Author: Siri
•Monday, August 30, 2010
***        ***        ***        ***

         ఒక రోజు మధ్యాహ్నం ఇల్లు సర్దుతుండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయ్యి కావ్య తలుపు తీసింది. ఎదురుగా సన్నగా పొడుగ్గా ఒక యువకుడు నిల్చుని ఉన్నాడు. 

         "మాస్టారు రమ్మని చెప్పారు అండీ" అన్నాడు. 

         "ఒక్క నిముషం ఉండండి" అని లోపలకు వెళ్ళి తల్లిని పిలవడానికి వెళ్ళింది. 

         "ఇంట్లో ఫాన్ పాడయ్యింది. బాగు చెయ్యడానికి ఎవరినో పంపిస్తాను అన్నారు నాన్నగారు. అతనే అయ్యుంటాడు. గదిలో ఫాన్ చూపించు" అంది అమ్మ. 

         "రండి మీరు బాగు చెయ్యాల్సిన ఫాన్ చూపిస్తాను" అని కావ్య అనేసరికి కంగారు పడిపోయాడు. 

         "అది కాదండి... మాస్టారు గారు అసలు" అని ఏదో చెప్పబోయాడు. తిరిగి చూసేసరికి కావ్య వెళ్ళిపోయింది. 

         తండ్రి రావడంతో బయటకు వచ్చింది కావ్య. తండ్రి ఆ వచ్చినతనితో చాలా సన్నిహితంగా మెలగడం నవ్వడం చూసి ఆశ్చర్యంగా చూసింది.  "ఏమ్మా కావ్య ఇతను ఎవరు అనుకున్నావు? నా స్నేహితుడు రాజారాం కొడుకు కిరణ్. ఊద్యోగ రీత్యా ఇక్కడకు వచ్చాడు. నేనే ఒక మంచి ఇల్లు చూసి పెడతాను అన్నాను. నువ్వూ అమ్మా కలిసి హడలు కొట్టేసారు కదమ్మా" అని నవ్వేసారు.

         అది విన్న కావ్య చిన్నగా నెత్తి మీద కొట్టుకుని "ఇప్పుడే కాఫి తెస్తాను" అని లోపలకు పరుగెత్తుకెళ్ళింది.

         "అయ్యో నువ్వైనా చెప్పచ్చు కదా బాబు. ఏమి అనుకోకు" అని వచ్చింది కావ్య తల్లి.

         "అదేం లేదండి పర్వాలేదు. పనిలో పని నాకు తెలిసినంతలో ఆ ఫాన్ బాగు చేస్తాను" అన్నాడు నవ్వుతూ కిరణ్.

         "భలేవాడివేనయ్యా"అని భుజం మీద తట్టి, "ఈ పూటకు ఇక్కడే ఉంటాడు వంట చెయ్యి. రేపు ఇల్లు చూపించి దింపి వస్తాను" అన్నారు కావ్య తండ్రి.

         కిరణ్ చూపులు కావ్య వైపు వెళ్ళాయి. కావ్య తప్పుగా అనుకున్నందుకు సిగ్గుతో తల దించుకొంది. కానీ కిరణ్ చూపులు మాత్రం కావ్యను వదిలి పెట్టలేదు.

         "మీ నాన్న ఎప్పుడు వస్తాడు? ఎన్ని రోజులయ్యిందో? పోనిలే నాకు ఒక మంచి కాలక్షేపం" అని కావ్య తండ్రి అన్న మాటలకు ఉలిక్కి పడి వెంటనే చూపులు మరల్చుకున్నాడు.

         "రిటైర్మెంట్ సంబంధించి అన్ని విషయాలు చూసుకొని ఇంకో వారంలో వస్తారు " అన్నాడు కావ్య కోసం వెతుకుతూ.

         రాజారాం, కావ్య తండ్రి చిన్ననాటి స్నేహితులు. చాలా రోజులు ఇద్దరు కలిసి పనిచేసారు కూడా. ఆ తరువాత వేరే ఉద్యోగాలలో చేరి దూరమయ్యారు. కిరణ్ చిన్నతనంలోనే అతని తల్లి పోయింది. అప్పటి నుండి తండ్రీ కొడుకులే ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. కిరణ్ మొదటి సారిగా ఉద్యోగంలో చేరడానికి వచ్చాడు. స్నేహితులు ఇద్దరు ఈ విధంగా మళ్ళీ కలుసుకోబోతున్నారు అని కావ్య తండ్రి ఆనందానికి అవధుల్లేవు. రాజారాంకి కొడుకు పుట్టినప్పుడు కూడా తనకి కూతురు పుడితే రాజారాంకే కొడలిని చేస్తాను అని చమత్కారం కూడా చేసుకున్నారు.

         కొద్ది రోజుల్లోనే కిరణ్ కావ్య ఇంట్లో వాళ్ళకి దగ్గరయ్యి పోయాడు. చాలా హడావుడి మనిషి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. కావ్య తండ్రి చూసిన ఇంటిలోకి కావ్య చేతి మీదుగా దీపం వెలిగించి చేరాడు. రెండు వారాల్లో తండ్రి రావడంతో రెండు ఇళ్ళళ్ళో రాకపోకలు ఎక్కువయ్యాయి. ఒక కుటుంబంలా కలిసిపోయారు. కిరణ్, రాజారాం రాక వల్ల కావ్య తండ్రిలో,ఇంట్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కిరణ్ వచ్చి అందరి ముఖాల్లో చిరునవ్వు తెప్పించాడు, ఒక్క కావ్య ముఖంలో తప్ప.

         "ఎందుకు ఎప్పుడూ మీ అమ్మాయి ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లా అలా మూతి ముడుచుకొని ఉంటుంది" అని కావ్య తల్లితో అంటూ ఉంటే కావ్య కోపంగా చూసేది.

         కొంచెం అతిగా చొరవ తీసుకోవడం, వచ్చిరాగానే సొంత ఇల్లులాగా తిన్నగా వంటింట్లోకి వెళ్ళడం, తన గురించి తెలిసినట్టు మాట్లాడం కావ్యకు బొత్తిగా నచ్చలేదు.

         కానీ కిరణ్ ఇవేమి పట్టించుకోలేదు. దేనినైనా తేలికగా తీసుకునే మనస్తత్వం అయిన వాడు కావడం వల్ల కావ్య దూరంగా ఉండాలని ప్రయత్నించినా కావ్య చుట్టూనే తిరిగాడు. అతనిలో తెలియకుండానే కావ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

         కొద్ది రోజుల్లోనే కావ్యను చూడడానికి వచ్చిన సంబంధం వాళ్ళు కబురు పంపడంతో కావ్య తండ్రి వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళారు. నెలరోజుల్లో నిశ్చితార్ధం చేయాలని నిశ్చయించారు.

         కావ్య తండ్రి తెలిసిన వాళ్ళందరికి చెప్పుకొని మురిసిపోయారు. ఈ విషయం రాజారాం,కిరణ్ కూ చెప్పాలని ఆత్రుతగా బయలుదేరారు. విషయం తెలియగానే రాజారాం సంతోషించినా కిరణ్ ముఖంలో మాత్రం నిరాశ కనిపించింది. "ఈ పెళ్ళి మీరే ముందుండి జరిపించాలి. నాకు నిన్ను మించి ఆత్మీయిలు ఎవరున్నారు? ఈ పెళ్ళి కాస్తా మంచిగా జరిగిపోతే నేను కన్ను మూసినా నాకు బాధ లేదు" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

         "ఏమిట్రా ఇది చిన్న పిల్లాడిలా? దీనికే డీలా పడితే ఎలా? ఇదిగో చూడు మేము మీ కుటుంబమే. అంతా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా బాధపడతారా?" అని దైర్యం చెప్పారు రాజారం.

         ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పడంతో కిరణ్ కావ్య తండ్రిని దింపడానికి వెళ్ళి బయటే నిలబడిపోయాడు.

         "ఎం కిరణ్ అక్కడే ఉండిపోయావు. లోపలకు రా" అని పిలిచారు కావ్య తండ్రి.


         "లేదండి మళ్ళీ ఇంకో రోజు వస్తాను" అన్నాడు కిరణ్ ఆలోచిస్తూ.

         "ఏమిటో కొత్తగా మొహమాటపడుతున్నావు. నువ్వు రాకుండా వెళ్ళిపోతే మా ఆవిడ గొడవ చేస్తుంది" అని నవ్వారు తేలికగా.

         లోపలకు వెళ్ళిన కిరణ్ ముభావంగా ఉండడం చూసి కావ్య తల్లి "ఏం బాబూ ఒంట్లో బాగోలేదా నీరసంగా ఉన్నావు?" అని అడిగింది.

         "అదేం లేదు బాగానే ఉంది" అని మాట దాటవెయ్యడానికి చూసాడు కిరణ్.

         వెళ్ళొస్తాను అని బయలుదేరిన కిరణ్ కు డాబా మెట్లు దిగుతూ కావ్య కనిపించింది. కొంచెం సేపు అలానే చూస్తూ ఉండిపోయాడు.

         "ఏమండీ కిరణ్ గారూ కాస్త తప్పుకుంటారా" అని గట్టిగా కావ్య అనడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. తను దారికి అడ్డంగా నిలిచి ఉన్నది గమనించి పక్కకు జరిగాడు.

         "మీకు ఎదో చెబుదామని అనుకున్నాను" అని ఆగిపోయాడు కిరణ్.

         "మీరు మెట్లు దిగి మీ ఇంటికి వెళ్తునట్టున్నారు" అంది కావ్య నవ్వుతూ.

         "మీ తెలివికి సంతోషించాం కానీ, అది కాదు మీకు పెళ్ళిట కదా. నేను పది రోజులు ముందే వచ్చి మాస్టారు గారికి అన్నీ సహాయం చేస్తాను" అన్నాడు కిరణ్.

         "పది రోజులా ?" అంది కావ్య కళ్ళు పెద్దవి చేసి.

         "ఎం తక్కువంటారా? పోనీ నెల రోజులు ఉంటాను సరేనా? మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు" అన్నాడు కావాలని ఆటపట్టిస్తూ.

         "చాలా సంతోషం. త్వరగా ఇంటికి చేరుకోండి. లేదంటే మా సందు చివర కుక్కలు వెంట పడతాయి పది దాటితే. అప్పుడు నెల రోజులు పడక వెయ్యాలి మీరు" అంది కిందకు చూపిస్తూ.

         ముఖంలో భయం నటిస్తూ "వెళ్ళొస్తాను" అని గేట్ దాటాడు కిరణ్. కాస్త దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు. కావ్య వచ్చే నవ్వు ఆపుకుంటు కిరణ్ వైపే చూస్తోంది. కిరణ్ మనసులో ఎక్కడో చిన్న అలజడి. 
         "ఇలా పెళ్ళి కాబోయే ఆడపిల్లవైపు చూడడం తప్పురా కిరణ్ " అని తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.


***        ***        ***        ***

         నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. రాజారాం, కిరణ్ అన్నిటికి దగ్గరుండి సహాయం చేసారు. చుట్టు పక్కల వాళ్ళని కొంతమందిని పిలిచారు. అబ్బాయి తరుఫు వారితో కలిపి ఒక ఏభై మందికి భోజనాలకి ఏర్పాటు చేసారు. కట్న కానుకలు ఏమి లేవు కాబట్టి నిశ్చితార్థం, పెళ్ళి కాస్త బాగా చెయ్యాలని ఆనుకున్నారు. ఎదురు చూస్తుండగానే పెళ్ళి వారు వచ్చారు రెండు కార్లలో.


         వచ్చిన వాళ్ళని ఆహ్వానించడానికి అందరూ బయలుదేరారు. కిరణ్ చెప్పినట్టుగానే సొంత కొడుకులా అన్ని బాధ్యతలు తీసుకొని అందరిని దగ్గరుండి చూసుకున్నాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి కొడుకు కనిపించలేదు. నిశ్చితార్థానికి రాకపోడానికి కారణం ఏమిటా అని పెద్దవాళ్ళను వాకబు చేసారు కావ్య తండ్రి. అతనికి ఆరోగ్యం బాగోలేదు అని ఒకరు, అతనికి తెలిసినవాళ్ళకి ఏదో అవసరమొచ్చి వెళ్ళాడని ఒకరు చెప్పారు. నిశ్చితార్థం పెద్దవాళ్ళని దగ్గరుండి జరిపించమన్నాడు అని చెప్పారు. ఇదంతా వింటూ ఉంటే ఏదో అనుమానం కలిగింది. మనసు కీడు శంకించింది. కానీ మనసుని అదుపులో పెట్టుకోవాలని కావ్య తండ్రి అందరికి అన్నీ అందించడంలో నిమగ్నమయిపోయారు.


         ఇటు కావ్యను అలంకరించి కూర్చో పెట్టారు. ఏమీ తోచక కావ్య కిటికి లో నుండి బయటకు తొంగి చూసింది. కిరణ్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.


         "రెండు గంటల నుండి ఇలాగే ఎక్కడికి కదలనివ్వకుండా కూర్చోపెట్టారు" అని విసుక్కుంది కావ్య.


         కావ్య నానమ్మ మూతి ముడుచుకొని ఒక మూల కూర్చుంది ఈ పెళ్ళిలో తనకేమి ఇష్టం లేదు అన్నట్టు.


         "అమ్మా ఏదో జరిగినట్టు అలా కూర్చోకపోతే నలుగురు పెద్దవాళ్ళని పలకరించి మాట్లాడొచ్చు కదా? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు?" అని మందలించారు కావ్య తండ్రి.


         "బాగానే ఉందిరా. ముసలిదాన్ని కూర్చున్నా కూర్చోనివ్వవా? నీ పెత్తనం నీ కూతురు మీద చెల్లుతుందేమో కాని నా దగ్గర కాదు చూసుకో" అని బెదిరించింది నానమ్మ.


         "అయ్యో ఎలా చెప్పేది? ఏదో ఒకటి చెయ్యి. కానీ వచ్చేవాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుంటే చాలు" అని వెళ్ళిపోయారు కావ్య తండ్రి.


         "ఏమిటండి బామ్మగారు ఏమయ్యింది? మీలో అసలు సంతోషం కనిపించడం లేదు?" అని కిరణ్ వచ్చాడు.


         నానమ్మ ఏదో చెప్పబోయేలోపు కావ్య ఆవిడ మూతిని తన చేతితో మూసి లోపలకు లాక్కెళ్ళింది. కిరణ్ కూడా ఆవిడ వెనకాలే వెళ్ళాడు.

         "అయ్యో నానమ్మ అక్కడ అందరూ తిరుగుతుంటే నీ సోది మొదలుపెట్టావు?" విసుక్కున్నట్టుగా అంది కావ్య.

         "సరిపోయిందే తండ్రీ కూతుళ్ళ వరస. ఒక చోట కూర్చో నివ్వరు, ఒక మాట మాట్లాడనివ్వరు" అంది నాన్నమ్మ కోపంగా.

         కిరణ్ ఇదంతా విచిత్రంగా చూస్తూ నిల్చొన్నాడు. "ఏమిటి బామ్మగారు ?నాకు చెప్పండి మీ బాధ" అన్నాడు ఆవిడ దగ్గరగా కూర్చొని.

         "ఏం చెప్పను బాబు? నాకు నీలాగే ఒక మనవడు ఉన్నాడు. ఎంతో బుద్దిమంతుడు. అతనికి కావ్యను ఇచ్చి చెయ్యాలి అని నా ఆశ. కాని నా కొడుకు, అల్లుడు కలిసి జరగనివ్వలేదు" అని చెప్తుంటే కావ్య కోపంగా చూసింది ఇప్పుడిదంతా అవసరమా అని.

         "సరేలే నాకెందుకు రేపో మాపో పోయేదాన్ని? కావ్య సంతోషంగా ఉండాలి అని అనుకున్నా అంతే" అంది మొహం తిప్పుకొని.

         "ఓహో మీకు ఇంకో కథానాయకుడు కూడా ఉన్నాడు అన్నమాట చెప్పనే లేదు" అన్నాడు కావ్య వంక చూసి.

         "అదేం లేదు" అని ఏదో చెప్పబోయింది.

         బయట ఏదో గొడవ వినిపించడంతో ఏమిటా అని కంగారు పడ్డారు. "నేను చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి బయటకు వెళ్ళాడు కిరణ్.

         ఎంత సేపటికీ కిరణ్ రాకపోవడంతో కంగారు పడుతోంది కావ్య.

         కొంత సేపటికి కిరణ్ లోపలకు వచ్చాడు.

         "కావ్యా నువ్వు కంగారు పడకు ఏది జరిగినా అంతా మన మంచికే" అన్నాడు.

         
  "ఏం చెప్తున్నారు మీరు? నాకేమి అర్థం కావడం లేదు. ఏమయ్యింది కిరణ్ గారూ" అంది కావ్య బయటకు వెళ్ళబోతూ. 


  "నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడే పోలీసులు వచ్చారు పెళ్ళి కొడుకు తరుఫు పెద్దవాళ్ళను అరెస్ట్ చెయ్యడానికి. పెళ్ళి కొడుకుకి ఇంతకు ముందే పెళ్ళి అయ్యిందిట. పిల్లలు కలగలేదని భార్యకు తెలియకుండా ఈ పెళ్ళికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు ఆవిడకు తెలిసి అందరి మీదా కేస్ పెట్టింది. మాస్టారు, మా నాన్నగారు కూడా స్టేషన్ దాకా వెళ్ళారు" అన్నాడు బాధగా. 


 కావ్యకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అయోమయంగా ఉండిపోయింది.

         "బామ్మగారు కాస్త కావ్యను చూసుకోండి. నేను వెళ్ళి చూసి వస్తాను" అని వెళ్ళిపోయాడు కిరణ్.

         "కావ్యా" అంటూ కావ్య తల్లి కంగారుగా లోపలకు వచ్చింది.

         మతి భ్రమించినట్లు కూర్చుంది కావ్య.

         "నేను అప్పుడే చెప్పాను మనిషి అదో రకంగా ఉన్నాడు అని. కనీసం పెళ్ళికి ముందు తెలిసింది లేదంటే దాని గోంతు కోసేవారు" అని కావ్య నానమ్మ ఏదో చెప్తున్నా కావ్య వినే స్థితిలో లేదు.

         ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఉన్నాయి. అంత మందికి చేసిన భోజనాలు కాకులకు విందు అయ్యింది. చుట్టు పక్కల వాళ్ళందరు ఏం జరిగిందా అని తొంగి తొంగి చూడడం ప్రారంభించారు. ఒకరిద్దరు ఇంటిలోకి వచ్చి వాకబు చేసుకెళ్ళారు. అందరికి సమాధానం చెప్పుకోలేక కావ్య తల్లి నానా అవస్థ పడింది.

         తిండి తిప్పలు లేకుండా అందరూ వెళ్ళిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రెండు మూడు గంటలకు ఆటో శబ్ధం విని ఆత్రుతగా బయటకు వచ్చారు. అలసిపోయిన ముఖాలతో కిరణ్, రాజారాం, కావ్య తండ్రిని తీసుకొచ్చారు. అందరి ముఖాలలో ఆందోళన, బాధ తాండవించింది.

         కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని కిరణ్, రాజారాం ఎక్కడి సామాన్లు అక్కడికి పంపించి అంతా సవ్యంగా సర్దించేసారు. ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు. కావ్య ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కిరణ్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కావ్య తండ్రి అవమానం తట్టుకోలేక క్రుంగిపోయారు.

         "ఎందుకిలా జరిగింది? కావ్యకే ఎందుకు ఇలా జరగాలి?" అని పదే పదే ప్రశ్నించుకున్నారు.

         చివరకు రాజారాం పెదవి విప్పడంతో అప్పటివరకు ఉన్న వాతావరణం మారింది.

         "ఏమిటిది ఎవరో పోయినట్టు ఇలా కూర్చోవడం? ఏది జరిగినా మంచికే జరిగింది. కావ్యకు అదృష్టం ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం తప్పింది" అన్నారు భుజం మీద చెయ్యి వేసి.

         "అది కాదురా ఇంత మందిలో మా పరువు పోయింది. మంచివాళ్ళు అని నమ్మి ఎంత మోసపోయాము. ఎవరికి ముఖం చూపించుకోలేని స్థితిలో వదిలేసారు" అని కావ్య తండ్రి తల పట్టుకొని కూర్చున్నారు.

         "నువ్వేం తప్పు చేసావు అని తల వంచుకోడానికి? వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యం ఇవ్వబట్టే నీకు ఈ బాధ. అదొక పీడ కలలా మర్చిపో. కావ్యకు అంతా శుభం జరుగుతుంది" అని చెప్పినా ఎవ్వరు వినే స్థితిలో లేరు.  కావ్య తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వారి వారి ఆలోచనలలో మునిగిపోయారు. నడి రాత్రి ఎవరో బాధగా మూలుగుతున్న శబ్ధం విని అందరూ లేచారు. కావ్య తండ్రి గుండె పట్టుకొని బాధతో మెలికలు తిరగడంతో అప్పటికప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆయనకి ఏవేవో పరీక్షలు చేసాక మళ్ళీ గుండెపోటు రావడంతో ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. అప్పటివరకు భ్రమించినట్లు ఉన్న కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదే కళ్ళ ముందు జరుగుతుంటే తట్టుకోలేకపోయింది. ఎవరినీ ఎవరూ ఓదార్చలేని పరిస్థితిలో కావ్యకు ధైర్యం కోల్పోడానికి ఇది సమయం కాదు అని అనిపించింది.

         వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి ఆపరేషన్ చెయ్యడానికి ఆమోదం చెప్పి వచ్చింది. మరునాడు ప్రొద్దున్న ఆపరేషన్ చేసి రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచాలి అని సగం డబ్బు కట్టమని బిల్లు అందించారు. కావ్య చేతిలో నుండి బిల్లుని కిరణ్ తీసుకొన్నాడు.

         "నేను కట్టి వస్తాను" అని వెళ్ళబోయాడు.

         "కిరణ్ గారూ ఒక్క నిముషం. ఆ బిల్లుని నేనే కడతాను. ఇప్పటికే మిమ్మలిని చాలా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు బిల్లు కూడా మీ చేత కట్టిస్తే నాన్నగారికి బాధ కలుగుతుంది. ఆయనకు నచ్చని విషయం నేను ఎప్పుడూ చెయ్యలేదు. బ్యాంక్ లో ఎంతో కొంత డబ్బు ఉంచారు. ఇప్పుడే అమ్మా నేను వెళ్ళి తీసుకు వస్తాము" అని సూటిగా కిరణ్ కళ్ళల్లోకి చూసింది తన నిర్ణయం మారదు అన్నట్టు.

         "పరాయి వాళ్ళను చేస్తున్నారు మమ్మలని. ఇప్పుడు నాకీ డబ్బు అవసరం లేదు. మంచి పనికి అవసరపడితే నాకూ సంతోషం" అన్నాడు కిరణ్.

         "మిమ్మలిని ఆత్మీయులుగా భావించాను కాబట్టే నిర్మొహమాటంగా చెప్పగలిగాను. నాకు నిజంగా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ముందుగా మీ దగ్గరకే వస్తాను, సరేనా?" అనేసి వెళ్ళిపోయింది కావ్య.

         కిరణ్ ఆరాధనగా కావ్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు.***        ***        ***        ***

         కావ్య తల్లిని తీసుకుని ఆటోలో డబ్బు కోసం బయలుదేరింది.

         "కావ్యా ఇది నాన్న నీ పెళ్ళి కోసం దాచిపెట్టిన డబ్బు. దానినెందుకు తియ్యడం? నా బంగారం అమ్మేసి..." అని ఎదో చెప్పబోయి కావ్య తల్లి కన్నీళ్ళను ఆపలేక ఆగిపోయింది.

         "అమ్మా?" అని ఆవిడ చుట్టూ చేతులు వేసింది కావ్య.

         "నాన్నకి ఇలా ఉన్నా నా పెళ్ళి కోసమే ఆరాటపడుతున్నావు. నా పెళ్ళి కోసం ఎందుకంత ఆరాటం? మీ ఇద్దరి కన్నా నా పెళ్ళి ముఖ్యం కాదు. ఎప్పుడూ మీతోనే ఉండిపోయినా నాకు సంతోషమే. ఏదొక ఉద్యోగం చేసైనా మిమ్మలిని చూసుకోగలను" అంది కావ్య ఆవిడ కళ్ళు తుడుస్తూ. (ఇంకా ఉంది )
Author: Siri
•Saturday, August 21, 2010
 కావ్య చేతిలోంచి పువ్వులన్నీ కింద పడ్డాయి. పరుగున తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పేసరికి భయంతో బిగుసుకు పోయింది తల్లి. అందరు కలిసి హడావుడిగా శ్రీను వెంట బయలుదేరారు. హాస్పిటల్ వెళ్ళేసరికి నీరసంగా పడుకొన్న తండ్రిని చూసి బావురుమంది కావ్య. 

         "ఏమయ్యింది నాన్నా?" అంటూ తండ్రి భుజం చుట్టూ చేతులు వేసింది కావ్య. 

         "ఎం లేదు కాస్త కళ్ళు తిరిగాయి అంతే" అన్నారు ఆయన నీరసంగా. 

         "కాస్త మైల్డ్ గా గుండెపోటు వచ్చింది. ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి" అని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. 

         ఆ తరువాత జరిగినది అంతా కావ్య జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. తండ్రికి గుండెపోటు అని తెలిసిన దగ్గర నుంచి అందరి మనసుల్లో ఆయనకు ఏదైనా అయితే ఎలా అన్న విషయం పదే పదే తొలచి వేసింది. అదే బాధ కావ్య తండ్రిని స్దిమితంగా ఉండనివ్వలేదు. మానసికమైన ఆవేదనని, ఎవరికి చెప్పుకోలేని బరువుని మోస్తూ చివరకు కావ్యకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు. 

         కావ్య తండ్రి ఉన్న స్థితిని చూసి మరు మాట చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తల్లి తండ్రి తన గురించి పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకోడానికి ఎంతో సేపు పట్టలేదు కావ్యకు. చిన్నదైన రెండు గదుల ఇంటిలోని మాటలను గోడలు రహస్యంగా దాచలేకపోయాయి. తండ్రి ఒకరోజు తల్లితో అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. 

         "పద్మా నీకు జీవితంలో బాధలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు. నాతో పాటు ఈ జీవితం నిన్నూ రంగులరాట్నంలా తిప్పింది. నాకంటూ ఒక ఆనందం కేవలం నువ్వు ఇచ్చిన నా కావ్య మాత్రమే. ఇదిగో చూడు చీటీలు కట్టిన డబ్బుతో కావ్య పెళ్ళి ఒక మంచి చోట చేసేద్దాం. ఈ ఇల్లు మిగిలిన కాస్త డబ్బు నీ పేరున రాసాను. నాకేదైనా అయితే అమ్మను నువ్వే చూసుకోవాలి. అన్నీ ఈ పుస్తకంలో నీకోసం రాసి ఉంచాను. నీకసలు లోకం తెలియదు. ఎలాగో ఏమిటో?" అని అంటున్న తండ్రి మాటలు తూటాల్లా గుచ్చుకున్నాయి కావ్యకు. 

         ఆయన తాపత్రయం రోజురోజుకి పెరిగిపోయింది. కనిపించిన వాళ్ళందరికి కావ్యకు మంచి సంబంధం చూడమని చెప్పడం ప్రారంభించారు. కావ్యని కాలేజ్ కి వెళ్ళ వద్దని వారించారు. "చదువుకోవాలని ఉంటే పెళ్ళి అయ్యాక చదువుకుందువు తల్లి" అని ముద్దుగానే మందలించారు. ఇక కావ్య తండ్రిని స్కూలుకి తీసుకెళ్ళడం, ఆయనకు వేళకు భోజనం పట్టుకెళ్ళడం, ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పడం తన బాధ్యతగా తీసుకుంది. 


 "నాకు ఇద్దరు తల్లులు. ఇంక నాకేంటి" అని అందరితో గొప్పగా చెప్పుకొని పొంగిపోయారు కావ్యని చూసి.

         ఆయనకు కాస్త ఓపిక రాగానే వరసగా సంబంధాలు చూడడం ప్రారంభించారు. తన పరిస్థితి ఎలా ఉండనీ కావ్యకు గొప్పింటి సంబంధం తేవాలని ఆయన కోరిక.

         దాని కోసం తన తాహుతాకు మించిన సంబంధాల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ కొద్ది రోజుల్లోనే తెలిసి పోయింది అది అంత సులభమైన పని కాదు అని.

         కొంతమంది కట్నం వద్దూ అంటూనే లాంచనాలు చిట్టా చదివారు. ఇంకొంత మంది మాకేమి అక్కర్లేదు మీ అమ్మాయి పేరున మాత్రం ఇంత డబ్బు బ్యాంక్ లో వెయ్యండి అన్నారు. కావ్య తండ్రికి మాత్రం తన కూతురు బంగారు బొమ్మ, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది అనే నమ్మకం. ఎక్కడో అక్కడ మంచి మనుషులు ఉండకపోతారా అని ఆయన ఆలోచన. పెళ్ళి సంబంధాలు చూసే మూర్తిగారి దగ్గరకు వెళ్ళారు. ఆయన కావ్య ను తేరి పారి చూసి మరీ నిరాడంబరంగా ఉంది అని కాస్త ఈ రోజు పిల్లలాగా బట్టలు వేసుకొని ఫోటో తీయించమని సలహా ఇచ్చారు.

         "అయ్యా ఈ రోజుల్లో అబ్బాయిలకు ఆలోచనలలో పాత కాలపు అమ్మయిలా ఉన్నా పర్వాలేదు. కానీ చూడడానికి మాత్రం రెండడుగులు ముందే ఉండాలి. అలా చేసి చూడండీ" అని ఓ చిన్న సలహా పారేసారు. ఆయన చెప్పినదేమిటో అర్ధం కాలేదు కావ్య తండ్రికి.

         "పెళ్ళి కావాలంటే ఇదంతా చెయ్యాలా? నా కూతురుకు ఏం తక్కువ?" అని అడిగారు.

         "తక్కువని కాదు. ఇప్పుడు పోకడ వేరేగా ఉందండి. మరి గొప్ప సంబంధాలు కావాలి అంటే తిప్పలు పడక తప్పవు. మొన్ననే ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. పదిహేను రోజుల్లో వచ్చి వెళ్ళిపోవాలి అన్నాడు. మరి రాగానే ఒకే రోజులో ఒక అరడజను పిల్లలను చూసాడు. వాళ్ళల్లో ఒక పిల్లను చేసుకొని వెళ్ళిపోయాడు. మరి అంత మందిలో మనం ప్రత్యేకంగా కనపడితేనే కదా వాళ్ళు మన దాకా వచ్చేది" అని గుక్క తిప్పకుండా చెప్పేసారు మూర్తిగారు.

         "చూడు, నీకు ఏదైనా మంచి సంబంధం తెలిస్తే చెప్పు. లేదంటే లేదు. ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు. నా కూతురుని టీవీ లాగా, వాషింగ్ మెషిన్ లాగా అమ్ముకోవాలని అనుకోవడం లేదయ్య. ఒక మంచి కుటుంబం ఉంటే చూడు" అని అన్నారు కావ్య తండ్రి.   "ఉన్నది చెప్పాను తరువాత మీ ఇష్టం. ఏదైనా ఉంటే కబురు పంపుతాను" అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన.

***        ***        ***        ***

         ఇంటికి రావడంతోనే దిగాలుగా కుర్చీలో కూర్చున్న తండ్రిని చూసింది కావ్య.

         "ఎందుకింత తాపత్రయం తండ్రికి? తాను కూతురినై పుట్టడం వల్లే కదా?" అని అనుకుంది కావ్య మనసులో. చల్లని మజ్జిగ తీసుకెళ్ళి ఇచ్చింది. ఆయన కావ్య వంక ప్రేమగా చూసారు. లోపల నుంచి నానమ్మ వచ్చింది. ఏదో చెప్పాలి అన్నట్టు చిన్నగా దగ్గింది.

         "కావ్యా దండెం మీద వేసిన బట్టలు మడత పెట్టి తీసుకురా" అని పురమాయించింది నానమ్మ.

         కావ్య వెళ్ళగానే కొడుకు పక్కగా చేరి మొదలు పెట్టింది. "చూడరా నీ మొండి పట్టుదల నాకేమి నచ్చలేదు. పిల్లాడిని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. మన వెంకట్ ఉండగా కావ్యకు, నువ్వు వేరే పెళ్ళికొడుకుని చూడడం నాకు నచ్చలేదు" అంది రోషంగా.

         "అమ్మా! మళ్ళీ మొదలు పెట్టావా? అది జరిగే పని కాదు అని చెప్పానుగా" అన్నారు కావ్య తండ్రి.

         "అది కాదురా వాడికేం తక్కువ? ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఇంక మీ బావ సంగతి అంటావా, అందరు కలిసి నచ్చ చెప్పితే ఆయనే వింటాడు" అంది నానమ్మ.

         "అది కాదమ్మ వెంకట్ మంచి వాడు కాదు అని నేను అన్నానా? నాకు వాడంటే అభిమానమే. కానీ పెళ్ళి అయితే వాడొక్కడితోనే కలిసి ఉంటే పర్వాలేదు. ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ముందే అది పెరిగిన పరిస్థితులని అవమాన పరిచిన వాళ్ళు పెళ్ళి తరువాత ఏం గౌరవం ఇవ్వగలరు? నా చెల్లెలు ఎలాగు ఆ మనుషుల మధ్య బ్రతక నేర్చుకుంది. నా కూతురుని కూడా అలాంటి మూర్ఖపు మనుషుల్లోకి పంపలేను. వాళ్ళకి తెలిసేలా రాజాలాంటి సంబంధం తెస్తాను. నువ్వు కావ్య మనసు పాడు చెయ్యకు అనవసరమైనవి అన్నీ చెప్పి" అని వెళ్ళిపోయాడు ఆయన విసురుగా.

         కొడుకు మొండితనంగా అలా చెప్పి వెళ్ళిపోవడం చూసి నిట్టూర్చింది నానమ్మ. తన మనవడిని మనవరాలిని కలిసి చూడాలి అని ఆవిడకున్న చివరి కోరిక. కాని కొడుకు, అల్లుడు మొండితనం,పట్టుదల ముందు ఆవిడ పెద్దరికం గెలవలేకపోయింది. ఆమె జీవితంలో ముందు తండ్రి, తరువాత భర్త, ఇపుడు కొడుకు. ముగ్గురూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చూపించుకున్నారు. ఒకప్పుడు తాను చేసుకుంటే పద్మావతినే చేసుకుంటాను అని మొండిగా పట్టుపట్టిన కొడుకు ఇప్పుడు తన కూతురు విషయంలో ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడో ఆవిడకు అర్ధం కావటంలేదు. చివరకు ఒక సంబంధం రానే వచ్చింది. బాగా సంపన్నుల కుటుంబం. పెళ్ళి కొడుకు అబుదబిలో పనిచేస్తున్నాడు. అన్ని విధాలా బాగుంది అని నిర్ణయించుకున్నాకే కావ్య తండ్రి వాళ్ళను ఇంటికి రమ్మని కబురు పంపారు. ఆయన ఆశించినట్టే వాళ్ళు ఎలాంటి కట్నం ఎదురుచూడలేదు. చాలా మర్యాద తెలిసిన మనుషులు అని తెగ పొంగిపోయారు కావ్య తల్లి తండ్రులు. వచ్చిన వాళ్ళకు కావ్య చూడగానే నచ్చింది.

         "మా అందరికి మీ అమ్మాయి బాగా నచ్చింది. అమ్మాయికి కూడా నచ్చాలి కదా. మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని మాకు కబురు పంపండి. మిగతా అంతా మేము చూసుకుంటాము" అని చెప్పి వెళ్ళిపోయారు.

         "అబ్బాయి బాగానే ఉన్నాడు. అసలు ఇంటికి వెళ్ళి కబురు పంపుతాము అనవలసింది వాళ్ళు. కాని మనకు ప్రాముఖ్యం ఇచ్చి మన అమ్మాయి మనసు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు అయ్యి ఉంటారు" అని సంతోష పడ్డారు కావ్య తల్లి తండ్రులు.

         "ఏం బాగున్నాడు. మలేరియా వచ్చిన మనిషిలాగా. నీ చెల్లెలు సింగపూర్లో ఉంది కదా. అది వచ్చాక ఒక మాట చెప్పి ఇదంతా చేస్తే బాగుంటుంది కదా" అని సణుక్కుంది ముసలావిడ.

         "వాళ్ళన్నీ మనలని అడిగే చేస్తున్నారా? పెద్దవాడిని కదా అని ఒక్కసారైనా మర్యాద ఇచ్చారా? అంతా అయ్యాక శుభలేఖ ఇస్తే సరిపోతుంది" అని కావ్య వంక చూసాడు ఆయన. "అదంతా మర్చిపో. నీకు నచ్చాడా లేదా అబ్బాయి?" అని అడిగారు కావ్యకు దగ్గరగా వచ్చి ఆత్రుతగా.

         తండ్రి ముఖంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు కావ్య. చిన్నపిల్లాడిలా గంతులు వేసేలా ఉన్నారు.

         "మీకు నచ్చితే నాకు సరే నాన్నా. కానీ... " అని సణిగింది కావ్య.

         "ఏమ్మా ఏమిటి నీ సందేహం?" ఆత్రంగా అడిగారు కావ్య తండ్రి.

         "అది కాదు నాన్నా, ఎక్కడో అంత దూరం వెళ్ళి ఉండాలి అంటే నా వల్ల కాదు. మిమ్మలిని వదిలి వెళ్ళలేను. పెళ్ళే చెయ్యాలి అని అంటే ఇదే ఊరిలో చూడండి నాన్నా" అంది నేల వంక చూస్తూ.

         "పిచ్చి పిల్లా ఇంతేనా? కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. నీకే అలవాటు అయిపోతుంది. హాయిగా మహారాణిలా ఉండచ్చు. మీ అమ్మ నాతో పడ్డ బాధలు నీకు రాకూడదు" అని అన్నారు నవ్వేస్తూ.

 "నిజమేనండి నాకు ఆలోచన రాలేదు. అంత దూరం పంపించి ఉండగలమా?" అని అంది కావ్య తల్లి.

         "ఏదో నీ కూతురు ఒక్కత్తే ఈ ప్రపంచంలో అత్తవారింటికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. కొత్తల్లో అలానే ఉంటుంది. నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. అదేమి పెద్ద విషయం కాదు" అని కొట్టిపారేసారు.

         "సరే మీకు ఏది సరే అనిపిస్తే అది చెయ్యండి నాన్నా" అని కావ్య అనేసరికి ఊపిరి పీల్చుకున్నారు.

         ఆడపిల్ల పెళ్ళి అవ్వడం వేరే ఇంటికి పంపించడంలో కష్టం కన్నా అమ్మాయి సంతోషంగా ఉండాలి అని ఒకే ఆశ కోసం ఎంత ఖర్చునైనా భరించి దూరంగా పంపించడానికి వెనుకాడరు కావ్య లాంటి మధ్య తరగతి అమ్మాయిల తల్లి తండ్రులు.

         మొదటి సారిగా కావ్య "నేను నా తండ్రికి మగబిడ్డగా పుట్టి ఉంటే ఎంత బాగుండు" అని అనుకుంది. "తన సొంతం అనుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఉన్న ఒక్క స్నేహితురాలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంక బావా ,అత్తయ్య. వాళ్ళ మీద అభిమానం చూపిస్తే తండ్రిని ఎదిరించినట్టు అవుతుంది అని బలవంతంగా దూరం చేసుకుంది.ఇప్పుడు ఆ తల్లి తండ్రులను వదిలి ఇంకో కొత్త బంధం. ఎందుకు ఆడపిల్లకే ఇలాంటి సర్దుకు పోవడం, పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవడం? తను ఎప్పుడూ అందరి మగ పిల్లల్లా తన తల్లి తండ్రి దగ్గరే ఉండిపోకూడదా?" చాలా మంది ఆడపిల్లల్లో రేగే ఆలోచనే కావ్యను పట్టి పీడిస్తోంది.

         ఆలోచనలతో సతమతమవుతున్న కావ్యకు నానమ్మ రావడంతో అడ్డుకట్ట పడింది.

         "కావ్యా కాస్త స్వార్ధం కూడా ఉండాలే మనిషికి. నువ్వు ప్రతీది ఇలా ఒప్పేసుకుంటే ఎలా చెప్పు?" అంది చివరి ప్రయత్నంగా.

         "ఎవరైనా చెప్పిన మాట వినమని చెప్తారు కానీ, ఇలా పెద్దల మాట వినొద్దు అని చెప్తారా?" అంది కావ్య నానమ్మ భుజం మీద వాలి.

         "బావ గురించి ఆలోచించావా? తెలిస్తే బాధపడతాడు" అంది నానమ్మ.

         "అంత బాధపడేవాడైతే అంత దూరం వెళ్ళి కూర్చుంటాడా? ఇప్పటికి అందరిని ఒప్పించి ఉండేవాడు. అయినా పెద్దవాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఎవరికీ సంతోషం లేకుండా ఉండడం కన్నా మనసు నిండా అభిమానంతో దూరంగా ఉండడం మంచిది కద నానమ్మా?" అంది కావ్య.

"నీకు ఉన్న ఆలోచనలో ఒక వంతు అయినా వాళ్ళకు ఉంటే బాగుండేది. చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసుకొని మనసులు దూరం చేసుకోవడం తప్ప మనసులు దగ్గర చెయ్యడం తెలియని వాళ్ళు. సరే ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నేను తాపత్రయ పడి ఏం లాభం?" అని పక్కకు తిరిగి పడుకుంది నానమ్మ.

         కావ్య చిన్నగా నవ్వింది. ఎందుకో కాస్త ప్రశాంతంగా అనిపించింది. "తండ్రి అనుకునట్టు అన్నీ జరుగుతున్నాయి. ఆయన ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంక బావ తెలివైనవాడు. తన పెళ్ళి అయ్యింది అని తెలిస్తే తను పెళ్ళి చేసుకొని రాజీ పడిపోతాడు. తనకు బావ మీదున్న ప్రేమ ఎప్పటికి ఉంటుంది. దానిని కేవలం పెళ్ళితో ముడిపెట్టడం తనకు ఇష్టం లేదు" అని మనసులో అనుకుంది. మంచు తెరలు తొలగి కాంతి ప్రసరించినట్టు ఆమె ఆలోచనలు అన్నీ తొలగిపోయాయి. కొత్తగా ప్రారంభమవ్వబోయే జీవితంతో రాజీపడిపోవడానికి సిద్ధమయ్యింది. ( ఇంకా ఉంది )
Author: Unknown
•Friday, August 20, 2010
ఈ రోజు మీకు నాకు బాగా నచ్చిన ఒక ఇంగ్లీష్ సాంగ్ ని పరిచయం చేయబోతున్నాను.ఇప్పటికే ఈ పాట చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇదేమీ కొత్త పాట కాకపోయినా, నాకు నచ్చిన పాటల్లో ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది.

చాలా రోజులైంది ఇంగ్లీష్ పాటల్ని విని అని, చేతికందిన ఒక సీడీ నీ ప్లేయర్ లోకి పెట్టగానే.. గిటార్ సౌండ్ తో మృదువుగా, చెవిలో గుసగుసలాడుతున్నట్లు.. Let me be your hero అని వినిపించింది. ఇంక అక్కడినించి మొదలైన ఈ పాట, గుండెని, మనసుని తాకుతూ.. పెదవుల మీద ఆ పాట లిరిక్స్ ని హమ్ చేయిస్తూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక పక్క కాఫీ తాగుతూ, డ్రైవ్ చూస్తూ ఈ పాట వినటం ఎంతో బాగుంది.

ఈ పాట లోని గొప్పతనం ఏంటంటే, పాట పెదవుల మీద నుంచి వచ్చింది కాకుండా గుండెల్లోంచి వచ్చిందా అనిపించేలా పాడాడు Enrique Iglesias. ఈ పాట విడుదలైనప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించింది. గాయకుడికి ఎంతో ఫేం తీసుకొచ్చింది. పాట పాడుతున్నప్పుడు విపరీతమైన ప్రేమ ని, బాధ ని గుండెల్లో ఉంచుకున్నప్పుడు, గొంతు వణుకుతుందే అలా పాట పాడాడు. చాలా ఇంగ్లీష్ పాటలు వాయిద్యాల హోరులో ఒక్కసారి వినగానే అర్ధం అయ్యేలా ఉండవు. కానీ ఈ పాటలోని సాహిత్యం సింపుల్ గా ఉంటూ, స్పష్ఠం గా అర్ధం అవుతుంది.

ఈ పాట వీడియో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ. ఈ వీడియో లో గాయకుడు Enrique, చాలా సినిమాల్లో నటించిన మరో ఇద్దరు (Jenniger Love Hewitt, Mickey Rourke) ఉన్నారు.

(Whispered) Let me be your hero ...
Would you dance if I asked you to dance?
Would you run and never look back
Would you cry if you saw me crying
Would you save my soul tonight?

Would you tremble if I touched your lips?
Would you laugh oh please tell me this
Now would you die for the one you love?
Hold me in your arms tonight

I can be your hero baby
I can kiss away the pain
I will stand by you forever
You can take my breath away !

Would you swear that you'll always be mine?
Would you lie would you run away
Am I in to deep?
Have I lost my mind?
I don't care you're here tonight

I can be your hero baby
I can kiss away the pain
I will stand by you forever
You can take my breath away !

Oh I just want to hold you !
I just want to hold you .. Oh ya !

Am I in too deep?
Have I lost my mind?
Well I don't care you're here tonight

I can be your hero baby
I can kiss away the pain
I will stand by you forever
You can take my breath away !
You can take my breath away !!

I can be your hero !!!
Author: Siri
•Saturday, August 14, 2010
తల్లికి ఏవో పుస్తకాలు తెచ్చుకోవాలి అని చెప్పి పావని ఇంటికి బయలుదేరింది కావ్య. 

         "ఎక్కడకు వెళ్ళి ఉంటుంది? ఆ సుబ్బరావుతో ఎక్కడికైనా వెళ్ళిందా? ఈ మధ్య ఏమి చెప్పడం లేదు. అంతా తన నుండి కూడా దాచడం మొదలు పెట్టింది" మనసులో అనుకుంటూ కావ్య వడివడిగా పావని ఇంటి వైపు నడుస్తోంది. 

         కొన్ని రోజులు ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి కావ్యకు. సుబ్బారావు ఎప్పుడు ఎదురు పడినా కావ్య వంక అదోలా చూడడం, పావనితో పాటు కావ్యకు కానుకలు ఇవ్వడం చేస్తున్నాడు. 

         ఒక రోజు కావ్య ఒంటరిగా ఇంటికి వెళ్తుంటే స్కూటర్ మీద వచ్చి ఏదో ఇవ్వబోయాడు సుబ్బారావు. "నాకెందుకు ఇస్తున్నారు " అని ప్రశ్నించినప్పుడు, "మీరంటే నాకు ఏదో చెప్పలేని అభిమానం. అసలు మిమ్మలిని చూసే నేను పావనితో స్నేహం చేసింది" అని వికారంగా సమాధానమిచ్చాడు. కావ్యకు ఎక్కడలేని కంపరం పుట్టింది. 

         "చూడండి ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఇక నుండి పావని ఉన్నప్పుడు తప్ప నాతో కలిసేందుకు ప్రయత్నం చేయకండి" అని గట్టిగా చెప్పేసి వెనక్కి చూడకుండా వచ్చేసింది. 

         అదే విషయం పావనికి నచ్చచెప్పడానికి చూసింది, కానీ పావని వినిపించుకొనే స్దితిలో లేకపోయింది. 
ఇంకా తన మీదే "అందరు మగాళ్ళు నీ వెనకే తిరిగుతారు అని నీ ఉద్దేశ్యం కదూ? మొదటి సారి ఒక అబ్బాయి నన్ను ఇష్ట పడితే తట్టుకోలేకపోతున్నావు" అని ఎప్పుడూలేని కసి నిండిన కళ్ళతో అంది పావని. కావ్య ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది. స్నేహంలో ఇలాంటి మలుపు కూడా వస్తుంది అని ఊహించలేకపోయింది. 

         "సరే ఇంక ఈ విషయం గురించి మనం మాట్లాడద్దు. నీకు కోపం చల్లారాక ఆలోచించి నీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యి. ఇంక నేను నీకు ఎలాంటి సలహాలు ఇవ్వను" అని చెప్పి వచ్చేసింది. అంతే మళ్ళి ఎక్కువగా మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరూ. 

         పావని ఇల్లు దగ్గరకు వచ్చే కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది కావ్యకు. 

         వెళ్ళగానే పావని తల్లి "కావ్యా నా కూతురు ఎక్కడికెళ్ళిపోయింది?" అని రాగాలు తీయడం ప్రారంభించింది.


 అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు కొంత మంది చేరారు.

         "ఇపుడు సాయంత్రమేగా అయ్యింది. ఇంకాస్త సేపు చూడండి. ఇంకెవరైనా ఇంటికి వెళ్ళి ఉండచ్చు కదా?" అని అంటున్నారు ఎవరో.

         "కావ్యా దానికి నువ్వు తప్ప ఇంక ఎవరు లేరు కదా స్నేహితులు? నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళి ఉంటుందో?" అని అడుగుతోంది ఆవిడ.

         కావ్యకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. "లేదు నాకు తెలియదండి. నాకు ఏమి చెప్పలేదు. ఈ మధ్య నాతో ఎక్కువగా మాట్లాడట్లేదు" అంది భయంగా. ఎక్కడకు వెళ్ళి ఉంటుందో అని కావ్యకు అనుమానం ఉన్నా నోరు తెరిచి చెప్పలేకపోయింది.

         "ఈ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టినా ఏమి చేసినా ఇంతే. ఎవరి గురించి పట్టించుకోరు. ఒళ్ళు బలిసి తిరుగుతారు" అని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు పావని తండ్రి. ఈ రోజే కాస్త మెలుకువగా కనిపించాడు ఆయన.

         కావ్య బిక్క చచ్చిపోయింది. ఆయన తిడుతున్నది తననో లేక వెళ్ళిన పావనినో అర్ధం కాలేదు. ఇలాంటి వాతవరణమే ఆమెకు కొత్త. ఏదైనా చిన్నగా మాట్లాడుకొని మందలించడమే గానీ ఇలా శాపనార్ధాలు పెడుతూ ఊరంతా వినిపించేలా గోల చేయడం ఆమె పెరిగిన వాతావరణంలో ఎప్పుడూ లేదు, ఎప్పుడూ చూడలేదు. ఆయన మాత్రం అడ్డు ఆపు లేకుండా తిడుతూనే ఉన్నాడు. పావని చెల్లెలు మాత్రం ఇదంతా మామూలే అన్నట్టు పిచ్చిగా చూస్తోంది.

         "ఈ కాలం పిల్లలకు చదువు వస్తుందో లేదో కాని ప్రేమలు దోమలు మాత్రం మహా బాగా నేర్చుకుంటారు" అని ఇంకెవరో అంటున్నారు.

         "ఈ మధ్య ఇలాగే అవతల వీధిలో ఒక పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో చాకలాడితో వెళ్ళిపోయింది" అని చెప్తోంది ఒకావిడ.

         కావ్యకు చెమటలు పట్టేసి ఊపిరాడనంత పనయ్యింది. తట్టుకోలేక "ఏమండి నేను వెళ్తున్నాను. ఏదన్నా అవసరం అయితే పిలవండి" అని చెప్పి వెనకాల ఏదో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వచ్చేసింది.

         "దేవుడా! పావని ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడు" అని వేడుకుంది కావ్య. ఇంట్లో ఏమీ చెప్పకుండా ఏమీ జరగనట్టు ఉండిపోయింది కావ్య. మనసులో భయం ఆవహిస్తోంది. తనకే తెలియకుండా ఇంట్లోకి బయటకు తచ్చాడుతోంది.

         "ఎందుకే కాలుగాలిన పిల్లి లాగా తిరుగుతున్నావు, పోయి చదువుకోరాదు?" అని తల్లి మందలించేసరికి లోపలకు వచ్చింది.

