Author: Siri
•Saturday, April 18, 2009
అమ్మ అయితే "ఇలాంటివి అన్ని మామూలే మన పెళ్ళిళ్ళలో. వాళ్ళు మగపెళ్ళి వాళ్ళు. ఇలాంటి లాంచనాలు అన్నీ మాములే. వాళ్ళు తోచింది వాళ్ళు అడుగుతారు. మనకు ఉన్నదాంట్లో మనం చేస్తాము" అని సమర్ధించుకొంది.

వాళ్ళు అలా అనుకొడానికి కారణం లేకపోలేదు. సగం వరకు వచ్చిన పెళ్ళిని ఏ వంక పెట్టి ఆపినా అది మన మెడకే చుట్టుకుంటుంది అని తెలుసు. రఘు చదువు, అతని ఉద్యోగం పెద్ద పీట వేసాయి. అన్నిటి కన్నా ముందు అందరికి ఇప్పటికే తెలిసిన నా ప్రేమ విషయం.

నాకంతా అయోమయంగా అనిపించింది. ప్రేమించేటప్పుడు తెలియదు పెళ్ళిలో ఇంత చిక్కు ముడులు ఉంటాయి అని. రఘుకి తెలియజెప్పాలని చూసింది. కానీ ప్రతీసారీ ఎదో సరదగా మాట్లాడడం, చిలిపిగా ఉండడం తప్ప దేని గురించి కాస్త తీవ్రంగా ఆలోచించడానికి ఇష్టపడలేదు.

"అదంతా పెద్దవాళ్ళు చూసుకుంటారు. నువ్వు నేను ప్రేమ పక్షుల్లా సంతోషంగా కలలు కనాలి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను పన్నెండు పేజీలు ఉత్తరం రాస్తే నువ్వు రెండు పేజీలతో సరిపెట్టుకున్నావు." అని అలిగాడు.

ఎలా అర్ధమయ్యేలా చెప్పాలో తెలియలేదు. ఎంతైనా ఇంకా పెళ్ళి కాలేదు కదా ఏదన్నా చెప్పే చనువు లేదు. పోని రఘు అయినా మా తల్లితండ్రులు ఇలా, వాళ్ళ మనస్తత్వం ఇలాంటిది అని ఎప్పుడూ చర్చించలేదు. నేను ఊహల్లో ఊహించుకున్నదే తప్ప నాకు జీవితం అంటే అవగాహనే లేదు. నేను ఊహించుకున్నదానికి వాస్తవం ఎంతో దూరం అని చాలా ఆలస్యంగా అర్ధం అయ్యింది.

పెళ్ళికి ముందు వంట ఎలా చెయ్యాలి ఎలా మర్యదగా నడుచుకోవాలని చెప్తారు కానీ మనుషుల మనస్తత్వాలు అర్ధం చేసుకొని మనసు మలినం కాకుండా ఎలా ఉండాలి అని ఎక్కడా ఎవ్వరూ చెప్పడం గుర్తులేదు. పెళ్ళి ముహూర్తం పెట్టడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మధ్యవర్తిత్వం చేసి చివరకు మనసులో ఉన్నది చెప్పేసారు రఘు తల్లి తండ్రులు. ప్రేమపెళ్ళి అని చెప్పి ఏమి లేకుండా ఎలా చేసుకోవడం అని తోచిందో ఏమో. అమ్మాయి పేరున ఇంత డబ్బు అత్తగారి కట్నం కింద ఇంత అని ఒక మొత్తం చెప్పారు. గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయ్యింది నాన్నకు. అసలు పెళ్ళి ఘనంగా చెయ్యాలి అన్నందుకే ఎంత ఘనంగా చేస్తే ఎంత డబ్బు ఎక్కడ నుండి సర్దాలో ఆలోచిస్తున్న ఆయనకు ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద మొత్తాన్ని ఎక్కడనుంచి తేవాలో అర్ధం కాలేదు. చివరకు అంత ఇచ్చుకోలేము అని చెప్పేసరికి మొహాలు మాడిపోయాయి అందరివి. మధ్యవర్తులు రెండువైపుల సర్ది చెప్పి బేరసారాలు జరిగాక ఒక ఒప్పందం కుదుర్చుకునారు. పెళ్ళి సమయానికి ఇవ్వలేక పోయినా పెళ్ళి అయిన ఒక సంవత్సరంలో అమ్మాయి పేరున డబ్బు వేసేటట్టు ఒప్పుకున్నారు. మొత్తానికి పెళ్ళి ముహూర్తం పెట్టడానికి రఘు తల్లిని కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది.

ఇంటికి వచ్చిన మా వాళ్ళ మొహాల్లో కూడా నేను ఊహించిన ఉత్సాహం లేదు. ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న నాకు ఎదో అపశ్రుతి కనిపించింది. అంత వరకు చాలా ధైర్యంగా ఉన్న అమ్మా నాన్నా ఇంక ఓపిక నశించి ఇప్పటి వరకు పైకి రానియ్యకుండా దాచిన భావాలను బయట పెట్టలేకుండా ఉండలేకపోయారు. అన్నిటి కన్నా డబ్బు ఎక్కడనుంచి పుట్టించాలీ అని ఆలోచన మొదలు అయ్యింది.

అంత వరకు ఆపుకున్న అమ్మ ఇంక కోపమంతా నాన్న మీద చూపించింది.

"దాని చిన్నప్పటి నుండి చెప్తున్నాను. ఈ పరిస్దితి వస్తుంది అని. ఎంతో కొంత డబ్బు దాని పేరున వెయ్యండి అని. నా మాట విన్నారు కాదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడ నుంచి తేవాలి అని బుర్ర పట్టుకొని కూర్చుంటారు" అంది ముక్కు తుడుచుకుంటూ.

విషయమేమిటి అని అడిగితే అమ్మ అంతా ఒక కధలా చెప్పుకొచ్చింది నా పెళ్ళి ప్రహసనం.

"నీకు ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలియాలి కదా. చిన్నప్పుడు నుండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని చేర్చి ఒక జత గాజులు, గొలుసు, చెవిలోకి చేయించాము. పెళ్ళికి ఎలాగోలా అప్పో సప్పో తెచ్చి చేస్తాము. కానీ నీ పేరున డబ్బు వెయ్యమని చెప్పారు మీ అత్తగారు. అదెక్కడ నుంచి తేవాలో తెలియక అవస్త పడుతున్నారు." అని అంది.

"దానికెందుకు ఇదంతా చెప్తావు. పెళ్ళి ఎలాగూ చెయ్యాలి. దానినైనా ఈ గొడవలు లేకుండా సంతోషంగా ఉండని." అని అన్నారు నాన్న ఎటో ఆలోచిస్తూ.

నాలో ఒక్కసారి ఉత్సాహం అలలా పొంగి దబ్బున పడి కనిపించకుండా పోయింది. ప్రేమంటే స్వర్గం అనిపించింది. మరి పెళ్ళంటే నరకమా? ఏమో అవునో కాదో కానీ పెళ్ళి అయ్యేవరకు నేను, ఇంట్లో వాళ్ళు అనుభవించినది అంత కన్నా ఎక్కువే అని చెప్పాలి. ఎందుకో నాకు ప్రేమలో నమ్మకం ధైర్యం తగ్గుతూ వచ్చాయి. అప్పటి వరకు ఊహల్లో తేలిన నన్ను ఎవరో ఈడ్చుకొచ్చి నేల మీద పడేసినట్టు అనిపించింది. రఘు చెప్పినా వినిపించుకొనేలా లేడు. అయినా రఘుకు మాత్రం ఏమర్ధమవుతుంది. అమ్మాయిగా తనకే ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయి. ఒక అమ్మాయిగా పుట్టాలి అప్పుడేగా నా క్షోభ అర్ధమయ్యేది.

"నన్ను మా నాన్నగారు కొడుకులా కాకుండా స్నేహితుడిలా పెంచారు" అనేవాడు రఘు. మరి స్నేహితుల్లో అవగాహన లోపించిందా? లేక ఈ విషయాలన్నీ తనకు తెలియకుండా జరుగుతున్నాయా? పెళ్ళిలో తనకు బాధ్యత ఉంది కదా? ప్రేమించేవరకు తన ఇష్టం, మరి పెళ్ళి అంతా తల్లితండ్రులకే అప్పగించేసాడా? ఎలా చెప్పుకుంటుంది తను మాత్రం సిగ్గు విడిచి? తను ఆ మాత్రం అర్ధం చేసుకోలేడా? అయినా మేము ఇద్దరం ఎప్పుడూ జీవితం గురించి మాట్లాడుకున్నదే లేదు. ఎప్పుడు సరదా కబుర్లే గానీ తను రఘుని అర్ధం చేసుకున్నది ఎంత? కానీ ఇదంతా రఘుని ప్రేమించడానికి ముందు ఆలోచించాల్సింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పుడు మౌనంగా అంతా చూస్తూ పోవడం తప్ప ఇంక ఏమీ చెయ్యలేకపోయింది
This entry was posted on Saturday, April 18, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 comments:

On September 25, 2009 at 1:30 AM , గువ్వ said...

Hi siri,
meeu ee katha lo raasina vishayaalanni inchuminchu gaa naa jeevitam lo jarigaayi upto pelli varakooo


aa tarvaatavi koodaaa alaane jarigelaa unnayi

naaku ee story chaduvutunte edupochhesindi chaalaaa

for your information
maa idddariperlu koodaa
Sandhya
Raghu nee

and maadi Love and arrranged marriage ye :(:(:(:(

 
On September 28, 2009 at 1:49 PM , Siri said...

గువ్వ గారు ,

ఎన్ని తరాలు మారినా మారని కధలు కొన్ని ...ఇలాంటి అనుభవాలు అందరికీ ఎంతొ కొంత ఉండక తప్పదు ...పద్దతులు పట్టింపుల కోసం కాక మనసుల సంతోషం కోసం పెళ్ళి సరదాలు మారితే అందరికీ ఆనందం అందరిలొ ఆప్యాయత కలుగుతాయి .....అప్పుడు పెళ్ళి రోజు ఒక తియ్యని గుర్తుగా మిగులుతుంది ....thanks for visiting my blog .