Author: Siri
•Friday, May 28, 2010
ఈ కధ నేను చాలా ఏళ్ళ క్రితం రాసింది . ఒకానొక సమయంలో స్నేహితులు అడిగితే నా చుట్టు ఉన్న మనుషులని వారి జీవితాలను చూసి దానికి కొంచెం కధ అల్లి రాసినది . అప్పట్లో ఈ బ్లాగ్లు అవి లేనందువల్ల కొంతమంది తెలుగు పత్రిక ఒకటి నడపాలని ప్రయత్నించారు . కానీ సమయం దొరకక అది సఫలం కాలేదు . ఏదేమైనా నా చేత ఈ కధ రాయించారు . నాకు భాషలో అంతగా పట్టు లేకపోయినా నాకు తోచినట్టు రాసుకున్నాను .  ఏదైనా అక్షర దోషాలు ఉంటే క్షమించండి . నాకు మానవ సంబంధాలు వారి మధ్య ఉండే అనుబంధం చాలా ఇష్టమైన విషయాలు . డబ్బు హోదా ఏదైనా మనుషులు, వారి ప్రేమాభిమానాల తర్వాతే అని బాగా నమ్ముతాను , అందరిలో అదే ఎదురు చూస్తాను .కుటుంబం , ప్రేమ , స్నేహం అన్నీ మనకు జీవితం లో ముఖ్యమైన అంశాలు. కానీ అతి సామాన్యంగా అనిపించే ఇవే మనకు చాలా ముఖ్యమైనవి అని మర్చిపోతాము .అసూయలు ఎవో గొడవలు చేసుకుంటూ నెమ్మదిగా అందరినీ దూరం చేసుకుంటాము .  ఇలా నా చుట్టు చూసిన వాళ్ళనే పాత్రలుగా మార్చుకొని కొంత నా ఇమేజినేషన్ ని జోడించి రాసాను . మీకు నచ్చుతుందని ఆశిస్తాను 


                                              ************************




మత్తు మత్తుగా తెల్లవారుతోంది. కావ్య బద్ధకంగా ముసుగు తన్ని నిద్రపోతోంది. వాళ్ళ అమ్మ పద్మావతి మాత్రం బుజ్జగించి నిద్రలేపుతూనే ఉంది. కావ్య వాళ్ళ అమ్మను ముద్దుగా పద్దు అని పిలిస్తుంది.

         "పద్దూ నిద్రపొనీవే కాసేపు, ఈ రోజు ఆదివారమే కదా" అంది కావ్య.

         "నీకు బొత్తిగా బుద్ది లేకుండా పోతుంది. అందరు ఆడపిల్లలు ఇలానే ఉన్నారా? ఇలా అయితే ఎలాగే? నాన్నగారు పొద్దున్నే ఎదో పని మీద వెళ్ళిపోయారు" అంది అమ్మ.

         "పద్దూ ఒక్క ఐదు నిముషాలే" అంటూ అమ్మ దగ్గరగా చేరి పడుకుంది.

         వాళ్ళకు కావ్య ఒకత్తే కూతురు. కావ్య తండ్రి టీచరుగా పనిచేస్తున్నారు. ఇంట్లో కావ్య, అమ్మ, నాన్న, నానమ్మా ఉంటారు. కావ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

         "కావ్యా! రాజమండ్రి నుండి ఫోన్ వచ్చింది" అని నానమ్మ అరుస్తోంది.

         గబుక్కున లేచి ఒక్కసారిగా ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. కళ్ళు పూర్తిగా విప్పకుండానే మత్తుగా హలో అంది.

         "ఎవరూ స్లీపింగ్ బ్యూటీ నా?" అవతలి నుండి చిన్న నవ్వు.

         "ఏంటి అప్పుడే లేచావు పాపం అదీ ఆదివారం" అవతలి నుండి.

         "నేనెప్పుడు తొందరగానే లేస్తాను" చిన్నగా సణిగింది కావ్య.

         "సరే అమ్మను పిలు కొంచెం మాట్లాడాలి" అవతలి నుండి.

         "ఏమ్ నాతో చెప్పకూడదా? అమ్మ పనిలో ఉంది" అంది కావ్య.

         "రేపు పని మీద వస్తున్నా అక్కడకు, పొద్దున్న ట్రైన్ కి వస్తాను" అవతలి నుండి.

         "సరే చెప్తాను బావా, అత్తయ్యని మామయ్యని అడిగానని చెప్పు" అని పెట్టేసింది కావ్య.

         కావ్యకి తన బావ వెంకట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ వయసులో తేడా ఉంది. అలాగే చిన్నప్పుడు నుండి కావ్య అంటే మహా ప్రాణం వెంకట్ కి. ఎక్కడికెళ్ళినా నువ్వు నాకు లక్కీ అని పక్కనే కూర్చోపెట్టుకునేవాడు. కాని అన్నిట్లో తను పెద్దవాడు అని సీరియస్ గా ఉంటాడు. అదే నచ్చదు కావ్యకు.  


మరునాడు ప్రొద్దున్నే తయారయిపోయింది కావ్య. కాలేజీకి వెళ్ళాలి, ఇంతలోపు బావ వచ్చేస్తే బాగుండు అనుకుంది.

         "ఇంక వెళ్ళమ్మా కాలేజీకి, ఆలస్యం అవుతోంది" అని తండ్రి పిలుపు వినిపించింది.

         ఇంక తప్పదు అన్నట్టు సైకిల్ తీసి బయలుదేరింది. రోజూ తను తన స్నేహితురాలితో కలిసి వెళ్తుంది. అక్కడికి చేరుకునేలోపు ఆమె వెనుక ఒక సైన్యమే ఉంటుంది. అప్పటికే పావని సైకిల్ ఎక్కి ఎదురుచూస్తోంది.

         "ఏంటి ఇంత లేట్ అస్సలే ఈ రోజు సైన్స్ క్లాస్ ఉంది" అంది పావని.

         "అవునే, కాని మా బావ వస్తానని చెప్పాడు చూస్తు ఉండిపొయా" అంది కావ్య.

         "అబ్బా నువ్వు, నీ బావ నాకు అస్సలు అర్ధం కాదు బాబోయ్" అంది పావని.

         పావని కావ్యకు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలు. వాళ్ళిద్దరు ఆరవ తరగతి నుండి కలిసే చదువుకున్నారు.

         పావని చూడడానికి పొట్టిగా బొద్దుగా ఉంటుంది. కావ్య పొడవుగా సన్నగా ఉంటుంది. ఇద్దరిని చాలా మంది లంబు జంబు అని కూడా అంటారు. కానీ అది ఎప్పుడు వాళ్ళిద్దరు స్నేహం మధ్యన రాలేదు. కావ్య చూడడానికి ముద్దుగా ఉంటుంది. బయట అడుగు పెడితే చాలు అక్కడక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు అబ్బాయిలు.

         ఆమె వెనకాలే సైన్యం లాగా వచ్చి కాలేజీలో దిగబెడతారు, మళ్ళీ సాయంత్రం ఇంటి దాకా వచ్చి వెళ్తారు.

         "అదిగో సుబ్బారావు వస్తున్నాడు " అంది పావని ముసిముసిగా.

         సుబ్బారావు రోజూ వస్తాడు అందరిలాగే కాని ఏమి మట్లాడడు. ఈ రోజు మత్రం ఎదో చెప్పడానికి దగ్గరగా వచ్చాడు. "మీతో కొంచెం మట్లాడాలి" అన్నాడు పావని వైపు చూసి.

         "నాతోనా, నాతో ఏమ్ పని?" అంది పావని అశ్చర్యపోతూ.

         కావ్య ఉండగా పావనితో ఇలా మాట్లాడాలి అని వచ్చిన వాళ్ళు చాలా అరుదు. ఆమెకి ఇదే మొదటిసారి. సుబ్బారావు పేరు ఎలా ఉన్నా మనిషి అందగాడే. సినిమా హీరోలా ఉంటాడు. కావ్యని వదిలేసి తనతో మట్లాడడం కొంచెం సంతోషంగా ఉంది పావనికి. 

         "ఇలా రోడ్డు మధ్యలో మట్లాడడం ఏమ్ బాగుంటుంది, సాయంత్రం ట్యూషన్ దగ్గరకు వస్తారుగా అప్పుడు మట్లాడదాం" అన్నాడు కావ్య వంక అదోలా చూస్తూ.

         పావని వాళ్ళ ట్యూషన్ మాస్టారు ఈ సుబ్బారావు కి తెలిసినవాడు. అదన్నమాట సంగతి. వెళ్తూ వెళ్తూ కావ్య నచ్చచెప్పడానికి చూసింది.

         "అలా ఎవరితో బడితే వాళ్ళతో మాట్లాడడమేనా అతను ఎవరో ఏంటో" అంది కావ్య.

         "నీకేం చెప్తావు, నీకు నీ బావ గురించి చెప్పడానికే సరిపోదు, ఏదో మట్లాడాలీ అంటే వద్దు అని వెళ్ళిపోనా చూద్దాం ఏమంటాడో" అంది పావని.

         "సరే తల్లి నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండు" అంటూ ముందుకు వెళ్ళిపోయింది కావ్య. పావని కూడా వెనకాలే ఫాలో అయ్యింది.

         ఇద్దరికి ప్రేమ అంటే ఏంటో, ఆకర్షణ అంటే ఏంటో తెలియని వయసు. అందుకే ఈ వయసులో అడపిల్ల ఇన్నోసెంట్ గా కొత్త అందంతో అందరిని అకర్షిస్తుంది. ఏ మాత్రం అలోచించకుండా ప్రేమలో పడిపోతుంది. 





                                             ***        ***        ***        ***


         సాయంత్రం ఇంటికి వస్తూనే కావ్య తన బావ కోసం చూసింది. వరండాలో కూర్చొని టీ తాగుతున్నాడు. అతనిని పట్టించుకోనట్టు నటించి "అమ్మా టీ కావాలీ" అని అరిచింది.

         " ఏరా కావ్యా ఎలా ఉన్నావు?" అని పలకరించాడు వెంకట్.





(ఇంకా ఉంది )