         కావ్య పుస్తకం పట్టుకుందే గానీ ఆలోచనలు అన్నీ పావని చుట్టూనే.

         నెమ్మదిగా అందరూ నిద్రకు ఉపక్రమించారు. కావ్య కూడా ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుంది. కొంచం సేపటికి బయట ఎదో అరుపులు వినిపించాయి. కావ్య ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది.

         ఎవరో గట్టి గట్టిగా అరుస్తున్నారు. కావ్య బయటకు వెళ్ళి చూసేసరికి పావని తండ్రి పూర్తిగా తాగేసి ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. కొంచం సేపటికి అందరూ బయటకు రావడం ప్రారంబించారు. కావ్యకు చేతులు ఆడటంలేదు. భయంతో సన్నగా వణికింది. తల్లి తండ్రి కూడా బయటకు వచ్చి చూస్తున్నారు. పావని తండ్రి తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తిట్టడం ప్రారంబించారు "అర్ధరాత్రి ఏంటి గోల ?" అని. కావ్య తండ్రి సంగతి ఏంటో చూద్దామని వెళ్ళబోతుంటే కావ్య వెళ్ళవద్దని వారించింది.

         "నా కూతురు కనిపించడంలేదు. కావ్యా ?కావ్యా? నీకు తెలుసు ఎక్కడుందో చెప్పు. కావ్యా? కావ్యా?" అని పెద్దపెద్దగా అరుస్తున్నాడు పావని తండ్రి.

         చుట్టుపక్కల వాళ్ళందరూ కావ్య వంకే చూస్తున్నారు. అందరూ తన వంకే చూడడం కావ్యకు ఇబ్బందిగా ఉంది. తండ్రి వైపు చూసింది భయంగా. ఆయన కావ్య వంక "ఏమిటి ఇదంతా?" అన్నట్టు కళ్ళతో కోపంగా చూస్తున్నారు. కావ్య తడబడుతూ విషయమంతా చెప్పింది.

         కావ్య తండ్రి నెమ్మదిగా పావని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఏదో సర్ది చెప్పి పక్కింటి శ్రీనుగాడు సహాయంతో రిక్షా ఎక్కించి పంపించారు.

         "ఇంకా పావని రాలేదన్న మాట, ఎందుకిలా చేసింది ఈ పిల్ల?" అని విసుక్కుంది కావ్య మనసులోనే.

         తండ్రి విసురుగా లోపలకు వెళ్ళి "కావ్యా"అని గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చి నిల్చుంది. తల పైకెత్తి చూసేలోపు చెంపకు చెళ్ళుమని తగిలింది తండ్రి చెయ్యి. ఏమయ్యిందో అని కావ్య తల్లి,నానమ్మ పరిగెత్తుకొని వచ్చారు. కావ్య బుగ్గ మీద చేతితో అలా నిల్చొని ఉండిపోయింది. "ఏం జరుగుతోంది ఇంట్లో? అందరూ ఎం చేస్తున్నారు? ఒక్క ఆడపిల్లను చూసుకోలేరా? ఎక్కడకు వెళ్తోంది, ఏం చేస్తోంది చూసుకోవద్దా? రేపటి నుండి నాకు చెప్పకుండా ఎక్కడకు వెళ్ళడానికి లేదు" అని చెప్పేసి లోపలకు వెళ్ళిపోయారు.

         "అలా పిల్లను పట్టుకొని బాదుతారా ఎవరైనా?" అని కావ్యను దగ్గరగా తీసుకుంది నానమ్మ.

         ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తండ్రి ఈ రోజు చెయ్యి చేసుకోవడం తట్టుకోలేకపోయింది. పరిగెత్తుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకొంది కావ్య.

         "కావ్యా ...అమ్మాయ్ తలుపు తియ్యి" అని కంగారుగా అంది నానమ్మ.

         "నన్ను కొంచెం సేపు వదిలెయ్యి నానమ్మ. నాకేం కాలేదు. నువ్వెళ్ళి పడుకో" అంది కావ్య వెక్కి వెక్కి ఏడుస్తూ.

         "అది కాదు. ముందు నువ్వు తలుపు తియ్యి" అంది నానమ్మ అక్కడే కూర్చొని. కావ్య తలుపు తీసేవరకు ఊరుకోలేదు. తలుపు తీసి కావ్య వెంటనే వెళ్ళి రెండు కాళ్ళు మడతపెట్టి ముఖం దాచుకొంది.

         "రేపే వెంకట్ కి ఫోన్ చేస్తాను. మీ ఇద్దరకి పెళ్ళి చేసేస్తే ఏ గొడవా ఉండదు" అంది నానమ్మ.

         "నానమ్మా అలాంటి పని చేసావంటే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను" అని మొహం తిప్పేసి పడుకుంది కావ్య.

         "ఓరి భగవంతుడా అందరికి మంచి బుద్ధిని ప్రసాదించు" మనసులో అనుకుంది కావ్య పక్కకు తిరిగి పడుకుంటూ.

         మర్నాడు ప్రొద్దున్న లేచేసరికి కావ్య మూలుగుతూ కనిపించింది. ఏమయ్యిందా అని నానమ్మ దగ్గరకు వచ్చి చూసింది. కావ్య ఒళ్ళంతా కాలిపోతోంది.

         "కావ్యా? లే ఏమయ్యింది?" అని అంది నానమ్మ. కావ్యకి ఏమి వినిపించడం లేదు. రాత్రి జరిగిన సంఘటనే గుర్తుకు వస్తోంది. నానమ్మ కంగారుగా వెళ్ళి తండ్రిని పిలుచుకుని రావడం అంతా కలలాగా ఉంది కావ్యకు. తండ్రి హడావుడిగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ హడావుడిలో రాత్రి జరిగినది అంతా అందరూ కొంతవరకు మర్చిపోయారు.

         వారం రోజులు కదలడానికి లేదని చెప్పారు. ప్రొద్దున్న లేస్తూనే గుర్తుకు వచ్చింది కావ్యకు రేపటి నుంచి పరీక్షలు అని. పుస్తకాలు తీయబోయింది. నీరసంతో దబ్బున పడిపోయింది. "పడుకోకుండా ఏం చేస్తున్నావు?" అని తండ్రి లోపలకు రావడంతో సర్దుకొని మంచం పైన కూర్చొంది.

         "రేపటి నుండి పరీక్షలు నాన్నా" అంది కావ్య నీరసంగా.

         "చూడు! డాక్టర్ నిన్ను అస్సలు కదలకూడదని చెప్పారు. పరీక్షలు రాయకపోతే ఇప్పుడు మునిగిపోయేది ఏమి లేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకో అప్పుడు ఏం చెయ్యాలి అని నేను ఆలోచిస్తాను" అని అనేసరికి కావ్య తండ్రి వంక బేలగా చూసింది. "అది కాదు నాన్నా" అని ఏదో చెప్పబోయింది.

         "చూడు కావ్యా! నేను ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాను అని నీకు నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇకనుంచి నేను తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తు మంచిగా ఆనందంగా ఉండాలనే, సరేనా? ఇక ప్రశాంతంగా పడుకో. ఇప్పుడు ఈ పరిస్దితిలో నువ్వు బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు" అని చెంప మీద చిన్నగా రాసి వెళ్ళిపోయారు.

         నిన్న కొట్టిన చెంపమీద ఏదో మందు రాసినట్టు అనిపించింది కావ్యకి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని అడిగే ధైర్యం లేదు. ఇంట్లో ఎవరికి లేదు ఆ మాటకొస్తే.

         "ఏది జరిగినా, ఏ నిర్ణయమైనా ఇంక తన జీవితం తండ్రి చేతిలో ఉంది. మంచి అయినా చెడు అయినా ఇక తండ్రి చూపించిన దారిలో అడుగులు వెయ్యడం మాత్రమే తన కర్తవ్యం" అని అనుకుంది కావ్య.

         కళ్ళు తిరిగినట్టు అయ్యి కళ్ళు మూసుకుంది కావ్య. ఎందుకో బావ గుర్తుకు వచ్చాడు. "ఇంక ఇంతవరకేనా బావ? రేపు ఎక్కడకు వెళ్తుందో తన జీవితం. అక్కడ బావ, తండ్రి ఇద్దరు ఉండరు. వాళ్ళు లేని జీవితం తను బ్రతకగలదా? ఎంతమంది అమ్మాయిలు బ్రతకటం లేదు? తన తల్లి కూడా అలా వచ్చి కొత్త ప్రపంచం సృష్టించుకున్నదే కదా?" ఇలాంటి ఆలోచనలతో మనసంతా భారమయిపోయింది.

         చాలా మంది ఆడపిల్లలు పెళ్ళి గురించి కలలు కంటారు. కావ్యకు మాత్రం తన సురక్షితమైన ఈ చిన్ని లోకం నుండి విడిపోవడం అంటే పీడ కలలాగా ఉంది. ఏదో కావాలని ఉంది. ఏదో ఎవరికో చెప్పాలని ఉంది. మనసులోని ఆవేదనను చెప్పేందుకు మాటలు లేవు. వినేందుకు మనుషులు లేరు.

         సాయంత్రం సన్నజాజి పూలు కోస్తూ ఏదో ఆలోచిస్తోంది కావ్య. ఇంతలో పక్కింటి శ్రీను హడావుడిగా పైకి వచ్చి "మీ నాన్న గారికి ఒంట్లో బాగోలేదుట. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. స్కూల్లో పిల్లలు కనిపించి చెప్పారు" అన్నాడు. 
Author: Siri
•Thursday, August 05, 2010
  "చూడు నాన్నగారు చాలా అస్దిమితంగా ఉన్నారు. ఇప్పటికే బావ పెళ్ళిలో జరిగిన దాని నుండి పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి వస్తే ఆయన తట్టుకోలేరు. ఆయన నీమీద ఎంతో ప్రేమ పెట్టుకున్నారు. నీకు వేరే ఊరిలో మంచి కాలేజ్ లో ఇంజినీరింగ్ లో సీట్ వచ్చినా పెళ్ళి అయ్యాక ఎలాగూ దూరమయిపోతావని నిన్ను విడిచి ఉండలేక, ఉన్న నాలుగు రోజులూ కళ్ళెదుటే ఉండాలని అనుకొని ఇక్కడే చేర్చారు. ఇలాంటిది ఏదన్నా జరిగితే ఆయన మనసు విరిగిపోతుంది." అంది అమ్మ ఏడుస్తూ. 

         "నిజంగా నాకేమి తెలియదమ్మా" అంది కావ్య తనూ ఏడుస్తూ ఇంకా ఏమి చెప్పాలో తెలియక. 

         "సరే నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. నేను ఎలాగో నాన్నగారికి నచ్చచెపుతాను. ఏడవకు కళ్ళు తుడుచుకో" అంది అమ్మ ప్రేమగా. 

         కావ్య ఏమి తప్పు చేసి ఉండదని ఆవిడకు తెలిసినా ఎక్కడో ఒక భయం. ఆడపిల్లను కన్న ప్రతి కన్న వాళ్ళకు ఉండే భయమే ఆవిడను అనుమానించేలా చేసాయి. ఒక మంచి నిర్ణయం అనేది మనిషికి తనకు ఉన్న అనుభవాలను తూచి ఆలోచించి తీసుకోవడం వల్ల వస్తుంది. కానీ ఆ అనుభవం అన్నది కొన్ని తప్పులు చేసి తప్పు ఒప్పులు తెలుసుకోవడం వల్ల వస్తుంది. ఒక మధ్య తరగతి ఆడపిల్లకు నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా చేస్తుంది లోకం. ఒక తప్పు చాలు ఆమె జీవితం అంతా శిక్ష అనుభవించడానికి. అందుకే ఆడపిల్లలను అందమైన గాజు బొమ్మల్లా పెంచుతారు. అవి విరిగి పోకుండా కాపాడుకోవాలని చూస్తారు. ఈ గాజు బొమ్మను ఇంకొకరి ఇంట్లో అందంగా అలంకరించేవరకు కంటికి నిద్ర లేకుండా జీవిస్తారు. కానీ ఆ గాజు బొమ్మలోనూ ఒక మనసు ఉంటుందని చాలా మంది గుర్తించరు. గుర్తించినా గౌరవంగా జీవించడం ముందు దానికి అంత ప్రాముఖ్యం లేదని భావిస్తారు. 

         కావ్య తండ్రి ముందే భోజనం తినేసి వెళ్ళి పడుకున్నారు. కావ్యకు దుఖః ముంచుకొచ్చింది. తండ్రి ఒక్క మాట మాట్లాడి ఉంటే బాగుండు అని. ఏదో తిన్నాను అన్నట్టు తిని వెళ్ళి పడుకుంది. ఆలోచనలతో నిద్ర దూరమయ్యింది. 

         "ఇంకో నెల రోజుల్లో పరీక్షలు. మనసు దేని మీద లగ్నం కావటం లేదు. అన్నివైపుల నుండి ఏదో రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చదవాలని ఏదో సాధించాలని లేదు. తండ్రికి నచ్చిన విధంగా నడచుకోవడమే తనకి ముఖ్యం" అనుకుంది కావ్య. 

         ఆమె కన్నీళ్ళకి తలగడే తోడుగా నిలిచింది అ రాత్రంతా. కావ్యకు ఇలాంటి ప్రేమలేఖలు రావడం ఏమీ కొత్త కాదు. కానీ తండ్రి దృష్టిలోకి వెళ్ళడం మొదటిసారి. కాలేజ్ లో చేరిన మొదటి రోజు నుండి ఆమె ఇదంతా అనుభవిస్తూనే ఉంది. మౌనంగా సంఘర్షణ పడుతూనే ఉంది. మొదట్లో ఆమెకు ఒకరకంగా ఇలా తన కంటూ ప్రత్యేకత చూపిస్తున్నందుకు ఏదో తెలియని సంతోషం కలిగింది, తెలియని గిలిగింతలకు లోనయ్యింది. రెండు రోజులు వెంట పడ్డ అబ్బాయి మరునాడు రాకపోతే ఎందుకు రాలేదా అని ఎదురు చూసేది. ఆమె వెంట పడ్డ అబ్బాయిలు అలుపు ఎరగకుండా తిరుగుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి పాపం అనిపించేది. ఎండలో వానలో ఎదురుచూసేవాళ్ళు. కావ్య వాళ్ళని చూసి చిరాకు పడినప్పుడల్లా పావని మండిపడేది. "పాపం నీకోసం వస్తే అలా మూతి తిప్పుకుంటావేంటి? అదే నా వెంట పడితేనా ఎంత గర్వపడేదాన్ని" అని వెక్కిరించేది.

         ఆ వెంట పడ్డవాళ్ళలో కొంతమంది కాలక్షేపానికి వచ్చినవారు ఉన్నారు. కొంత మంది నిజంగా ప్రేమించి ఆరాధించినవారూ ఉన్నారు. ఇంకొంత మంది బెదిరించి బయపెట్టినవారు ఉన్నారు. కావ్య మాత్రం ఎవరికి ఎలాంటి సమాధానం ఇచ్చేది కాదు. దానికి చాలా మంది గిట్టని వారు "అందమైనదని పొగరు" అని కూడా బిరుదు ఇచ్చారు.

         కావ్య పట్టణంలో ఉన్నా సామాన్యంగానే ఉండేది. తండ్రికి నచ్చని బట్టలు కట్టుకునేది కాదు. ఆమెకు కొత్త సంవత్సరం వస్తోంది అంటే భయంగా ఉండేది. ఆమెకు లేఖలు రాయాలని తపించే వాళ్ళు కోకొల్లలు. తండ్రికి తెలియకుండా ఎన్నో చింపి పారేసింది. చివరకు ఆమె ఇంటి చివరన ఉండే మెడికల్ షాప్‌కి కూడా తన పేరిట రావడం ప్రారంభించాయి. కొంత మంది ఆడపిల్లల పేర్లతో రాస్తే ఇంకొందరు ఆమె వెళ్ళే దార్లో విసిరేవాళ్ళు. ఇదంతా చూడగా చూడగా ఆమెలో భయాన్ని పెంచాయి.

         పావని దగ్గరకు చెల్లాయ్ అని సహాయంకోసం వచ్చిన వారు ఉన్నారు. పావని వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడల్లా కావ్యకు కోపం వచ్చేది. "ఇంత మందిలో ఎంత మందిని ప్రేమించమంటావు? ప్రేమ అంటే మంచినీళ్ళు తాగినంత తేలికగా చెప్తున్నావు. వీళ్ళల్లో ఎంత మందికి దాని అర్ధం తెలుసు? ఒకడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెంటపడిన వాడు డిగ్రీ లోకి వెళ్ళేసరికి ఆ కాలేజ్ దూరం అని తెలిసి ఇంకో ఇంటర్ అమ్మాయి వెంటపడ్డాడు. అతనినా ప్రేమించాలి? ఇంకొకడు వెంట పడి మా అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది అండి. ఎంత కట్నం వచ్చినా వద్దనుకొని మీ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. కట్నం తీసుకోకుండా వదిలెయ్యడం అతి పెద్ద త్యాగం అన్నట్టు మాట్లాడే అతనిని ప్రేమించనా? నేను ఇలాగే బాగున్నాను తల్లి. నన్ను వదిలెయ్యి" అని కోపంగా జవాబు చెప్పేది.

         చాలా మంది అమ్మాయిలకన్నా కావ్యకు ఒకింత ఆలోచన ఉంది అని చెప్పాలి. పావని కావ్య కన్నా చదువులో చాలా తెలివైనది. కాని కొన్ని విషయాల్లో పావని కన్నా కావ్య ఆలోచనతో ప్రవర్తిస్తుంది.  తల్లి, తండ్రి ఏదో పనిమీద బయటకు వెళ్ళడంతో నానమ్మ పక్కన చేరింది కావ్య. ఇంట్లో మనసు విప్పి మాట్లాడగలిగే ఒక్కే మనిషి ఆవిడ. ఏ విషయం అయినా భళ్ళున కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. దానికి ఎవరు సనుక్కున్నా, పట్టించుకోక పోయినా అవిడ దారి ఆవిడది .అందుకే ఆవిడకు చివరిదాకా ఏదీ తెలియనివ్వరు.

         కావ్య ఏదో ఆలోచనలో ఉండడం గమనించి, "ఏమిటి ఏమయ్యింది? మొహం అలా నీరసంగా ఉంది? ఒంట్లో గానీ బాగోలేదా?" అని దగ్గరగా వచ్చి నుదురు పట్టుకొని చూసింది.

         "అదేం లేదు నానమ్మ. నేను బాగానే ఉన్నాను" అంది కావ్య.

         "బాగానే ఉండడం ఏమిటీ? తిండి సరిగ్గా తినవు. కాలేజ్, చదువు అని తిరుగుతావు. ఇప్పుడే సరిగ్గా తినాలి. ఆరోగ్యం ఏమవుతుందే?" అంది ప్రేమగా మందలిస్తూ.

         ప్రేమగా పలకరింపు కోసం ఎదురు చూస్తున్న కావ్యకు ఏడుపు తన్నుకు వచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ నానమ్మ వంక చూసింది.

         "ఏమిట్రా ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు? ఎం జరిగింది అసలు" అంది నానమ్మ కంగారు పడుతూ.

         "ఏం లేదు నానమ్మ ఇది బాధ కాదు. నీ ప్రేమ" అంది కావ్య రెండు బుగ్గలు గట్టిగా లాగుతూ.

         "హమ్మయ్య ఇలా నువ్వు అల్లరి చేస్తే గానీ నా మనసు కుదుట పడదు. ఏమిటో ఇలా దిగులుగా ఉంటే ఏమిటో అని కంగారు పడ్డాను" అంది నానమ్మ.

         "నానమ్మ ఒకటి అడుగుతాను చెప్తావా?" అడిగింది కావ్య.

         "ఏమిటే అడుగు. నేనెప్పుడైనా దాచానా ఏదైనా నీ దగ్గర? అడుగు" అంది నానమ్మ మామూలుగా.

         "ఎవరిని అడిగే దైర్యం లేక అడగలేదు. అక్కడ పెళ్ళిలో ఏం జరిగింది? నాన్న ఎందుకు బావతో కోపంగా మాట్లాడారు?"

         "అదా? అదీ..." అని తటపటాయించింది నానమ్మ.

         "ఏం నానమ్మా చెప్పవా?" బ్రతిమిలాడింది కావ్య.

  "అదేం లేదురా. మీ నాన్న ఎట్టి పరిస్తితుల్లో నీకు తెలియకూడదు అని చెప్పాడు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా నీకు. నేను చెప్పాను అని తెలిస్తే కోపగించుకుంటాడు. ఒకప్పుడు మీ తాతయ్యకు భయపడని నేను ఇప్పుడు వీడికి భయపడుతున్నా" అని కొంచెం సేపు ఆలోచించి మళ్ళి తనే చెప్పడం ప్రారంభించింది.

         "ఏముంది మీ మామయ్య , హరిణి బుద్ది తెలుసు కదా? సంతోషం గానే వెళ్ళాము. కాని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అక్కడి పరిస్తితి వేరే అని. నాన్నని కనీసం పలకరించడం కూడా లేదు. వెంకట్, అత్తయ్య మాత్రమే వచ్చారు. వచ్చేటప్పుడు మామయ్య మీ నాన్నాని గదిలోకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడాడు. ఆతరువాత తెలిసింది. నీ పెళ్ళి వీలైనంత తొందరగా చెయ్యమని డబ్బు దానం చేసాడు ఆ మహానుభావుడు. ఏమీ అర్ధం కాని మీ నాన్న అయోమయంలో పడ్డాడు. దానికి వెంకట్ మీద ఎదైనా ఆశలు ఉంటే వదులుకోమని. ఇంకా డబ్బు అవసరమైతే పంపుతానని చెప్పాడు. సంగతి అర్ధమైన మీ నాన్న ఆ డబ్బు ఆయన మొహం మీదే కొట్టి కోపంగా వచ్చేసాడు. వెంకట్, అత్తయ్య ఎంత చెప్పినా వినకుండా వచ్చేసాడు. నేను మీ అత్తయ్య అక్కడ ఇక్కడ నచ్చచెప్పలేక నోరు మూసుకొని ఉండిపోయాము. అదీ జరిగిన సంగతి" అంది నానమ్మ తల పట్టుకొని.

         "నా వల్ల అందరికి ఎంత బాధో కదా? అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది" అంది కావ్య కోపంగా.

         "ఏమిటీ పిచ్చి మాటలు? ఎవరి బుద్దో చెడిందని నిన్ను నువ్వు నిందించుకోవడం ఏమిటి? ఎవరి ప్రవర్తనకు వాళ్ళే బాధ్యులు. ఇంకొకరు కాదు. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు" అంది నానమ్మ బుగ్గ మీద చిన్నగా కొడుతూ.

         "నాన్న నాతో ఇదివరకులా మాట్లాడట్లేదు నానమ్మ. నాకు బెంగగా, భయంగా ఉంది. రాత్రి పడుకున్నా నిద్ర రావడం లేదు .ఇదివరకులా ఎప్పుడూ మనం హాయిగా సంతోషంగా ఉండలేమా? నాకింకేమి వద్దు" అంది కావ్య ఏడుస్తూ నానమ్మని చుట్టుకు పోయి.

         "పిచ్చి పిల్లా ఇవన్ని జీవితంలో నీకు మొదటి చేదు అనుభవాలు. ఇలాంటివి ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి, చెడు అన్నవి అన్నదమ్ముల్లాంటివి. అన్నిటిని మనం అనుభవించాల్సి వస్తుంది. అన్నీ మంచి రోజులు, అంతా సంతోషమే, జీవితం కాదు. అలాగే అంతా చెడు కాదు. రెండిటి కలయికే జీవితం. అన్నింటిని ఎదుర్కొని సమస్యను సులభపరుచుకోవాలి. పోను పోను నీకే అర్ధం అవుతుంది. ఇంక నాన్న సంగతి అంటావా, వాడికి తెలిసిన విధంలో సమస్యలను ఎదుర్కొంటూ బాధ్యతలని మోస్తున్నాడు. నీ మీద ప్రేమ లేక కాదు. ధైర్యంగా ఉండు " అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది నానమ్మ. 
         కావ్యకు కాస్త తెరిపిగా ఉంది నానమ్మ దైర్యం చెప్పడంతో. ఒక్క చిన్న మాట చాలు ఆప్యాయంగా, ఎవరికైనా కొండంత బలాన్ని ఇస్తుంది.

         ఆ రోజు ఆదివారం కావడంతో కావ్య తండ్రి ఇంట్లోనే ఉన్నారు. కావ్య తన పనులు చేస్తూనే ఒక కంట తండ్రిని గమనిస్తోంది. ఆయన మనసులో ఎం జరుగుతోందో తెలుసుకోవాలని ఉంది. ఈ నిశబ్దం భరించలేకుండా ఉంది. ఆయన తల్లిని ఏదన్నా అడిగినప్పుడు తానే పరుగెత్తుకెళ్ళి అందిస్తోంది. అయినా ఆయన మొహంలో ఏమి మార్పు లేదు. "పెద్దవాళ్ళు ఇలా బెట్టు చేయడం మామూలే. చిన్నవాళ్ళే సర్దుకొని వారి కనుగుణంగా నడచుకోవాలి" అని చెప్పిన తండ్రి మాటలే గుర్తుకు వచ్చాయి. దైర్యం చేసి దగ్గరగా వెళ్ళింది.

         "నాన్నా...." అని పిలిచింది కావ్య. గొంతులో చిన్న వణుకు.

         ఆయన తల పైకెత్తి చూసారు కావ్య వంక. కావ్య కళ్ళల్లో కన్నీళ్ళు ఏ నిముషంలోనైనా ప్రవహించేలా ఉన్నాయి.

         "ఫైనల్ పరీక్షలు ఎప్పుడు?" అని అడిగారు ఆయన.

         "వచ్చే వారం నుండి " అని చిన్నగా సమాధానం ఇచ్చింది.

         "మరి ఈ పనులన్ని నీకెందుకు వెళ్ళి చదువుకో " అన్నారు చేతిలో పేపర్ వంక చూస్తూ.

         ఇంకా ఉండబట్టలేక "నన్ను క్షమించండి నాన్నా. నావల్ల మీకు అన్నీ కష్టాలు" అని ఏడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండి పోయింది.

         "ఛ ఏడవకు. ఇప్పుడేమయ్యిందనిలే కళ్ళు తుడుచుకో" అని పైకి లేపి పక్కన కూర్చోపెట్టుకున్నారు.

         "మీరు నాతో మాట్లాడకపోవడం నాకు చాలా బాధగా ఉంది నాన్నా. నేను ఏదన్నా తట్టుకోగలను కానీ మీరు మాట్లాడకపోతే భరించలేను" అంది కావ్య ఏడుస్తూ.

         "నాకు ఎన్నో ఆలోచనలు. నీ మీద ప్రేమలేక కాదు. ఇది నిన్ను ఇంత బాధిస్తుందని నేను అనుకోలేదు. నువ్వు ఏమి తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాధపడడం? ఊరుకో" అన్నారు చిరునవ్వుతో.

         "మీ కావ్య మీకు బాధ కలిగించే పని ఎప్పుడూ చెయ్యదు నాన్నా, నన్ను నమ్మండి" అంది కావ్య.

         "నాకు తెలుసురా అది. కాని ఒకప్పుడు పరిస్తితులు మనలని వేరేలా ఆలోచించేలా చేస్తాయి. నీ తండ్రి గొప్పవాడు ఏమీ కాదు. ఒక మామూలు తండ్రిని. అందరిలో ఉండే భయాలే నాకూ ఉన్నాయి. నువ్వు బాగుండాలనే నేను కోరుకునేది. అంతే, అంతకన్నా ఇంకేమి లేదు. నీ మీద ఎలాంటి మచ్చ రాకూడదు అనే నా ప్రయత్నం" అన్నారు ఆయన కళ్ళు తుడుచుకుంటూ.

అక్కడే నిల్చొని వింటున్న కావ్య తల్లి కూడా కొంగుతో కళ్ళుతుడుచుకుంది.

         "బాగుందిరా మీ వరస. అందరూ ఇలా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, ఇప్పుడేమయ్యిందని? ఎవరో ఏదో అంటారని మనం బతకడం మానేస్తామా?" అంటూ నానమ్మ వచ్చింది.

         "పిచ్చి పిల్ల మానసికంగా దానిని ఎందుకు హింస పెడతారు? దానికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు
చేతకాని వాళ్ళలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. మనసులో ప్రేమలు పెట్టుకొని ఏం లాభం పైకి చూపించుకోనంతవరకు. ఎవరో ఏదో పిచ్చి రాతలు దీనికి రాస్తే దీనిదా తప్పు? వాటిని ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి కాని, దానిని దోషిలాగా ఏదో తప్పు చేసినట్లు అది అనుకొనేలా మనం నడుచుకోవడం బాగుందా?" అని గట్టిగా చివాట్లు పెట్టింది నానామ్మ.

         చెప్పింది తల్లి కాబట్టి ఇంక ఏమీ అనలేక ఆవిడ చెప్పినది నిజమే అని మాట్లాడకుండా ఉండిపోయారు కావ్య తల్లిదండ్రులు.

         "నానమ్మా నాన్నని ఎందుకు తిడతావు?" అంది కావ్య కోపంగా.

         "బాగుందే నేను నీకోసం వాదిస్తుంటే నువ్వు నా మీద పడతావేంటి? అవునులే ఎంతైనా నీకు మీ అమ్మా నాన్నే ముఖ్యం. ఈ ముసలిది ఎవరికి అక్కర్లేదు" అంది నానమ్మ కోపం నటిస్తూ.

         అందరి ముఖంలో చిరునవ్వు విరిసింది. తండ్రికి బుగ్గమీద చిన్న ముద్దిచ్చి పరిగెట్టుకొని నానమ్మ దగ్గరకు వెళ్ళి కౌగలించుకొంది కావ్య.

         "నువ్వు నా మంచి స్నేహితురాలివి కదా?" అని నానమ్మకు కూడా ఒక ముద్దు ఇచ్చింది కావ్య.

         ఎవరో తలుపు కొట్టినట్లు చప్పుడు వినిపించి కావ్య తలుపు తీసింది. పావని ఇంటి పక్కన ఉండే నూనె కొట్టతని పదేళ్ళ పిల్లాడు నిల్చొని ఉన్నాడు. "పావని అక్క కనిపించడం లేదంట. వాళ్ళ అమ్మగారు మిమ్మలిని అడిగి రమ్మన్నారు ఇక్కడ ఉందేమో" అని అప్పచెప్పినట్టు చెప్పాడు. కావ్య గుండె ఒక్కసారి ఝల్లుమంది.

         "ఎవరే వచ్చారు?" అని వెనక నుండి కావ్య తల్లి కేక పెట్టింది.

         "పావని ఇంటి పక్కన పిల్లాడు అమ్మ" అని తల్లికి చెప్పి"నేను వస్తాను నువ్వు వెళ్ళు"అని చెప్పి పిల్లాడిని పంపించేసింది.

         కావ్యకు చేతులు కాళ్ళు ఆడటం లేదు. "ఈ పిల్ల ఏం చేసిందో? అంతా బాగుంది అనుకునే సమయానికి ఇలా కొత్త సమస్య వచ్చి పడింది" అనుకుంది కావ్య మనసులో. ( ఇంకా ఉంది )