Author: Unknown
•Wednesday, July 07, 2010
ఇంతకు ముందు కూడా హాస్య నటులని ప్రధాన పాత్రధారులుగా ( హీరోలు ) గా చేసి తీసిన సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఈ సారి సునీల్ తో యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ రాజమౌళి అనగానే ఎలా తీస్తాడో అన్న కుతూహలం చాలా మంది ఉండే ఉంటుంది. సినిమా సెట్స్ మీద ఉన్నంత వరకు గోప్యం గా ఉంచి, విడుదలకు కాస్త ముందు కుతూహలం పెంచేలా మార్కెటింగ్ చెయ్యటం లో జక్కన్న సిద్దహస్తుడు. ఇప్పటివరకు ఓటమి ఎరుగని రాజమౌళి సినిమా అనగానే సినిమా ప్రియులు ఆత్రుత గానే ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా మొత్తం గా చూస్తే లోపాలు కనిపిస్తున్నా, అద్భుతం అనిపించేలా ఉండకపోయినా, సినిమాలో రెండు మూడూ సీన్స్ ప్రేక్షకుల ఎమోషన్స్ ని తారాస్థాయికి వెళ్ళేలా చేస్తాయి. ఇక్కడే రాజమౌళి గెలిచేది. హింస, శృంగారం పాళ్ళు ఎక్కువే ఉన్నా, కమర్షియల్ సినిమాకి ఆ మాత్రం హంగులు అద్దాలేమో !

రాజమౌళి అన్ని సినిమాలకీ తన బాబాయి కీరవాణి నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు, ఎప్పటిలాగే ఇప్పుడు కూడాను. రాజమౌళి అనగానే క్యాచీ ట్యూన్స్ ఇస్తారో లేక కీరవాణి దగ్గర తనకు కావాల్సిన క్యాచీ ట్యూన్స్ ను రాజమౌళీ నే సెలెక్ట్ చేసుకుంటారో కానీ, దాదాపు అన్ని సినిమాల విజయం లో కీరవాణి సంగీతానికి సింహభాగం ఉంది. పాటల సంగీతం తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇస్తారు కీరవాణి.

ఇక మర్యాద రామన్న పాటల విషయానికొస్తే. దీంట్లో అయిదు పాటలున్నాయి. పాటలన్నీ మొదటిసారి వినగానే నచ్చేసాయి. ఈ పాటల్లో ముఖ్యం గా నచ్చింది సాహిత్యం. మామూలుగా రోజు వారీ మాటలతో పాటుగా చక్కని తెలుగు సాహిత్యం ఈ పాటల్లో కనిపిస్తుంది.



1. అమ్మాయి కిటికీ పక్కన

కారుణ్య గొంతు చాలా రోజుల తరువాత విన్నాను మళ్ళీ. కారుణ్య తో పాటు చైత్ర గొంతు కలిపారు ఈ పాటకి. చైత్ర గొంతు తన పేరులాగే ప్రత్యేకం గా ఉంది. సరదాగా ఉంది ఈ పాట. ఏదో నలుపు తెలుపు కాలం నాటి పాటల అనిపిస్తుంది, అయినా బాగుంది సూతింగ్ గా..చక్కని వాడుక భాషలో సాహిత్యం బాగుంది. ముఖ్యం గాయకుల ఉచ్చారణ స్పష్ఠం గా వింటానికి చెవుల్లో తేనె పోసినంత చల్లగా ఉంది. అనంత శ్రీరాం సాహిత్యాన్ని అందించారు.

2. ఉద్యోగం పోయింది


రామజోగయ్య శాస్త్రి గారు సరదా మాటలతో ఉద్యోగం పోవడాన్ని కూడా నవ్వుకునేలా వ్రాశారు. మాటలతో ఆడుకున్నారు అసలు. రంజిత్ పాడారు ఈ పాట. బాగుంది సరదాగా !


3. తెలుగమ్మాయి


ఇదేదో గ్రూప్ ఫొటో సాంగ్ లా ఉంది. ఏ సందర్భం లో వస్తుందో మరి. కీరవాణి గీతా మాధురితో కలిసి పాడారు. అనంత శ్రీరాం సాహిత్యం ఇచ్చారు. గీతా మాధురి, కీరవాణి గొంతులకి అభిమానిని కాకపోయిన ఈ పాటకి సరిపోయేలా చక్కగానే పాడారు. కీరవాణి బానే పాడతారు కానీ, హీరో గొంతు మెటీరియల్ కాదనిపిస్తుంది. హుషారుగా పాడినా ఏదో బాధపడుతూ పాడినట్లుంటుంది. పల్లవి వేగం గా ఉండటం, పాటలో ఉండే వేరియేషన్స్ వలన ఈ పాట కూడా నాకు నచ్చేసింది.


4. రాయే రాయే


రాజమౌళి సినిమాల్లో ఒక ఐటం సాంగ్ ఉండాల్సిందే. మసాలా బాగా దట్టించి వదులుతారు. కొన్ని పదాలు సెన్సార్ కోతకి గురౌతాయి కూడా, ఉదా: విక్రమార్కుడిలోని కాలేజీ పాపల బస్సు, ఛత్రపతి లోని మన్నేల తింటివిరా కృష్ణా.. అంత ఘాటు ఈ పాటలో లేదులెండి. బంపర్ ఆఫర్ లోని రమణమ్మ పాట ఎఫెక్ట్ కాబోలు, రఘు కుంచె తోనే ఈ పాటని పాడించారు. గీతా మాధురి తో కలిసి పాడారు రఘు. మాంచి మాస్ మాసాలా సాంగ్. ఎవరో చైతన్య ప్రసాద్ అనే అతను సాహిత్యాన్ని అందించారు. ఇలాంటి పాటల్లో సాహిత్యాన్ని వినక్కర్లేదు. మ్యూజిక్ లో ఉండే బీట్ మాత్రమే గుర్తుండిపోతుంది.


5. పరుగులు తీయి


ఈ పాట హీరో పరుగుల వెనక వచ్చే పాట లా ఉంది. Background song. బాలు గారు పాడారు, కొంచెం ఎక్కువ ఆవేశం తోనే పాడారు. వయసు ప్రభావమేమో గొంతు అలసిపోతుంది.




మొత్తమ్మీద చూస్తే నాకు మొదటి మూడు పాటలు నచ్చాయి బాగా, మిగతా రెండిటిలో మసాలా పాట కూడా పర్లెదు, చివరది తెర మీద బాగుంటుందేమో మరి.
This entry was posted on Wednesday, July 07, 2010 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

On July 11, 2010 at 5:37 PM , Sai Praveen said...

రాయే రాయే పాట సాహిత్యం గమనించారా? అది ఐటెం సాంగ్ లాగ లేదు. ఆ రాత్రికి ఇద్దరు కలిసి 'లేచిపోవడానికి' సిద్ధపడుతు హీరో హీరోయిన్ పాడుకునే పాట లాగ ఉంది. పైగా సలోని హీరోయిన్ అసలు పేరు. సినిమా లో కూడా అదే పేరు వాడేసినట్టున్నారు