Author: Siri
•Thursday, July 15, 2010
హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటేనే ఒక మహా సముద్రం. అందులో ఆటోలో స్టేషన్ చేరే సరికి సగం ప్రయాణం అయినట్టే. కావ్య నానమ్మతో ట్రైన్ లోకి నడిచింది. టిఫిన్ తినేసి బెర్త్ మీదకి ఎక్కేసారు. నానమ్మ లోయర్ లో కావ్య అప్పర్ లో ఎక్కారు. మధ్య బెర్త్ లో బావ ఏం చేస్తున్నాడో అని కిందకు తొంగి చూసింది. తలకింద చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తున్నాడు.


"ఏం బావా నిద్రపోలేదా?" అంది కావ్య తొంగి చూస్తు.

"లేదురా నిద్ర రాలేదు.కాపలా కాయాలిగా?" అన్నాడు వెంకట్.

"దేనికి కాపలా? ఈ సామానుల్లో ఏముంది.తీసుకుపోతే తీసుకుపోని" అంది కావ్య.

"సామానులు కాదు నిన్ను ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారు అని" అన్నాడు నవ్వుతూ వెంకట్.

"ఆహా నువ్వేదో సినిమా హీరో లాగా ఫైటింగ్ చేద్దామనా?" కవ్విస్తూ అంది కావ్య.

వెంకట్ నవ్వి ఊరుకున్నాడు. కావ్య మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది. వెంకట్ మాత్రం అలోచిస్తూనే ఉన్నాడు. అమ్మా నాన్న తరువాత కావ్య గురించే ఎక్కువగా అలోచిస్తాడు. ఏదో తెలియని బంధం. అన్నయ్య, అక్కయ్య వాళ్ళ వాళ్ళ జీవితాలు చూసుకున్నారు. తను మాత్రం అమ్మకు దగ్గరగా ఉండాలి అని అక్కడే లెక్చరర్ గా చేరిపోయాడు. కావ్య వేసిన ప్రతీ అడుగూ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు. ఎప్పుడు అది ప్రేమగా మారిందో తనకే తెలియదు. కానీ ఏనాడు కావ్యకి చెప్పలేదు. తనకి తానుగా నిర్ణయాలు తీసుకునే దాకా చెప్పకూడదు అని అనుకున్నాడు.


ఎప్పుడు నిద్రలోకి వెళ్ళాడో తెలియదు. మెళుకువ వచ్చేసరికి కొవ్వూరు చేరుకున్నారు. కావ్య అప్పుడే లేచి, కూర్చుని గోదావరి చూస్తోంది. ట్రైన్ నెమ్మదిగా గోదావరి బ్రిడ్జ్ మీదగా వెళ్తోంది. దూరంగా పడవలు చూడటానికి ఎంతో బాగున్నాయి. పిల్లలు అందరూ కిటికీ దగ్గరకు చేరి కూర్చున్నారు. కొంతమంది దణ్ణం పెట్టుకొని డబ్బులు వేస్తున్నారు. ట్రైన్ రాజమండ్రి చేరుకుంది.


ఇంటికి వెళ్ళడంతోనే వెంకట్ కావ్యకు ఇష్టమైనవన్ని తెప్పించాడు. ఎప్పుడు పైన కట్టేసి ఉండే ఉయ్యాల బల్ల తీసి బిగించాడు. కావ్య రోజంతా పూలు, మొక్కలు అని తిరుగుతూనే ఉంది. ఎంతో ప్రేమగా తన బావ పెంచుకున్న పావురాలు, చిలకలతో ఆడుకుంది, ప్రపంచంలోని సంతోషం అంతా ఇక్కడే ఉంది అన్నట్టు. చిన్న చిన్న కోరికలు చిన్న ప్రపంచం అందులో ప్రేమ, ఆప్యాయత. తను పువ్వుల్లో పువ్వుగా,ఒక పావురమై ఈ తోటలో ఉండిపోతే బాగుండు అనిపిస్తోంది కావ్యకు.


రాత్రి భోజనాలు అయ్యేసరికి రాత్రి పది అయ్యింది. అందరు డాబా ఎక్కారు. మామయ్య పక్కన కూర్చుని చిన్న పిల్లలాగా ఎదో కబుర్లు చెప్తోంది కావ్య. ఇంకొక వైపు నానమ్మ, వెంకట్ తల్లి కృష్ణవేణి కూర్చున్నారు. వెంకట్ వచ్చి పక్కనే కూర్చున్నాడు.


"ఏంటమ్మా అంత దీక్షగా చూస్తున్నావు" అడిగాడు వెంకట్.

"ఏం లేదురా, కావ్య వచ్చిందంటే సందు చివరి దాక వినిపిస్తుంది దాని గోల. ఎప్పుడూ నిశ్శబ్దం గా ఉండే ఇల్లు కొత్తగా కళకళలాడుతూ ఉంటుంది. మన దగ్గరే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. చూడు మీ నాన్నగారితో మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది? అయనతో కూడ కలగలిపి మాట్లాడే అమాయకత్వం తనలో ఉంది.కల్మషం లేకుండా కలగొలుపుగా ఉంటుంది " అంది అమ్మ.


"దానిదేముందే కృష్ణా, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను పెద్దాడి పెళ్ళి అయ్యాక వీళ్ళకీ చేసేద్దాం" అంది నానమ్మ.

"అమ్మమ్మా అలాంటి పనులు చెయ్యకు. మీకు ఎప్పుడు చూసినా ఎవరు పెళ్ళి చేద్దామా అని ప్లాన్ వేస్తుంటారు. ఇప్పుడు పెళ్ళి అని దాని చదువు పాడు చెయ్యొద్దు. కావ్య బాగా చదువుకుని తను స్వంతంగా నిర్ణయాలు తీసుకునే వరకు ఎవ్వరు ఏమీ మాట్లాడద్దు" అన్నాడు వెంకట్ సీరియస్ గా.

"అది చదువుకుని ఏం ఉద్యోగాలు చెయ్యాలి?" అంది కృష్ణవేణి.

"ఉద్యోగాలు చెయ్యాలి అని కాదమ్మా ఒక గృహిణిగా ఉన్నా, లేక ఉద్యోగానికి వెళ్ళినా ఏదైనా సరే చదువు ముఖ్యం. రేపు పిల్లలకు ఏదన్నా చెప్పాలన్నా తనకు తానుగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా అన్నీ తెలుసుకొని ఉండడం అవసరం. తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పరుచుకోవాలి. అదీ కాకుండా ఈ వయసులో స్నేహితులు, కాలేజి అని ఎన్ని సరాదాలు ఉంటాయి. అన్ని అనుభవాలు చూసి తనకంటూ ఒక సొంత అభిప్రాయం ఏర్పరుచుకునే రోజు రావాలి. మీకు చాన్స్ ఇస్తే ఇప్పుడే పెళ్ళి చేసేసి ఇంకో సంవత్సరానికి ఒక పిల్లని కనిచ్చెయ్యమని అంటారు" అన్నాడు వెంకట్ నవ్వుతూ.


"అవునురా, మీరు తెలివైన ఈ కాలపు పిల్లలు. మీకున్న తెలివి మాకు ఎక్కడిది. ఏదో మాకు మా పెద్దలు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నాము. ఆ కాలంలో ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడితే తప్పు అనేవాళ్ళు కాని ఎందుకో చెప్పేవాళ్ళు కాదు. మాకు అని సొంత అభిప్రాయాలూ ఉండేవా? ఇప్పుడెన్నో ఆలోచనలు ఎన్నో మార్పులు" ఆంది వెంకట్ తల్లి ఏదో కొల్పోయినట్లు.


దానితో నానమ్మ అందుకొంది. "నాకు నా పదవ యేట పెళ్ళి చేసారు. పదహారు ఏళ్ళు వచ్చేదాకా మా అమ్మగారింట్లోనే ఉన్నా. అప్పుడప్పుడు మీ తాతగారు వచ్చి పోతుండేవారు. కాని అందరి ముందే మాట్లాడడం. ఒంటరిగా కలవడం కుదరక ఒక రోజు నేను ఆడుకుంటుంటే సైకిల్ మీద వచ్చి వెనకాల కూర్చోపెట్టుకుని సినిమాకి తీసుకెళ్ళారు".


పక్కనే కావ్య వచ్చి కూర్చుంటూ, "ఏంటి నేను లేకుండా ఏదో చెప్పేసుకుంటున్నారు" అంది.

"ఏం లేదు అమ్మమ్మ తన లవ్ స్టొరీ చెప్తోంది" అన్నాడు వెంకట్ తలగడ మీద పడుకుంటూ.

"చెప్పు నానమ్మా నేనూ వింటాను" అంది కావ్య ఇంటరెస్టింగా.

నానమ్మ మళ్ళి చెప్పడం మొదలు పెట్టింది...

