Author: Unknown
•Wednesday, January 13, 2010
బ్లాగర్లందరికీ ముందుగా..

సంక్రాంతి శుభాకాంక్షలు !
:)

సంక్రాంతి అంటేనే చలి మంటలు, భోగిపళ్ళు, ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులు, పిండివంటలు.


ఇది ప్రధానం గా ధాన్యాలు, పంటల పండుగ అనేమో, పల్లెటూళ్ళలోనే బాగా జరుగుతుంది. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంట రైతు కి చేతికి అంది వచ్చి ఇంటికొచ్చే సమయం, అలాగే కొత్తసంవత్సరం తో పాటుగా కొత్త కొత్త ఆశలతో సంక్రాంతి లక్ష్మి ఘల్లు ఘల్లుమంటూ విచ్చేస్తుంది. ఈ పండుగ మూడు రోజుల పండుగ.

భోగి ( పాత చెక్క సామాన్లతో, కట్టెలతో భోగిమంటలేస్తారు, చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు )





సంక్రాంతి ( ఇది ప్రధానమైన రోజు )

కనుమ ( పసువులకు కొమ్ములకు రంగులు వేసి, పసుపు కుంకుమ చల్లి పూజ చేస్తారు, అలాగే ఈ రోజు మాంసం వండుకుని తింటారు. తమిళనాడు లో ఈ రోజే ఆయుధపూజ చేస్తారు.నాగళ్ళకు, దుక్కి దున్నే సామానులకు, ట్రాక్టర్లకు పసుపు రాసి కుంకుమ చల్లుతారు.)

ఇక నా జ్ఞాపకాల లోగిళ్ళలోకి వెళ్తే...

మా ఊరూ పక్కా పల్లెటూరికి, టౌన్ కి మధ్యరకం గా ఉంటుంది. అయినప్పటికీ పల్లెటూరి వాతావరణం ఎక్కువే కనిపిస్తుంది. సంక్రాంతి మాసం మొదలవ్వగానే ఆడవాళ్ళు వారపత్రికలలోవో లేక నోట్ బుక్కులలోవో వేసిన స్పెషల్ ముగ్గుల ని స్టడీ చేస్తూ రంగం లోకి దూకుతారు. డిసెంబర్ మాసం, చలికాలం కావటం తో పొద్దున్నే లేచి చలిలో వేసేవాళ్ళు కాస్త తక్కువే ! మా వీధి అంతా రాత్రి భోజనాలయ్యాక, యుద్దం లోకి దిగినట్లు, ముగ్గు గిన్నెలని చేత బట్టుకుని, నడుము చుట్టూ చెంగులని చుట్టుకుని పోటీలు పడి ముగ్గులేస్తారు. మా ఇంట్లో నేనొక్కణ్ణే అబ్బయిని కావటం వలన, నాకూ అలా ముగ్గులని చూడటం ఇష్ఠం. జనవరి ఫస్ట్ కు, భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులూ స్పెషల్ ముగ్గులకి రంగులద్ది, Welcome New Year అంటూ వ్రాసేవాణ్ణి.





ఇక ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ఇవి ఆవు పేడతోనే చెయ్యాలి, మా ఊళ్ళో ఏమో ఆవులు తక్కువ. అందుకని పండక్కు మాత్రమే ఆ ఆవు గల వాళ్ళని బ్రతిమాలి తెచ్చి గొబ్బిళ్ళు పెట్టేవారు. ఆ గొబ్బిళ్ళ పైన పూలు పెట్టేవాళ్ళు.

ఈ మాసం అంతా, తెల్లవారు ఝామున 3 , 4 గంటల మధ్యలో భజన వచ్చేది హారతి తీసుకుని. అదే గుర్తు, లేచి చదువుకోవటానికి. ఇంక తెల తెల వారుతుండగా, హరిదాసు హరిలోరంగ హరీ అంటూ తల మీద కిరీటం లాంటి మెరుస్తున్న పాత్రతో, భజన చేసుకుంటూ వస్తాడు. తనకు, బియ్యం కానీ, పప్పు దినుసులు లాంటివి కానీ వేసేవాణ్ణి.





ఆ తరువాత గంగిరెద్దుల మేళం వచ్చేది. అయ్యవారికీ దణ్ణం పెట్టు, అమ్మగారికీ దణ్ణం పెట్టు అంటూ విచిత్రం గా ఆడించేవాడు గంగిరెద్దుని.



బాగా చిన్నప్పుడు అయితే ఈ మాసం లోనే మా తాతయ్య నాకు విల్లు చేసి ఇచ్చేవాడు వెదురు తో, దానికి గోగుపుల్లలని బాణాలు గా పెట్టుకుని కొబ్బరి ఆకులకి, చెట్లకీ వేస్తూ ఉండేవాణ్ణి. అలాగే పతంగులు కూడా, డాబా మీదకు వెళ్ళి మా మామయ్య తయారు చేసిన గాలి పటాలని పోటీలు పడి ఎగరేసేవాళ్ళం !

ఇక పండుగ దగ్గరకు వచ్చే సమయానికి, అమ్మ వాళ్ళు పిండి వంటల హడావిడిలో పడిపోయేవాళ్ళు. వాటికి నేను ఉడుత సహాయం గా, పిండి కొట్టటమో లేక పాకం రుచి చూడటమో, ఏదో చిన్న చిన్న పనులు చేసేవాణ్ణి. ఈ పండక్కి అరిసెలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అందులోనూ నేతి గారెలు అలా వేడి వేడిగా బాండీ లోంచి తీయగానే తింటూ ఉంటే ఉంటుందీ నా సామిరంగా !

పండుగకి కాస్త ముందుగానే కొత్త బట్టలు టైలర్ కి ఇచ్చి ఆ ముందు రోజూ తప్పకుండా కుట్టి ఇచ్చేట్టూ చూసుకునేవాళ్ళం. భోగి పండుగ రాగానే తలంటు పోసుకుని, దేవుడి పటాలన్నీ కడిగి, తుడిచి శుభ్రం చేసి వాటికి గంధం, పసుపు, కుంకుమ అద్దేవాణ్ణి. సంక్రాంతి రోజు పెద్దగా చేసేది ఏమీ ఉండేది కాదు, పూజ చేసుకోవటం దణ్ణం పెట్టుకోవటం. ఇక కనుమ రోజు, మా తాతయ్య వాళ్ళ గేదెలకి, వాటీ దూడల కొమ్ములకి రంగులు రాసి, వాటి మీద పసుపు కుంకుమ చల్లేవాళ్ళం. ఆ రోజు సుష్ఠిగా నాన్-వెజ్ లాగించి ఊరి మీద పడేవాళ్ళం. ఈ మూడు రోజూల్లో ఏదో ఒక సినిమాకి తప్పకుండా వెళ్ళేవాళ్ళం.

సంక్రాంతికో, దసరాకో సరిగా గుర్తులేదు కాని, ఎద్దుల పందాలు జరిగేవి మా ఊళ్ళో. ఇది చాల ఫేమస్! చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు, వేరే జిల్లాల నుంచి కూడా తమ ఎద్దులని తీసుకువచ్చి పోటీల్లో పాల్గొనేవాళ్ళు. ఈ పోటీల్లో ఒంగోలు నుంచి వచ్చింది ఎద్దులు చాలా బాగుండేవి. పగలంతా పందాలు, సాయంత్రానికి ఆ ఎద్దులను అలంకరించి వీధుల్లో తిప్పేవాళ్ళు. ఇది చాల సంబరం గా జరిగేది.

ఇలా సంక్రాంతి మాసం అంతా ఎంతో సరదాగా, ఉత్సాహం గా, సంతోషం గా గడిపేవాళ్ళం. నేను ఇండియాలో ఉన్నంత వరకు, సంక్రాంతికి తప్పకుండా ఇంటికి వచ్చేవాణ్ణి. ఇప్పుడు ఇవన్నీ చాల వరకు ఉండకపోవచ్చు. ఏదో మామూలు పండగలా గడిచిపోతుంది, అంతే !



This entry was posted on Wednesday, January 13, 2010 and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 comments:

On January 13, 2010 at 4:33 PM , చిలమకూరు విజయమోహన్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు

 
On January 13, 2010 at 10:30 PM , మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

 
On January 14, 2010 at 2:40 AM , వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వేణుగారు. కమ్మటి ఙ్ఞాపకాలు భలే రాశారు :-)

 
On January 14, 2010 at 4:37 AM , జయ said...

చాలా చక్కటి సంక్రాంతి పండగండి మీది.సంక్రాంతికి మీ ఊరికి వెళ్ళండి. ఇలాగే ఎప్పటికీ జరుపుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.

 
On January 15, 2010 at 9:46 AM , Unknown said...

@ Vijaya Mohan garu
@ Maala Kumar garu
@ Rao garu
@ Venu Srikanth
@ Jaya garu

Thank you for stepping in and gave your comments and wishes !

:)

 
On January 22, 2010 at 4:27 PM , antaryagam said...

కోస్తాంధ్ర అయితె కోడి పందేలు, హరి దాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు,పిల్లలకి భోగి పళ్ళు, తెలంగాణా ప్రాంతం అయితే గాలి పటాలు చూసే వాళ్ళకి రెండు కళ్ళు చాలవన్నట్లు ఉంటుంది.

ఈ సంవత్సరం నేను అమెరికా లొ ఉండి కూడా బొమ్మల కొలువు పెట్టి, మా మనవలకి భోగి పళ్ళు పోసి, చుట్టు పక్కల ఉన్న భారతీయులని పిలిచి సంబరం చేసేటప్పటికి అందరు ఎంతో సంతోషించి భారత దేశం లో లేక పొయినా పండుగ తము మిస్స్ అవ్వలేదని, తమ ఆనందాతిశయాలని మాతో పంచుకున్నారు.

సంక్రాంతి ని నేను మిస్స్ అవలేదనే భావం కలిగింది.

సందడి అంతా మన పండుగ ల లో ఉన్నదనిపించింది.

 
On July 18, 2010 at 7:01 AM , satish said...

venu garu late ga post chesthunanduku emi anukovadu :) .. e samvatsaram modati sariga pandaga jarupu koleka poyina.. me blog dwara patha teepi gnapakalanu gurthu chesukunnanu ..thank u for that :) ...

naku telusi ma palleturu lo e pandaga meekana baga jarupukuntamu anukuntuna :) .. danyam entiki ravadam .. padi pasuvalanu, tractor ni kadagatam :) ... adrustavasathu enka ma vooriki haridasu, gangireddi vallu vasthunnaru :) ... amartyagam garu annatu ga kodi pandalanu baga chuse vallamu :) ....