•Thursday, October 29, 2009
దర్శకుడు : చైతన్య దంతులూరి
తారాగణం : నారా రోహిత్ ,వేదిక ,రణధీర్ ,సయాజీ షిండే
సంగీతం : మణిశర్మ
ముందుగా మెచ్చుకోవలసింది మాటల రచయితని, దర్శకుడిని, ఛాయాగ్రహకుడిని మరియు సంగీత దర్శకుడిని.
ఈ సినిమా ఒక సాంకేతిక పరమైన విజయం. మూస సినిమాలకు కొంత మేరకు భిన్నంగా వెళ్ళారనే చెప్పాలి. ఈ సినిమా గురించి విభిన్నమైన రివ్యూలు వచ్చాయి. కొంతమంది దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటే, మరి కొంతమంది, చెప్పిందంతా చెప్పి చివరికి మామూలు ప్రతీకారం తీర్చుకునే కధగా తేల్చేసారు. ఏవరు ఏమన్నప్పటికీ, నాకు మాత్రం ఈ సినిమా చూడాలని బలంగా అనిపించింది. మొత్తానికి ఇప్పటికి చూడటం వీలైంది. నా అంచనాలకి ఏ మాత్రం తప్పలేదు. నేను అనుకున్న్నట్టే ఉంది , నాకు నచ్చింది.
కధా పరం గా చూసినా, సాంకేతిక పరం గా చూసినా, ఇది ప్రత్యేకం గా నిలుస్తుంది. నారా రోహిత్, విలన్ గా వేసిన హాపీడేస్ అబ్బాయి రణధీర్ ఇద్దరూ బాగా చేసారు. బలమైన ప్రత్యర్ధి ఉన్నప్పుడే, హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేది. ఈ ఫార్ములాని నేను బాగా నమ్ముతాను.
కొన్ని సన్నివేశాల్లో ( చాలా వరకు కూడా ) ప్రత్యర్ధి బలమే ఎక్కువ కనిపిస్తుంది. అలాగని ఆ విలనిజంకి ఫాసినేట్ అయ్యేలా అనిపించదు. హీరొ పాత్రని ఉదాత్తతో మలిచారు. సమాజానికి మంచి చెయ్యాలనే ఆశయం, పదిమందినైనా ఒంటరిగా ఎదొర్కొనగల ధీరత్వం, ముక్కుసూటిగా తను నమ్మినదాన్ని ఆచరించే మనస్తత్వం, తండ్రికి తను ఇచ్చే గౌరవం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మంచి లక్షణాలే !
హీరోకి హీరోయిన్ కి మధ్య ఉన్న సున్నితమైన ప్రేమ సన్నివేశాలు కాని, తండ్రీ కొడుకుల మధ్యన సిద్దాంతపరమైన మాటలు కానీ, విలన్ పాత్రలో ఉండే క్రూరత్వం కానీ, అన్నిట్లోనూ అతి ఏ మాత్రం కనిపించదు.
నాకు బాగా ముచ్చటేసింది ఈ సినిమాలోని 'సంభాషణలూ'. చాలా పొదుపుగా వాడుకుంటూ, తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్నీ చూపించగలిగారు రచయిత. అలానే నేపధ్య సంగీతం. చాలా చాలా బాగుంది. చాయాగ్రహకుడు వెలుగు నీడల్ని చక్కగా వాడుకున్నాడు. చాలా సన్నివేశాల్లో' శివ ' సినిమా గుర్తొచ్చింది. దాని ప్రేరణో మరేమో కాని, శివ మాత్రం చాల సార్లు గుర్తొచ్చింది.
ఇన్ని మంచి విషయాలున్నా, కొన్ని లోపాలు కూడా లేక పోలేదు.
ప్రతి సారీ హీరోదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది, ఒక్కసారి తప్ప. అంతమందినీ ఒక్కడే చితక బాదేస్తుంటాడు. రౌడీలు కూడా పెద్దగా తుపాకులకి కాని, కత్తులకి కానీ పని చెప్పరు. అంత వివేకంతో ఆలోచించే హీరో నాన్నగారు, మాజీ నక్సల్ ఉన్నట్టుండి విలన్ మీదకు ఒక ప్లానింగ్ లేకుండా వెళ్ళ్టడం వింతగా ఉంది.
చాలా మంది అన్నట్టు, ముందు అంతా నీతులు చెప్పి చివర్లో మామూలు పద్దతిలోనే ( అడ్డ దారిలోనే ) విలన్ని ఎదుర్కోవటమేంటీ అని.
హీరో మాటల్లో " నువ్వొక సమస్యవి. కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు, వాటిని నాశనం చెయ్యటం తప్ప ". అది నిజమే అనిపిస్తుంది.
అలాంటి సమస్యే ఈ శక్తి పట్నాయక్. అప్పటికీ పద్దతి ప్రకారమే, చట్ట పరిధి లోనే ( అంటే పై అధికారి అనుమతి తోనే ) ఇదంతా చేస్తాడు భగత్ ప్రాణిగ్రాహి.
ఈ సినిమాలోని పాత్రల పేర్లు కాని, కధ జరిగిన ప్రదేశం పేరు గాని ఏవో నవలలోని పేర్లు లా అనిపించాయి.
భగత్ ప్రాణిగ్రాహి
శక్తి పట్నాయక్
సాహు
రణస్థలి
మొత్తం గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఈ సినిమాని మలచిన తీరు బాగుంది. ఇలాంటి ప్రత్యేకం గా ఉండే సినిమాలు మరిన్ని రావాలి.అన్నీ చెప్పి ఇంకొక విషయం గురించి చెప్పకపోతే ఈ రివ్యూ అసంపూర్ణమే. అది ఈ సినిమా లోని పాటలు. చాలా చాలా బాగున్నాయి. వాటి తీసిన తీరు బాగుంది. హీరో హీరొయిన్లు ఆ పాత్రలకు చక్కగా సరిపోయారు. నాకైతే నారా రోహిత్ కనిపించలేదు భగత్ ప్రాణిగ్రాహి తప్ప !
0 comments: