Author: Siri
•Saturday, April 18, 2009
"ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది పునర్జన్మ అన్నట్టు ఎక్కడో విన్నట్టు గుర్తు.అయినా కాకపోయినా ప్రతీ ఆడదానికి జీవితంలో ఎక్కడోక్కడ మార్పు తప్పదు. తన మెట్టినింటి వారికి ఎవరికి కష్టం కలిగించకుండా మసలుకోవడం, అత్తగారినే తల్లిగా చూసుకోవడం, పెద్దలను గౌరవించడం ఇవన్నీ ఆడపిల్లకు కనబడని ఆభరణాలు." అరగంట నుండి టీవీలో వస్తున్న సీరియలు చూసి విసుక్కుంది సంధ్య.

"నా చిన్నప్పటి నుండి ఇదే వింటున్నాను. వీళ్ళకు ఇవి తప్ప వేరే ఏమీ లేవా ఆడపిల్లలకు చెప్పటానికి." అని ఛానల్ మారుస్తుండగా ఫోన్ మోగింది.

"హలో" అంది సంధ్య. "హలో శ్రీమతి ఎలా ఉన్నావు?" అవతలి నుండి సంధ్య భర్త రఘు కంఠం వినిపించింది.

"బాగున్నాను.మీరెలా ఉన్నారు? వంట చేసుకుంటున్నారా? బయట ఎక్కువ తినకండి" అంది మందలిస్తూ.

"అలాగే మహారాణి! సరే కానీ, పిల్లలు ఎలా ఉన్నారు నిద్రపోయి ఉంటారు."
"అవునండి ఇప్పుడే పడుకున్నారు." అంది ఆవులిస్తూ.

"సరే రేపు పొద్దున్న మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ అమ్మగారూ ,నాన్నగారూ ఎలా ఉన్నారు" అన్నాడు.

"ఊం బాగున్నారు చెప్పండి" అంది ముక్తసరిగా. ఏదో తనకు నచ్చని విషయం చెప్పబోతున్నాడు అని అర్ధం అయ్యింది సంధ్యకు.

"అమ్మ నిన్ను వచ్చి ఒక పది రోజులు ఉండమని చెప్పింది. నీ వీలు చూసుకొని వెళ్ళి రాకూడదు?" అన్నాడు కాస్త సంశయిస్తూనే.

"ఏమండి మళ్ళి మళ్ళి అదే చెప్పకండి. మళ్ళీ మీకు నాకు వాదన మొదలు అవుతుంది. ఇక్కడ ఉన్న కొన్ని రోజులు హాయిగా ఉండనివ్వండి." అంది.

"సరే నీ ఇష్టం. ఒక వారం రోజులు వెళ్తే సంతోషిస్తారు వాళ్ళు. ఇకపై నీ ఇష్టం" అని అన్నాడు భారం అంతా సంధ్య మీద పెట్టి.

"ఎందుకండి మా వాళ్ళ దగ్గరకు వచ్చీ రాగానే ఈ తంతు మొదలు అవుతుంది." అంది బాధగా.

"సరే నేనేమి నిన్ను బలవంతం చెయ్యలేదు కదా. ఆలోచించి నీకు తోచినట్టు చెయ్యి. మళ్ళీ రేపు పిల్లలతో మాట్లాడతాను. ఉంటాను" అని పెట్టేసాడు.

రఘు సంధ్యలకు పెళ్ళయ్యి పదేళ్ళు కావస్తోంది. ఇద్దరు పిల్లలు. రఘు సంధ్యలది ప్రేమ మరియు పెద్దలు చేసిన పెళ్ళి. అంటే వాళ్ళు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకొని పెళ్ళి చేసారు. పెళ్ళి అయిన సంవత్సరం లోనే అమెరికాలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు. ప్రతి రెండు ఏళ్ళకి ఒక్కసారి ఇండియా వచ్చి వెళ్తుంటారు. రఘు నాలుగు వారాలు సెలవులో వచ్చి వెళ్ళిపోయాడు. సంధ్య మాత్రం తన తల్లితండ్రులతో గడపాలని పిల్లలతో ఇంకో నెల ఉండిపోయింది. వచ్చిందే కానీ అత్తగారి ఇంటి నుండి పిలుపులు వస్తూనే ఉన్నాయి ఇంకో పది పదిహేను రోజులు ఉండి వెళ్ళమని.

"మాకు మాత్రం సరదా ఉండదా పిల్లలు మాతో ఉండాలి అని. కాస్త మీరే చెప్పి పంపించండి" అని సంధ్య తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడం. సంధ్యకు ఇదంతా చిరాకు కలిగిస్తోంది.

రఘు ఉన్నన్నాళ్ళు అక్కడే ఉన్నారు. రఘు వెళ్ళే ముందు ఎదో ఒక రెండు రోజులు చుట్టం చూపుగా సంధ్య పుట్టింటికి వచ్చి వెళ్ళిపోయాడు. సంధ్య పుట్టింటి వాళ్ళు ఆ మూడు రోజులు ఒక పండుగగా చేసుకున్నారు. రఘు వెళ్ళిపోయాక హాయిగా తల్లితండ్రులతో గడపాలి అనుకున్న సంధ్యకు మనశ్శాంతి లేకుండా అయ్యింది. ప్రతీసారి జరిగేదే అయినా అలవాటు కాని వింతైన నాటకం.

"తను మాత్రం ఎదైనా పదే పదే పుట్టింటికి వెళ్తుందా? ఎదో రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ సమయం కోసం తను ఎంత ఎదురు చూస్తుంది. రఘు మాత్రం ఉన్న నాలుగు వారాలు వంతులు లేకుండా ఎవరి మాటలు పడకుండా దర్జాగా గడిపేస్తాడు. తను మాత్రం అందరికి సంజాయిషి చెప్పుకోవాలి. రఘుకి, తన పిల్లలు తన తల్లితండ్రులతో గడపాలని ఆశ. నిజమే కానీ, ఆ లెక్కలో తను ఎక్కడ ఉంది? తనకు స్నేహితులను కలుసుకోవాలని తన వాళ్ళతో గడపాలని ఉండదా?"

సంధ్యకు రఘు మీద కోపం అసహనం పెరిగిపోయింది. సంధ్య , రఘు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారే తప్ప వాళ్ళ మధ్య ఎప్పుడూ ఏదో తెలియని సంఘర్షణ జరుగుతూనే ఉంది.
This entry was posted on Saturday, April 18, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: