్య బ్రతిమాలినా ఆవిడ ఒప్పుకోలేదు.

         వెంకట్ కూడా ఉండిపోతాను అనడంతో హరిణి చిరాకు పడింది.

         "ఏదోక నాటకం చెయ్యకుండా ఉండదు మహా తల్లి. అందరం సరదాగా వెళ్ళాల్సింది కాస్తా ఇలా తగలడింది" అని పళ్ళు నూరింది.

         "అబ్బా రాద్ధాంతం చెయ్యకు" అని హరిణి భర్త సముదాయించాడు.

         "నేనా రాద్ధాంతం చేస్తున్నది. అక్కడ చూడండి" అని కావ్య వైపు గుర్రుగా చూసింది.

         కావ్యకు ఇంక కళ్ళనుండి జల జలా కన్నీళ్ళు రాలడమే తరువాయి. కావ్య అత్తయ్య అది గమనించింది.

         "ఒరే వెంకట్ నువ్వూ వెళ్ళు. లేదంటే అది ఇంకా రాద్ధాంతం చేస్తుంది. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను" అని చెప్పడంతో వెంకట్ కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు.



వాళ్ళు వెళ్ళిన రండు గంటలకు కావ్యకు తిన్నది ఇమడక వాంతులు అవుతుండడంతో గాభరా పడి కావ్య అత్తయ్య వెంకట్ కి ఫోన్ చేసింది.

         వెంకట్ రాగానే అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు. వెంకట్ ఇద్దరినీ లోపలకు పంపించి బయటే ఎదురు చూశాడు. కొంచెం సేపటికి కావ్య, తల్లీ రావడం చూసి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు.

         "ఏమి కంగారు లేదు. అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే అంతా తగ్గిపోతుంది" అని నవ్వింది కావ్య వైపు చూస్తూ.

         "అదేమిటి మందులు ఏమి రాయకుండా, ఏమి చూడకుండా ఇలా పంపించేసారు? నేను మాట్లాడి మందులేమైనా ఇస్తారేమో అడిగి వస్తాను" అని వెళ్ళబోయాడు వెంకట్.

         "అవేమి అక్కర్లేదు.నువ్వు పదా" అని వెంకట్ తల్లి చెయ్యి పట్టి ఆపింది.

         ఏం చెప్పినా వినిపించుకోకుండా హడావుడి చేస్తున్న వెంకట్ పక్కనే నర్స్ వచ్చి నిల్చొంది.

         "ఈయనేనా కాబోయే తండ్రి? ఇప్పుడే ఇంత హడావుడి చేస్తున్నారు, ఇంక ముందు ఎంత చేస్తారో?" అని నవ్వేసి కావ్య చేతిలో ఒక సీసాని ఉంచింది.

         "ఇవి బలానికి టాబ్లేట్లు, వేసుకోమన్నారు డాక్టర్ గారు" అని చెప్పేసి వెంకట్ వైపు చూసి నవ్వేసి వెళ్ళిపోయింది నర్స్.

         విచిత్రంగా చూస్తున్న వెంకట్ ని చూసి కావ్య, అతని తల్లి ఒక్కసారి ఫక్కున నవ్వారు. వెంకట్ కూడా వాళ్ళ నవ్వుతో జత కలిపాడు.

***        ***        ***        ***

         సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు కిరణ్ కి తను తండ్రి కాబోతున్న సంగతి చెప్పాలా అని ఎదురు చూసింది కావ్య.

         "విషయం తెలిస్తే అమ్మా నాన్నా కూడా ఎంత ఆనందిస్తారో" అని ఊహల్లో తేలిపోతోంది కావ్య.

         సాయంత్రం ట్రైన్ కి వస్తున్న వాళ్ళను తీసుకు రావడానికి వెంకట్ వెళ్ళాడు. వచ్చే వాళ్ళ కోసం కావ్య వసారాలోనే కూర్చొంది.


( ఇంకా ఉంది )

Author: Siri
•Monday, September 13, 2010
  "ప్రియమైన కావ్యకు, 
         నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు క్షమించు. చెప్పే ధైర్యం చాలలేదు. ఎదురుగా చెప్ప లేక ఇలా అక్షరాల సహాయంతో రాస్తున్నాను. నేను ఇచ్చిన బహుమతి నీకు నచ్చిందనుకుంటాను. ఎప్పటి నుండో నీకోసమే చేసింది. ఎప్పుడోకప్పుడు ఇవ్వాలని ఉంచాను. ఇప్పుడు సరైన సమయం వచ్చిందనుకుంటాను.

         అమ్మా, అమ్మమ్మ అందరూ చెప్పే మాటలు నువ్వు పట్టించుకోకు. అమ్మ నిన్ను బాధపెడితే ఆవిడ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంక నా విషయానికి వస్తే, నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు.

         నేను కొంచెం బాధపడింది నిజమే. కానీ మళ్ళీ ఆలోచించాను. నా ప్రేమ ఆత్మకు సంబంధించింది కానీ శరీరానిది కాదు. మనిద్దరం ఒకటి కాకపోవడం వల్ల అందులో ఏ మాత్రం మార్పు రాదు. ప్రేమకు పెళ్ళే సమాధానమా? కాదు కదా?

         నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే ఆత్మ ఒకటుందని అది ఏ స్వార్థాన్నీ కోరుకోదని గుర్తు ఉంచుకో. నువ్వు సంపూర్ణంగా, సంతోషంగా జీవితం గడపాలి. ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడే నాకు సంతోషం.

         నువ్వూ, నీ జీవితంలో ఉన్న మనుషులు నాకు ముఖ్యమైనవారే. ఇప్పుడు నీతో పాటు కిరణ్, నీకు పుట్టబోయే పిల్లలు, ఇలా ఇంకా నాకు ఎంతో మంది ప్రేమించేవాళ్ళు దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి. మీరు ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

         మీ కష్ట సుఖాల్లో నన్ను ఎప్పుడైనా తలచుకుంటారని ఆశిస్తూ...

వెంకట్ 





 అని రాసి ఉంది.

         అలా చదువుతూ ఉండిపోయింది కావ్య. ఎన్ని సార్లు చదివినా ఇంకా చదవాలనిపించింది. ఎప్పుడు వచ్చాడో కిరణ్ వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న కావ్య చేతిలోంచి ఉతరాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. 



 ఇలా అనుకోకుండా వచ్చి పక్కనే కూర్చున్న కిరణ్ ని చూసి కావ్య ఉలిక్కి పడింది. ఉత్తరం చదివి ఏమనుకుంటాడో అని కంగారు పడింది.

         "మీ బావ మనిషే అందగాడు అనుకున్నా, మనసూ అంత కంటే అందమైనదని ఈ ఉత్తరం చెప్తోంది. ఇలాంటి మనిషి మనకు ఉన్నందుకు మనమే అదృష్టవంతులం. నిజంగా నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి మనసున్న మనిషిని" అన్నాడు నవ్వుతూ.

         తేలికగా ఊపిరి పీల్చుకుంది కావ్య. అలమార లోంచి ఫోటో ఆల్బం తీసి చూపించింది. కిరణ్ ఒక్కొక్క ఫోటో గురించి అడుగుతున్నాడు. కావ్య ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోయింది. ఇద్దరూ నవ్వుతూ ఒకరికొకరు దగ్గరయ్యిపోయారు.

***        ***        ***        ***

         కావ్య, కిరణ్ ఇద్దరూ జీవితంలో సర్దుకుపోయారు. వెళ్ళిన కొత్తల్లో కావ్యను ఏ పని చేయనివ్వలేదు రాజారామ్ గారు కిరణ్ కలిసి. కొద్ది రోజుల్లోనే తల్లితండ్రులను వదిలి వచ్చానన్న బాధ నెమ్మదిగా పోయింది. ఒకే ఊరిలో ఉండడం వల్ల ఆదివారాలు అందరూ కలిపి గడిపేవారు.

         కావ్య కూడా రాజారాంని తండ్రిలా చూసుకోవడం, కిరణ్ కి అన్నీ ఎప్పటికప్పుడు చేసి పెట్టడం చూసి కావ్య తల్లి తండ్రులు మురిసిపోయారు. కిరణ్ కూడా కొడుకులా అన్ని విషయాలు చూసుకోవడంతో కావ్య తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశ్రాంతి తీసుకున్నారు. వెంకట్ కి కూడా కిరణ్ తో మంచి స్నేహం ఏర్పడడంతో అపుడప్పుడు కలుసుకునేవారు.

