Author: Unknown
•Tuesday, March 31, 2009



Cast: Madhavan, Neetu Chandra
Written & Directed by: Vikram K. Kumar
Music: Shankar-Ehsaan-Loy
Photography: P.C.Sriram
Production : BIG Pictures

Genre: Suspense Thriller


ఈ సినిమా ని చూడాలని ఆసక్తిగా ఎదురు చూసాను. టైటిల్ ఒకరకమైన ఆసక్తిని రేకెత్తించితే, ఇదేదో హర్రర్ సస్పెన్స్ ధ్రిల్లర్ అని తెలిసి మరింత ఉత్సుకతగా ఎదురు చూసాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని. నాకు ఇలాంటి సస్పెన్స్ ధ్రిల్లర్స్ చాలా ఇష్ఠం ! నా నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చెయ్యలేదు ఈ సినిమా.

దర్శక రచయిత అయిన విక్రం ఒక సక్సెస్ ఫార్ములాని ఫాలో అయ్యారు. అదేంటంటే..

మొదట కధ లోని పాత్రలని ఎస్టాబ్లిష్ చెయ్యటం..
వాళ్ళకి ఒక సమస్యను సృష్ఠించటం..
కధలోని ప్రధాన పాత్రలు ఆ సమస్య వలన పడే ఘర్షణ, ఆందోళన, భయం ..
అసలు ఆ సమస్య ఎలా వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం ..
చివరకు చిక్కుముడులన్నీ విప్పుకుంటూ సమస్యని అధిగమించటం ..

ఇది ఒక అధ్బుతమైన సక్సెస్ ఫార్ములా ! స్మూత్ ఫ్లో లో సాగిపోయే యే మాత్రం కంఫ్యూజన్ లేని కధనం !

కధ క్లుప్తం గా ..

ఒక ఉమ్మడి కుటుంబం.. అందులో ఒక తల్లి, అన్న వదిన పిల్లలు, తమ్ముడు అతని భార్య, చెల్లెలు.
అన్నాతమ్ముళ్ళిద్దరూ కష్ఠపడి ఇష్ఠపడి ఒక అపార్ట్మెంట్ ని లోన్ సాయం తో కొనుక్కుంటారు. అదే ఈ 13B. 13 వ అంతస్తులో ఉండే B ఫ్లాట్ !

ఈ కుటుంబం ఫ్లాట్ లోకి దిగాక, కొన్ని వింత అనుభవాలు ఎదురౌతాయి.
రోజూ పాలు విరిగిపోవటం, గోడలకు మేకులు దిగకపోవటం, మనోహర్ (మాధవన్ ) కి మాత్రమే ఏ రోజూ లిఫ్ట్ పని చెయ్యకపోవటం, సెల్ ఫోన్ కెమేరాలో ఫొటో సరిగా రాకపోవటం లాంటివి కొన్ని.

అలాగే సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకి 13 వ చానెల్ లో ' సబ్ కైరియత్ ' అనే సీరియల్ వస్తుంది. ఆ టైం లో ఇంక యే చానెల్ నీ చేంజ్ చెయ్యలేరు. తప్పని సరిగా అదే సీరియల్ చూడాల్సి వస్తుంది. మొదట విసుక్కున్నా నెమ్మదిగా ఆ ఇంట్లోని వాళ్ళు ఆ సీరియల్ కి ఎడిక్ట్ అయిపోతారు. కానీ వింతగా, ఆ సీరియల్ లోని పాత్రలన్నీ వీరి కుటుంబం లానే ఉండటం, ఆ సీరియల్ లో జరిగే సంఘటనలన్నీ వీరికి నిజం గా జరగటం వింతగా అనిపిస్తుంది మనోహర్ కి. ఇతనొక్కడే గమనిస్తాడు ఇలా పోల్చుకుని నిజ జీవిత సంఘటనలతో..

మొదట అన్నీ మంచివే జరుగుతాయి కాబట్టి అంత సీరియస్ గా తీసుకోడు మొదట ఆశ్చర్య పడినా . కానీ తరువాత చెడు సంఘటలు జరిగే కొద్దీ భయమేస్తుంది, తన వాళ్ళని రక్షించుకోవాలని తపనపడతాడు. ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరికీ చెప్పడు. ఆలా చెప్తే భయపడి ఖాళీ చేసి వెల్దాం అంటారని. అక్కడే ఎందుకు ఉండాలి అనుకుంటాడంటే, ఈ సీరియల్ ఆ ఇంట్లో మాత్రమే వస్తుంది. ఆది ఫాలో అవుతూ, జరగబోయే చెడు ని ఆపుదామనే ప్రయత్నం !

ఇక అక్కడనుంచి కధ పరుగుపెడుతుంది, తన పోలీస్ మిత్రుని సాయం తో ఈ మిస్టరీ ని చేధించే దిశగా మనోహర్ కదులుతాడు. అలా ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వెళ్ళేకొద్దీ కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తూ ఉంటాయి.

అసలు తన ఫ్లాట్ లోనే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి?
ఆ సీరియల్ లోని మనుషులు నిజ జీవితం లో ఉన్నారా?
అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు?

వీటన్నిటికీ సమాధానాలు సినిమా చివరి 30 నిమిషాలలో తెలుస్తాయి.

రచన, దర్శకత్వం :
కచ్చితం గా ఈ దర్శకరచయిత ' విషయం ' ఉన్న మనిషి. ఆద్యంతం సినిమాని ఆసక్తికరం గా మలిచారు. ఇలాంటి సినిమాలకి ప్రాణం సస్పెన్స్ ని చివరి వరకు మైంటైన్ చెయ్యటం, దానికి తగ్గట్లుగా పట్టుగా కధని నడపటం. అలాగే నటులనుంచి మంచి నటన రాబట్టుకున్నారు. పాటలే అనవసరం అనిపించింది. మసాలా కోసం రెండు పాటల్ని బలవంతం గా ఇరికించినట్లు అనిపించింది.

నటులు, నటన :
ఇది ఒకరకం గా 'one man show' అనే చెప్పాలి. ఫ్లాష్ బాక్ తప్ప ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేం లోనూ మాధవన్ కనిపించినట్లు అనిపిస్తుంది. చాలా చక్కగా చేసారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్టు బాగా చేసారు.

నా విశ్లేషణ:

నాకు చాలా రోజులకి ఒక మంచి ధ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ కలిగింది. హర్రర్ జెనర్ లోకి ఈ సినిమా వచ్చినప్పటికీ, ఇది ఎక్కువగా సస్పెన్స్ ధ్రిల్లర్ అనే చెప్పాలి. ఇది ప్యూర్ హర్రర్ సినిమా ఎంత మాత్రమూ కాదు. పెద్ద పెద్ద అరుపులు, సడన్ గా భయపెట్టే శబ్దాలు, సీన్స్ లేవు.
నిజానికి, ఈ సినిమాకి ఫ్లాష్ బాక్ బ్యాక్ బోన్ లాంటిది. దీని గురించి ఎక్కువ చెప్పి, మీకు చూసేటప్పుడు పొందే ధ్రిల్ ని పోగొట్టటం ఇష్ఠం లేదు. ఫ్లాష్ బ్యాక్ ని తీసిన తీరు చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయినా కూడా ' అసలు మనిషి ' ని రివీల్ చెయ్యకపోవటం మరింత నచ్చింది.
కధ, కధనం రెండూ చాలా ఆసక్తికరం గా ఉన్నాయి. ఇలాంటి సినిమాలకి ఫొటోగ్రఫీ చాలా ముఖ్యం ! అది చాలా బాగుంది. మొత్తమ్మీదా, నాకు బాగా నచ్చిన ధ్రిల్లర్ ఇది. తప్పకుండా చూడండి.

కొసమెరుపు: ఈ సినిమాని హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చెయ్యబోతున్నారు. హాలీవుడ్ నుంచి సినిమాలు మనకు దిగుమతవ్వటమే కానీ, ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇది మన భారతీయ సినిమాకి ఒక శుభ పరిణామం !

This entry was posted on Tuesday, March 31, 2009 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: