Author: Siri
•Thursday, August 05, 2010
  "చూడు నాన్నగారు చాలా అస్దిమితంగా ఉన్నారు. ఇప్పటికే బావ పెళ్ళిలో జరిగిన దాని నుండి పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి వస్తే ఆయన తట్టుకోలేరు. ఆయన నీమీద ఎంతో ప్రేమ పెట్టుకున్నారు. నీకు వేరే ఊరిలో మంచి కాలేజ్ లో ఇంజినీరింగ్ లో సీట్ వచ్చినా పెళ్ళి అయ్యాక ఎలాగూ దూరమయిపోతావని నిన్ను విడిచి ఉండలేక, ఉన్న నాలుగు రోజులూ కళ్ళెదుటే ఉండాలని అనుకొని ఇక్కడే చేర్చారు. ఇలాంటిది ఏదన్నా జరిగితే ఆయన మనసు విరిగిపోతుంది." అంది అమ్మ ఏడుస్తూ. 

         "నిజంగా నాకేమి తెలియదమ్మా" అంది కావ్య తనూ ఏడుస్తూ ఇంకా ఏమి చెప్పాలో తెలియక. 

         "సరే నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. నేను ఎలాగో నాన్నగారికి నచ్చచెపుతాను. ఏడవకు కళ్ళు తుడుచుకో" అంది అమ్మ ప్రేమగా. 

         కావ్య ఏమి తప్పు చేసి ఉండదని ఆవిడకు తెలిసినా ఎక్కడో ఒక భయం. ఆడపిల్లను కన్న ప్రతి కన్న వాళ్ళకు ఉండే భయమే ఆవిడను అనుమానించేలా చేసాయి. ఒక మంచి నిర్ణయం అనేది మనిషికి తనకు ఉన్న అనుభవాలను తూచి ఆలోచించి తీసుకోవడం వల్ల వస్తుంది. కానీ ఆ అనుభవం అన్నది కొన్ని తప్పులు చేసి తప్పు ఒప్పులు తెలుసుకోవడం వల్ల వస్తుంది. ఒక మధ్య తరగతి ఆడపిల్లకు నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా చేస్తుంది లోకం. ఒక తప్పు చాలు ఆమె జీవితం అంతా శిక్ష అనుభవించడానికి. అందుకే ఆడపిల్లలను అందమైన గాజు బొమ్మల్లా పెంచుతారు. అవి విరిగి పోకుండా కాపాడుకోవాలని చూస్తారు. ఈ గాజు బొమ్మను ఇంకొకరి ఇంట్లో అందంగా అలంకరించేవరకు కంటికి నిద్ర లేకుండా జీవిస్తారు. కానీ ఆ గాజు బొమ్మలోనూ ఒక మనసు ఉంటుందని చాలా మంది గుర్తించరు. గుర్తించినా గౌరవంగా జీవించడం ముందు దానికి అంత ప్రాముఖ్యం లేదని భావిస్తారు. 

         కావ్య తండ్రి ముందే భోజనం తినేసి వెళ్ళి పడుకున్నారు. కావ్యకు దుఖః ముంచుకొచ్చింది. తండ్రి ఒక్క మాట మాట్లాడి ఉంటే బాగుండు అని. ఏదో తిన్నాను అన్నట్టు తిని వెళ్ళి పడుకుంది. ఆలోచనలతో నిద్ర దూరమయ్యింది. 

         "ఇంకో నెల రోజుల్లో పరీక్షలు. మనసు దేని మీద లగ్నం కావటం లేదు. అన్నివైపుల నుండి ఏదో రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చదవాలని ఏదో సాధించాలని లేదు. తండ్రికి నచ్చిన విధంగా నడచుకోవడమే తనకి ముఖ్యం" అనుకుంది కావ్య. 

         ఆమె కన్నీళ్ళకి తలగడే తోడుగా నిలిచింది అ రాత్రంతా. 



కావ్యకు ఇలాంటి ప్రేమలేఖలు రావడం ఏమీ కొత్త కాదు. కానీ తండ్రి దృష్టిలోకి వెళ్ళడం మొదటిసారి. కాలేజ్ లో చేరిన మొదటి రోజు నుండి ఆమె ఇదంతా అనుభవిస్తూనే ఉంది. మౌనంగా సంఘర్షణ పడుతూనే ఉంది. మొదట్లో ఆమెకు ఒకరకంగా ఇలా తన కంటూ ప్రత్యేకత చూపిస్తున్నందుకు ఏదో తెలియని సంతోషం కలిగింది, తెలియని గిలిగింతలకు లోనయ్యింది. రెండు రోజులు వెంట పడ్డ అబ్బాయి మరునాడు రాకపోతే ఎందుకు రాలేదా అని ఎదురు చూసేది. ఆమె వెంట పడ్డ అబ్బాయిలు అలుపు ఎరగకుండా తిరుగుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి పాపం అనిపించేది. ఎండలో వానలో ఎదురుచూసేవాళ్ళు. కావ్య వాళ్ళని చూసి చిరాకు పడినప్పుడల్లా పావని మండిపడేది. "పాపం నీకోసం వస్తే అలా మూతి తిప్పుకుంటావేంటి? అదే నా వెంట పడితేనా ఎంత గర్వపడేదాన్ని" అని వెక్కిరించేది.

         ఆ వెంట పడ్డవాళ్ళలో కొంతమంది కాలక్షేపానికి వచ్చినవారు ఉన్నారు. కొంత మంది నిజంగా ప్రేమించి ఆరాధించినవారూ ఉన్నారు. ఇంకొంత మంది బెదిరించి బయపెట్టినవారు ఉన్నారు. కావ్య మాత్రం ఎవరికి ఎలాంటి సమాధానం ఇచ్చేది కాదు. దానికి చాలా మంది గిట్టని వారు "అందమైనదని పొగరు" అని కూడా బిరుదు ఇచ్చారు.

         కావ్య పట్టణంలో ఉన్నా సామాన్యంగానే ఉండేది. తండ్రికి నచ్చని బట్టలు కట్టుకునేది కాదు. ఆమెకు కొత్త సంవత్సరం వస్తోంది అంటే భయంగా ఉండేది. ఆమెకు లేఖలు రాయాలని తపించే వాళ్ళు కోకొల్లలు. తండ్రికి తెలియకుండా ఎన్నో చింపి పారేసింది. చివరకు ఆమె ఇంటి చివరన ఉండే మెడికల్ షాప్‌కి కూడా తన పేరిట రావడం ప్రారంభించాయి. కొంత మంది ఆడపిల్లల పేర్లతో రాస్తే ఇంకొందరు ఆమె వెళ్ళే దార్లో విసిరేవాళ్ళు. ఇదంతా చూడగా చూడగా ఆమెలో భయాన్ని పెంచాయి.

         పావని దగ్గరకు చెల్లాయ్ అని సహాయంకోసం వచ్చిన వారు ఉన్నారు. పావని వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడల్లా కావ్యకు కోపం వచ్చేది. "ఇంత మందిలో ఎంత మందిని ప్రేమించమంటావు? ప్రేమ అంటే మంచినీళ్ళు తాగినంత తేలికగా చెప్తున్నావు. వీళ్ళల్లో ఎంత మందికి దాని అర్ధం తెలుసు? ఒకడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెంటపడిన వాడు డిగ్రీ లోకి వెళ్ళేసరికి ఆ కాలేజ్ దూరం అని తెలిసి ఇంకో ఇంటర్ అమ్మాయి వెంటపడ్డాడు. అతనినా ప్రేమించాలి? ఇంకొకడు వెంట పడి మా అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది అండి. ఎంత కట్నం వచ్చినా వద్దనుకొని మీ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. కట్నం తీసుకోకుండా వదిలెయ్యడం అతి పెద్ద త్యాగం అన్నట్టు మాట్లాడే అతనిని ప్రేమించనా? నేను ఇలాగే బాగున్నాను తల్లి. నన్ను వదిలెయ్యి" అని కోపంగా జవాబు చెప్పేది.

         చాలా మంది అమ్మాయిలకన్నా కావ్యకు ఒకింత ఆలోచన ఉంది అని చెప్పాలి. పావని కావ్య కన్నా చదువులో చాలా తెలివైనది. కాని కొన్ని విషయాల్లో పావని కన్నా కావ్య ఆలోచనతో ప్రవర్తిస్తుంది. 



 తల్లి, తండ్రి ఏదో పనిమీద బయటకు వెళ్ళడంతో నానమ్మ పక్కన చేరింది కావ్య. ఇంట్లో మనసు విప్పి మాట్లాడగలిగే ఒక్కే మనిషి ఆవిడ. ఏ విషయం అయినా భళ్ళున కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. దానికి ఎవరు సనుక్కున్నా, పట్టించుకోక పోయినా అవిడ దారి ఆవిడది .అందుకే ఆవిడకు చివరిదాకా ఏదీ తెలియనివ్వరు.

         కావ్య ఏదో ఆలోచనలో ఉండడం గమనించి, "ఏమిటి ఏమయ్యింది? మొహం అలా నీరసంగా ఉంది? ఒంట్లో గానీ బాగోలేదా?" అని దగ్గరగా వచ్చి నుదురు పట్టుకొని చూసింది.

         "అదేం లేదు నానమ్మ. నేను బాగానే ఉన్నాను" అంది కావ్య.

         "బాగానే ఉండడం ఏమిటీ? తిండి సరిగ్గా తినవు. కాలేజ్, చదువు అని తిరుగుతావు. ఇప్పుడే సరిగ్గా తినాలి. ఆరోగ్యం ఏమవుతుందే?" అంది ప్రేమగా మందలిస్తూ.

         ప్రేమగా పలకరింపు కోసం ఎదురు చూస్తున్న కావ్యకు ఏడుపు తన్నుకు వచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ నానమ్మ వంక చూసింది.

         "ఏమిట్రా ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు? ఎం జరిగింది అసలు" అంది నానమ్మ కంగారు పడుతూ.

         "ఏం లేదు నానమ్మ ఇది బాధ కాదు. నీ ప్రేమ" అంది కావ్య రెండు బుగ్గలు గట్టిగా లాగుతూ.

         "హమ్మయ్య ఇలా నువ్వు అల్లరి చేస్తే గానీ నా మనసు కుదుట పడదు. ఏమిటో ఇలా దిగులుగా ఉంటే ఏమిటో అని కంగారు పడ్డాను" అంది నానమ్మ.

         "నానమ్మ ఒకటి అడుగుతాను చెప్తావా?" అడిగింది కావ్య.

         "ఏమిటే అడుగు. నేనెప్పుడైనా దాచానా ఏదైనా నీ దగ్గర? అడుగు" అంది నానమ్మ మామూలుగా.

         "ఎవరిని అడిగే దైర్యం లేక అడగలేదు. అక్కడ పెళ్ళిలో ఏం జరిగింది? నాన్న ఎందుకు బావతో కోపంగా మాట్లాడారు?"

         "అదా? అదీ..." అని తటపటాయించింది నానమ్మ.

         "ఏం నానమ్మా చెప్పవా?" బ్రతిమిలాడింది కావ్య.

  "అదేం లేదురా. మీ నాన్న ఎట్టి పరిస్తితుల్లో నీకు తెలియకూడదు అని చెప్పాడు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా నీకు. నేను చెప్పాను అని తెలిస్తే కోపగించుకుంటాడు. ఒకప్పుడు మీ తాతయ్యకు భయపడని నేను ఇప్పుడు వీడికి భయపడుతున్నా" అని కొంచెం సేపు ఆలోచించి మళ్ళి తనే చెప్పడం ప్రారంభించింది.

