Author: Siri
•Saturday, June 05, 2010
"ఓ బావా నువ్వా? ఎప్పుడు వచ్చావు ఏంటి ఇలా సడన్‌గా వచ్చావు?" అంది కావ్య ఏమీ పట్టనట్టు. 

         "నీ కోసమే వచ్చాను " అన్నాడు ప్లేట్ లో బజ్జి తీసుకొని నములుతూ. 

         కావ్య అతని చేతిలోని ప్లేట్ లాక్కొంది. "ఏం కాదు, ఏ అప్పలమ్మనో చూడడానికి పెళ్ళిచూపుల కోసం వచ్చి ఉంటావు" అంది బజ్జి నోట్లో కుక్కుతూ. 

         "దాని మాటలకేం గాని అన్నయ్య పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు" అని అంటూ కావ్య అమ్మ బయటకు వచ్చింది. 

"వచ్చే నెలలో పెట్టమని అడుగుతున్నారు. అన్నయ్య సింగపూర్ వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో అని. అందుకే అమ్మమ్మను తీసుకెల్దామని వచ్చాను ఒక వారం రోజులు" అన్నడు వెంకట్.

         "మంచిదిరా ఈ పెళ్ళి అయిపోతే నువ్వు కూడా చక్కగా మంచి పిల్లను చేసుకొని సెటిల్ అయిపోవచ్చు. ఇంకా ఎన్నిరోజులు కష్ట పడతావు." అంది నానమ్మ.

         "అంటే బావ ముదిరిపొతున్నాడు అంటావా నానమ్మా?" వ్యంగ్యంగా అంది కావ్య.

         "నువ్వు ఊరుకో నువ్వు చిన్న పిల్లవు పోయి చదువుకో నీకెందుకు ఇవన్నీ" అని మొట్టికాయ వేసింది వాళ్ళ అమ్మ.

         "డిగ్రీ లోకి వచ్చాను ఇంకా చిన్న పిల్లనేనా?" అంది కావ్యా.

         "ఐతే నీకు పెళ్ళి చేసేస్తాము వెళ్ళిపో" అంది నానమ్మ.

         "నేను అస్సలు పెళ్ళి చేసుకోను, చేసుకున్నా అమ్మను వదిలి వెళ్ళను " అంది వాళ్ళ అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి.

         "అందరు ఆడపిల్లలు అనేదే ఇది. మళ్ళి పెళ్ళి కాగానే అమ్మో మా అయన ఒంటరిగా ఉన్నాడు అంటూ ఒక్కరోజు కూడా ఉండరు" అంది వాళ్ళ నానమ్మ.

         వెంకట్ అంతా విని నవ్వుతున్నాడు.

         ఆ నవ్వు ఎంతో బాగుంటుంది. ఎప్పుడు కళ్ళతో నవ్వుతాడు. అందగాడు అందమైన మనసు కలవాడు. ఎప్పుడు కోపం అన్నదే రాదు. ఇంట్లో అందరి కన్నా చిన్నవాడైనా చాలా ఆలోచన ఉన్నవాడు.

         కావ్యకి వెంకట్ మేనత్త కొడుకు, అంటే తండ్రికి స్వయానా చెల్లెలు కొడుకు  . అతనికి ఒక అక్క, అన్న ఉన్నారు. అక్క హరిణికి పెళ్ళి అయ్యి మూడేళ్ళు అవుతుంది. అన్నయ్య ఎప్పుడూ పని మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్తుంటాడు. అతనికే పెళ్ళి కుదిరింది ఇప్పుడు. అదీ హరిణి చెప్పిన సంభంధం తోనే. పిల్లల్లో వెంకట్ ఒక్కడే ఎక్కువ చనువుగా ఉండేది. మిగతా ఇద్దరు పెద్దగా మట్లాడరు. వెంకట్ కి అతని తల్లికి మాత్రం కావ్య అన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నా అభిమానం, ప్రేమ. చిన్నప్పుడు నుండి కావ్య అంటే అందరికన్నా ఇష్టం వెంకట్ కి. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనివ్వడు. కావ్య ఇంకా చిన్నపిల్ల ఆమెకి మానసిక పరిపక్వత రాలేదు అని అతని అభిప్రాయం. ఆమె చదువు పూర్తి అయితే గాని ఈ విషయం చెప్పకూడదు అని అనుకున్నాడు. 
వెంకట్ అక్క హరిణి పెళ్ళి అయినా పెత్తనం అంతా పుట్టింట్లో చెలాయిస్తుంది. అత్తగారింట్లో ఆమెను ఎవరు పట్టించుకోరు. అక్కడ ఆమె చిన్న కోడలు, పెత్తనం అంతా పెద్ద కోడలిది. హరిణి వాళ్ళ మెప్పు పొందాలని ఎంతో తాపత్రయపడుతుంది. పుట్టింటికి వచ్చినప్పుడల్లా తను పెద్ద కూతురు అని తన మాటే వినాలని గొడవ చేస్తుంది. ఆఖరికి కావ్య మేనత్త కూడ భయపడుతుంది హరిణి వస్తోంది అంటే. ఆమె ఇంటికి పెద్ద కూతురు అవ్వడం వల్ల అందరు మంచివాళ్ళు అవ్వడం వల్ల ఆమెకు అడ్డం చెప్పరు. ఏదో వచ్చినప్పుడు సంతోషంగా ఉండి వెళ్ళిపోతుంది అని.

