Author: Siri
•Friday, October 08, 2010
 "ఆ వచ్చేవాళ్ళు ఇంట్లోకి కూడా వస్తారే, లోపలకి వచ్చి కూర్చో" అని నవ్వింది కావ్య మేనత్త. 

         అయినా కావ్య మాత్రం ఎదురు చూస్తూనే ఉంది. చిన్న పిల్లలాగా ఏదో తెలియని ఆరాటం, ఉత్సాహం ఉరకలు వేసాయి. జీవితంలో బాధలన్నీ తొలగి మంచిరోజులు వస్తున్నాయి అని అనిపించింది కావ్యకు. చిన్నగా పొట్టని తడిమి చూసుకొని ఏదో పులకింతకు లోనయ్యింది. వెళ్ళిన బావ ఎంతకూ రాకపోవడంతో కంగారు ఎక్కువయ్యింది కావ్యకి. 

         "ట్రైన్ కాస్త ఆలస్యంగా వస్తోందేమో, కంగారు పడకు" అని కావ్య అత్తయ్య చెప్తూనే ఉన్నా కావ్యలో ఆరాటం ఎక్కువయ్యింది. కొంత సేపటికి పోన్ మ్రోగటంతో ఆత్రుతగా వెళ్ళి చూసింది. 

         "ఇదిగో కావ్యా, బావ మాట్లాడుతాడట" అని కృష్ణవేణి ఫోన్ కావ్య చేతికిచ్చింది. 

         "హలో" అని అంది కంగారుగా కావ్య. 

         "కావ్యా! మామయ్య వాళ్ళు రాలేదు. సరైన సమయానికి ట్రైన్ అందుకోలేకపోయినట్టు ఉన్నారు. ఇప్పుడే కిరణ్ తో మాట్లాడాను. డ్రైవర్ ఎలాగూ ఉన్నాడు. నేను వెళ్ళి వాళ్ళను తీసుకుని వచ్చేస్తాను. నువ్వు కంగారు పడకు, సరేనా?" అని పెట్టేసాడు వెంకట్. 

         కావ్యకు కంగారు ఇంకా ఎక్కువయ్యింది. 

         "ట్రైన్ సమయానికి అందుకోకపోవడం ఏమిటి? కిరణ్ ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు" అని ఆలోచనలు చుట్టుముట్టాయి కావ్యకు. తల్లి తండ్రులకు,కిరణ్ కి ఫోన్ చేసి చూసింది. ఎక్కడా పోన్ ఎత్తలేదు. 

         "అయ్యో అమ్మా వాళ్ళ ఫోన్ పాడయ్యింది అని కిరణ్ చెప్పాడు కదా? మామయ్యగారు ఊరెళ్తున్నారు కదా అని ఈయన కూడా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటాడు" అని మనసులోనే అనుకుని పోన్ పెట్టేసింది. 

         "కనీసం ఒక్కసారి నాకు పోన్ చేసి చెప్పొచ్చు కదా ఆ విషయం" అని విసుక్కుంది కావ్య. 

         కిరణ్ కావ్యకు పోన్ చెయ్యకుండా వెంకట్ కి ఎందుకు చేసాడో అర్థం కాలేదు కావ్యకు. ఏవేవో చెడు ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. 



 "ఛ! ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను?" అని మనసులో వస్తున్న ఆలోచనలను మళ్ళించడానికి చూసింది. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక రాత్రంతా జాగరణే చేసింది.

***        ***        ***        ***

         మర్నాడు పొద్దున్న లేచి బావ పోన్ ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసింది. కిరణ్ ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యనందుకు చిరాకు పడింది కావ్య. మధ్యాహ్నం ఎప్పటికో కార్ వచ్చిన అలికిడి వినిపించి బయటకు పరిగెత్తుకొని వచ్చింది కావ్య. కార్ లోనుండి వెంకట్ మాత్రమే దిగడం చూసింది.

         "ఏం బావా అమ్మా వాళ్ళేరి?" అని చుట్టూరా చూసింది.

         "కావ్యా! అమ్మా వాళ్ళు వస్తున్న కార్ కి చిన్న ప్రమాదం జరిగింది. ఏమి కంగారు పడకు. అంతా బాగానే ఉంది. నిన్ను తీసుకెళ్ళాలనే వచ్చాను పదా" అని అన్నాడు వెంకట్ గబ గబా.

         కావ్య మాటా మంతి లేకుండా నిలబడి పోయింది.

         "నువ్వు ఇలా కంగారు పడితే ఎలా? ముందు బట్టలు సర్దుకో పదా" అని గట్టిగా అనేసరికి ఈ లోకం లోకి వచ్చింది కావ్య.

         "ఏమయ్యింది దెబ్బలు తగల్లేదు కదా? నిన్న అందుకే ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు ఎత్తలేదు. చెప్పు బావా దెబ్బలు ఎక్కువ తగల్లేదు కదా" అని వెంకట్ ని పట్టి కుదిపేసింది.

         "అదేం లేదు నువ్వు కంగారు పడకు. నీకు మంచిది కాదు" అని సముదాయించాడు వెంకట్.

         కావ్య బట్టలు సర్దుకోడానికి లోపలకు వెళ్ళిపోయింది.

         "అందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా..." అని అరిచాడు గట్టిగా ఎవరు కనిపించకపోయేసరికి. లోపలకు వెళ్ళిన కావ్యను చూసి కంగారుగా కావ్య అత్తయ్య వచ్చింది.

         "ఏమిటిది కంగారుగా వచ్చావు? ఏమయ్యింది? అన్నయ్య వాళ్ళంతా ఏరి? మళ్ళీ ఎక్కడికి ప్రయాణం?" అని అంది వెంకట్ సర్దడం చూసి.

         కావ్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిని పక్కగా తీసుకెళ్ళాడు.


 "మామయ్య వాళ్ళకి చిన్న ప్రమాదం జరిగింది స్టేషన్ కి వస్తుండగా. హాస్పిటల్ లో ఉన్నారు ఇప్పుడు. నేను కావ్యను తీసుకెళ్తాను. అందరికి చెప్పి నువ్వూ బయలుదేరి వచ్చెయ్యి. మీరు అందరూ తొందరగా బయలుదేరి వెనకాలే వచ్చేయండి" అని అన్నాడు తన బట్టలు నాలుగు సర్దుకుంటూ.

         "ఒరేయ్ నాకు కంగారుగా ఉంది. అన్నయ్యకు ఏమి జరగలేదు కదా?" అని అంది గాభరాగా.

         "అమ్మా అరిచి గొడవ చెయ్యకు. అన్నీ ఇప్పుడు చెప్పలేను. తొందరగా వచ్చేయండి. దయచేసి ఇప్పుడు ఏమి అడగొద్దు" అన్నాడు వెంకట్.

         ఇంకేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది వెంకట్ తల్లి.

         "అమ్మా కావ్యను కాస్త ఏదన్నా తినేలా చూడు" అని చెప్పాడు తల్లి వంక చూస్తూ.

         రాత్రంతా నిద్రపోని వాడిలా వాడిపోయి ఉన్నట్టు ఉంది వెంకట్ ముఖం.

         "సరే" అని లోపలకు వెళ్ళి ఇద్దరికి తినడానికి తీసుకొచ్చింది.

         "నా ఫలహారం నా గదిలో పెట్టమ్మా" అని చెప్పడంతో ఒక ప్లేట్ అక్కడ పెట్టేసి కావ్యకు ఇవ్వడానికి వెళ్ళిపోయింది.

         కావ్యను తీసుకొని బయలుదేరాడు వెంకట్.

         "వెళ్ళొస్తాను అత్తయ్య. అక్కడ ఎలా ఉన్నారో? అందరిని చూసేదాకా నా మనసు కుదుట పడదు" అని చెప్పి వెళ్ళి కార్లో కూర్చొంది కావ్య.

         ఒక్క నిముషం ఆగి తల్లి వంక చూసాడు వెంకట్. వెంకట్ చెప్పకపోయినా ఏదో దాస్తున్నాడు అని అనిపించింది ఆవిడకు.

         "తొందరగా వచ్చేయండి" అని చెప్పి ముందుకు కదలిపోయాడు వెంకట్.

