•Wednesday, October 14, 2009
ఈ టాపిక్ మీద ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా తమ బాధని బ్లాగు పోస్టుల రూపం లో వేళ్ళబోసుకునే ఉంటారు.అయినా కూడా నా ఫ్రస్ట్రేషన్ ని ఆపుకోలేక ఇలా పోస్ట్ చేస్తున్నా ! అలా కళ్ళముందు రింగులు తిప్పుకుంటే...అలా అలా 80 లలోకి వెళ్ళగానే డాబా పైకి ఎక్కి కొత్తగా కొన్న చిన్న టీవీకి వచ్చిన పెద్ద యాంటెనా ని బిగుస్తూ.." బొమ్మ కనిపిస్తుందా "అని నాన్న అరుపులు.. కింద నించి నిక్కర్లో టీవీ కేసి ఆశగా చూస్తూ చుక్కలు తప్ప బొమ్మ రావట్లేదని కంగారు పడుతూ "రావట్లేదు నాన్న" అని జవాబులు. యాంటెనా ని యుద్దం లో బల్లెం లాగా అటూ ఇటూ నానా రకాల విన్యాసాలు చేసి మొత్తానికి బొమ్మ కనిపించగానే అలానే గట్టిగా బిగించి కిందకి దిగగానే ఇక మా ఇంట్లో ఒక సందడి మొదలైంది.
నాకు పండగలప్పుడు వచ్చే స్పెషల్ ప్రోగ్రాములన్నా, ఆదివారం మేలుకొలిపే రంగోలి అన్నా, బుధవారం చిత్రహార్, శుక్రవారం చిత్రలహరి ( రాను రానూ అరగంట ప్రోగ్రాం లో 20 నిముషాలు యాడ్స్ తినేసేవి) చాలా ఇష్ఠం ! ఇంక క్రికెట్ సీజన్ సంగతి సరే సరి ! మా ఇంట్లో బాటరీ సౌకర్యం కూడా ఉండటం తో కరెంట్ కట్ ఉన్నా చక్కగా అందరూ మా ఇంట్లోకి చేరేవారు.
రియాలిటీ షోలని టైటిలేసి ఈ ఫ్లాష్ బాక్ (సోది) ఏంటా అనా.. వస్తున్నా వస్తున్నా.. అక్కడికే వస్తున్నా !
రామోజు రావు గారికి యే దుర్ముహూర్తాన బల్బ్ వెలిగిందో 24 గంటలూ తెలుగు ప్రసారాలు వచ్చేలా తెలుగు చానెల్ ఒకటి ప్రారంభించాలని. మొదట్లో సంబరపడ్డా ,ఈ సంతోషం ఈ సామెత అవుతుందని ఊహించలేదు .ఇప్పుడేముంది .. ముందుంది రియాలిటీ షోల ఫెస్టివల్ అని .
**** ఇక్కడ రింగులైపోయాయి ****
అమెరికాలో ఉన్న పాపానికి మొన్న మొన్నటివరకు జెమినీ తమిళ్ డబ్బింగ్ సీరియల్స్ తో.తేజా లో వచ్చే ఎప్పుడూ వినని, చూడని అత్యద్భుతమైన చిత్ర్రారాజాలతో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న టైం లో. ఎవరో మా టీవీ మీ అమెరికా వచ్చేసిందని చెప్పగానే ఇంద్రలో వీణ డాన్సేసినంత పని చేసా. మా ఊరి వంట, సూపర్ సింగర్, అమృతం, క్రొత్త క్రొత్త సినిమాలు ఇలా అన్నీ మంచి ప్రోగ్రాములే అని ఓ నాలుగు నెలలు హాయి హాయిగా చూసేసాను. ఇంక అప్పటి నుంచి నెమ్మదిగా రంగులు తొలగి 'రియాలిటీ ' కనిపించసాగింది నా కళ్ళకి.
మా టీవీ వాడు కొన్న 25 సినిమాలనే మరో పాతికేళ్ళు వేస్తాడని, అరిగిపోయిన అయిపోయిన సీరియళ్ళనే మార్చి మార్చి 'అరే ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసినట్టుందే ' అనిపించేలా హింసపెడతాడని ఊహించలేకపోయా.. ఈ లోపు సూపర్ సింగర్ అయిపోగానే, జూనియర్ మొదలు. అది అవ్వగానే 3 మొదలు. ఇలా మూడు సంవత్సరాలు ఈ ఒక్క ప్రోగ్రాం తోనే బండి నడిపించేసాడు మా టీవీ వాడు. కొంతలో కొంత నయం ఏంటంటే 'రేలారే రేల ' ద్వార జానపదులని పరిచయం చెయ్యటం.
కానీ ఈ రియాలిటీ షోలన్నీ సెల్ ఫోన్ కంపెనీలే ఎందుకు స్పాన్సర్ చేస్తున్నాయనేది నా పీత బుర్రకి అర్ధం కాలేదు మొదట ! ఎస్ ఎం ఎస్ లంటూ ప్రతి దానికి చావగొడుతుంటే వెలిగింది అప్పుడు. ఒక పక్క ఎస్ ఎం ఎస్ ల ద్వారా, ఒక పక్క కమర్షియల్స్ ద్వారా వీళ్ళకి డబ్బులే డబ్బులని. మరి ఇంతగా కళలు దిగజారిపోయాయా అనిపించేది. ప్రతి దాంట్లోకి డబ్బు జొచ్చుకొచ్చేసి, టాలెంట్ ఉన్నా లేకున్నా మళ్ళీ మళ్ళీ ఎలిమినేట్ అయినవాళ్ళే ' వైల్డ్ కార్డ్ ' మళ్ళీ వచ్చేసి మరో నాలుగు నెలలు ప్రోగ్రాంని సా...గ..దీసే వాళ్ళు. తమ బంధువులమ్మాయో, లేక తమ స్నేహితుడో, లేక తెలిసినవారో ఉంటే చాలు.. ఎస్ ఎం ఎస్ లు వేల కొద్దీ వరదలయ్యేవి.
ఇంక అలా ప్రతిభని ఎస్ ఎం ఎస్ లతో కొలిచే దౌర్భాఘ్యం మన సంస్కృతి లా మారిపోయింది. అటు హిందీ చానెళ్ళూ కానీ, ఇటు తెలుగు చానెళ్ళు కానీ అన్నిట్లోనూ ఇదే తంతు. లేని పోని కాంట్రవర్సీలు, అరుచుకోవటం, ఏడవటం , అయినదానికీ కాని దానికీ కాళ్ళ మీద పడిపోవటం.. ఇలాంటి డ్రామాలకి కొదవే లేదు. ఈ రియాలిటీ షో లకి, దిక్కుమాలిన అతి నిక్రుష్టపు ఏడుపుగొట్టు సాగతీత సీరియళ్ళకి పెద్ద తేడా లేకుండా పోయింది.
పాటల ప్రోగ్రాములు సరే సరి, ఇంక డాన్సులంటూ చేసే వెర్రి మొర్రి వేషాలకి కొదవే లేదు. భాష రాని జడ్జీలు, సినిమాల్లో కంటే మరీ ఘోరంగా వళ్ళంతా కనిపించేలా గెంతులేసే డాన్సర్లు,చిన్న పిల్లల చేత కూడా వాళ్ళ వయసుకు మించిన హావ భావాలతో కూడిన డాన్సులు, కేకలు, పిల్లి కూతలు.. అబ్బో ఎన్నని చెప్పను.ఈ మధ్య ఇవి పరాకాష్టకి చేరింది ఓంకార్ అనే మగానుభావుడు మా టీవీ లోకి లెగ్గెట్టాక. అదృష్ఠం, చాలెంజ్ అని రెండు కళా ఖండాలు నిర్మాతగా, దర్శకుడిగా మన మీదకు వదిలాడు. దొందూ దొందే.. వీటి గురించి వ్రాయాలంటే మరో రెండు పెద్ద పేద్ద పోస్టులయ్యేట్టున్నాయి.
చివరగా మీకో డౌట్ రావొచ్చు.. ఇంత తిట్టుకుంటూ చూడాల్సిన పనేంటని..
' గతి లేక .. '
ఉన్నవే రెండు మూడు తెలుగు చానెళ్ళు. తెలుగు భాష మీద, తెలుగు నేల మీద ఆశపోక, ఆ పరిసరాలని, మనుషులని, ఇలా చూసుకుందామంటే. ఈ చానెళ్ళ వాళ్ళేమో ఇలా బాదేస్తున్నారు. ఇవన్నీ చూసాక చిన్నప్పుడు నేను చూసిన ' దూర దర్శన్ ' అతి ప్రియం గా అనిపిస్తుంది. ఈ పిచ్చి టీవీలకి ప్రత్యామ్నయం గా నిజమైన వినోదాన్ని ఇచ్చే ఒక మంచి చానెల్ ఎవరైనా పెడితే 'మా ' మంచి చానెల్ అనుకుంటూ గర్వం గా చెప్పుకోవచ్చు !
Articles
|
6 comments:
TV 9 tagiliMchaMDi boleDaMta saMdaDi
హ హ హ "అమెరికా లో వున్న పాపానికి" బాగుంది. మొన్న టి దాక మా అమ్మ మూలం గా నేను కూడా ఆ బాధితురాలినే, వెళ్ళగానే పీకించేసి బయటకు వెళ్ళి వాయువ్యాన నువ్వుల నీళ్ళు వదిలి చక్క గా వచ్చా ఇంట్లోకి... నెలకు $30 డబ్బులు కలిసి వస్తున్నాయి ప్రశాంతం గా వుంద్ ఈల్లు.
i even saw a community in Orkut for Omkar Victims.....!!!
vijay... నిజంగానా ?? ఐతే, ఇప్పుడే చేరుతున్నా... ఈ ఓంకార్ గాడేంటో.. అందరూ వాడిని 'అన్నయ్యా' అని పిలవడమేంటో.. చూడలేక చస్తున్నా..
ఆమెరికా లొ వున్న మిరె అలా అంటె ఇంక భారత దేశములొ వున్న మా సంగతి ఎమి వద్దు ఆంటె ఇంటిలొ గొల తినటానికి బొజనం కుడా పెట్టకుండా ఎవడొ పక్క వాడి ఆద్రుష్టం కొసం చుస్తు కుర్చుంటారు (ఆద్రుష్టం షొ)
aa dance programs okkate dikkayyayi kadandii tvlo. aa jiddu saagatheetha serials chudaleka(gathi leka) dance shows chudalsi vasthundhi.