Author: Siri
•Friday, July 30, 2010
కాలేజ్ మొదలు అయ్యింది. ఎప్పటిలాగా ముందు పావని ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టి లోపలకు వెళ్ళింది. అక్కడ పావని తండ్రి తాగి పడి ఉన్నాడు. ఆ గదంతా అదొక ఘాటైన వాసనతో నిండిపోయింది. ఆమెకు వాంతి అయ్యేంతగా వికారం పుట్టింది. ఇలాంటి ప్రదేశంలో రోజు ఎలా ఉండగలుగుతుందో పావని అనిపించింది. అక్కడే పావని తల్లి కనిపించి పలకరించి పావని పొద్దున్నే వెళ్ళిపోయింది అని చెప్పింది. తను రాకుండా ఎప్పుడు వెళ్ళదు .అలాంటిది మొదటి సారిగా ఇలా చేసింది. కాలేజ్ కి వెళ్ళినా ఏమి చెప్తున్నా ఆమెకు ఒక్క ముక్క ఎక్కలేదు. పావని కాలేజ్ కి రాకపోవడం వింతగా ఉంది. సాయంత్రం పావని ఇంటి దగ్గర కావ్య కోసం ఎదురు చూస్తోంది.

         "ఎక్కడకు పోయావు రోజంతా కాలేజ్ కి కూడా రాలేదు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా?" అంది కావ్య.

         "అమ్మా తల్లీ అరవకు. అమ్మ అడిగితే కాలేజ్ నుండే వస్తున్నా అని చెప్పు. సెలవుల్లో ఎక్కువ బయటకు వెళ్ళనివ్వలేదు అమ్మ. అందుకే ఇలా వెళ్ళాల్సి వచ్చింది. మేము ఇద్దరం ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోతున్నాము" అంది పావని సిగ్గుపడి మెలికలు తిరుగుతూ.

         "అంటే రోజురోజుకి అబద్ధాల చిట్టా పెద్దది చేస్తున్నావు అన్నమాట" అంది కావ్య.

         "కొన్ని సార్లు అబద్ధాలు చెప్పక తప్పదు" అంది పావని.

 "కానీ ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అని భయం లేదా నీకు?" అడిగింది కావ్య.

         "తెలిసినా నా గురించి భాధపడతారని నేను అనుకోను. నేను కూడా మా అమ్మలాగా తయారవ్వలని అనుకోవట్లేదు. కావాలని అనుకున్నా అమ్మ నాకు ఎలాంటి సహాయం చెయ్యలేదు. నాన్న తెలివిగా ఉన్న కొంతసేపులో అమ్మతో దెబ్బలాడటమే సరిపోతుంది. నేను ఏం చెయ్యాలి అని నేనే నిర్ణయం తీసుకుంటాను" అంది పావని.

         "కానీ నాకు ఈ ప్రేమలూ అవి సరికాదు అనిపిస్తుంది. అమ్మా నాన్నా చెప్పినట్టు విని జీవితం గడిపేస్తే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది" అంది కావ్య.

         "ఏమిటి పాత సినిమాల్లో హీరోయిన్ లాగా మాట్లాడుతున్నావు?" ఆశ్చర్యపడుతూ అడిగింది పావని.

         "కొన్ని కొన్ని అనుభవాలు అలా మాట్లాడిస్తాయి" అంది కావ్య నిస్సారంగా.

         కావ్య ఎదో చెప్పబోయేలోపు పావని అడ్డుపడింది. "నాకు ట్యూషన్ టైమ్ అయ్యింది. నీ బాధలు ఇంకెప్పుడైనా వింటాను. అయినా నీకేం బాధలు చెప్పు. ఉన్నా అవి నాకన్నా తక్కువే అయి ఉంటాయి."

         "అంటే నాకేమి బాధలు ఉండవనా నీ ఉద్దేశ్యం, లేక నా బాధ బాధ కాకుండా పోతుందా?" అంది కావ్య కోపంగా.

         "ఒప్పుకుంటాను సరేనా? రేపు మాట్లాడుదాం" అని పావని వెళ్ళిపోయింది.

         కావ్యకు ఇప్పటివరకు చెక్కుచెదరని వాళ్ళిద్దరి స్నేహం మధ్యన ఎవరో వచ్చినట్లు అనిపించింది. ఎప్పుడూ తనకోసం ఇతరులతో పోట్లాట పెట్టుకునేది. ఇప్పుడు తన మాటలు వినే టైమ్ లేనట్టు వెళ్ళిపోయింది. కావ్య చాలా బాధ పడింది.

         ఆ తరువాత మెల్ల మెల్లగా పావని పొద్దున్న కావ్య కన్నా ముందు వెళ్ళిపోవడం ప్రారంభించింది. మధ్యలో ఎన్నో సార్లు కాలేజ్ కి రాకపోవడం, తన కోసం కావ్య చేత అబద్దాలు చెప్పించటం చేసింది. ఇవన్నీ తప్పు అని తెలిసినా ఏమి చెప్పలేక మౌనంగా ఉండిపోయింది కావ్య. స్నేహంలో ఎన్నో రహస్యాలు దాస్తాము, ఎన్నో చెప్పుకుంటాము, అవి స్నేహితులతోనే రహస్యంగా ఉండిపోతాయి. కావ్య కూడా అలా పావని రహస్యాలను కాపాడుతూ వచ్చింది.

***        ***        ***        ***

చూస్తూ చూస్తూనే వేసవి కాలం వచ్చేసింది. పెళ్ళి ముహూర్తాల జోరు. కావ్య పెద్ద బావ పెళ్ళి ముహూర్తం పెట్టినట్టు ఫోన్ చేసారు. ఒక పక్క ఆనందంగా ఉన్నా మళ్ళీ హరిణి ,మామయ్యకు ఎదురు పడటం ఇష్టం లేదు. ఏమి ఉన్నా లేకపోయినా ఆమెకు స్వాభిమానం పుట్టుకతోనే వచ్చింది. అనుకోకుండా అదృష్టం కలిసివచ్చినట్టు ఆమెకు పరిక్షల సమయంలోనే పెళ్ళి ముహూర్తం పెట్టారు. కార్ లో కావ్య మేనత్త ,మామయ్య పిలవడానికి వచ్చారు. ఇదివరకు ఉన్న ఉత్సాహం వాళ్ళలోనూ లేదు. ఏదో మార్పు ఉండడం కావ్య తండ్రి గమనించాడు. మేనత్త దగ్గరగా వచ్చి కావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.

         "ఎవరెలా మారినా నువ్వు మాత్రం ఇలానే ఉండు. ఈ అత్తయ్య మీద కోపం లేదుగా?" అంది ప్రేమగా.

         కావ్యకు కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. "లేదు అత్తయ్య అదేం లేదు" అంది కావ్య.

         "నిన్ను నా దగ్గర ఉంచేసుకోవాలనుకోవడం నా స్వార్దమే. కాని ఏం చెయ్యను? నాకు ఇష్టమైన వాళ్ళు నా దగ్గరే ఉండాలనుకున్నాను. నా వైపు నుండి ఆలోచించాను కాని నీ వైపు నుండి ఆలోచించలేదు. నన్ను క్షమించురా" అంటూ...

         "నువ్వు ఈ పెళ్ళి విషయం నచ్చక కోపంగా వెళ్ళిపోయావని హరిణి ,వెంకట్ మాట్లాడుకోవడం విన్నాను. నాకు మనసులో విషయాలు దాచుకోవడం తెలియదు, నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను" అని కొంచెం సేపు ఆగి...

         "వెంకట్ కి నువ్వంటే ప్రాణం అని నాకు తెలుసు. ఒక తల్లిగా వాడు అనుకున్నది జరగాలని నా కోరిక. పైకి చెప్పక వాడు, మీ మామయ్య ముందు గెలవలేక నేను ఇద్దరం ఎప్పుడూ ఓడిపోతాము. ఆఖరివాడనో ఏమో నాకు వాడు బాధపడితే చూడలేను. నీ ఆలోచనల్లో ఏ మాత్రం మార్పు వచ్చినా నా కన్నా సంతోషించే వాళ్లు ఉండరు. ఇప్పుడు కూడా నేను ఇలా చెప్పాను అని తెలిస్తే వెంకట్ మండిపడతాడు .కాని వాడి కున్న ఓర్పు నాకు లేదు. అందుకే చెప్తున్నా. ఆలోచించు సరేనా?" అని లేచింది.

         కావ్య తల అడ్డంగా మాత్రం ఊపింది. "కానీ ఎవరికి మాత్రం అర్దం అవుతుంది తన బాధ? తన కిష్టమైన వాళ్ళు బాధపడకూడదు అనే కదా తను ఇదంతా చేసింది" అని మనసులోనే తనకు తాను సముదాయించుకుంది.

         పెళ్ళికి కావ్య వాళ్ళ నానమ్మ ,తండ్రి మాత్రం వెళ్ళి వచ్చారు. కావ్య పరీక్షలు సాకుతో ఊండిపోయింది. కావ్య కు తోడుగా ఆమె తల్లి ఉండిపోయింది. తండ్రి పెళ్ళికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి అదో రకంగా ఉండడం చూసింది కావ్య. తల్లి తండ్రి ఏదో మాట్లాడుకోవడం తను రాగానే తప్పించుకోవడం గమనించింది. ఇంట్లో ఎప్పుడూ లేని నిశబ్ద వాతావరణం ఏర్పడింది.

కావ్యకు తండ్రి వైపు చూడాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా ఏదో బెరుకుగా ఉంది. ఎప్పుడూ ఆయనని ఇలా చూడలేదు కావ్య. ఆయన మొహంలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అయనను బాధ పెట్టే విషయం ఏదో బావ పెళ్ళిలో జరిగింది అని మాత్రం అర్ధం అయ్యింది. అది ఏమయ్యుంటుందో కూడా కావ్యకు తెలిసినా ఆ విషయంలో తండ్రితో మాట్లాడే ధైర్యం లేదు.

         కావ్యకు తండ్రి అంటే చాలా ఇష్టం. తల్లి ఎప్పుడైనా అడపా దడపా తిట్టడం చూసింది కాని తండ్రి ఎప్పుడూ గట్టిగా ఒక్క మాట అన్నది లేదు. చిన్నప్పటి నుండి డబ్బు లేకపోయినా ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు. కావ్యకి ఏ మాత్రం జ్వరం వచ్చినా రాత్రంతా పక్కనే కూర్చునేవారు నిద్రపోకుండా. ఏ చిన్న అలికిడి అయినా "ఏరా కావ్య ఏమయ్యింది?" అని పరిగెత్తుకొని వచ్చేవారు. ఆయన ఉన్నారు అని ఒక ధైర్యం ఎప్పుడూ కావ్యకు ఉండేది. కావ్య ఎప్పుడైనా దేనికైనా నిరాశపడినా ఆయన నవ్వుతూ "ఇదేమంత పెద్ద విషయమా?" అని ధైర్యం చెప్పినప్పుడల్లా ఎంతో ఊరట కలిగేది. కావ్యకు ఎప్పుడూ పెరిగి పెద్దవకుండా ఉండిపోతే బాగుండేది అనిపించింది.

         కావ్యకు దేని మీద దృష్టి నిలవడం లేదు. ఆమెకున్న ఒకే ఒక ఆధారం తన స్నేహితురాలు. ఆమె కూడా దూరం అయిపోయినట్టు అనిపిస్తోంది. చదవటానికి పుస్తకాలు ముందేసుకుందే కాని ఒక్క ముక్క ఎక్కటం లేదు. ఆలోచనలతోనే సమయం గడిచిపోతోంది.

***        ***        ***

         రోజులు చాలా నెమ్మదిగా గడుస్తున్నాయి. ఆ రోజు కావ్య బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట అత్తయ్య వాళ్ళ కార్ చూసింది. "మళ్ళీ ఏం జరగబోతుందో దేవుడా?" అని లోపలకు వెళ్ళింది. ముందు ఎవరూ కనిపించకపోయేసరికి వెనుక వరండాలోకి చూసింది. పడక కుర్చీలో తండ్రి, పక్కనే వెంకట్ కూర్చున్నారు. ఇంకొక పక్కన అమ్మ, నానమ్మ. తండ్రి కోపంగా మాట్లాడడం వినిపించింది.

         "చూడు వెంకట్ నాకు నీ మీద, అమ్మ మీద కోపం లేదు. కానీ అక్కడ జరిగిన దానికి చాలా బాధగా ఉంది. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. ఏది ఎలా జరుగుతుందో అలా జరగని. నువ్వు ఎప్పటిలాగే రావచ్చు వెళ్ళచ్చు, కాని ఈ విషయంలో ఇంకా మాట్లాడద్దు" అనేసి వెళ్ళిపోయారు. కావ్య తల్లి కూడా అయన నిర్ణయమే తనది అన్నట్టు వెనుకాలే వెళ్ళిపోయింది.

         వెంకట్ ఏమి చెప్పాలో తెలియక అలా ఉండిపోయాడు.కావ్య నానమ్మ మాత్రం వెంకట్ దగ్గరగా వచ్చి కూర్చుంది.

 "వీళ్ళందరూ ఇంతేరా చచ్చినా మారరు. ఎవరి పట్టుదల వాళ్ళది. దేశం ఎక్కడికో వెళ్ళిపోవాలని, ఆకాశంలోకి దూసుకుపోవాలి అని అనుకోవడమేకానీ మనిషిగా మాత్రం ఎదగడానికి ప్రయత్నం చెయ్యరు. ఇలానే మూర్ఖంగా ఆలోచిస్తూ ఎన్ని యుగాలు మారనీ మళ్ళీ మొదటకు వస్తారు. తాము అనుకున్నదే నిజమని అదే అందరూ వినాలని అనుకొని పిచ్చివాళ్ళులా తిరిగి తిరిగి మొదట బయలుదేరిన చోటికే చేరుతారు. నువ్వెందుకు బాధపడతావు? కొన్ని రోజులు పోనీ అంతా సర్దుకుపోతుంది. లేదంటే నేనున్నాగా" అని ధైర్యం చెప్పింది.

         లేవబోతున్న వెంకట్ కు కావ్య కనిపించింది. ఒక్కసారి ఇద్దరు చూపులు కలిసి అలా ఉండిపోయారు. ఎవరి మనసులో ఏముందో అని తెలుసుకోవాలనో ఏంటో.

         "తనకు కావ్య మీద ఉన్న ప్రేమ కావ్యకు తన మీద ఉంటే ఇప్పటికి ఎవరిని అయినా ఒప్పించేవాడు" అని వెంకట్ అనుకున్నాడు మనసులో.

         "బావ అందరిని పట్టుబట్టి ఒప్పించకూడదా? కనీసం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒక్కసారి చెప్పచ్చు కదా. కనీసం రోడ్డు మీద వెంటపడేవాళ్ళు కూడా సంవత్సరాలు తరబడి వెంటపడి ప్రేమ గురించి చెప్పాలని చూస్తారు. అలాంటిది కనీసం ఒక్కసారి చెప్పి చూడచ్చు కదా నేను ఏమంటానో తెలిసేది?" అని కావ్య అనుకుంది.

         ముందు వెంకట్ తేరుకొని నవ్వాడు.

         కావ్య చెప్పులు విసురుగా విడుస్తూ కోపం నటించింది. "ఈ నవ్వుకేం తక్కువ లేదు. అందంగా ఒక నవ్వు విసిరేస్తాడు" అనుకుంది మనసులోనే.

         వెంకట్ నేరుగా కావ్య దగ్గరకు వెళ్ళాడు.

         "ఏయ్ కోతీ ఎప్పుడూ కొపమేనా? కాస్త అప్పుడప్పుడు నవ్వచ్చు కదా?" అన్నాడు చిన్నగా మొట్టికాయ మొట్టి.

         "ఇదిగో నా దగ్గర ఇలా బెదిరిస్తే బెదిరిపోను. నువ్వు నీ పెళ్ళాం దగ్గర చూపించు ఇదంతా" కోపంగా అంది కావ్య.

         ఈ చనువు కావ్యకు కేవలం వెంకట్ దగ్గరే సాధ్యం. కావ్య చిన్న పిల్లలా గారం పోవడం, దానికి వెంకట్ చిన్నగా నవ్వుతూ మైమరిచి ఆనందించడం చూస్తేనే ఎవరికైనా అర్ధం అవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ చంటి పిల్లలా ఎంత స్వచ్చమైనదని. చాలా మందికి ప్రయత్నిస్తే కాని ఇలాంటి ప్రేమ దొరకదు. పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుండి ఒకరిని ప్రేమించడం తన సొంతంగా భావించడం దేవుడిచ్చిన వరం.


         "కావ్యా" అని బాధగా పిలిచాడు వెంకట్. ఇప్పుడే నవ్వుతూ మాట్లాడిన వెంకట్ గొంతులో ఏదో బాధ.

         "నువ్వెప్పుడూ మారకుండా ఇలానే ఉంటావుగా? ఎక్కడ ఉండనీ గుర్తు పెట్టుకుంటావుగా?" అన్నాడు.

         "ఏంటీ, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నావు?" ఆంది కావ్య కంగారుగా.

         "ఏమో ఇదివరకులాగా నేను ఇక్కడకు రావడం మామయ్యకు ఇష్టం ఉండకపోవచ్చు. చూస్తుంటే అందరిలో ఏదో మార్పు. ఏది ఎలా జరుగుతోందో అర్ధం కావట్లేదు. నేను అందరికి చెప్పేంత పెద్దవాడిని కాదు. ఇదంతా నిన్నూ కొంతవరకూ బాధపెడుతోందని తెలుసు. అన్నయ్య సింగపూర్ రమ్మని అంటున్నాడు. కొన్ని రోజులు వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము." అన్నాడు వెంకట్ దిగులుగా.

         "మళ్ళీ ఎప్పుడు వస్తావు బావా?" అడిగింది కావ్య.

         "రెండు మూడు నెలలు పట్టచ్చు" జవాబిచ్చాడు వెంకట్.

         కావ్య మౌనంగా ఉండిపోయింది.

         "ఏయ్ కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఎప్పటిలాగే ఉండాలి. ఇవన్ని మామూలే అందరి ఇళ్ళలో. నీకు ఎప్పుడు మాట్లాడాలన్నా నాతో మాట్లాడచ్చు. నేనెప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను సరేనా?" అన్నాడు వెంకట్.

         సరే అన్నట్టు తల ఊపింది కావ్య.

         "బావా నీతో ఒకటి చెప్పాలి" అని ఎదో చెప్పబోయింది. లోపల నుంచి అమ్మ ,నానమ్మ రావడం చూసి మౌనంగా ఉండిపోయింది.

         "నేను వెళ్ళొస్తాను" అని అందరికి చెప్పి కావ్య వైపు చూసాడు. ఆమె ప్రతిమలా నిలబడి ఉంది. కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోయాడు వెంకట్.

         కావ్య ఏదో చెప్పాలని అనుకుంది కానీ చెప్పలేకపోయింది. ఒక మామూలు ఆడపిల్లకు ఉండే భయం బెరుకు ఆమెను మౌనంగా ఉండేలా చేసాయి. ఆమె ఒక అయోమయ పరిస్తితిలో ఉంది.

         "ఎప్పుడూ బావ తనని ప్రేమిస్తున్నట్లు చెప్పలేదు. మరి తను ఇంతగా బాధపడదానికి కారణం ఏంటి? తనూ ఏనాడు ప్రేమ అని ఆలోచించలేదు. కానీ ఈ రోజు బావ వెళ్ళిపోతుంటే ఎందుకు ఇంత బాధగా ఉంది? ఏదో కోల్పోయినట్టు ఏదో వెలితిగా? పరిగెట్టుకొని వెళ్ళి బావని ఆపి కౌగలించుకోవాలని, వెళ్ళొద్దని బ్రతిమాలాలి అని ఏదేదో పిచ్చిగా ఆలోచనలు. కానీ ఇంత మంది తన వాళ్ళను బాధపెట్టి బావనే కావలనుకోవడం మంచిదా? దానివల్ల ఎవరికి మాత్రం సుఖం?" ఇలా అంతుబట్టని ఎన్నో ప్రశ్నలు. కావ్యకు సమాధానాలు చెప్పేవారు లేరు.