         అన్నీ విసిరి పారేసిన బట్టలు సర్దడానికి వెంకట్ గదిలోకి వచ్చింది వెంకట్ తల్లి కృష్ణవేణి.

         "తను పెట్టిన ఫలహారం అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వెంకట్. ఇంత కంగారుగా వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఏదో జరగరానిది జరిగే ఉంటుంది" అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. 



దారి పొడుగునా వెంకట్ ఎక్కడికో చూస్తూ మౌనంగానే ఉండిపోయాడు. ఏదన్నా అడగాలన్నా మాట్లాడాలన్నా బెరుకుగా అనిపించింది కావ్యకు. ఆలోచిస్తూనే కళ్ళు మూసుకొని పడుకుంది. వెంకట్ కావ్య వైపు తిరిగి చూసాడు. పసిపాపలా ఉన్న కావ్యను చూసి భారంగా ఊపిరి తీసుకొని వదిలాడు.

         "రాబోయే తూఫాన్ నుండి కావ్యను ఎలా కాపాడుకోవాలి? చిన్న విషయాలు తట్టుకోలేని కావ్యను ఎలా ఓదార్చాలి?" అని పదే పదే ప్రశ్నించుకున్నాడు.

         ఎన్ని సార్లు ఆలోచించినా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దేనినైనా ఎదుర్కునే ధైర్యం కావ్యకు ప్రసాదించమని మనసులోనే వేడుకున్నాడు. తెల్లవారుతుండగా హైదరాబాద్ చేరుకున్నారు. వెళ్ళే దారిలో ఆపి కావ్యకు తినడానికి తీసుకొచ్చాడు వెంకట్.

         "ఇప్పుడిదంతా ఎందుకు బావా ఇంటికి వెళ్ళిపోతాము కదా కొంచెం సేపటిలో? అమ్మ చేతి వంట తినొచ్చు" అని అంది కావ్య.

         "లేదు కావ్య నిన్న ఎప్పుడో తిన్నావు" అని చేతిలో పెట్టేసరికి మారు మాట్లాడకుండా తినేసింది. ముందు ఆకలి అనిపించకపోయినా కొంచెం తిన్న తరువాత ఆకలి అనిపించింది.

         "ఇంకా బయలుదేరుదామా బావా? అమ్మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు" అనేసరికి కావ్య వైపు చూసాడు వెంకట్.

         "కావ్యా ....." అని ఎదో చెప్పబోయాడు వెంకట్. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఏదో నిర్ణయించుకొని "ఊ ..పద " అని కార్ ఎక్కాడు.

         కొంచం సేపటికి ఒక గుడి ముందు కార్ ఆగేసరికి ప్రశ్నార్థకంగా చూసింది కావ్య.

         "ఇంటికి వెళ్ళకుండా ఏమిటిది బావా? పొద్దున్నే స్నానం కూడా చెయ్యకుండా గుడికి తీసుకొచ్చావేమీటి?" అని ఆశ్చర్యంగా చూసింది.

         "పద కావ్యా చెప్తాను" అని కార్ డోర్ తెరిచాడు.

         అయోమయంగా వెంకట్ వెనకాలే నడిచింది.

         పూర్తిగా తెల్లవారలేదు. ఇలాంటి సమయంలో వెంకట్ ఇంటికి వెళ్ళకుండా గుడికి ఎందుకు వచ్చాడు అని విచిత్రంగా అనిపించినా అంత కంటే ఏదో భయం వెన్నంటి వణికించింది. 



  వెనకాలే వెళ్ళి వెంకట్ పక్కన కూర్చొంది. రెండు చేతుల్లో ముఖం దాచుకొని తల వంచుకొని కూర్చున్నాడు వెంకట్.

         "బావా ఏమయ్యింది? ఎందుకలా ఉన్నావు" అని అడిగింది కావ్య వణికే స్వరంతో.

         వెంకట్ తలెత్తి కావ్య వంక చూసాడు. ఎప్పుడు లేనిది వెంకట్ కళ్ళల్లో కన్నీళ్ళు జల జలా రాలాయి. కావ్య కంగారుగా చూసింది.

         "నాకు భయంగా ఉంది బావా. ఇంటికి వెళ్ళిపోదాము పదా" అని అంది వెంకట్ చేతిని పట్టుకొని.

         ఇంక ఇంత కంటే ఆలస్యం చెయ్యకూడదు అని వెంకట్ నిర్ణయించుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు కావ్యకు చెప్పేయ్యాలి అని అనుకున్నాడు.

         "కావ్యా జీవితంలో ఎన్నో జరుగుతాయి. కానీ అన్నిటి కన్నా బాధాకరమైనది మన వాళ్ళని పోగొట్టుకోవడమే. అలా అని నీకు ఎవరూ లేరని నువ్వు అనుకోకు. నీకు మేమందరం ఉన్నాము. నువ్వు ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది" అని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయాడు. కావ్య వంక చూడలేక మళ్ళీ రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

         "ఏమిటి బావా అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అమ్మా వాళ్ళకు ఏమీ అవ్వలేదు కదా" అని కంగారుగా అంది కావ్య.

         ఏదో జరగ కూడనిది జరిగింది అని చూచాయగా అనిపించినా మనసు మొండికేసింది చెడుగా ఆలోచించడానికి. వెంకట్ కావ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

         "కావ్యా ఏది జరిగినా నువ్వు మనోధైర్యాన్ని కోల్పోనని నా మీద ప్రమాణం చెయ్యి" అని తన తల మీద కావ్య చేతిని ఉంచాడు.

         "ఊఁ.." అని మాత్రం అనగలిగింది కావ్య.

         వెంకట్ చేతులు వణుకుతుండడం గమనించి గుండె వేగంగా కొట్టుకుంది కావ్యకు.

         "కావ్యా! మామయ్య, అత్తయ్య, కిరణ్ ముగ్గురూ మనలని వదిలి పెట్టి వెళ్ళిపోయారు. శాశ్వతంగా వెళ్ళిపోయారు కావ్యా. ఊరు వచ్చేటప్పుడు ఆటో ఆక్సిడెంట్ అయ్యి ముగ్గురూ...." అని ఇంక చెప్పలేక ఆగిపోయాడు కావ్య రెండు చేతులని గట్టిగా పట్టుకొని. 



 ఒక్క క్షణం చలనం లేకుండా అలా చూస్తూ ఉండిపోయింది కావ్య. వెంకట్ నుండి తన చేతులు ఒక్కసారి వెనక్కి తీసుకుంది. మరుక్షణం నిశ్శబ్దాన్ని చీలుస్తూ గుండె పగిలేలా గట్టిగా అరిచింది కావ్య. గుండెల్లోని బాధను తట్టుకోలేనంతగా రోదించింది.

         వెంకట్ కి ఆమె బాధను ఆపే శక్తి లేదు. ఆ క్షణంలో ఆమెతో పాటు రోదించడం తప్ప ఏమి చెయ్యలేకపోయాడు. కావ్యను దగ్గరగా తీసుకొని తన గుండెలకు హత్తుకున్నాడు. కావ్య ఎంతగా ఏడ్చినా బాధను తట్టుకోలేకపోతోంది. ఒక్కసారి వెంకట్ వడిలో స్పృహ తప్పి పడిపోయింది. కావ్యను ఎత్తుకొని తీసుకొచ్చి కార్ లో కూర్చోపెట్టాడు వెంకట్.

         "డ్రైవర్ పదా" అని అన్నాడు.

         ఇద్దరిని దూరం నుండి గమనించిన డ్రైవర్ కళ్ళల్లోనూ కన్నీళ్ళు కదలాడాయి.

         "మామయ్య గారి ఇంటికేనా అండి బాబు?" అని అన్నాడు డ్రైవర్.

         అవునన్నట్లు వెంకట్ తల ఊపడంతో కార్ ముందుకు పోనిచ్చాడు డ్రైవర్.

***        ***        ***        ***

         జీవితంలో తట్టుకోలేని ఎదురు దెబ్బ తగిలి కుమిలిపోయింది కావ్య. జీవితంలో ముఖ్యమైన ముగ్గురినీ కన్నీటితో వీడ్కోలు చెప్పేసింది. తలచి తలచి కన్నీరు ప్రవాహంలా పొంగి చివరకు కళ్ళు ఎడారులయ్యాయి.

         కళ్ళు మూసినా తెరిచినా కన్నవాళ్ళ మాటలే చెవిలో ధ్వనిస్తున్నాయి. తను పుట్టి పెరిగిన ఇంట్లో ఉండడానికే భీతిగా ఉంది కావ్యకు. ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు. కావ్య అత్తయ్య వాళ్ళు కూడా ఇంక బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. కావ్యను ఒంటరిగా వదలడం ఇష్టం లేక "కావ్యను, అమ్మమ్మను తీసుకొని రెండు రోజుల్లో వస్తాను" అని వెంకట్ అనడంతో కావ్య అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు.

         కావ్య తిండీ, నిద్ర అంతా మరిచిపోయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా నేల మీద పడుకొని ఉండిపోయింది. కావ్య నానమ్మ, రాజారాం గారు చెరొక మూల దిక్కు తోచకుండా కూర్చుండిపోయారు. వెంకట్ కావ్యకు తినడానికి తీసుకొచ్చాడు.



  "కావ్యా" అని పిలిచాడు.

         కావ్య తిరిగి చూడకుండా అలాగే పడుకొని ఉండిపోయింది.

         "కావ్యా పదిరోజులయ్యింది నువ్వు సరిగ్గా భోజనం చేసి. కాస్త తిను. నువ్వు తింటే అమ్మమ్మ వాళ్ళు తింటామని కూర్చున్నారు" అని అన్నాడు.

         "వద్దు బావా నా వల్ల కాదు. నేను ఇంక బతికి ఏం చెయ్యాలి? ఇంక జీవితంలో ఏం సుఃఖం మిగిలి ఉందని?నా వల్ల కాదు" అని అంది నిరాశగా.

         ఎంత బ్రతిమాలినా కావ్య వినిపించుకోలేదు. వెంకట్ పదే పదే తినమని అడుగుతూనే ఉన్నాడు. కావ్యకు బాధతో కూడిన కోపం వచ్చింది.

         "ఏం బావా నీకు తిండి తినడం తప్ప నా బాధ గురించి కొంచెం కూడా పట్టించుకోవా? ఇప్పుడు తినకపోతే చచ్చిపోతానా? అలా చచ్చిపోతే ఇంకా హాయి. కాస్త విషం ఇవ్వు చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు బావా" అని పిచ్చి పట్టినట్టు అరిచింది.

         అంతా ప్రశాంతంగా వింటూనే ఉన్నాడు వెంకట్.

         "కావ్య ఒక్కసారి నాతోరా" అని అన్నాడు కావ్య చేయి పట్టుకొని.

         "ఏమిటిది బావా చెయ్యి వదులు. నన్ను ఇలా వదిలెయ్యి" అని విదిలించుకోబోయింది.

         అయినా వినిపించుకోలేదు వెంకట్. గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు.

         "అటు చూడు కావ్యా. వడలిపోయి, అలసిపోయి ఉన్న రెండు ప్రాణాలు. కళ్ళ ఎదురుగా తమ కన్న కొడుకులని పోగొట్టుకొని జీవితంలో అనుభవించకూడని బాధను అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా విషం ఇచ్చెయ్యమంటావా? నీకు ముందు ఇంత జీవితం ఉండి, నీకు నీ బిడ్డ రూపంలో ఒక తోడు ఉండి కూడా బతకలేక చచ్చిపోతాను అంటున్నావు. ఇంక జీవితంలో ఏ ఆశ లేని వాళ్ళు ఎందుకు బ్రతికి ఉండాలి? అలా చూస్తే జీవితంలో ఎవరోకరిని పోగొట్టుకొన్నవాళ్ళందరూ చచ్చిపోవడమే మార్గం అయితే ముందు వీళ్ళకే విషం ఇవ్వాలి" అని అన్నాడు.

         "బావా ?"అని విస్తుపోయి చూసింది వెంకట్ వైపు.

  "నిన్ను బాధపెట్టాలనో ఎత్తి చూపాలనో ఇది చెప్పలేదు కావ్యా. నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఇప్పుడు చాలా అవసరం. నువ్వు ఒంటరిదానివి కాదు. నీలో పెరుగుతున్న నీ బిడ్డ బాధ్యత నీకే ఉంది. చూడు కావ్యా ఆ ముసలివాళ్ళు ఇద్దరూ జీవితపు చరమాంకంలో ఉన్నారు. ఇంక వాళ్ళకు మిగిలిన కొద్ది కాలం ఏం ఆశతో బ్రతుకుతారు? నువ్వూ నీకు పుట్టబోయే బిడ్డే వాళ్ళకి కొత్త ఆశని కలిగిస్తుంది. వాళ్ళు జీవించడానికి ఒక మార్గం అవుతుంది. నువ్వు వాళ్ళ కోసం ధైర్యంగా ఉండాలి" అని చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు వెంకట్.

         కావ్య వెనకాలే వచ్చి అన్నంతో ఉన్న కంచాన్ని చేతిలోకి తీసుకొంది. గబ గబా తినడం ప్రారంభించింది. తింటు తింటూనే మధ్యలో ఆగి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది.

         "నా వల్ల కావడం లేదు బావా. ఈ గదుల్లో అమ్మ గొంతు, నాన్న నడుస్తున్న శబ్దం, కిరణ్ నవ్వులే వినిపిస్తున్నాయి" అని అంది చేతిలోని కంచాన్ని కింద పెట్టి.

         వెంకట్ కింద పెట్టిన కంచాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చేతితో ముద్దలు చేసి కావ్యను తినమని కళ్ళతోనే అభ్యర్థించాడు. కావ్య మారు మాట్లాడకుండా తినడం ప్రారంభించింది. ఏమి చెయ్యాలో పాలిపోని పరిస్థితిలో వెంకట్ ధైర్యంతో చెప్పే మాటలే ఆమె మంత్రించినట్టు వింటోంది. కావ్య అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో బయటకు వచ్చాడు వెంకట్.

         రాజారాం గారు పడక కుర్చీలో వాలి పడుకొని ఉన్నారు. వెంకట్ వచ్చిన అలికిడి అవడంతో తిరిగి చూసారు.

         "ఇంకా పడుకోలేదా బాబాయ్ గారు?" అని పక్కన కూర్చున్నాడు.

         "సుఃఖమైన నిద్రపోయి చాలా రోజులయ్యింది. శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది. కానీ మనసు అలసిపోతే నిద్ర దరికే చేరదు" అని పైకి చూస్తూ విరక్తిగా నవ్వారు రాజారాంగారు.

         వెంకట్ కి ఆయనని అలా చూసేసరికి చాలా జాలి కలిగింది. అందరి కన్నా ఎక్కువగా జీవితంలో కోల్పోయింది ఆయనే అని అనిపించింది. కావ్యను, అమ్మమ్మను రాజమండ్రి తీసుకెళ్ళే విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించాడు వెంకట్.

         "బాబాయ్ గారు! మీరు అనుకోనంటే ఒక మాట. మిమ్మలిని అందరినీ కొన్ని రోజులు రాజమండ్రి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి దూరంగా కొన్ని రోజులు ఉంటే మనసు కాస్త కుదుట పడుతుంది" అని మనసులోని మాట చెప్పాడు వెంకట్. 



( ఇంకా ఉంది)





This entry was posted on Friday, October 08, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On October 9, 2010 at 9:57 AM , diamond said...

siri garu...nenu me stories ki fan ni.
ee part chadivi naku chala badha ga vundi.. kaani indulo sagam na jeevitham chusugaliganu.

 
On October 9, 2010 at 10:07 AM , వంశీ కిషోర్ said...

katha chaduthuu naa kallu eppudu chamarchaayo teleeledu. maa thathagaru kuda alaa accident lone maaku lekunda poyaaru. poyina vaari lotu evaru teerchalenidi, badha taragalenidi. anni digamingi jeevithamlo munduki saagaali.

 
On October 11, 2010 at 2:08 AM , చెప్పాలంటే...... said...

kadhlone baadha vesindi..kaani mi menakodali ki ela aindani chadivi miku elaa cheppalo kudaa teliyadam ledu....drive chese vaallu jagratta gaa vunte endariko kadupu sokam taggutundi.....so....sorry andi...