Author: Siri
•Thursday, July 22, 2010
 వెంకట్ నేరుగా వచ్చి అలమారలో ఏదో వెతుకుతున్నాడు. ముందు కాస్త ఓపికగా వెతికాడు. కొంచెం సేపు తరువాత కాస్త అత్రుతగా వెతకటం మొదలు పెట్టాడు. కావ్య తలుపు చాటు నుండి అంతా చూస్తూనే ఉంది. నవ్వు ఆపుకోలేక చిన్నగా నవ్వింది. వెంకట్ వెతుకుతున్నవాడల్లా ఆగి వెనక్కి చూసాడు. చేతులు వెనక్కి పెట్టుకొని ఏదో దాస్తూ కావ్య కనిపించింది.

         "ఏయ్ దొంగా ఏం చేస్తున్నావు?" అన్నాడు కావ్య ఏం దాచిందో చూడాలని.

         "ఏం వెతుకుతున్నావు బావా?" అంది తెలిసినా తెలియనట్టు.

         "అయినా ఇక్కడేముంది తీసుకోడానికి పుస్తకాలు చెత్త తప్ప" అంది పుస్తకం మీద దుమ్ము దులుపుతూ.

         నవ్వి ఊరుకున్నాడు వెంకట్.

         "అవును బావా ఎప్పుడు చదువు, పుస్తకాలు అని ఉంటావు, నీకు జీవితం అంటూ లేదా? అంటే ఏవన్నా సరదాలు అవి ఇవీ, ప్రేమ దోమా లాంటివి" అంది కావ్య నవ్వుతూ.

         ఒక్కసారి కావ్య వైపు దీక్షగా చూసాడు. ఈ సంభాషణ ఎటు వెళ్తుందో వెంకట్ కి తెలుసు.

         "ఎందుకు లేవు? చిన్నప్పటి నుండి ఎంతో మందిని ప్రేమించాను" అన్నాడు ఉడికిస్తూ.

         "అబ్బో ఫర్వాలేదే ఏదో బుద్ధావతారం అనుకున్నా, కొంచెం తెలివి ఉంది అని అర్ధం అయ్యింది" అంది కావ్య.

         వెంకట్ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. కావ్య మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.

         "మరి నువ్వు?" అన్నాడు ఆసక్తిగా.

         "నేనా అంది?" తడబడుతూ.

         "నేను ప్రేమించాలి అంటే అతను తెల్ల గుర్రం మీద ఎగురుతూ రావాలి" అంది గట్టిగా నవ్వుతూ.

         "అంటే తెల్ల గుర్రం మీద వస్తేగానీ కుదరదు అంటావు. సరేగానీ నీ చదువు సంగతి ఎలా ఉంది? అన్నాడు కొంచెం సీరియస్ గా.

         "అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? ఏ సినిమా గురించో లేదా మబ్బులు గురించో లేదా వర్షం గురించో మాట్లాడచ్చు కదా?" అంది నుదురు మీద కొట్టుకుంటూ.

"సరే పోనీ నీ భవిష్యత్తుని ఎలా చూస్తున్నావు చెప్పగలవా?" అడిగాడు వెంకట్.

         "నాకేం కావాలి? అమ్మా నాన్నా కావాలి. తెల్ల గుర్రం మీద వచ్చే పెళ్ళి కొడుకు, పెళ్ళి, పిల్లలు. వాళ్ళందరిని చూసుకుంటూ నా లైఫ్ హ్యాపీగా గడిపేస్తాను" అంది సింపల్ గా.

         "అది కాదురా రేపు పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చాక నీకు ఒక నలభై ఏళ్ళు వచ్చాక నేను లైఫ్ లో ఏమి చేసాను అని అనుకోకూడదు. మా అమ్మలాంటి వాళ్ళు ఎంతో మంది ఇలానే సర్దుకుని చివరకు ఎంత సుఖం ఉన్నా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. నీకు కావల్సింది ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నీ కోసం ముందు నువ్వు జీవించాలి. అప్పుడే ఇంకొకరి కోసం జీవించగలవు" అన్నాడు.

         "అబ్బా నీ వేదాంతం నాకు అర్ధం కాదు. కాని ఒక్కటి, నువ్వు చెప్పినట్టు నాకు ఇష్టమైనది నేను చదువుతాను సరేనా? మహప్రభో" అని దణ్ణం పెట్టింది కావ్య.