         కిరణ్ ఒక కంపెనీలో ప్యాకింగ్ విభాగంలో మేనేజర్ గా పనిచేసేవాడు. వెంకట్ సలహా మేరకు అప్పు తీసుకొని సొంతంగా తనకు తెలిసిన ప్యాకింగ్ కంపెనీ ఒకటి పెట్టాడానికి పూనుకున్నాడు.

         "మీ బావ అద్భుతమైన సలహా ఇచ్చాడు. నువ్వు రావడంతో నా జీవితం మారిపోయింది" అని సంతోషంగా కావ్య ను ఎత్తి గిరగిరా తిప్పేసాడు కిరణ్.

         కావ్య ముఖంలో సంతోషం కనపడకపోవడంతో ఏమిటని అడిగాడు కిరణ్.

         "నా జాతకం మావయ్య, హరిణి చూపించినప్పుడు నాది అంత మంచి జాతకం కాదు అని చెప్పారు. నాకు అత్తగారు లేరు లేదంటే ఆవిడకు ప్రాణ గండం అని కూడా చెప్పారు. ఇది నా వల్ల కాదు అంతా మీ అదృష్టమే" అని అంది కావ్య.

         "పిచ్చీ! నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు" అని అన్నాడు కిరణ్ కావ్య నెత్తి మీద చిన్న మొట్టికాయ మొడుతూ.



 "అంటే జాతకాలు ఇవేమి నిజం కాదూ అంటారా?" అని అంది కావ్య మూతి తిప్పుతూ.

         "నిజం అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. అస్సలు నిజంలేదు అనడం లేదు. కానీ ముందే తెలుసుకొని జీవితం అంతా బాధపడటం ఎందుకు అంటాను. ఒకరి ఉనికి వల్ల ఇంకొకరికి నష్టం అని చెప్పడం నిజంగా తెలివి తక్కువతనమే. ఇప్పుడు నా జాతకంలో నేను రేపో మాపో పోతాను అని రాసి ఉంది అనుకో, అది తెలుసుకొని రోజూ చావు భయంతో బతకడం కన్నా తెలియకుండా ఒక్కరోజైనా సంతోషంగా ఉండడం మేలు. అలాగే ఎవరో చెప్పిన జాతకాన్ని గురించి ఆలోచించి అన్నిటికీ వెనకడుగు వెయ్యడం కన్నా, నీ ఉనికి వల్ల ఎంత మందికి సంతోషాన్నీ, ప్రేమను పంచావో తెలుసుకొని ఆనందంగా గడపడం ముఖ్యం అంటున్నా. అందుకే హాయిగా మనో ధైర్యంతో, ఆనందంగా ఉన్న కొన్ని క్షణాలు గడపాలి. ఈ క్షణం మళ్ళీ రేపు రమ్మని బ్రతిమాలినా రాదు" అని అన్నాడు కావ్య బుగ్గ గిల్లుతూ.

         కిరణ్ మాటలతో ఏదో కొత్త ఊపిరి వచ్చినట్లు అనిపించింది కావ్యకు.

         "మీతో పాటూ నేను సహాయం చెయ్యనా మీ పనిలో?" అని అడిగింది కావ్య.

         "సహాయం ఏంటి? సర్వం నీదే. నువ్వే దానికి అధిపతివి" అని అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         "అన్నట్టు మర్చిపోయాను సాయంత్రం మనం ఒకరి ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసిన వాళ్ళు. లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం కదా. దాని సంబంధించి మాట్లాడాలి. నువ్వు తయరవ్వు, ఇద్దరం కలిసి వాళ్ళింటికి వెళ్ళి వద్దాం" అని అన్నాడు.

         "సరే" అని లేచింది కావ్య.

***        ***        ***        ***

         సాయంత్రం ఇద్దరూ తయారయ్యి బయలుదేరారు. ముచ్చటగా ఉన్న చిన్న ఇల్లు. అందంగా చుట్టూరా మొక్కలు ఉన్నాయి.

         వెళ్ళి తలుపు కొట్టగానే "ఆఁ వస్తున్న" అన్న అడ గొంతు వినిపించింది.

         ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది కావ్యకు. తలుపు తీసి ఎదురుగా నిల్చొన్న అమ్మాయిని చూడగానే కావ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది.



ఎదురుగా పావని నోరు వెళ్ళబట్టుకొని చూస్తూ ఉండిపోయింది.

         "నేను చూసేది నిజమేనా? కావ్యా ఎలా ఉన్నావు? రా లోపలకు. ఎన్ని రోజులయ్యిందే నిన్ను చూసి" అని లాక్కొని వెళ్ళిపోయింది.

         కిరణ్ విచిత్రంగా చూస్తుండిపోయాడు వాళ్ళిద్దరి వంక.

         "నువ్వు ఇక్కడ ఎలా?" అని ఎన్నో ప్రశ్నలతో నిండిన ముఖంతో చూసింది కావ్య.

         "అదంతా పెద్ద కథ. అన్నీ చెప్తాను కానీ, నీ వెనకాల ఉన్నతను ఎవరు?" అని చెవిలో గుసగుసలాడింది పావని.

         "అతను నా భర్త కిరణ్ " అని అంది కావ్య కిరణ్ ను పరిచయం చేస్తూ.

         "నమస్కారం అండి. మీకూ కావ్యకు పరిచయం ఉన్నట్టు ఉంది. నేను రమణ గారికి తెలుసండి. ఆయన్ని కలవడానికే వచ్చాము" అన్నాడు కిరణ్ కావ్య పక్కగా వచ్చి నిల్చొని.

         "అవును, పావని నేను చిన్నప్పటి నుండి స్నేహితులం" అని అంది కావ్య పావని వంక సంతోషంగా చూస్తూ.

         ఇంతలోపు లోపల నుంచి వచ్చిన వ్యక్తిని చూసి పావని చిన్నగా నవ్వింది. అతని వెనకాలే తొమ్మిది సంవత్సరాల పాప పరిగెట్టుకొని వచ్చింది.

         "ఇదిగో ఈయనే మా వారు" అని పరిచయం చేసి కావ్య గురించి చెప్పింది.

         పాప వచ్చి "ఆమ్మా" అంటూ పావనిని కౌగలించుకొని కూర్చుంది.

         కావ్య నోట మాట రానట్టు ఉండిపోయింది.

         "మీరు మాట్లాడుతూ ఉండండి. నేనూ, కావ్య లోపలకు వెళ్ళి మాట్లాడుకుంటాము" అని కావ్యను లోపలకు తీసుకెళ్ళింది పావని.

         "కావ్యా అంతా అయోమయంగా ఉందే. నీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది? అయినా మీ బావ ఏమయ్యాడు? ఎన్ని చెప్పేదానివి మీ బావ గురించి" అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది పావని.

         "నా సంగతి అలా ఉంచు. నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోయావని మీ వాళ్ళు ఎంత బాధపడ్డారో. మళ్ళీ వెళ్ళి కలవడానికి భయం వేసింది. పెళ్ళికి పిలుద్దామని వెళితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా?" అని అంది కావ్య బాధపడుతూ.

"ముందు నీ కథ చెప్పు నాకు. మీ బావ గురించి చెప్పకపోతే నాకు బుర్ర పగిలేలా ఉంది" అంది పావని ఆత్రుతగా.

         కావ్య అంతా చెప్పుకొచ్చింది. రాజమండ్రి వెళ్ళినప్పుడు జాతకం చూడటం నుంచి తండ్రి గుండెపోటు రావడం, కిరణ్ తో పెళ్ళి జరగడం వరకు అన్నీ చెప్పింది.

         "పాపం మీ బావ. అలాంటి బావ నాకు ఉంటేనా, అస్సలు వదిలేదాన్ని కాదు. మనస్పూర్తిగా మనలని ప్రేమించేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. చాలా మంది ఏదొక స్వార్థంతోనో లేక అవసరం కోసమో బంధాలను ఏర్పరుచుకుంటారు. నీ జీవితంలో అలాంటి మనిషి ఉండి కూడా నువ్వు దూరం చేసుకున్నావు" అంది పావని కోపం నటిస్తూ.

         "కిరణ్ కూడా ఏమంత చెడ్డావాడు కాదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగదు కదా జీవితంలో. నేను సంతోషంగానే ఉన్నాను" అని అంది కావ్య కిందకు చూస్తూ.

         "నువ్వు బాగానే ఉన్నావు. పెళ్ళి భర్త అని. కానీ పాపం మీ బావ?" అని అంది పావని వెంకట్ ని వెనకేసుకొస్తూ.

         "నువ్వు కూడా అలా అనకే. నాకు బాధగా ఉంటుంది. ఏదో నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇప్పుడు ఎంత దాని గురించి మాట్లాడినా మారేది ఏమీ లేదు. నీ సంగతి చెప్పు అంత పెద్ద కూతురు ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది?" అంది కావ్య పావని పక్కన కూర్చుంటూ.

         "ఏం చెప్పమంటావు కావ్యా? నీకు తెలుసుగా? ఎంత మంది ఏం చెప్పినా నాకు సుబ్బరావు పిచ్చి బాగా ఎక్కేసింది. ఇంట్లో రోజువారీ గొడవల నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. ప్రేమను వెతుక్కుంటూ వాడి వెనకాలే వెళ్ళిపోయాను. రెండు వారాలు బాగానే ఉన్నాడు. పెళ్ళి కూడా చేసుకుంటాను అని చెప్పాడు. నన్ను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంచాడు. నన్ను లోపల ఉంచి తాళం వేసి ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేవాడు. కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఉండడం మంచిది అని నేనూ సర్దుకుపోయాను. కానీ సమయం గడిచే కొద్దీ రావడం తగ్గించేసాడు. ఒక్కొక్కసారి వారం రోజులు కనిపించకుండా పోయేవాడు. నాకు భయం వేసి నిలదీసాను. వాడికి విపరీతంగా కోపం వచ్చింది. ' ఇంత ధైర్యం లేని దానివి ఇల్లు వదిలి ఎందుకు వచ్చావు ' అని అన్నాడు. ఇంతకు ముందు ఎంతో ప్రేమ ఒలకబోసిన వాడు కొంచెం కొంచెం మారిపోయాడు" అంది మాట తడబడుతూ.

         మళ్ళీ అంతలోనే సర్దుకొని చెప్పడం ప్రారంభించింది... 



"అలా వారాలు నెలలు గడిచిపోయాయి. అక్కడ ఒక బందీ లాగా ఉండిపోయాను. చివరకు ఒకరోజున పెద్ద గొడవ పెట్టుకున్నాను. తనకు పెళ్ళి కుదిరిందని, అమ్మాయి బాగా చదువుకున్నది అందమైనది అని చెప్పాడు. తల్లి తండ్రులను మీరి తాను ఏమీ చెయ్యలేను అని తేల్చి చెప్పేసాడు. పెద్దగా ఏడ్చాను, అరిచాను ఏదేదో చేసాను. కాని ఫలితం లేకపోయింది. చివరకు నన్ను మా తల్లి తండ్రుల దగ్గరకు వెళ్ళిపొమ్మని చెప్పి నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు. ఎటూ దిక్కుతోచని నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవస్థపడ్డాను. చేతిలో రెండు వందల రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. రోజంతా పిచ్చిదానిలా తిరిగాను. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక చచ్చిపోవాలని అనిపించింది. కానీ ఎందుకో ఎంత తిట్టినా అమ్మా, నాన్నా గుర్తుకు వచ్చారు. అక్కడ గడిపిన రోజులు మరీ అంత బాధాకరం కాదూ అనిపించింది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక అసలైన నరకం అనుభవించాను. ఎవరికి నన్ను చూడాలని అనిపించలేదు. ఒక రోగిష్టిలా ఇక మూల పడి ఉండమన్నారు.

         అమ్మ కాస్త ప్రేమ కనిపించినా నాన్న కోపం చాలా ఎక్కువయ్యింది. ఇంకా తాగి గందరగోళం చేయడంతో ఇల్లు కూడా ఖాళీ చెయ్యాల్సివచ్చింది. ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేసి ఊరి చివరకి వెళ్ళిపోయాము. ఒక రోజు తాగి వచ్చి ఎప్పుడు వచ్చారో తెలియదు నాన్న, పొద్దున్న చూసేసరికి మనిషి ప్రాణం పోయింది. ఇంకా అంతా అయోమయం. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అప్పుడే రమణ గారితో పరిచయం ఏర్పడింది. నాన్నకి తెలిసినవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఒక మంచి మనిషి ఆయన. నాకు ఎలాగోలా నాన్న ఉద్యోగం వచ్చేలా కష్టపడ్డారు. డిగ్రీ కూడా పూర్తి చెయ్యడానికి సహాయం చేసారు. ఆయన వల్లే ఇప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. అన్నీ మర్చిపోయి జీవితం గడపగలుగుతున్నాను" అంది కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళను ఆపుకొంటూ.

         "ఎన్ని బాధలు అనుభవించావే. నీ బాధల ముందు నావి చాలా తేలికగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతలో అంత పెద్ద పాప ఎలా వచ్చింది అని చెప్పలేదు నువ్వు" అని కుతూహలంగా అడిగింది కావ్య.

         "రమణ గారి భార్య పాప పుట్టగానే చనిపోయింది. అప్పటి నుండి ఆయనే తల్లిగా పెంచారు. మాకు పరిచయం పెరిగి పాప నాకు దగ్గర అయ్యింది. తెలియకుండానే ఆయన మీద, పాప మీద నాకు తెలియని ప్రేమ ఏర్పడింది. కానీ ఇది ఇదివరకు లాంటి ప్రేమ కాదు. అమ్మ ఆశీర్వచనంతో పెళ్ళి చేసుకున్నాను. ముందు ఆయన దీనికి ఇష్టపడలేదు. కానీ నా మొండితనం నీకు తెలుసుగా? అదీ కాక నా సంగతి అంతా తెలిసి కూడా నాకు ఎంతో విలువనిచ్చిన మనిషిని ఎలా దూరం చేసుకునేది? అమ్మ కూడా చాలా సంతోషించింది. నా జీతం అంతా అమ్మకు చెల్లాయికే ఇచ్చేస్తున్నాను. చెల్లెలినైనా మంచిగా చదివించి పైకి వచ్చేలా చెయ్యాలి. అదే నా ఆశ. నాన్న బతికి ఉన్నంతకాలం మాకు ఎప్పుడూ ఏదీ చేసింది లేదు. కానీ ప్రాణం పోయాక మాత్రం మాకు ఒక మంచి దారిని చూపించాడు. ఆయన ఉద్యోగం నాకు రావడంతో ఇప్పుడు అమ్మకు, చెల్లాయికి ఆయన స్థానంలో ఉండి అన్నీ చెయ్యగలుగుతున్నాను" అని అంది పావని హాయిగా ఊపిరి పీల్చుకొని. 



"మనం ఎన్ని కలలు కన్నాము. పెళ్ళి అయ్యాక అందరం కలసుకోవాలని సరదాగా గడపాలని ఎన్నో అనుకున్నాము. కానీ మన జీవితాలు ఎలా మారిపోయాయో చూడు. నీ పెళ్ళికి నేను నా పెళ్ళికి నువ్వు లేకుండానే అయిపోయాయి" అంది కావ్య బాధగా.

         "నీకు వచ్చి చెప్పాలనే అనిపించింది. కానీ అప్పటికే నా విషయం మీ తల్లి తండ్రులకు తెలిసి ఉంటుంది. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ఉండిపోయాను" అని అంది పావని.

         ఇద్దరూ మాట్లాడుతుండగా పాప పరిగెత్తుకొని వచ్చింది, "అమ్మా ఆకలి వేస్తుంది" అని.

         "చూసావా నీతో కబుర్లలో పడి వచ్చినవాళ్ళకు ఏదైనా చెయ్యాలి అని ధ్యాసే లేకపోయింది" అని కంగారుగా లేచింది పావని.

         "పద నేనూ సహాయం చేస్తాను. వంట త్వరగా అయిపోతుంది" అని పావని వెనకాలే వెళ్ళింది కావ్య.

         అందరూ కలిసి భోజనాలు ముగించారు.

         "వంట చాలా బాగుంది. కాస్త కావ్యకు నేర్పించండి" అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         కోపంగా చూసింది కావ్య కిరణ్ వైపు.

         "మీరు తమషా చేస్తున్నారు అని తెలిసు. కావ్య వంట చెయ్యడం బాగోకపోవడం అని ఉండనే ఉండదు. కావ్య అన్నిట్లోను బెస్ట్. అయినా మీరు మాత్రం ప్రతి ఆదివారం మా ఇంట్లోనే భోజనం చేయ్యాలి. సరేనా?" అని అంది పావని.