"మేము సినిమా కి వెళ్ళిన సంగతి వాళ్ళ నాన్నగారికి తెలిసినట్టు ఉంది. చితకబాదారట ఆయన్ని, తరువాత నా మరిది చెప్పగా తెలిసింది. రెండు వారాలకు చూసాను మళ్ళీ, పాపం దూరం నుంచే చూసి వెళ్ళిపోయారు. పదహారు ఏళ్ళకు తాతయ్యగారింటికి వెళ్ళాను. ఆయనకు అప్పుడు ఇరవై. చదువుకోసమని వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నేను లేనిదే వెళ్ళనని గొడవ చేసి తీసుకెళ్ళారు. ఇంక అప్పటి నుంచి అయన చనిపోయేవరకు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. తొమ్మిదవ తరగతితో ఆగిపొయింది నా చదువు. ఆయన వల్ల పుస్తకాలు చదివేదాన్ని ఎప్పుడైనా. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అయన చదువుకున్నారు. ఆ తరువాత లా పూర్తి చేసారు. నేను పిల్లల పెంపకంలో మునిగిపోయాను. ఊళ్ళో ఆయన తమ్ముళ్ళు కష్టపడి పొలాలు చూసుకొని ఈయనకు డబ్బు పంపేవారు. అప్పుడదే స్వర్గం అనిపించేది. నాకైతే ఇద్దరే పిల్లలు కానీ నా తోటి స్నేహితురాళ్ళకు పది మంది పైనే పిల్లలు. ఒక్కొక్క బిడ్డకు ఒక రెండు సంవత్సరాలు వేసుకున్నా ఒక ఇరవై సంవత్సరాలు అందులోనే గడిచిపోయేవి. ఇంక స్వంత అభిప్రాయాలకు ఆలోచనలకు చోటెక్కడ ఉంటుంది?" అంది ఇంక ముగించేసినట్టు.

"తాతయ్య చాలా రొమాంటిక్ కదా నానమ్మ?" అంది కావ్య మైమరిచి వింటూ.

"అవన్ని నాకు తెలియదు కానీ, అయన చనిపోయేవరకు కూడా ప్రతి అదివారం తప్పకుండా హోటల్ కి తీసుకెళ్ళి ఆ తర్వాత సినిమా చూపించేవారు" అంది నానమ్మ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు లేనట్టు.

వెంకట్ అమాయకంగా చెప్పుకుంటూ పోతున్న అవిడ దగ్గరగా వచ్చి రెండు బుగ్గలు పట్టుకొన్నాడు చిన్నపిల్లను ముద్దు చేస్తున్నట్టు. "ఈ సారి నుంచి నేను తీసుకెళ్తాను నిన్ను సినిమాకి" అన్నాడు ప్రేమగా.

ఆ వయసులో వాళ్ళను ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు తక్కువే. ఏదో టీవి సీరియల్ చూసుకుంటూనో లేక ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటారా అని చూస్తుంటారు. ఆవిడ కళ్ళల్లో తడి ఎవరన్నా గమనించారో లేదో కాని వెంకట్ మాత్రం గమనించాడు.


"రేపు ప్రొద్దున్నే హరిణి వాళ్ళ ఆడపడుచుతో వస్తోంది. ఈ కబుర్లు మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు వెళ్ళి పడుకోండి" అంది వెంకట్ తల్లి.


*** *** *** ***

హరిణి వచ్చిన హడావిడితో ఇల్లంతా నిండిపోయింది. మనుషులు ఎక్కువ అవడంతో వంటలు రకరకాలు పురమాయించింది కృష్ణవేణి. పెళ్ళి హడావుడి అప్పుడే మొదలు అయినట్టు ఉంది. వంటింట్లో ఆడవాళ్ళు చేరితే ఇంక వేరే చెప్పక్కర్లేదు.

"అమ్మా, వాళ్ళు వచ్చే రెండు నెలల్లో మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాము అని చెప్పారు. మిగతా విషయాలు అన్నీ మాట్లాడేసాను. ముహూర్తం పెట్టాక పెళ్ళి బట్టలు కొనాలి అంతే" అని హడావిడిగా చెప్పేసింది హరిణి.

"అదంతా నువ్వే చూసుకోవాలి.నాకు కాలు చెయ్యి ఆడదు. ఇంతకీ మీ ఆడపడుచుకి కాఫీ కావాలేమో చూసిరా" అంది కృష్ణవేణి.

"తను అప్పుడే లేవదులేమ్మా. పాపం ప్రయాణం చేసి అలసిపోయింది. బెంగుళూరు నుండి రావడం అంటే తేలికా? తనకి ఈ పల్లెటూళ్ళు అంటే అంతగా నచ్చవు. కానీ కాకినాడలో ఎదో పని ఉంది అంటే నాతో రమ్మన్నాను. మీరు కూడా ఒకసారి చూస్తారు అని. రేపు వెంకట్ ని ఒకసారి కాకినాడ తీసుకెళ్ళి రమ్మను" అంది హరిణి.

ఇంతలో కావ్య పరిగెత్తుకుని వచ్చింది. "అత్తయ్య నాకు ఒక కాఫి " అని హరిణి వైపు తిరిగి "హాయ్ వదినా ఎలా ఉన్నావు? ఏంటి కొంచెం గుండుగా తయరయ్యావు?" అంది కొంటెగా.