         నానమ్మ బట్టలు సర్దడం చూసి కావ్య నెమ్మదిగా దగ్గరకు వచ్చింది. తనూ సర్దటం మొదలు పెట్టింది.

         "నేను లేకుండా ఎలా ఉంటావు నానమ్మా? మళ్ళీ ఎప్పుడు వస్తావు" అంది బాధగా మొహం పెట్టి.

         "ఏంటీ సంగతి? నీకు రావాలని ఉంది అని చెప్పొచ్చుగా" అంది నానమ్మ.

         "అది కాదు. నాకు సెలవులే కదా నీకు తోడుగా వస్తాను" అంది కావ్య.

         "నాన్నతో నేను చెప్తాను కాని నువ్వు సర్దుకో" అంది నానమ్మ.

         కావ్య సంతోషంగా మొహం పెట్టింది. కావ్యకు అత్తయ్య ఊరెళ్ళడం అంటే చాలా ఇష్టం. అత్తయ్యది పాత కాలపు ఇల్లు, కాని ఇంట్లో అన్ని ఉన్నాయి. వాళ్ళ పెరట్లో లేని మొక్కంటూ లేదు. హైదరాబాదులో ఉంటూ తోటలు చెట్లు అంటే ఎంటో తెలియకుండా పోయింది. అక్కడికి వెళ్తే ఎదో ప్రపంచం లోకి వెళ్ళినట్లు ఉంటుంది.

         తండ్రి స్కూటర్ మీద వెంకట్ రిజర్వేషన్ కోసం బయలుదేరుతుండగా కావ్య కూడా బయలుదేరింది.

         "నా ఫ్రెండ్ దగ్గర నోట్స్ ఉంది తెచ్చుకోవాలి" అని ఎక్కి కూర్చుంది సమాధానం రాక ముందే.

         "నన్ను అలా పావని ఇంట్లో దింపేసి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకెళ్ళు" అంది ముందుకు వంగి చూస్తూ.

         అలా వెళ్తుంటే ఎన్ని కళ్ళు చూసి కుళ్ళిపొయాయో తెలియదు. కావాలని కావ్య ఇంకా గట్టిగా పట్టుకుంది. పావని వాళ్ళ ఇంటికి వెళ్ళే సరికి ఎదురుచూస్తోంది పావని. కావ్య ని చూడగానే గబగబ వచ్చి లాక్కెళ్ళింది.

         "అయ్యొ బావా తొందరగా వచ్చెయ్యి" అంది కావ్య పావనితో పాటు పరిగెడుతూ.
"ఏమిటి తొందర అలా లాక్కొచ్చావు?" అంది కావ్య.

         "నీకు ఒక మంచి న్యూస్ చెప్పాలి మరి" అంది పావని అదోలా కళ్ళు తిప్పుతూ.

         "ఏం సుబ్బరావు కనిపించాడా మళ్ళీ?" అడిగింది కావ్య.

         "కనిపించడమే కాదు నేనంటే ఇష్టం అన్నట్టు మాట్లాడాడు" సంతోషంగా చెప్పింది పావని.

         "ఏమోనే నాకు ఇలాంటివి భయం. నువ్వేం చేస్తున్నావో అలోచించే చేస్తున్నావా?" అంది కావ్య.

         "ఇందులో ఆలోచించడానికి ఏముంది. ఇందులో తప్పేముంది?" అంది పావని కోపంగా మొహం పెట్టి.

         "అబ్బా కోపం తెచ్చుకోకు ముక్కు మీదే ఉంటుంది నీకు కోపం" అంది కావ్య.

         "ప్రేమించడం తప్పా? నీకు మాత్రం మీ బావ అంటే ఇష్టం లేదు?" అంది పావని అమాయకంగా.

         "అది వేరు ఇది వేరు. తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో కూడ తెలియదు. ఎప్పుడూ బాగా చదువుకో అది చెయ్యి ఇది చెయ్యి అని పెద్ద తాతయ్యలా చెప్తుంటాడు సో అన్ రొమాంటిక్" అంది కావ్య బావ మీద కంప్లెయింట్ చేస్తున్నట్టు.

         "అదంతా నాకు అనవసరం నువ్వు నా స్నేహితురాలిగా నాకోసం సంతోషిస్తావా? లేక ఇలానే పిచ్చి సలహాలు ఇస్తావా?" నిలదీసింది పావని.

         "నేనెప్పుడు నీ వైపే కాని, కాస్త అలోచించి చెయ్యమంటున్నా" అంది కావ్య.

         "సరే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీకు చెప్పకుండా చెయ్యను సరేనా?" అంది పావని.

         "నేను సెలవులకు మా బావ ఊరెళ్తున్నాను. ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను. వచ్చాక నీకు ఫోన్ చేస్తాను" అంది కావ్య.

         "అదీ సంగతి! అందుకే అమ్మగారి ముఖంలో అంత సంతోషం, కాని మన ఇద్దరికి పెళ్ళి అయ్యాక అందరం మంచిగా ఇలానే సరదాగా కలవాలి సరేనా?" నవ్వుతో అంది పావని.

         "సరే సరే, ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు? ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అవన్నీ తరువాత మట్లాడుకుందాం" అంది కావ్య తను కూడా నవ్వుతూ.

         "సోమలింగం ఎవరు మీ బావా?" అంది పావని ఉడికిస్తూ.
 ఇద్దరు హాయిగా నవ్వేసుకున్నారు. కావ్యకు పావనిని చూస్తే పాపం అనిపిస్తుంది.తనకి చిన్నప్పటి నుండి కష్టాలే. చాలా తెలివైనది, అన్నిట్లో తనకన్నా ముందుంటుంది. తండ్రి మంచి ఉద్యోగం ఉన్నా నెలకు పదిహేను రోజులు తాగి లీవ్ మీదుంటాడు. ఇంట్లో ఎప్పుడు తల్లి తండ్రి దెబ్బలాడుతూనే ఉంటారు. చదువుకోడానికి కూడా కావ్య ఇంటికే వెళ్తుంది. ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంది. ఎప్పుడూ కావ్యతో "నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమందో, నీ చుట్టూ నిండి ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది.మీ ఇంట్లో ఎందుకు నన్ను పుట్టించలేదా" అని అంటూ ఉంటుంది.

         వెంకట్ స్కూటర్ హార్న్ విని కావ్య బయటకు వచ్చింది. పావని చిన్నగా కావ్య చేతిని గిల్లుతూ ఏదో చెప్తోంది. పావనికి బై చెప్పి స్కూటర్ ఎక్కింది కావ్య.

         "ఏంటి ఇద్దరు ఏం సీక్రెట్స్ చెప్పుకుంటున్నారు?" అడిగాడు వెంకట్.

         "ఏం లేదు బావా, నిన్ను చూసి ఎవరు మీ అంకులా అని అడుగుతోంది" అంది ముసిముసిగా నవ్వుతూ.

         "ఏయ్" అని కొడుతున్నట్టు చిన్నగా చెయ్యి ఎత్తాడు వెంకట్.

         "ఇది మీ ఊరు కదా అని వదిలేస్తున్నా, మా ఊరు వస్తున్నావుగా అప్పుడు చెప్తాను నీ పని" అని స్కూటర్ స్టార్ట్ చేసాడు వెంకట్. 

(ఇంకా ఉంది )