Author: Siri
•Saturday, April 18, 2009
ఎలాగోలాగ డబ్బులు కూడపెట్టి పెళ్ళికి అంతా తయారయ్యారు. పెళ్ళికి ఎంత వరకు చెయ్యగలరో అంతా చెయ్యడానికి సిద్దమయ్యారు. నా కన్నా వయసులో చిన్నవాడు అయిన నా తమ్ముడు శేఖర్ నాన్నతో పాటు నా కన్నా పెద్దవాడిలా బాధ్యత కలిగిన వాడిలా అన్నీ చూసుకున్నాడు.

అందరి కళ్ళళ్ళో ఒకటే ఆశ నా పెళ్ళి సంతోషంగా జరగాలి అని. పెళ్ళికి ఎన్ని అడ్డంకులు రావాలో అన్నీ వచ్చాయి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక వాళ్ళ వైపు ఎవరో పోయారు అని పెళ్ళి ఒక సారి వాయిదా పడింది. అప్పటికే ముందుగా పెళ్ళి కోసం చేసిన ఏర్పాటులన్నిటికి ఇచ్చిన డబ్బులు వెనక్కి వచ్చే మార్గం కనిపించలేదు. మళ్ళీ రెండో సారి ముహూర్తం పెట్టినప్పుడు పాల వాళ్ళు మూడు రోజుల పాటు సమ్మె చేసారు. అన్నిటికి అవసరానికి మించి రెట్టింపు ధర ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది. పెళ్ళి వాళ్ళు మాత్రం తక్కువ వచ్చారా? వాళ్ళ ఇంట్లో మొదటి పెళ్ళి అని ఎక్కడెక్కడి నుండో కుటుంబ సమేతంగా పెళ్ళికి ముందు రోజే సత్రంలోకి మేము ప్రవేశించడానికి ముందే వచ్చేసారు. ఈ జనాన్ని చూసి గుండె ఆగినంత పనయ్యింది. మా వైపు బంధువులేమో తీరికగా ముహూర్త సమయానికి వచ్చారు ఎక్కడ పని అప్పగించేస్తారో అని.

ఒక గదిలో అలంకరించి కూర్చో పెట్టిన నాకు నాన్న పడుతున్న అవస్త చూసి మనసంతా భారమయ్యింది. రఘుతో పెళ్ళి అవుతోంది అన్న సంతోషం వెతికినా నాలో కనిపించలేదు. పెళ్ళి వాళ్ళ బస్సు రావడంతో హడావుడి మొదలు అయ్యింది. ఎవరో వచ్చారు పలకరించి వెళ్ళారు. కానీ నా కళ్ళకు మాత్రం నా తల్లి తండ్రుల ముఖంలో ఆందోళన మాత్రమే కనిపించింది. కాఫీ తాగారా? భోజనం చేసారా? అని అడుగుతూనే ఉన్నారు.

తెల్లవారుజామున పెళ్ళి అని త్వరగా పడుకోమని నాన్న భోజనాలు ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిపోయారు. పడుకుందామని అనుకుంటుండగా మా పిన్ని ఒకావిడ వచ్చింది.

"ఏమిటో ఎంత చేసినా ఈ పెళ్ళి వాళ్ళు ఇంతే. ఏదోక లోటు కనిపెడతారు." అంది కోపంగా.

"ఎం జరిగింది" అని కంగారుగా అడిగాను.

"అయ్యో నీకు విషయం తెలియదామ్మా? ఎవరో మనవాళ్ళు పెళ్ళి వాళ్ళ కన్నా ముందు పంక్తిలో కూర్చుని తినేసారు. అది వాళ్ళు చూసి చాలా పెద్ద గొడవే చేసారు. మీ నాన్నకు పాపం ఇదంతా తెలియనే తెలియదు. భోజనానికి పది సార్లు చెప్తేగాని కదిలి రావడం లేదు వాళ్ళు. మనవాళ్ళకి పాపం ఆకలి వేసి ఎవరో ఇద్దరు తిన్నట్టు ఉన్నారు. మా పెద్దవాళ్ళు తినకుండా తినేస్తారా అని మీ అత్తగారు మామగారు భోజనానికి రాకుండా భీష్మించుకుని కూర్చున్నారు. మీ నాన్న కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడుతున్నారు. పెళ్ళి కొడుకు కూడా కోపంగా అరుస్తున్నాడు. మీ నాన్న బాధ నేను చూడలేక ఇలా వచ్చేసాను" అని మహా చక్కగా వార్తను మోసుకొచ్చింది.

"రఘు అరుస్తున్నాడా? ఏమిటి ఇదంతా? ఎవరు ఇచ్చారు రఘుకి ఆ హక్కును నా తండ్రితో ఇలా ప్రవర్తించేందుకు? తను బయటకు వెళ్ళి రఘుని అడిగితే?" అని రకరకాలు ఆలోచనలు నాలో వచ్చాయి.

కానీ అక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు వెయ్యలేక పోయాను. ఇప్పుడు ఉన్న మానసిక పరిపక్వత అప్పుడు లేదు, ధైర్యం లేదు. జరిగిన దానికి బెదిరిపోయి కన్నీళ్ళు పెట్టుకోవటం తప్ప. ధైర్యం ఉంటే మాత్రం తను ఏం చెయ్యగలదు. పెళ్ళి పందిరిలో అందరి ముందు ఏమిటిది అని అడగగలిగేదా? అమ్మా నాన్నా అక్కడ ఎం అవస్త పడుతున్నారో అని తెగ ఆరాటపడ్డాను. కొంచెం సేపటికి అమ్మా, నాన్నా వేలాడే మొహాలతో వచ్చారు.

"ఇంకా పడుకోలేదా తల్లీ? రేపు పొద్దున్నే లేపేస్తారు" అని అన్నారు నాన్న ఏమి జరగనట్టు. ఆయన ముఖం చూస్తే వారం రోజులు లంకణాలు చేసిన మనిషిలా ఉన్నారు.

"నాన్నా నాకీ పెళ్ళి వద్దు నాన్నా" అని ఆయన్ని పట్టుకొని ఏడ్చేసాను. ఆయన కంగారు పడిపోయారు.

"ఏమిటి ఏమయ్యింది ఇప్పుడు. అంతా సర్దుకు పోయింది. నువ్వేమి బెంగ పడకు. ఏదో చిన్న తప్పు జరిగింది, నేను అంతా సరిచేసాను. నువ్వు దేని గురించి ఆలోచించకుండా పడుకో. ఈ రోజు నీ జీవితంలో సంతోషమైన రోజు. ఇలా కన్నీళ్ళతో ఉండకూడదు. కళ్ళు తుడుచుకో" అని ధైర్యం చెప్పారు.

"అది కాదు నాన్నా. నా వల్ల మీరు ఇంకొకరి ముందు తల వంచుకొని నిల్చోవడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడడం నాకు బొత్తిగా నచ్చలేదు." అని వెక్కి వెక్కి ఏడ్చాను.

"ఎవరు దానికి అన్ని విషయాలు మోసుకు వస్తున్నారు. దానికి తెలియనివ్వొద్దు అని చెప్పానా" అని అమ్మ మీద మండి పడ్డారు.

"నాన్నా నాకు పెళ్ళి వద్దు నాన్నా" అని పిచ్చి పట్టినట్టు ఏడుస్తూనే ఉన్నాను.

"పిచ్చి పిల్లా! ఇదంతా మామూలే మన పెళ్ళిళ్ళలో. వాళ్ళు ఏదో ఆవేశపడ్డారు. ఇలాంటివి చూసి చూడనట్టు ఉండిపోవాలి. మన మర్యాద అని చూస్తూ కూర్చుంటే పెళ్ళి ఎలా జరిగేది. ఇంత మంది వచ్చారు. ఈ ఒక్క రోజు ఓపిక పట్టేస్తే ఇంక అంతా సవ్యంగా జరిగిపోతుంది." అని చాలా సులభంగా చెప్పేసారు కానీ అదంతా పైపైన గంభీరమే అని నాకు తెలుసు.
This entry was posted on Saturday, April 18, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: