Author: Siri
•Monday, August 30, 2010
***        ***        ***        ***

         ఒక రోజు మధ్యాహ్నం ఇల్లు సర్దుతుండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయ్యి కావ్య తలుపు తీసింది. ఎదురుగా సన్నగా పొడుగ్గా ఒక యువకుడు నిల్చుని ఉన్నాడు. 

         "మాస్టారు రమ్మని చెప్పారు అండీ" అన్నాడు. 

         "ఒక్క నిముషం ఉండండి" అని లోపలకు వెళ్ళి తల్లిని పిలవడానికి వెళ్ళింది. 

         "ఇంట్లో ఫాన్ పాడయ్యింది. బాగు చెయ్యడానికి ఎవరినో పంపిస్తాను అన్నారు నాన్నగారు. అతనే అయ్యుంటాడు. గదిలో ఫాన్ చూపించు" అంది అమ్మ. 

         "రండి మీరు బాగు చెయ్యాల్సిన ఫాన్ చూపిస్తాను" అని కావ్య అనేసరికి కంగారు పడిపోయాడు. 

         "అది కాదండి... మాస్టారు గారు అసలు" అని ఏదో చెప్పబోయాడు. తిరిగి చూసేసరికి కావ్య వెళ్ళిపోయింది. 

         తండ్రి రావడంతో బయటకు వచ్చింది కావ్య. తండ్రి ఆ వచ్చినతనితో చాలా సన్నిహితంగా మెలగడం నవ్వడం చూసి ఆశ్చర్యంగా చూసింది.  "ఏమ్మా కావ్య ఇతను ఎవరు అనుకున్నావు? నా స్నేహితుడు రాజారాం కొడుకు కిరణ్. ఊద్యోగ రీత్యా ఇక్కడకు వచ్చాడు. నేనే ఒక మంచి ఇల్లు చూసి పెడతాను అన్నాను. నువ్వూ అమ్మా కలిసి హడలు కొట్టేసారు కదమ్మా" అని నవ్వేసారు.

         అది విన్న కావ్య చిన్నగా నెత్తి మీద కొట్టుకుని "ఇప్పుడే కాఫి తెస్తాను" అని లోపలకు పరుగెత్తుకెళ్ళింది.

         "అయ్యో నువ్వైనా చెప్పచ్చు కదా బాబు. ఏమి అనుకోకు" అని వచ్చింది కావ్య తల్లి.

         "అదేం లేదండి పర్వాలేదు. పనిలో పని నాకు తెలిసినంతలో ఆ ఫాన్ బాగు చేస్తాను" అన్నాడు నవ్వుతూ కిరణ్.

         "భలేవాడివేనయ్యా"అని భుజం మీద తట్టి, "ఈ పూటకు ఇక్కడే ఉంటాడు వంట చెయ్యి. రేపు ఇల్లు చూపించి దింపి వస్తాను" అన్నారు కావ్య తండ్రి.

         కిరణ్ చూపులు కావ్య వైపు వెళ్ళాయి. కావ్య తప్పుగా అనుకున్నందుకు సిగ్గుతో తల దించుకొంది. కానీ కిరణ్ చూపులు మాత్రం కావ్యను వదిలి పెట్టలేదు.

         "మీ నాన్న ఎప్పుడు వస్తాడు? ఎన్ని రోజులయ్యిందో? పోనిలే నాకు ఒక మంచి కాలక్షేపం" అని కావ్య తండ్రి అన్న మాటలకు ఉలిక్కి పడి వెంటనే చూపులు మరల్చుకున్నాడు.

         "రిటైర్మెంట్ సంబంధించి అన్ని విషయాలు చూసుకొని ఇంకో వారంలో వస్తారు " అన్నాడు కావ్య కోసం వెతుకుతూ.

         రాజారాం, కావ్య తండ్రి చిన్ననాటి స్నేహితులు. చాలా రోజులు ఇద్దరు కలిసి పనిచేసారు కూడా. ఆ తరువాత వేరే ఉద్యోగాలలో చేరి దూరమయ్యారు. కిరణ్ చిన్నతనంలోనే అతని తల్లి పోయింది. అప్పటి నుండి తండ్రీ కొడుకులే ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. కిరణ్ మొదటి సారిగా ఉద్యోగంలో చేరడానికి వచ్చాడు. స్నేహితులు ఇద్దరు ఈ విధంగా మళ్ళీ కలుసుకోబోతున్నారు అని కావ్య తండ్రి ఆనందానికి అవధుల్లేవు. రాజారాంకి కొడుకు పుట్టినప్పుడు కూడా తనకి కూతురు పుడితే రాజారాంకే కొడలిని చేస్తాను అని చమత్కారం కూడా చేసుకున్నారు.

         కొద్ది రోజుల్లోనే కిరణ్ కావ్య ఇంట్లో వాళ్ళకి దగ్గరయ్యి పోయాడు. చాలా హడావుడి మనిషి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కావ్య తండ్రి చూసిన ఇంటిలోకి కావ్య చేతి మీదుగా దీపం వెలిగించి చేరాడు. రెండు వారాల్లో తండ్రి రావడంతో రెండు ఇళ్ళళ్ళో రాకపోకలు ఎక్కువయ్యాయి. ఒక కుటుంబంలా కలిసిపోయారు. కిరణ్, రాజారాం రాక వల్ల కావ్య తండ్రిలో,ఇంట్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కిరణ్ వచ్చి అందరి ముఖాల్లో చిరునవ్వు తెప్పించాడు, ఒక్క కావ్య ముఖంలో తప్ప.

         "ఎందుకు ఎప్పుడూ మీ అమ్మాయి ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లా అలా మూతి ముడుచుకొని ఉంటుంది" అని కావ్య తల్లితో అంటూ ఉంటే కావ్య కోపంగా చూసేది.

         కొంచెం అతిగా చొరవ తీసుకోవడం, వచ్చిరాగానే సొంత ఇల్లులాగా తిన్నగా వంటింట్లోకి వెళ్ళడం, తన గురించి తెలిసినట్టు మాట్లాడం కావ్యకు బొత్తిగా నచ్చలేదు.

         కానీ కిరణ్ ఇవేమి పట్టించుకోలేదు. దేనినైనా తేలికగా తీసుకునే మనస్తత్వం అయిన వాడు కావడం వల్ల కావ్య దూరంగా ఉండాలని ప్రయత్నించినా కావ్య చుట్టూనే తిరిగాడు. అతనిలో తెలియకుండానే కావ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

         కొద్ది రోజుల్లోనే కావ్యను చూడడానికి వచ్చిన సంబంధం వాళ్ళు కబురు పంపడంతో కావ్య తండ్రి వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళారు. నెలరోజుల్లో నిశ్చితార్ధం చేయాలని నిశ్చయించారు.

         కావ్య తండ్రి తెలిసిన వాళ్ళందరికి చెప్పుకొని మురిసిపోయారు. ఈ విషయం రాజారాం,కిరణ్ కూ చెప్పాలని ఆత్రుతగా బయలుదేరారు. విషయం తెలియగానే రాజారాం సంతోషించినా కిరణ్ ముఖంలో మాత్రం నిరాశ కనిపించింది. "ఈ పెళ్ళి మీరే ముందుండి జరిపించాలి. నాకు నిన్ను మించి ఆత్మీయిలు ఎవరున్నారు? ఈ పెళ్ళి కాస్తా మంచిగా జరిగిపోతే నేను కన్ను మూసినా నాకు బాధ లేదు" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

         "ఏమిట్రా ఇది చిన్న పిల్లాడిలా? దీనికే డీలా పడితే ఎలా? ఇదిగో చూడు మేము మీ కుటుంబమే. అంతా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా బాధపడతారా?" అని దైర్యం చెప్పారు రాజారం.

         ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పడంతో కిరణ్ కావ్య తండ్రిని దింపడానికి వెళ్ళి బయటే నిలబడిపోయాడు.

         "ఎం కిరణ్ అక్కడే ఉండిపోయావు. లోపలకు రా" అని పిలిచారు కావ్య తండ్రి.


         "లేదండి మళ్ళీ ఇంకో రోజు వస్తాను" అన్నాడు కిరణ్ ఆలోచిస్తూ.

         "ఏమిటో కొత్తగా మొహమాటపడుతున్నావు. నువ్వు రాకుండా వెళ్ళిపోతే మా ఆవిడ గొడవ చేస్తుంది" అని నవ్వారు తేలికగా.

         లోపలకు వెళ్ళిన కిరణ్ ముభావంగా ఉండడం చూసి కావ్య తల్లి "ఏం బాబూ ఒంట్లో బాగోలేదా నీరసంగా ఉన్నావు?" అని అడిగింది.

         "అదేం లేదు బాగానే ఉంది" అని మాట దాటవెయ్యడానికి చూసాడు కిరణ్.

         వెళ్ళొస్తాను అని బయలుదేరిన కిరణ్ కు డాబా మెట్లు దిగుతూ కావ్య కనిపించింది. కొంచెం సేపు అలానే చూస్తూ ఉండిపోయాడు.

         "ఏమండీ కిరణ్ గారూ కాస్త తప్పుకుంటారా" అని గట్టిగా కావ్య అనడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. తను దారికి అడ్డంగా నిలిచి ఉన్నది గమనించి పక్కకు జరిగాడు.

         "మీకు ఎదో చెబుదామని అనుకున్నాను" అని ఆగిపోయాడు కిరణ్.

         "మీరు మెట్లు దిగి మీ ఇంటికి వెళ్తునట్టున్నారు" అంది కావ్య నవ్వుతూ.

         "మీ తెలివికి సంతోషించాం కానీ, అది కాదు మీకు పెళ్ళిట కదా. నేను పది రోజులు ముందే వచ్చి మాస్టారు గారికి అన్నీ సహాయం చేస్తాను" అన్నాడు కిరణ్.

         "పది రోజులా ?" అంది కావ్య కళ్ళు పెద్దవి చేసి.

         "ఎం తక్కువంటారా? పోనీ నెల రోజులు ఉంటాను సరేనా? మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు" అన్నాడు కావాలని ఆటపట్టిస్తూ.

         "చాలా సంతోషం. త్వరగా ఇంటికి చేరుకోండి. లేదంటే మా సందు చివర కుక్కలు వెంట పడతాయి పది దాటితే. అప్పుడు నెల రోజులు పడక వెయ్యాలి మీరు" అంది కిందకు చూపిస్తూ.

         ముఖంలో భయం నటిస్తూ "వెళ్ళొస్తాను" అని గేట్ దాటాడు కిరణ్. కాస్త దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు. కావ్య వచ్చే నవ్వు ఆపుకుంటు కిరణ్ వైపే చూస్తోంది. కిరణ్ మనసులో ఎక్కడో చిన్న అలజడి. 
         "ఇలా పెళ్ళి కాబోయే ఆడపిల్లవైపు చూడడం తప్పురా కిరణ్ " అని తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.


***        ***        ***        ***

         నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. రాజారాం, కిరణ్ అన్నిటికి దగ్గరుండి సహాయం చేసారు. చుట్టు పక్కల వాళ్ళని కొంతమందిని పిలిచారు. అబ్బాయి తరుఫు వారితో కలిపి ఒక ఏభై మందికి భోజనాలకి ఏర్పాటు చేసారు. కట్న కానుకలు ఏమి లేవు కాబట్టి నిశ్చితార్థం, పెళ్ళి కాస్త బాగా చెయ్యాలని ఆనుకున్నారు. ఎదురు చూస్తుండగానే పెళ్ళి వారు వచ్చారు రెండు కార్లలో.


         వచ్చిన వాళ్ళని ఆహ్వానించడానికి అందరూ బయలుదేరారు. కిరణ్ చెప్పినట్టుగానే సొంత కొడుకులా అన్ని బాధ్యతలు తీసుకొని అందరిని దగ్గరుండి చూసుకున్నాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి కొడుకు కనిపించలేదు. నిశ్చితార్థానికి రాకపోడానికి కారణం ఏమిటా అని పెద్దవాళ్ళను వాకబు చేసారు కావ్య తండ్రి. అతనికి ఆరోగ్యం బాగోలేదు అని ఒకరు, అతనికి తెలిసినవాళ్ళకి ఏదో అవసరమొచ్చి వెళ్ళాడని ఒకరు చెప్పారు. నిశ్చితార్థం పెద్దవాళ్ళని దగ్గరుండి జరిపించమన్నాడు అని చెప్పారు. ఇదంతా వింటూ ఉంటే ఏదో అనుమానం కలిగింది. మనసు కీడు శంకించింది. కానీ మనసుని అదుపులో పెట్టుకోవాలని కావ్య తండ్రి అందరికి అన్నీ అందించడంలో నిమగ్నమయిపోయారు.


         ఇటు కావ్యను అలంకరించి కూర్చో పెట్టారు. ఏమీ తోచక కావ్య కిటికి లో నుండి బయటకు తొంగి చూసింది. కిరణ్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.


         "రెండు గంటల నుండి ఇలాగే ఎక్కడికి కదలనివ్వకుండా కూర్చోపెట్టారు" అని విసుక్కుంది కావ్య.


         కావ్య నానమ్మ మూతి ముడుచుకొని ఒక మూల కూర్చుంది ఈ పెళ్ళిలో తనకేమి ఇష్టం లేదు అన్నట్టు.


         "అమ్మా ఏదో జరిగినట్టు అలా కూర్చోకపోతే నలుగురు పెద్దవాళ్ళని పలకరించి మాట్లాడొచ్చు కదా? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు?" అని మందలించారు కావ్య తండ్రి.


         "బాగానే ఉందిరా. ముసలిదాన్ని కూర్చున్నా కూర్చోనివ్వవా? నీ పెత్తనం నీ కూతురు మీద చెల్లుతుందేమో కాని నా దగ్గర కాదు చూసుకో" అని బెదిరించింది నానమ్మ.


         "అయ్యో ఎలా చెప్పేది? ఏదో ఒకటి చెయ్యి. కానీ వచ్చేవాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుంటే చాలు" అని వెళ్ళిపోయారు కావ్య తండ్రి.


         "ఏమిటండి బామ్మగారు ఏమయ్యింది? మీలో అసలు సంతోషం కనిపించడం లేదు?" అని కిరణ్ వచ్చాడు.


         నానమ్మ ఏదో చెప్పబోయేలోపు కావ్య ఆవిడ మూతిని తన చేతితో మూసి లోపలకు లాక్కెళ్ళింది. కిరణ్ కూడా ఆవిడ వెనకాలే వెళ్ళాడు.

         "అయ్యో నానమ్మ అక్కడ అందరూ తిరుగుతుంటే నీ సోది మొదలుపెట్టావు?" విసుక్కున్నట్టుగా అంది కావ్య.

         "సరిపోయిందే తండ్రీ కూతుళ్ళ వరస. ఒక చోట కూర్చో నివ్వరు, ఒక మాట మాట్లాడనివ్వరు" అంది నాన్నమ్మ కోపంగా.

         కిరణ్ ఇదంతా విచిత్రంగా చూస్తూ నిల్చొన్నాడు. "ఏమిటి బామ్మగారు ?నాకు చెప్పండి మీ బాధ" అన్నాడు ఆవిడ దగ్గరగా కూర్చొని.

         "ఏం చెప్పను బాబు? నాకు నీలాగే ఒక మనవడు ఉన్నాడు. ఎంతో బుద్దిమంతుడు. అతనికి కావ్యను ఇచ్చి చెయ్యాలి అని నా ఆశ. కాని నా కొడుకు, అల్లుడు కలిసి జరగనివ్వలేదు" అని చెప్తుంటే కావ్య కోపంగా చూసింది ఇప్పుడిదంతా అవసరమా అని.

         "సరేలే నాకెందుకు రేపో మాపో పోయేదాన్ని? కావ్య సంతోషంగా ఉండాలి అని అనుకున్నా అంతే" అంది మొహం తిప్పుకొని.

         "ఓహో మీకు ఇంకో కథానాయకుడు కూడా ఉన్నాడు అన్నమాట చెప్పనే లేదు" అన్నాడు కావ్య వంక చూసి.

         "అదేం లేదు" అని ఏదో చెప్పబోయింది.

         బయట ఏదో గొడవ వినిపించడంతో ఏమిటా అని కంగారు పడ్డారు. "నేను చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి బయటకు వెళ్ళాడు కిరణ్.

         ఎంత సేపటికీ కిరణ్ రాకపోవడంతో కంగారు పడుతోంది కావ్య.

         కొంత సేపటికి కిరణ్ లోపలకు వచ్చాడు.

         "కావ్యా నువ్వు కంగారు పడకు ఏది జరిగినా అంతా మన మంచికే" అన్నాడు.

         
  "ఏం చెప్తున్నారు మీరు? నాకేమి అర్థం కావడం లేదు. ఏమయ్యింది కిరణ్ గారూ" అంది కావ్య బయటకు వెళ్ళబోతూ. 


  "నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడే పోలీసులు వచ్చారు పెళ్ళి కొడుకు తరుఫు పెద్దవాళ్ళను అరెస్ట్ చెయ్యడానికి. పెళ్ళి కొడుకుకి ఇంతకు ముందే పెళ్ళి అయ్యిందిట. పిల్లలు కలగలేదని భార్యకు తెలియకుండా ఈ పెళ్ళికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు ఆవిడకు తెలిసి అందరి మీదా కేస్ పెట్టింది. మాస్టారు, మా నాన్నగారు కూడా స్టేషన్ దాకా వెళ్ళారు" అన్నాడు బాధగా. 


 కావ్యకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అయోమయంగా ఉండిపోయింది.

         "బామ్మగారు కాస్త కావ్యను చూసుకోండి. నేను వెళ్ళి చూసి వస్తాను" అని వెళ్ళిపోయాడు కిరణ్.

         "కావ్యా" అంటూ కావ్య తల్లి కంగారుగా లోపలకు వచ్చింది.

         మతి భ్రమించినట్లు కూర్చుంది కావ్య.

         "నేను అప్పుడే చెప్పాను మనిషి అదో రకంగా ఉన్నాడు అని. కనీసం పెళ్ళికి ముందు తెలిసింది లేదంటే దాని గోంతు కోసేవారు" అని కావ్య నానమ్మ ఏదో చెప్తున్నా కావ్య వినే స్థితిలో లేదు.

         ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఉన్నాయి. అంత మందికి చేసిన భోజనాలు కాకులకు విందు అయ్యింది. చుట్టు పక్కల వాళ్ళందరు ఏం జరిగిందా అని తొంగి తొంగి చూడడం ప్రారంభించారు. ఒకరిద్దరు ఇంటిలోకి వచ్చి వాకబు చేసుకెళ్ళారు. అందరికి సమాధానం చెప్పుకోలేక కావ్య తల్లి నానా అవస్థ పడింది.

         తిండి తిప్పలు లేకుండా అందరూ వెళ్ళిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రెండు మూడు గంటలకు ఆటో శబ్ధం విని ఆత్రుతగా బయటకు వచ్చారు. అలసిపోయిన ముఖాలతో కిరణ్, రాజారాం, కావ్య తండ్రిని తీసుకొచ్చారు. అందరి ముఖాలలో ఆందోళన, బాధ తాండవించింది.

         కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని కిరణ్, రాజారాం ఎక్కడి సామాన్లు అక్కడికి పంపించి అంతా సవ్యంగా సర్దించేసారు. ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు. కావ్య ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కిరణ్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కావ్య తండ్రి అవమానం తట్టుకోలేక క్రుంగిపోయారు.

         "ఎందుకిలా జరిగింది? కావ్యకే ఎందుకు ఇలా జరగాలి?" అని పదే పదే ప్రశ్నించుకున్నారు.

         చివరకు రాజారాం పెదవి విప్పడంతో అప్పటివరకు ఉన్న వాతావరణం మారింది.

         "ఏమిటిది ఎవరో పోయినట్టు ఇలా కూర్చోవడం? ఏది జరిగినా మంచికే జరిగింది. కావ్యకు అదృష్టం ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం తప్పింది" అన్నారు భుజం మీద చెయ్యి వేసి.

         "అది కాదురా ఇంత మందిలో మా పరువు పోయింది. మంచివాళ్ళు అని నమ్మి ఎంత మోసపోయాము. ఎవరికి ముఖం చూపించుకోలేని స్థితిలో వదిలేసారు" అని కావ్య తండ్రి తల పట్టుకొని కూర్చున్నారు.