కావ్య జీవితంలో ఒక ఘట్టం ముగిసిపోయింది. బావ వెళ్ళిపోయాడు. అందరూ ఒక మామూలు స్దితికి వచ్చేసారు ఒక్క కావ్య, వెంకట్ తప్ప. మనసులో ఎన్ని ఉన్నా పైకి అందరికి కష్టం కలిగించకుండా ఉండడం అలవాటు చేసుకున్నారు.

         ఒకరోజు కావ్య కాలేజ్ నుండి రాగానే తండ్రి ఏదో ఆలోచిస్తూ చాలా కోపంగా ఉండడం చూసింది. మామూలుగానే పుస్తకాలు పెట్టేసి లోపలకు వెళ్ళింది. ఈ మధ్య తండ్రి కళ్ళళ్ళోకి చూడాలన్నా ఏదో సంకోచం. ఆయనకు కలిగిన బాధకు తానే కారణం అని ఆమె భావించడం దానికి ఒక కారణం. తండ్రి మీదున్న అపారమైన ప్రేమ ఆమెను కొంతవరకు వెంకట్ గురించి తాత్కలికంగా మర్చీపోయేలా చేసింది. లోపలకు వెళ్ళిన కావ్యకు తల్లి బిందెలో నీళ్ళు పడుతూ కనిపించింది. "నానమ్మ గుడికెళ్ళినట్టు ఉంది" అనుకుంది కావ్య మనసులో.

         "పద్దూ కాఫీ కావాలి" అంది ఎప్పటిలాగే. ఇటు తిరిగి చూసిన తల్లి కళ్ళలో కూడా ఏదో అపశృతి. నీళ్ళు పడుతున్న అమ్మ ఒక్కసారి కావ్య చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది.

         "ఏమయ్యింది అమ్మా ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు?" అంది కావ్య తనూ కంగారు పడుతూ.

         "కావ్యా ఈ ఉత్తరం చూడు" అని చెత్త బుట్టలో నుంచి ఒక ఉత్తరాన్ని తీసింది అమ్మ.

         "ఏమిటిది? ఎవరు రాసారు?" అని అడిగింది కావ్య అయోమయంగా.

         "అదే నిన్ను అడుగుతున్నాను. నీకు తెలియకుండా నీకెవరు రాస్తారు?" అంది తల్లి ఎదో అనుమానంగా.

         "నాకు తెలియదమ్మ నిజంగా" అంది కావ్య కళ్ళలో తిరిగే కన్నీళ్ళను ఆపుకుంటూ.

         కావ్య మరోసారి చూసింది. ఎవరో తనకు రాసిన ప్రేమలేఖ. తనకు చాలా తెలిసినట్టు రాసారు ఎవరో. ముందు ఎదురింటి శ్రీను గాడు ఏమో అని అనుమానించింది. కానీ వాడి చేతి రాత కాదు. ఎవరి చేతనైనా రాయించాడా? ఏమీ అర్ధం కాలేదు.

         "అమ్మా నిజంగా అమ్మా నాకేమి తెలియదు. ఎవరో కావాలని చేసినట్టు ఉంది" అంది కావ్య వాళ్ళ అమ్మ
కళ్ళలోకి చూస్తూ.


(ఇంకా ఉంది)
This entry was posted on Friday, July 30, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On July 30, 2010 at 2:16 PM , వంశీ కిషోర్ said...

చాల చక్కగా రాస్తున్నరు. మనసున్న ప్రేమకి అభిమానినయ్యాను :)

~వంశీ

 
On July 30, 2010 at 7:34 PM , Siri said...

ధన్యవాదాలు వంశీ గారు ...ప్రతి వారం చదివి మీ అభిప్రాయాలు తెలుపుతున్నారు :)

 
On August 2, 2010 at 2:43 AM , satish said...

first ga naku e blog ni parichayam chesinanduku ga vamsi ki thanks cheppali ...

siri garu e bagam kuda bagundi .. story entha serious ga vundo .. anthe serious ga memu involve ayyipothunam :) .. e story lo meeru annatu ga valla eddari madyana vunde prema .. chanti pillala la swachamayinadi ... anduke e story enka interesting ga vundi .. will be waiting for next part :) ...