"నువ్వెప్పుడు తగలడ్డావు?" అంది హరిణి విసుగ్గా.

"నీ కన్నా ముందే వచ్చాను వదినా. ఇదిగో ఈ వడ తిను. ఎంత బాగుందో అత్తయ్య చేసింది" అంది కావ్య.

"అది నువ్వేం చెప్పక్కర్లేదు. మా అమ్మ సంగతి నాకు తెలుసు" అంది హరిణి విసురుగా.

"ఎందుకే దానిమీద మండిపడతావు వచ్చి రాగానే" అంది నానమ్మ.

"ప్రతిసారీ దాన్నెందుకు వెంటేసుకొని వస్తావు. అది వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి అని, పెళ్ళి టైమ్ కి వస్తే సరిపోదా?" చిరాకుగా అంది హరిణి.

"దానికి ఇక్కడకు వచ్చే హక్కు, అధికారం ఉంది. ఏం నీ వయ్యారి ఆడపడుచు రాగా లేనిది కావ్య వస్తే ఏంటి?" అంది నానమ్మ సనుక్కుంటూ.

"అమ్మమ్మా! మా ఆడపడుచుని ఇంకోమాట అంటే ఊరుకునేదిలేదు" అంది హరిణి కోపంగా. కావ్య వైపు ఒకసారి విసురుగా చూసి అక్కడనుండి వెళ్ళిపోయింది.

"అబ్బబ్బా! ఇద్దరికీ ఒక్క క్షణం పడదు కదా" అని తల కొట్టుకుంది కృష్ణవేణి.

"అమ్మా దాని సంగతి తెలుసు కదా. తెలిసి ఎందుకు దానితో గొడవ?" అంది కృష్ణవేణి.

"సరేలే " అని చిన్న పిల్లలను కోపగించుకున్నట్టు మొహం పెట్టింది నానమ్మ.


*** *** *** ***

వెంకట్ తండ్రికి జాతకాలలో చాలా నమ్మకం ఎక్కువ. ఏపనైనా మంచిరోజు చూస్తేగాని చెయ్యరు. అన్నీ ఆయన గురిగా నమ్మే గురువుగారు చెప్తే కాని చెయ్యరు. నమ్మకాలు ఎక్కువే. తన కూతురు హరిణి పుట్టగానే తనకు ఐశ్వర్యం కలిసి వచ్చింది అని ఆయన గట్టి నమ్మకం. అందుకే హరిణి గారాబంగాను మొండిగాను పెరిగింది. ఇక్కడ ఉన్న తన ప్రత్యేకత తన అత్తవారింట్లో కూడా ఉండాలి అని ఆశించింది. అది అక్కడ దొరక్క ఆమె తనని తనే మర్చిపోయి తన చుట్టూ ఒక పరిధిని ఏర్పరచుకొని అదే ప్రపంచం అనుకుని ఉంటుంది. అన్నయ్యకి తను చెప్పిన తన అత్తగారి వైపు సంబంధం కుదిర్చింది. ఇప్పుడు తమ్ముడు కి తనకు వరుసకు ఆడపడుచు అయిన స్వప్నను ఇచ్చి చెయ్యాలని ఆలోచన. ఈ విధంగా తనకు ఒక ప్రత్యేకత ఉంటుంది అని ఆమె ఆశ.


తండ్రితో పాటూ హరిణి కూడా వాళ్ళ గురువు గారి దగ్గరకు బయలుదేరింది. పెళ్ళి కాబోయే వాళ్ళ జాతకాలు చూపించి రావాలని ఆయన ఉద్దేశం. కావ్య నానమ్మ తన కూతురు కృష్ణవేణిని రహస్యంగా పిలిచి కావ్య జాతకం కూడా చూపించమని చెప్పింది. ఆ పని ఆవిడ హరిణికి అప్పగించింది. హరిణి ఒక నిశ్చయంతో ముందుకు నడిచింది.


(ఇంకా ఉంది )
This entry was posted on Thursday, July 15, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

On July 17, 2010 at 6:23 AM , Anonymous said...

bagundi andi ippati daaka awaiting for the next module :) ha haa enta computer lokam kada... ade nandi taruvayi bagam.. :))

 
On July 17, 2010 at 10:29 AM , Siri said...

Thank you Deepu :)I will try to update every friday

 
On July 18, 2010 at 5:03 AM , satish said...

siri ... last bagam meda e bagam baga nachindi .... a train journey mari simple ga cheppesaru ... but thank you... a godavari meda velladam .. dabbulu vayyadam .. patha gnapakalu gurthuku vachayi ... a olden gold love story bagundi :) .. will be waitng for next friday for the next uppdate :) ..

 
On July 20, 2010 at 1:47 PM , వంశీ said...

chaala baagundi siri garu!
waiting for this friday !