         "నువ్వేం తప్పు చేసావు అని తల వంచుకోడానికి? వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యం ఇవ్వబట్టే నీకు ఈ బాధ. అదొక పీడ కలలా మర్చిపో. కావ్యకు అంతా శుభం జరుగుతుంది" అని చెప్పినా ఎవ్వరు వినే స్థితిలో లేరు.  కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వారి వారి ఆలోచనలలో మునిగిపోయారు. నడి రాత్రి ఎవరో బాధగా మూలుగుతున్న శబ్ధం విని అందరూ లేచారు. కావ్య తండ్రి గుండె పట్టుకొని బాధతో మెలికలు తిరగడంతో అప్పటికప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆయనకి ఏవేవో పరీక్షలు చేసాక మళ్ళీ గుండెపోటు రావడంతో ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. అప్పటివరకు భ్రమించినట్లు ఉన్న కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదే కళ్ళ ముందు జరుగుతుంటే తట్టుకోలేకపోయింది. ఎవరినీ ఎవరూ ఓదార్చలేని పరిస్థితిలో కావ్యకు ధైర్యం కోల్పోడానికి ఇది సమయం కాదు అని అనిపించింది.

         వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి ఆపరేషన్ చెయ్యడానికి ఆమోదం చెప్పి వచ్చింది. మరునాడు ప్రొద్దున్న ఆపరేషన్ చేసి రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచాలి అని సగం డబ్బు కట్టమని బిల్లు అందించారు. కావ్య చేతిలో నుండి బిల్లుని కిరణ్ తీసుకొన్నాడు.

         "నేను కట్టి వస్తాను" అని వెళ్ళబోయాడు.

         "కిరణ్ గారూ ఒక్క నిముషం. ఆ బిల్లుని నేనే కడతాను. ఇప్పటికే మిమ్మలిని చాలా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు బిల్లు కూడా మీ చేత కట్టిస్తే నాన్నగారికి బాధ కలుగుతుంది. ఆయనకు నచ్చని విషయం నేను ఎప్పుడూ చెయ్యలేదు. బ్యాంక్ లో ఎంతో కొంత డబ్బు ఉంచారు. ఇప్పుడే అమ్మా నేను వెళ్ళి తీసుకు వస్తాము" అని సూటిగా కిరణ్ కళ్ళల్లోకి చూసింది తన నిర్ణయం మారదు అన్నట్టు.

         "పరాయి వాళ్ళను చేస్తున్నారు మమ్మలని. ఇప్పుడు నాకీ డబ్బు అవసరం లేదు. మంచి పనికి అవసరపడితే నాకూ సంతోషం" అన్నాడు కిరణ్.

         "మిమ్మలిని ఆత్మీయులుగా భావించాను కాబట్టే నిర్మొహమాటంగా చెప్పగలిగాను. నాకు నిజంగా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ముందుగా మీ దగ్గరకే వస్తాను, సరేనా?" అనేసి వెళ్ళిపోయింది కావ్య.

         కిరణ్ ఆరాధనగా కావ్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు.***        ***        ***        ***

         కావ్య తల్లిని తీసుకుని ఆటోలో డబ్బు కోసం బయలుదేరింది.

         "కావ్యా ఇది నాన్న నీ పెళ్ళి కోసం దాచిపెట్టిన డబ్బు. దానినెందుకు తియ్యడం? నా బంగారం అమ్మేసి..." అని ఎదో చెప్పబోయి కావ్య తల్లి కన్నీళ్ళను ఆపలేక ఆగిపోయింది.

         "అమ్మా?" అని ఆవిడ చుట్టూ చేతులు వేసింది కావ్య.

         "నాన్నకి ఇలా ఉన్నా నా పెళ్ళి కోసమే ఆరాటపడుతున్నావు. నా పెళ్ళి కోసం ఎందుకంత ఆరాటం? మీ ఇద్దరి కన్నా నా పెళ్ళి ముఖ్యం కాదు. ఎప్పుడూ మీతోనే ఉండిపోయినా నాకు సంతోషమే. ఏదొక ఉద్యోగం చేసైనా మిమ్మలిని చూసుకోగలను" అంది కావ్య ఆవిడ కళ్ళు తుడుస్తూ. (ఇంకా ఉంది )
This entry was posted on Monday, August 30, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments:

On August 30, 2010 at 11:54 AM , వంశీ said...

కొత్త పాత్రలను సంక్లిప్తంగా భలె ఇమిద్చారు కథలో.

 
On August 31, 2010 at 1:01 AM , రాధిక(నాని ) said...

చదువుతుంటే చాలా కుతూహలంగా ఉందండి .తరువాత ఏమిజరుగుతుందిఅని. బాగుందండి.స్వాతీ,నవ్య ఇలా ఏదైనా పుస్తకాలకు పంపించండి .ఇంకా ఎక్కువమంది చదువుతారు..