         "సరే నువ్వు ఆ పని చేస్తే, నేను నీకు తెల్లగుర్రం మీద పెళ్ళికొడుకుని తెచ్చి పెడతాను" అన్నాడు వెంకట్.

         వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం దూరం నుంచి హరిణి ఆడపడుచు స్వప్న చూస్తోంది. వాళ్ళకి దగ్గరగా వచ్చి వాళ్ళిద్దరి సంభాషణ మధ్యలో వెంకట్ ని పిలిచింది. వాళ్ళకి అంతరాయం కలిగించడం ఆమెకు తప్పనిసరి అనిపించింది. ఒకరకంగా ఆమెకు వాళ్ళిద్దరిని అలా ఏకాంతంగా మాట్లాడుకోవటం చూసి అసూయ కలిగింది.

         "రేపు ప్రయాణం గురించి మీతో మాట్లాడాలి కొంచెం" అంది కావ్య వంక చూస్తూ.

         వెంకట్ కావ్య వంక తిరిగి "రేపు నేను స్వప్నని తీసుకొని కాకినాడ వెళ్ళి వస్తాను. నీకు తోచకపోతే ఈ పుస్తకాలు ఎవైనా చదువుకో సరేనా? నాకు చెప్పకుండా నాదేదీ దొంగిలించి ఇంకొకరికి ఇచ్చెయ్యకు" అన్నాడు కన్నుకొట్టి వెళ్ళిపోతూ.

         కావ్య వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది. బావ వెళ్ళిపోవడం ఆమెకు ఇష్టం లేదు. ఏదో భయంగా ఉంది. బావ, అత్తయ్య లేకపోతే ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు. అమ్మో రేపు హరిణి వచ్చిందంటే మళ్ళీ ఏం తుఫాన్ వస్తుందో తెలియదు. ఇలా అలోచనలు ఆమె మనసులో రగులుతున్నాయి.

         ఇందాక అలమార నుండి తీసిన ఫోటోను జాగ్రత్తగా గుండెల్లో దాచుకుంది.
ప్రొద్దున్నే వెంకట్ స్వప్నని తీసుకుని కాకినాడ వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని కావ్యకి పిచ్చెక్కినట్టు ఉంది. ఇంతలో కారులో హరిణి వాళ్ళు వచ్చారు. గుమ్మంలో కావ్యని చూస్తూనే ఇద్దరు మొహాలు మాడినట్లు అనిపించింది. కనీసం చిన్న నవ్వు కూడా కనిపించలేదు. కావ్యకు ఏమీ అర్ధం కాలేదు. ఏదో వాళ్ళకు ప్రయాణం అలసట ఏమో అని అనుకుని ఊరుకుంది.

         కావ్య నానమ్మ దగ్గరకు వెళ్ళి ఒళ్ళో పడుకుంది.

         "ఏంటో బెంగగా ఉంది. అమ్మ గుర్తుకు వస్తోంది." దిగులుగా అంది కావ్య.

         నానమ్మ ప్రేమగా కావ్య తల నిమురుతూ ఉండి పోయింది.

         కావ్యకి బావ అలా వెళ్ళిపోవడం, హరిణి, మామయ్య మొహంలో తనని చూస్తే చిరాకు, ఎందుకో మొదటిసారిగా తను పరాయి ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న వయసులో ఎన్నో సార్లు తను వచ్చింది. ఎప్పుడూ సరదాగా హరిణితో చిన్న చిన్న పంతాలు కాని, ఈ సారి ఎందుకు ఇలా అనిపిస్తుందో, ఈ మార్పు ఎందుకో అర్ధం కాలేదు. చిన్నప్పుడు ఉండే అమాయకత్వం తొలగి ఇప్పుడే మనుషుల మనసులో ఉండే స్వార్ధాలు తొలిసారిగా చూడగలుగుతోంది.

         నానమ్మ నిద్రపోవడం చూసి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఏమీ తోచట్లేదు, ఏం చెయ్యాలో అని అనుకుంటుండగా హరిణి మాటలు వినిపించాయి. హరిణి తల్లితో ఏదో గట్టిగా చెప్తోంది.

         "అమ్మా నేను ఎప్పుడో చెప్పాను ఇలా ముందుగానే అన్నీ అనేసుకోవద్దు అని. ఇప్పుడు చూడు ఏమయ్యిందో" అంది అన్నీ తెలిసినట్లు.

         వెంకట్ తండ్రి మౌనంగా కూర్చున్నవాడల్లా లేచి వచ్చాడు.

         "చూడు కృష్ణా! కావ్య జాతకంలో దోషం ఉందని చెప్పారు గురువుగారు. నాకు హరిణి చెప్పగా తెలిసింది నువ్వు అత్తయ్యగారు కలిసి వెంకట్ కు కావ్య కు పెళ్ళి చెయ్యాలని అలోచన చేస్తున్నారని. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ విషయం తెలిసాక నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. నీకు కాని మీ అన్నయ్య వాళ్ళకు కానీ ఇలాంటి అభిప్రాయం ఉంటే ఇప్పుడే మార్చుకోండి" అని గట్టిగా తన నిర్ణయం చెప్పేసాడు ఆయన.

         "అది కాదండి పిల్లల మనసు కూడా తెలుసుకోవాలి కదా. పెద్దవాళ్ళుగా మనకు వాళ్ళు గౌరవం ఇస్తున్నప్పుడు మన బాధ్యతగా వారి మనసు తెలుసుకుని ఉండడంలో, వారికి నచ్చినది మనం చెయ్యడంలో తప్పేముంది?" అని ఎప్పుడు లేని దైర్యం తెచ్చుకుని అడిగేసింది కృష్ణవేణి.
"జాతకాలు కలవనిదే ఈ విషయంలో మాట్లాడేది లేదు .వాళ్ళు చిన్న పిల్లలు మీరే పెద్దవాళ్ళు వాళ్ళ మనసులో ఇలాంటివి కల్పించకండి. వాళ్ళిద్దరి మనసులో ఇలాంటి ఆలోచన రాకుండా చెయ్యడం మీ బాధ్యత. హరిణి ఈ విషయం చెప్పడం వల్ల మంచిదయ్యింది. లేకుంటే అనర్ధం జరిగేది. ఈ విషయంలో ఇంకెవరు ఏదీ మాట్లాడకూడదు. మీ అన్నయ్య వాళ్ళని కూడా లేని పోనీ ఆశలు పెట్టుకోవద్దని చెప్పు" అని కోపంగా చెప్పి ఆయన అక్కడనుండి వెళ్ళిపోయారు.

         హరిణి తన ప్లాన్ సరిగ్గా పనిచేసినందుకు ఆనందించింది. తండ్రితో ఒంటరిగా వెళ్ళినప్పుడు తను అందరి మీద కల్పించి చెప్పి ఆయనను నమ్మించింది. గురువుగారు చెప్పిన చిన్న దోషాన్ని పెద్దది చేసి చూపించగలిగింది. ఎవరి చేత చెప్పిస్తే అందరు వింటారో అదే చేసింది.

         కృష్ణవేణికి ఏం చెయ్యాలో తోచట్లేదు. అనుకోకుండా ఇలా అవుతుందని అనుకోలేదు.

         హరిణి ఇంకా ఎదో చెప్తూనే ఉంది. "అమ్మా! అందుకే కావ్య మాటిమాటికి ఇక్కడకు రావడం నాకు నచ్చలేదు. మామయ్య వాళ్ళకు పెళ్ళి చేసే తాహతు లేదు కదా అని పైసా ఖర్చు లేకుండా చేసేద్దామని అనుకుంటూన్నారో ఏంటో, కావాలంటే డబ్బు సహాయం చేద్దాము. నాన్నతో నేను మాట్లాడుతాను" అంది పొగరుగా.

         "హరిణీ!!!" అని అరిచింది ఆమె తల్లి కోపంగా.

         "నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ నాన్నగారు ఇచ్చిన అలుసు వల్లే నువ్వు కొంచెం కూడా ఎదుటి వాళ్ళ మనసులు అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నీలాగే నాకు వెంకట్, కావ్యలు కూడా ముఖ్యం. ఏది ఎలా చెయ్యాలో మాకు తెలుసు. నువ్వు అనవసరంగా ఇందులో కల్పించుకోకు." అంది బాధపడుతూ.

         బయటనుంచి అంతా వింటున్న కావ్యకి మతి పోయినట్టు అనిపించింది. జరుగుతున్నది కలా నిజమా అన్నది అర్ధం కాలేదు. జీవితం లో మొదటిసారి తట్టుకోలేని బాధ ఏదో అంతా ఆవహించింది.

         హరిణి బయటకు వస్తూ కావ్యని చూసింది. తనతో రమ్మని బయటకు తీసుకెళ్ళింది. కావ్య మౌనంగా వెనుకే నడిచింది.

         "చూడు కావ్యా, మేము నీ శత్రువులం కాదు. నువ్వంతా వినే ఉంటావు. అమ్మకు తెలియని ఒక విషయం నీకు ఒకటి చెప్పాలి. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మాత్రమే నాకు, ఈ ఇంటికి సహాయం చెయ్యగలవు." అంది కావ్య మొహంలోకి చూస్తూ.

కావ్య ఏమీ చెప్పే పరిస్తితిలో లేదు. నేల వంక చూస్తోంది. ఇదే టైమ్ అనుకొని హరిణి అందుకొంది.

         "నీ జాతకంలో దోషం ఉంది కదా? దానివల్ల నీకు వెంకట్ కి గానీ పెళ్ళి అయితే అమ్మకు ప్రాణగండం అని గురువుగారు చెప్పారు. మరి వెంకట్ కు అమ్మ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా? ఆ విషయం అమ్మకి గాని వెంకట్ కు గాని చెప్తే వాళ్ళు బాధపడతారు, లేదా ఇవేమి పట్టించుకోకుండా ఈ పెళ్ళి చేస్తారు. అప్పుడు అమ్మకేదైనా అయితే అప్పుడు అది ఎవరి తప్పు అవుతుంది? అందువల్ల నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా." అంది కాసేపు ఆగి.

         "ఏంటి వదినా చెప్పు?" అని మాత్రం అనగలిగింది కావ్య.

         "ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నేను ఎవరికీ చెప్పను. నువ్వు అమ్మ క్షేమం కోరేదానివైతే నువ్వు చెప్పకూడదు. ఒకవేళ అమ్మా వాళ్ళు పెళ్ళి అని బలవంతం చేస్తే నీకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు అని చెప్పాలి సరేనా?" అంది హరిణి.

         కావ్య మౌనాంగా ఉండటం చూసి "ఏంటి ఏమి మాట్లాడవు? అమ్మ కోసం ఆ మాత్రం చెయ్యలేవా?" అడిగింది హరిణి.

         "అయ్యొ వదినా లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు చెప్పకపోయినా నేను అదే చెసేదాన్ని. అత్తయ్య నాకు ముఖ్యమే. నేను అంత స్వార్ధపరురాలిని కాదు." అంది కావ్య వచ్చే కన్నీళ్ళను దిగమింగుతూ.

         "థాంక్స్ కావ్య" అని లోపలకు వెళ్ళిపోయింది హరిణి.

         కావ్యకు ప్రేమ అంటే ఏంటో తెలిసే ముందే అంతా అయిపోయింది. తనకి ఇప్పటి వరకు వెంకట్ ఇంత ముఖ్యమని అనుకోలేదు. ఇప్పుడే తనకు అర్ధం అవుతోంది. కావ్య ఉయ్యాల బల్ల వైపు చూస్తూ ఉండిపోయింది. ఒక్కరోజులో అంతా మారిపోయింది. ఇక్కడ ఎవ్వరు తనకు సొంతం కాదు అని చెప్పక చెప్పి వెళ్ళిపోయింది హరిణి. ఇంక ఒక్క నిముషం అక్కడ ఉండబుద్ది కాలేదు. ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఒకప్పుడు ఎంతగానో నచ్చిన ప్రదేశం ఇప్పుడు ఎందుకో అంత గొప్పదేమి కాదు అనిపించింది.

         తాము ఉండే రెండు గదుల ఇల్లే స్వర్గంలా తోచింది. సాయంత్రం ఎలాగైనా నానమ్మతో చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంది. వెంకట్ రాకుండానే వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంది.

కావ్య చెప్పడమే తరువాయి హరిణి స్వయంగా టికెట్స్ తెప్పించింది. కావ్యకు వాళ్ళ అత్తయ్య, నానమ్మ నచ్చచెప్పాలని చూసారు. "ఎందుకే ఈ హడావుడి? సెలవులు ఇంకా ఉన్నాయి కదా ?" అని.

         అయినా కావ్య ఒప్పుకోలేదు. అమ్మను చూడాల్సిందే అని పట్టు పట్టింది. కనీసం వెంకట్ వచ్చేవరకు ఉండమని అడిగింది కృష్ణవేణి.

         దేనికి ఒప్పుకోలేదు కావ్య. మొండిగా ఇలా ఎందుకు పట్టు పట్టిందో ఇద్దరికీ అర్ధం కాలేదు. పెళ్ళి ముహూర్తం పెట్టగానే చెప్పమని నానమ్మ కృష్ణవేణికి చెప్పి బయలుదేరింది.

         వాళ్ళు వెళ్ళిన పది నిముషాలకు వెంకట్ వాళ్ళు వచ్చారు. ఎక్కడా కావ్య, అమ్మమ్మ కనిపించకపోయేసరికి అక్కడే కూర్చున్న హరిణి ని అడిగాడు. ఎప్పుడు విషయం చెప్దామా అని కూర్చుంది హరిణి.

         "ఏముందిరా అమ్మ నాన్న మీ పెళ్ళి విషయంలో గొడవ పడ్డారు. అది కావ్య విన్నట్లు ఉంది. నాకు ఇష్టం లేకుండా మీరందరు ఎలా నిర్ణయాలు తీసుకోగలరు అని కోపంగా నాతో టికెట్లు తెప్పించుకొని వెళ్ళిపోయింది. నేను నువ్వు వచ్చే వరకు ఉండమని చెప్పాను. అయినా వినిపించుకోలేదు. నాకిష్టంలేని పెళ్ళి ఎలా చేస్తారు అని కోపగించుకొని వెళ్ళిపోయింది" అంది.

         "అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా అంతే. తొందర పడద్దు అని చెప్పినా వినిపించుకోరు. సరే నేను స్టేషన్ వెళ్ళి వస్తాను" అని హరిణి అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు వెంకట్.

         ఇంకా ట్రైన్ ఐదు నిముషాలలో బయలుదేరుతుంది అనగా వచ్చాడు వెంకట్ స్టేషన్ కి కావ్య వాళ్ళను వెతుక్కుంటూ. హడావుడిగా అన్ని పెట్టెల్లోకి వెతుకుతున్నాడు. కావ్య దూరం నుంచి వెంకట్ రావడం చూసింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎవరినైతే తప్పించుకోవాలని తను హడావుడిగా బయలుదేరిందో తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. తను చూడనట్టు ఇంకొకవైపు తిరిగి కూర్చుంది. అమ్మమ్మా అంటూ వెంకట్ వచ్చేసరికి ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

         "ఏమిట్రా ఇది, ఇలా పరిగెత్తుకొని వస్తున్నావు? ఏమయ్యింది?" అని కంగారు పడింది నానమ్మ.

         "కావ్య ఏది నేను ఒక్కసారి మాట్లాడాలి" అన్నాడు ఆయాసపడుతూ వెంకట్.

         "ఏది ఇక్కడే ఉండాలి ఎక్కడకు పోయింది" అని తిరిగి చూసింది. అక్కడ కావ్య కనిపించలేదు.

 "నేను చూస్తాను అమ్మమ్మ నువ్వు కూర్చో" అని చెప్పి లోపలకు ఎక్కాడు వెంకట్. ఎక్కి పక్కకు తిరుగుతుండగా కావ్య అటు తిరిగి నిలుచిని ఉంది. ఎవరో వెనకాలే ఉండడం గమనించి తిరిగి చూసింది. ఎదురుగా వెంకట్ నవ్వుతూ కనిపించాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతున్న కావ్య చెయ్యి పట్టుకున్నాడు.

         "కావ్య చెప్పకుండా వెళ్ళిపోతున్నావా?" అన్నాడు భాధగా.

         "లేదు బావా అమ్మను చూడాలి అనిపించింది అందుకే ఇలా" అంది కావ్య.

         "నా మీద కోపం లేదుగా?" అడిగాడు వెంకట్ చెయ్యి వదలకుండానే.

         "ఊఁహూ " అంది తల అడ్డంగా ఊపుతూ.

         "హమ్మయ్య ఎక్కడ కోపంగా వెళ్ళిపోతావో అని భయపడ్డాను. సరే కాని అమ్మ ఏదో అంది అనుకో ఇలా వెళ్ళిపోవడమేనా? పెద్దవాళ్ళు ఏదో అంటారు. నీకు ఇష్టం లేని పని ఎవ్వరు చెయ్యరు. నేను చెప్పానుగా నేనే నీకు స్వయంగా తెల్ల గుర్రం మీద పెళ్ళికొడుకుని తెస్తాను అని. నువ్వేం భయపడకు సరేనా?" అన్నాడు చేతిని నెమ్మదిగా వదిలేస్తూ.

         ట్రైన్ నెమ్మదిగా కదులుతోంది.వెంకట్ దిగి చెయ్యి ఊపుతున్నాడు. కావ్య ఎదో చెప్పబోయింది.కాని మాటలు రాలేదు.ట్రైన్ నెమ్మదిగా వేగం పుంజుకుంది.చూస్తూ చూస్తూనే వెంకట్ దూరమయ్యిపోయాడు.

***        ***        ***        ***


         మొదట్లో ప్రతి విషయంలో ఆమెకు వెంకట్ గుర్తుకు వచ్చేవాడు. నెమ్మది నెమ్మదిగా తనను తాను మొండిగా మార్చుకొంది. ప్రేమ ఒక వైరస్ లాంటిది. అది తగ్గినట్టే తగ్గుతుంది కనపడకుండా పోతుంది. కాని మనకే తెలియకుండా ఏదో ఒక టైమ్ లో పైకొచ్చి మనలను భాధ పెట్టి పోతుంటుంది అని సరిపెట్టుకుంది కావ్య.

         సెలవులు అయ్యాక ముందు వెళ్ళి పావనిని కలవాలి అని అనుకుంది కావ్య. అన్ని విషయాలు చెప్పాలి అని తెగ ఆరాటంగా ఉంది. పావనికి తప్ప ఇంకెవరికి చెప్పుకోగలదు? ఆమె తల్లిదండ్రులు ఒక మామూలు మధ్యతరగతి తల్లిదండ్రులు. వాళ్ళు అన్నీ జీవితంలో సాఫీగా గడిచిపోవాలి అనుకునే మనుషులు. ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేని వాళ్ళు. ఇదేమి జీవన్మరణ సమస్య కాకపోయినా కావ్యకు అదే ఆమె జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని, అనుభవించని భాధ.

         ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఫోన్ మోగింది. వినిపించినా వినిపించనట్టు ఊరుకుంది.

         "ఏమిటే ఫోన్ అలా మోగుతుంటే ఎత్తవు?" అని విసుక్కుంటూ అమ్మ ఎత్తేలోపు అది మ్రోగటం ఆగిపోయింది.

"ఏమిటో పిల్ల ఎక్కడో ఊహల్లో తేలుతుంటుంది" అనుకుంటూ వెళ్ళిపోయింది.

         కావ్యకు ఎక్కడ తన బావ ఫోన్ చేస్తాడో ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని ఆలోచిస్తోంది. ఎప్పుడు ఫోన్ మోగుతుందా అని చూసే తనకి ఇప్పుడు మోగకుండా ఉంటే బాగుండు అని ప్రార్ధిస్తోంది. ఆలోచిస్తూ ఏదో తగిలినట్టు అనిపించి కిందకు చూసింది. ఏదో కాగితం చుట్టబెట్టి ఉంది. ఎక్కడ నుండి వచ్చిందా అని చుట్టూ చూసింది. ఎదురుంటి శ్రీనుగాడు వెకిలిగా నవ్వుతున్నాడు.

         "ఇప్పటికి ఇది ఏభైయ్యో లవ్ లెటర్. ఎందుకు విసురుతాడో ఈ పనికిమాలిన కవిత్వాలు. బయటకు వస్తే చాలు రడీ అయిపోతాడు. తన ఇంట్లో వాళ్ళో, వాళ్ళ ఇంట్లో వాళ్ళో చూస్తే ఎంత రభస? రేపు మళ్ళీ మొహాలు చూసుకోగలమా" అని మనసులో అనుకుని వాడి ఎదురుగానే చించి పారేసి అటు చూడకుండా లోపలకు వచ్చేసింది.

                                 ***        ***        ***        ***

(ఇంకా ఉంది )
This entry was posted on Thursday, July 22, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments:

On July 23, 2010 at 7:20 AM , వంశీ said...

siri garu; appude katha lo malupu vachesthundi ani anukoledu.

 
On July 25, 2010 at 1:47 AM , satish said...

siri garu .. e bagam chala bagundi ...