Author: Unknown
•Thursday, August 13, 2009
మగధీర -

మగధీర నేను కూడా చూశాను ఈ వారం. అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ తరవాత ఇదే తెలుగు సినిమా మా ఊళ్ళో స్క్రీనింగ్ చెయ్యటం. ఈ సారి ఎప్పుడూ వేసే ధియేటర్ లో కాకుండా వేరే చోట వేసారు. ధియేటర్ చూడటానికి బానే ఉన్నా, మాకు వచ్చిన మగధీర ప్రింట్ మరీ నాసిరకం గా ఉంది. ఆడియో & విజువల్ క్వాలిటీ రెండూ బాలేవు. అసలు ఇలాంటి సినిమాకి కావాల్సినవే ఇవి. అవి సరిగా లేక కొతవరకు డిజప్పాయింట్ అయ్యాను.

చత్రపతి లోని షర్క్ విజువల్ ఎఫెక్ట్ కి ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి అసలు పోలికే లేదు. చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు. అందరూ చెప్పినట్లు సెకండ్ హాఫ్ లోని 40 నిముషాల ఎపిక్ ఎపిసోడ్ అద్బుతం గా చిత్రించారు. ఈ సినిమాకి ప్రాణం ఈ 40 నిముషాలే !

కధ విఠలాచార్య జానపద సినిమాల్లా అనిపించినా, దాని ప్రెజెంటేషన్ ముఖ్యం. ఇదే కధ వేరే డైరెక్టర్ చేతుల్లోకి వెళ్తే ఇలా కచ్చితం గా తీసేవారు కాదు. రాజమౌళి సినిమా కధలన్నీ సింపుల్ గా, సిల్లీగా ఉన్నా, వాటిని ఆసక్తికరం గా మంచి ఎమోషన్స్ తో, ఎంటర్టైన్మెంట్ తో తీర్చిదిద్దగలడు. అలాగే నటీనటులను తనకు అనుగుణం గా మలచుకుంటాడు. నిజం గా జక్కన్నే ఈ రాజమౌళి. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ని తారాస్థాయికి తీసుకువెళ్తాడు. నేను మొదటిసారి సిమ్హాద్రి చూస్తున్నప్పుడు దానిలోని కేరళ ఎపిసోడ్ లో విలన్ వెంటపడి తరిమి కొట్టే సన్నివేశం చాలా చాలా నచ్చింది. ఆ తరువాత చత్రపతి లోని ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్ కూడా అలాంటిదే. ఇందులో కూడా అలాంటి సన్నివేశమే ఆ 40 నిముషాల్లో అనిపించాయి. కానీ, ఆ ఎపిక్ ఎపిసోడ్ మీద, హాలీవుడ్ సినిమాలు గ్లాడియేటర్, 300 సినిమాల ప్రభావం చాలా అనిపించింది. అయినప్పటికీ చూడ చక్కగా ఉంది.

ఈ సినిమాకి ఆయివు పట్టు రాం చరణ్ తేజ స్టంట్స్, బాడీ లాంగ్వేజ్, డాన్సులు, హార్స్ రైడింగ్. కానీ కాలభైరవ పాత్రలో పదాల ఉచ్చారణ బాలేదు, ఇలాంటి జానపద పాత్రలకి ఉచ్చారణ చాల ముఖ్యం! హర్ష, కాలభైరవ రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. కాలభైరవ పాత్రలో అయితే మరీనూ, గాలికి ఎగిరే ఆ పొడవాటి జుట్టు, కోర మీసం, గడ్డం, ఆ డ్రెస్సులు భలే కుదిరాయి. కాజల్ కూడా యువరాణిగా అందం గా ఉంది. శ్రీహరి పాత్ర గుడ్లు మిటకరించటం, అరుపులకే పరిమితం అయినట్లుంది. షేర్ ఖాన్ పాత్రతో కూడా కాలభైరవ తలపడి ఉంటే ఇంకా బాగుండేది. విలన్ గా వేసిన అతను పర్లేదు. రాజమౌళి తన సినిమాల్లో విలన్ పాత్రని బలం గా మల్చుతాడు, అప్పుడే హీరో పాత్ర బాగా ఎలివేట్ అవుతుందని నమ్మకం ! అది నిజం కూడా !

సినిమాలో చక్కటి సన్నివేశాలెన్ని ఉన్నాయో, అవసరం లేనివి, సిల్లీగా అనిపించేవి కూడా అలాగే ఉన్నాయి. పాటల ప్లేస్మెంట్ బాగుంది. పాటలు బాగున్నాయి చూడటానికి కూడా. ముఖ్యం గా బంగారు కోడి పెట్ట పాటలో అదరగొట్టేసాడు రాం చరణ్ ! ఒంటి కాలితో కట్ చెప్పకుండా ఎక్కువ సేపు చేసిన డాన్స్ అద్భుతం !

మొత్తం మీద ఈ సినిమా అధ్బుతమైన సినిమా అనిపించనప్పటికీ, ఒక గుడ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలా అనిపిస్తుంది. లాజిక్కులకి పోకుండా రెండున్నర గంటలసేపు సరదాగా చూడతగ్గ సినిమా !