Author: Siri
•Saturday, August 14, 2010
తల్లికి ఏవో పుస్తకాలు తెచ్చుకోవాలి అని చెప్పి పావని ఇంటికి బయలుదేరింది కావ్య. 

         "ఎక్కడకు వెళ్ళి ఉంటుంది? ఆ సుబ్బరావుతో ఎక్కడికైనా వెళ్ళిందా? ఈ మధ్య ఏమి చెప్పడం లేదు. అంతా తన నుండి కూడా దాచడం మొదలు పెట్టింది" మనసులో అనుకుంటూ కావ్య వడివడిగా పావని ఇంటి వైపు నడుస్తోంది. 

         కొన్ని రోజులు ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి కావ్యకు. సుబ్బారావు ఎప్పుడు ఎదురు పడినా కావ్య వంక అదోలా చూడడం, పావనితో పాటు కావ్యకు కానుకలు ఇవ్వడం చేస్తున్నాడు. 

         ఒక రోజు కావ్య ఒంటరిగా ఇంటికి వెళ్తుంటే స్కూటర్ మీద వచ్చి ఏదో ఇవ్వబోయాడు సుబ్బారావు. "నాకెందుకు ఇస్తున్నారు " అని ప్రశ్నించినప్పుడు, "మీరంటే నాకు ఏదో చెప్పలేని అభిమానం. అసలు మిమ్మలిని చూసే నేను పావనితో స్నేహం చేసింది" అని వికారంగా సమాధానమిచ్చాడు. కావ్యకు ఎక్కడలేని కంపరం పుట్టింది. 

         "చూడండి ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఇక నుండి పావని ఉన్నప్పుడు తప్ప నాతో కలిసేందుకు ప్రయత్నం చేయకండి" అని గట్టిగా చెప్పేసి వెనక్కి చూడకుండా వచ్చేసింది. 

         అదే విషయం పావనికి నచ్చచెప్పడానికి చూసింది, కానీ పావని వినిపించుకొనే స్దితిలో లేకపోయింది. 
ఇంకా తన మీదే "అందరు మగాళ్ళు నీ వెనకే తిరిగుతారు అని నీ ఉద్దేశ్యం కదూ? మొదటి సారి ఒక అబ్బాయి నన్ను ఇష్ట పడితే తట్టుకోలేకపోతున్నావు" అని ఎప్పుడూలేని కసి నిండిన కళ్ళతో అంది పావని. కావ్య ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది. స్నేహంలో ఇలాంటి మలుపు కూడా వస్తుంది అని ఊహించలేకపోయింది. 

         "సరే ఇంక ఈ విషయం గురించి మనం మాట్లాడద్దు. నీకు కోపం చల్లారాక ఆలోచించి నీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యి. ఇంక నేను నీకు ఎలాంటి సలహాలు ఇవ్వను" అని చెప్పి వచ్చేసింది. అంతే మళ్ళి ఎక్కువగా మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరూ. 

         పావని ఇల్లు దగ్గరకు వచ్చే కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది కావ్యకు. 

         వెళ్ళగానే పావని తల్లి "కావ్యా నా కూతురు ఎక్కడికెళ్ళిపోయింది?" అని రాగాలు తీయడం ప్రారంభించింది.


 అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు కొంత మంది చేరారు.

         "ఇపుడు సాయంత్రమేగా అయ్యింది. ఇంకాస్త సేపు చూడండి. ఇంకెవరైనా ఇంటికి వెళ్ళి ఉండచ్చు కదా?" అని అంటున్నారు ఎవరో.

         "కావ్యా దానికి నువ్వు తప్ప ఇంక ఎవరు లేరు కదా స్నేహితులు? నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళి ఉంటుందో?" అని అడుగుతోంది ఆవిడ.

         కావ్యకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. "లేదు నాకు తెలియదండి. నాకు ఏమి చెప్పలేదు. ఈ మధ్య నాతో ఎక్కువగా మాట్లాడట్లేదు" అంది భయంగా. ఎక్కడకు వెళ్ళి ఉంటుందో అని కావ్యకు అనుమానం ఉన్నా నోరు తెరిచి చెప్పలేకపోయింది.

         "ఈ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టినా ఏమి చేసినా ఇంతే. ఎవరి గురించి పట్టించుకోరు. ఒళ్ళు బలిసి తిరుగుతారు" అని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు పావని తండ్రి. ఈ రోజే కాస్త మెలుకువగా కనిపించాడు ఆయన.