         "సరే తప్పకుండా, మీరు చెప్పేసారుగా. ఇంక ప్రతి ఆదివారం మీతోనే భోజనం" అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         సరే ఇంక చాలు అన్నట్టు చిన్నగా గిల్లింది కావ్య. రమణ గారికి, పావనికి బాయ్ చెప్పి ఆటోలో బయలుదేరారు కావ్య, కిరణ్ లు. కిరణ్ సంతోషంగా ఉండడం చూసి కావ్య ఏమిటి అని అడిగింది.

         "ఏమి లేదు కావ్యా. ఇంక లోన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. రమణ గారు తప్పకుండా సహాయం చేస్తాను అన్నారు. ఇంక మనకి అంతా మంచి రోజులే. బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలి. ఒక పెద్ద ఇల్లు కట్టాలి. అందులో నాన్న, నువ్వు, నేను, మీ అమ్మా నాన్న అందరం కలిసి సంతోషంగా ఉండాలి. చిన్న కావ్య రావాలి" అని చెప్పుకుంటూ పోయాడు కిరణ్.

 "అయ్యో చిన్న కావ్య ఎవరు?" అని అంది కోపం నటిస్తూ కావ్య.

         "నువ్వూ" అంటూ కావ్యను గట్టిగా పట్టుకోబోయాడు.

         "ఇల్లు వచ్చేసిందండి. అదిగో మామయ్య" అని అనేసరికి సర్దుకొని నవ్వాడు కిరణ్.

         "నీ సంగతి తరువాత చెప్తాను" అని లోపలకు వెళ్ళిపోయాడు.

         నవ్వుతూ కావ్య వెనకాలే నడిచింది.

***        ***        ***        ***

         వెంకట్ తల్లి తండ్రులకు షష్టిఫూర్తి నిశ్చయించారని శుభలేక వచ్చింది. కావ్య వాళ్ళ అత్తయ్య, వెంకట్ కూడా ఫోన్లో పదే పదే చెప్పడంతో కిరణ్ కావ్యను రెండురోజులు ముందు వెళ్ళి రమ్మని చెప్పాడు. అత్తయ్య అడగగానే పరుగెత్తుకెళ్ళే కావ్యకు ఇప్పుడెందుకో వెళ్ళడానికి మనస్కరించలేదు. ఎంత ప్రయత్నించినా ఎందుకో కావ్యకు అత్తయ్యను, హరిణిని అందరినీ ఎదుర్కునే ధైర్యం చాలలేదు.

         "మీతో వెళ్ళి మీతోనే వచ్చేస్తాను" అని అంది కావ్య ఆలోచిస్తూ.

         "అదేమిటి కావ్యా. అక్కడ అందరూ మీ వాళ్ళు. అన్ని సార్లు పదే పదే చెప్పారు కదా. ఏదైనా అవసరం ఉంటుంది. సహాయం చేసినట్టు ఉంటుంది కదా? వెళ్ళిరా" అని అన్నాడు కిరణ్, కావ్య ముఖంలోని భావాలని గమనించకుండా.

         "అమ్మా, నాన్న, నానమ్మా కూడా యాత్రలకు వెళ్ళారు కదా. ఎవరూ లేకుండా ఎలా వెళ్ళేది" అని అంది కిరణ్ చేతిలోంచి దువ్వెన తీసుకొని తల దువ్వుతూ.

         "దానిదేముంది వెంకట్ ని వచ్చి తీసుకెళ్ళమంటాను నీకు భయం అయితే. మీ అమ్మా, నాన్నా వచ్చాక మేము అందరం కలిసి వస్తాము" అని అన్నాడు కావ్య వంక చూస్తూ.

         కొంచెం సేపు ఆలోచించి "వద్దులేండి నాకేం భయం లేదు. నేనే వెళ్ళగలను ఒంటరిగా" అని అంది కావ్య మూతి ముడుచుకుంటూ.

         కావ్య వెళ్ళాడానికి అన్నీ ఏర్పాట్లు చేసి వెంకట్ కి ఫోన్ చేసి చెప్పాడు కిరణ్.



(ఇంకా ఉంది )