         కావ్య బిక్క చచ్చిపోయింది. ఆయన తిడుతున్నది తననో లేక వెళ్ళిన పావనినో అర్ధం కాలేదు. ఇలాంటి వాతవరణమే ఆమెకు కొత్త. ఏదైనా చిన్నగా మాట్లాడుకొని మందలించడమే గానీ ఇలా శాపనార్ధాలు పెడుతూ ఊరంతా వినిపించేలా గోల చేయడం ఆమె పెరిగిన వాతావరణంలో ఎప్పుడూ లేదు, ఎప్పుడూ చూడలేదు. ఆయన మాత్రం అడ్డు ఆపు లేకుండా తిడుతూనే ఉన్నాడు. పావని చెల్లెలు మాత్రం ఇదంతా మామూలే అన్నట్టు పిచ్చిగా చూస్తోంది.

         "ఈ కాలం పిల్లలకు చదువు వస్తుందో లేదో కాని ప్రేమలు దోమలు మాత్రం మహా బాగా నేర్చుకుంటారు" అని ఇంకెవరో అంటున్నారు.

         "ఈ మధ్య ఇలాగే అవతల వీధిలో ఒక పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో చాకలాడితో వెళ్ళిపోయింది" అని చెప్తోంది ఒకావిడ.

         కావ్యకు చెమటలు పట్టేసి ఊపిరాడనంత పనయ్యింది. తట్టుకోలేక "ఏమండి నేను వెళ్తున్నాను. ఏదన్నా అవసరం అయితే పిలవండి" అని చెప్పి వెనకాల ఏదో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వచ్చేసింది.

         "దేవుడా! పావని ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడు" అని వేడుకుంది కావ్య. 



ఇంట్లో ఏమీ చెప్పకుండా ఏమీ జరగనట్టు ఉండిపోయింది కావ్య. మనసులో భయం ఆవహిస్తోంది. తనకే తెలియకుండా ఇంట్లోకి బయటకు తచ్చాడుతోంది.

         "ఎందుకే కాలుగాలిన పిల్లి లాగా తిరుగుతున్నావు, పోయి చదువుకోరాదు?" అని తల్లి మందలించేసరికి లోపలకు వచ్చింది.

         కావ్య పుస్తకం పట్టుకుందే గానీ ఆలోచనలు అన్నీ పావని చుట్టూనే.

         నెమ్మదిగా అందరూ నిద్రకు ఉపక్రమించారు. కావ్య కూడా ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుంది. కొంచం సేపటికి బయట ఎదో అరుపులు వినిపించాయి. కావ్య ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది.

         ఎవరో గట్టి గట్టిగా అరుస్తున్నారు. కావ్య బయటకు వెళ్ళి చూసేసరికి పావని తండ్రి పూర్తిగా తాగేసి ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. కొంచం సేపటికి అందరూ బయటకు రావడం ప్రారంబించారు. కావ్యకు చేతులు ఆడటంలేదు. భయంతో సన్నగా వణికింది. తల్లి తండ్రి కూడా బయటకు వచ్చి చూస్తున్నారు. పావని తండ్రి తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తిట్టడం ప్రారంబించారు "అర్ధరాత్రి ఏంటి గోల ?" అని. కావ్య తండ్రి సంగతి ఏంటో చూద్దామని వెళ్ళబోతుంటే కావ్య వెళ్ళవద్దని వారించింది.

         "నా కూతురు కనిపించడంలేదు. కావ్యా ?కావ్యా? నీకు తెలుసు ఎక్కడుందో చెప్పు. కావ్యా? కావ్యా?" అని పెద్దపెద్దగా అరుస్తున్నాడు పావని తండ్రి.

         చుట్టుపక్కల వాళ్ళందరూ కావ్య వంకే చూస్తున్నారు. అందరూ తన వంకే చూడడం కావ్యకు ఇబ్బందిగా ఉంది. తండ్రి వైపు చూసింది భయంగా. ఆయన కావ్య వంక "ఏమిటి ఇదంతా?" అన్నట్టు కళ్ళతో కోపంగా చూస్తున్నారు. కావ్య తడబడుతూ విషయమంతా చెప్పింది.

         కావ్య తండ్రి నెమ్మదిగా పావని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఏదో సర్ది చెప్పి పక్కింటి శ్రీనుగాడు సహాయంతో రిక్షా ఎక్కించి పంపించారు.

         "ఇంకా పావని రాలేదన్న మాట, ఎందుకిలా చేసింది ఈ పిల్ల?" అని విసుక్కుంది కావ్య మనసులోనే.

         తండ్రి విసురుగా లోపలకు వెళ్ళి "కావ్యా"అని గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చి నిల్చుంది. తల పైకెత్తి చూసేలోపు చెంపకు చెళ్ళుమని తగిలింది తండ్రి చెయ్యి. ఏమయ్యిందో అని కావ్య తల్లి,నానమ్మ పరిగెత్తుకొని వచ్చారు. కావ్య బుగ్గ మీద చేతితో అలా నిల్చొని ఉండిపోయింది. 



"ఏం జరుగుతోంది ఇంట్లో? అందరూ ఎం చేస్తున్నారు? ఒక్క ఆడపిల్లను చూసుకోలేరా? ఎక్కడకు వెళ్తోంది, ఏం చేస్తోంది చూసుకోవద్దా? రేపటి నుండి నాకు చెప్పకుండా ఎక్కడకు వెళ్ళడానికి లేదు" అని చెప్పేసి లోపలకు వెళ్ళిపోయారు.

         "అలా పిల్లను పట్టుకొని బాదుతారా ఎవరైనా?" అని కావ్యను దగ్గరగా తీసుకుంది నానమ్మ.

         ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తండ్రి ఈ రోజు చెయ్యి చేసుకోవడం తట్టుకోలేకపోయింది. పరిగెత్తుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకొంది కావ్య.

         "కావ్యా ...అమ్మాయ్ తలుపు తియ్యి" అని కంగారుగా అంది నానమ్మ.

         "నన్ను కొంచెం సేపు వదిలెయ్యి నానమ్మ. నాకేం కాలేదు. నువ్వెళ్ళి పడుకో" అంది కావ్య వెక్కి వెక్కి ఏడుస్తూ.

         "అది కాదు. ముందు నువ్వు తలుపు తియ్యి" అంది నానమ్మ అక్కడే కూర్చొని. కావ్య తలుపు తీసేవరకు ఊరుకోలేదు. తలుపు తీసి కావ్య వెంటనే వెళ్ళి రెండు కాళ్ళు మడతపెట్టి ముఖం దాచుకొంది.

         "రేపే వెంకట్ కి ఫోన్ చేస్తాను. మీ ఇద్దరకి పెళ్ళి చేసేస్తే ఏ గొడవా ఉండదు" అంది నానమ్మ.

         "నానమ్మా అలాంటి పని చేసావంటే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను" అని మొహం తిప్పేసి పడుకుంది కావ్య.

         "ఓరి భగవంతుడా అందరికి మంచి బుద్ధిని ప్రసాదించు" మనసులో అనుకుంది కావ్య పక్కకు తిరిగి పడుకుంటూ.

         మర్నాడు ప్రొద్దున్న లేచేసరికి కావ్య మూలుగుతూ కనిపించింది. ఏమయ్యిందా అని నానమ్మ దగ్గరకు వచ్చి చూసింది. కావ్య ఒళ్ళంతా కాలిపోతోంది.

         "కావ్యా? లే ఏమయ్యింది?" అని అంది నానమ్మ. కావ్యకి ఏమి వినిపించడం లేదు. రాత్రి జరిగిన సంఘటనే గుర్తుకు వస్తోంది. నానమ్మ కంగారుగా వెళ్ళి తండ్రిని పిలుచుకుని రావడం అంతా కలలాగా ఉంది కావ్యకు. తండ్రి హడావుడిగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ హడావుడిలో రాత్రి జరిగినది అంతా అందరూ కొంతవరకు మర్చిపోయారు.

         వారం రోజులు కదలడానికి లేదని చెప్పారు. ప్రొద్దున్న లేస్తూనే గుర్తుకు వచ్చింది కావ్యకు రేపటి నుంచి పరీక్షలు అని. పుస్తకాలు తీయబోయింది. నీరసంతో దబ్బున పడిపోయింది. 



"పడుకోకుండా ఏం చేస్తున్నావు?" అని తండ్రి లోపలకు రావడంతో సర్దుకొని మంచం పైన కూర్చొంది.

         "రేపటి నుండి పరీక్షలు నాన్నా" అంది కావ్య నీరసంగా.

         "చూడు! డాక్టర్ నిన్ను అస్సలు కదలకూడదని చెప్పారు. పరీక్షలు రాయకపోతే ఇప్పుడు మునిగిపోయేది ఏమి లేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకో అప్పుడు ఏం చెయ్యాలి అని నేను ఆలోచిస్తాను" అని అనేసరికి కావ్య తండ్రి వంక బేలగా చూసింది. "అది కాదు నాన్నా" అని ఏదో చెప్పబోయింది.

         "చూడు కావ్యా! నేను ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాను అని నీకు నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇకనుంచి నేను తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తు మంచిగా ఆనందంగా ఉండాలనే, సరేనా? ఇక ప్రశాంతంగా పడుకో. ఇప్పుడు ఈ పరిస్దితిలో నువ్వు బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు" అని చెంప మీద చిన్నగా రాసి వెళ్ళిపోయారు.

         నిన్న కొట్టిన చెంపమీద ఏదో మందు రాసినట్టు అనిపించింది కావ్యకి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని అడిగే ధైర్యం లేదు. ఇంట్లో ఎవరికి లేదు ఆ మాటకొస్తే.

         "ఏది జరిగినా, ఏ నిర్ణయమైనా ఇంక తన జీవితం తండ్రి చేతిలో ఉంది. మంచి అయినా చెడు అయినా ఇక తండ్రి చూపించిన దారిలో అడుగులు వెయ్యడం మాత్రమే తన కర్తవ్యం" అని అనుకుంది కావ్య.

         కళ్ళు తిరిగినట్టు అయ్యి కళ్ళు మూసుకుంది కావ్య. ఎందుకో బావ గుర్తుకు వచ్చాడు. "ఇంక ఇంతవరకేనా బావ? రేపు ఎక్కడకు వెళ్తుందో తన జీవితం. అక్కడ బావ, తండ్రి ఇద్దరు ఉండరు. వాళ్ళు లేని జీవితం తను బ్రతకగలదా? ఎంతమంది అమ్మాయిలు బ్రతకటం లేదు? తన తల్లి కూడా అలా వచ్చి కొత్త ప్రపంచం సృష్టించుకున్నదే కదా?" ఇలాంటి ఆలోచనలతో మనసంతా భారమయిపోయింది.

         చాలా మంది ఆడపిల్లలు పెళ్ళి గురించి కలలు కంటారు. కావ్యకు మాత్రం తన సురక్షితమైన ఈ చిన్ని లోకం నుండి విడిపోవడం అంటే పీడ కలలాగా ఉంది. ఏదో కావాలని ఉంది. ఏదో ఎవరికో చెప్పాలని ఉంది. మనసులోని ఆవేదనను చెప్పేందుకు మాటలు లేవు. వినేందుకు మనుషులు లేరు.

         సాయంత్రం సన్నజాజి పూలు కోస్తూ ఏదో ఆలోచిస్తోంది కావ్య. ఇంతలో పక్కింటి శ్రీను హడావుడిగా పైకి వచ్చి "మీ నాన్న గారికి ఒంట్లో బాగోలేదుట. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. స్కూల్లో పిల్లలు కనిపించి చెప్పారు" అన్నాడు. 
This entry was posted on Saturday, August 14, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 comments:

On August 15, 2010 at 12:02 AM , diamond said...

siri garu,story ni chala baaga narrate chesthunnaru...begining nunchi me story ni follw avuthunnanu...:)

 
On August 15, 2010 at 1:12 AM , వంశీ కిషోర్ said...

ఎప్పుడూ పల్లెత్తు మాట అనని నాన్న ఒక్క సారిగ కొదితె ఎంత బాదగ ఉంటుందో...

వచ్చే టపా కొసం ఎదురు చూస్తున్నాను.

 
On August 16, 2010 at 3:54 AM , satish said...

siri garu .. eppati laga e bagam kuda bagundi ... migilina vati meda koncham emotional ga anipinchindi ... as usual ga last lo suspense lo pettaru ... will be waiting for next part ..

 
On August 16, 2010 at 10:24 AM , Lathanjal said...

పావని ఎక్కడుందో అని తెలుసుకోవాలని ఉందండి...త్వరాగా తర్వాతి పోస్టు రాయండి..

 
On August 18, 2010 at 2:10 AM , Chaitanya said...

nijanga chala baga undandi..chala familiar ga edo mana intlo srory nemo anipinchetatlu.
waiting for the next post.