         "ఏముంది మీ మామయ్య , హరిణి బుద్ది తెలుసు కదా? సంతోషం గానే వెళ్ళాము. కాని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అక్కడి పరిస్తితి వేరే అని. నాన్నని కనీసం పలకరించడం కూడా లేదు. వెంకట్, అత్తయ్య మాత్రమే వచ్చారు. వచ్చేటప్పుడు మామయ్య మీ నాన్నాని గదిలోకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడాడు. ఆతరువాత తెలిసింది. నీ పెళ్ళి వీలైనంత తొందరగా చెయ్యమని డబ్బు దానం చేసాడు ఆ మహానుభావుడు. ఏమీ అర్ధం కాని మీ నాన్న అయోమయంలో పడ్డాడు. దానికి వెంకట్ మీద ఎదైనా ఆశలు ఉంటే వదులుకోమని. ఇంకా డబ్బు అవసరమైతే పంపుతానని చెప్పాడు. సంగతి అర్ధమైన మీ నాన్న ఆ డబ్బు ఆయన మొహం మీదే కొట్టి కోపంగా వచ్చేసాడు. వెంకట్, అత్తయ్య ఎంత చెప్పినా వినకుండా వచ్చేసాడు. నేను మీ అత్తయ్య అక్కడ ఇక్కడ నచ్చచెప్పలేక నోరు మూసుకొని ఉండిపోయాము. అదీ జరిగిన సంగతి" అంది నానమ్మ తల పట్టుకొని.

         "నా వల్ల అందరికి ఎంత బాధో కదా? అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది" అంది కావ్య కోపంగా.

         "ఏమిటీ పిచ్చి మాటలు? ఎవరి బుద్దో చెడిందని నిన్ను నువ్వు నిందించుకోవడం ఏమిటి? ఎవరి ప్రవర్తనకు వాళ్ళే బాధ్యులు. ఇంకొకరు కాదు. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు" అంది నానమ్మ బుగ్గ మీద చిన్నగా కొడుతూ.

         "నాన్న నాతో ఇదివరకులా మాట్లాడట్లేదు నానమ్మ. నాకు బెంగగా, భయంగా ఉంది. రాత్రి పడుకున్నా నిద్ర రావడం లేదు .ఇదివరకులా ఎప్పుడూ మనం హాయిగా సంతోషంగా ఉండలేమా? నాకింకేమి వద్దు" అంది కావ్య ఏడుస్తూ నానమ్మని చుట్టుకు పోయి.

         "పిచ్చి పిల్లా ఇవన్ని జీవితంలో నీకు మొదటి చేదు అనుభవాలు. ఇలాంటివి ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి, చెడు అన్నవి అన్నదమ్ముల్లాంటివి. అన్నిటిని మనం అనుభవించాల్సి వస్తుంది. అన్నీ మంచి రోజులు, అంతా సంతోషమే, జీవితం కాదు. అలాగే అంతా చెడు కాదు. రెండిటి కలయికే జీవితం. అన్నింటిని ఎదుర్కొని సమస్యను సులభపరుచుకోవాలి. పోను పోను నీకే అర్ధం అవుతుంది. ఇంక నాన్న సంగతి అంటావా, వాడికి తెలిసిన విధంలో సమస్యలను ఎదుర్కొంటూ బాధ్యతలని మోస్తున్నాడు. నీ మీద ప్రేమ లేక కాదు. ధైర్యంగా ఉండు " అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది నానమ్మ. 




         కావ్యకు కాస్త తెరిపిగా ఉంది నానమ్మ దైర్యం చెప్పడంతో. ఒక్క చిన్న మాట చాలు ఆప్యాయంగా, ఎవరికైనా కొండంత బలాన్ని ఇస్తుంది.

         ఆ రోజు ఆదివారం కావడంతో కావ్య తండ్రి ఇంట్లోనే ఉన్నారు. కావ్య తన పనులు చేస్తూనే ఒక కంట తండ్రిని గమనిస్తోంది. ఆయన మనసులో ఎం జరుగుతోందో తెలుసుకోవాలని ఉంది. ఈ నిశబ్దం భరించలేకుండా ఉంది. ఆయన తల్లిని ఏదన్నా అడిగినప్పుడు తానే పరుగెత్తుకెళ్ళి అందిస్తోంది. అయినా ఆయన మొహంలో ఏమి మార్పు లేదు. "పెద్దవాళ్ళు ఇలా బెట్టు చేయడం మామూలే. చిన్నవాళ్ళే సర్దుకొని వారి కనుగుణంగా నడచుకోవాలి" అని చెప్పిన తండ్రి మాటలే గుర్తుకు వచ్చాయి. దైర్యం చేసి దగ్గరగా వెళ్ళింది.

         "నాన్నా...." అని పిలిచింది కావ్య. గొంతులో చిన్న వణుకు.

         ఆయన తల పైకెత్తి చూసారు కావ్య వంక. కావ్య కళ్ళల్లో కన్నీళ్ళు ఏ నిముషంలోనైనా ప్రవహించేలా ఉన్నాయి.

         "ఫైనల్ పరీక్షలు ఎప్పుడు?" అని అడిగారు ఆయన.

         "వచ్చే వారం నుండి " అని చిన్నగా సమాధానం ఇచ్చింది.

         "మరి ఈ పనులన్ని నీకెందుకు వెళ్ళి చదువుకో " అన్నారు చేతిలో పేపర్ వంక చూస్తూ.

         ఇంకా ఉండబట్టలేక "నన్ను క్షమించండి నాన్నా. నావల్ల మీకు అన్నీ కష్టాలు" అని ఏడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండి పోయింది.

         "ఛ ఏడవకు. ఇప్పుడేమయ్యిందనిలే కళ్ళు తుడుచుకో" అని పైకి లేపి పక్కన కూర్చోపెట్టుకున్నారు.

         "మీరు నాతో మాట్లాడకపోవడం నాకు చాలా బాధగా ఉంది నాన్నా. నేను ఏదన్నా తట్టుకోగలను కానీ మీరు మాట్లాడకపోతే భరించలేను" అంది కావ్య ఏడుస్తూ.

         "నాకు ఎన్నో ఆలోచనలు. నీ మీద ప్రేమలేక కాదు. ఇది నిన్ను ఇంత బాధిస్తుందని నేను అనుకోలేదు. నువ్వు ఏమి తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాధపడడం? ఊరుకో" అన్నారు చిరునవ్వుతో.

         "మీ కావ్య మీకు బాధ కలిగించే పని ఎప్పుడూ చెయ్యదు నాన్నా, నన్ను నమ్మండి" అంది కావ్య.

         "నాకు తెలుసురా అది. కాని ఒకప్పుడు పరిస్తితులు మనలని వేరేలా ఆలోచించేలా చేస్తాయి. నీ తండ్రి గొప్పవాడు ఏమీ కాదు. ఒక మామూలు తండ్రిని. అందరిలో ఉండే భయాలే నాకూ ఉన్నాయి. నువ్వు బాగుండాలనే నేను కోరుకునేది. అంతే, అంతకన్నా ఇంకేమి లేదు. నీ మీద ఎలాంటి మచ్చ రాకూడదు అనే నా ప్రయత్నం" అన్నారు ఆయన కళ్ళు తుడుచుకుంటూ.

అక్కడే నిల్చొని వింటున్న కావ్య తల్లి కూడా కొంగుతో కళ్ళుతుడుచుకుంది.

         "బాగుందిరా మీ వరస. అందరూ ఇలా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, ఇప్పుడేమయ్యిందని? ఎవరో ఏదో అంటారని మనం బతకడం మానేస్తామా?" అంటూ నానమ్మ వచ్చింది.

         "పిచ్చి పిల్ల మానసికంగా దానిని ఎందుకు హింస పెడతారు? దానికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు
చేతకాని వాళ్ళలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. మనసులో ప్రేమలు పెట్టుకొని ఏం లాభం పైకి చూపించుకోనంతవరకు. ఎవరో ఏదో పిచ్చి రాతలు దీనికి రాస్తే దీనిదా తప్పు? వాటిని ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి కాని, దానిని దోషిలాగా ఏదో తప్పు చేసినట్లు అది అనుకొనేలా మనం నడుచుకోవడం బాగుందా?" అని గట్టిగా చివాట్లు పెట్టింది నానామ్మ.

         చెప్పింది తల్లి కాబట్టి ఇంక ఏమీ అనలేక ఆవిడ చెప్పినది నిజమే అని మాట్లాడకుండా ఉండిపోయారు కావ్య తల్లిదండ్రులు.

         "నానమ్మా నాన్నని ఎందుకు తిడతావు?" అంది కావ్య కోపంగా.

         "బాగుందే నేను నీకోసం వాదిస్తుంటే నువ్వు నా మీద పడతావేంటి? అవునులే ఎంతైనా నీకు మీ అమ్మా నాన్నే ముఖ్యం. ఈ ముసలిది ఎవరికి అక్కర్లేదు" అంది నానమ్మ కోపం నటిస్తూ.

         అందరి ముఖంలో చిరునవ్వు విరిసింది. తండ్రికి బుగ్గమీద చిన్న ముద్దిచ్చి పరిగెట్టుకొని నానమ్మ దగ్గరకు వెళ్ళి కౌగలించుకొంది కావ్య.

         "నువ్వు నా మంచి స్నేహితురాలివి కదా?" అని నానమ్మకు కూడా ఒక ముద్దు ఇచ్చింది కావ్య.

         ఎవరో తలుపు కొట్టినట్లు చప్పుడు వినిపించి కావ్య తలుపు తీసింది. పావని ఇంటి పక్కన ఉండే నూనె కొట్టతని పదేళ్ళ పిల్లాడు నిల్చొని ఉన్నాడు. "పావని అక్క కనిపించడం లేదంట. వాళ్ళ అమ్మగారు మిమ్మలిని అడిగి రమ్మన్నారు ఇక్కడ ఉందేమో" అని అప్పచెప్పినట్టు చెప్పాడు. కావ్య గుండె ఒక్కసారి ఝల్లుమంది.

         "ఎవరే వచ్చారు?" అని వెనక నుండి కావ్య తల్లి కేక పెట్టింది.

         "పావని ఇంటి పక్కన పిల్లాడు అమ్మ" అని తల్లికి చెప్పి"నేను వస్తాను నువ్వు వెళ్ళు"అని చెప్పి పిల్లాడిని పంపించేసింది.

         కావ్యకు చేతులు కాళ్ళు ఆడటం లేదు. "ఈ పిల్ల ఏం చేసిందో? అంతా బాగుంది అనుకునే సమయానికి ఇలా కొత్త సమస్య వచ్చి పడింది" అనుకుంది కావ్య మనసులో. 



( ఇంకా ఉంది )
This entry was posted on Thursday, August 05, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

On August 6, 2010 at 3:07 PM , వంశీ కిషోర్ said...

ఈ కథ సహజత్వానికి చాల దెగ్గరగా ఉంది, జీవితంలో అన్ని మనం అనుకున్నట్టె జరగవు అని నేను అందరికి చెబుతూ ఉంతాను.ఇది చదువుతూ ఉంటే అదె నాకు గుర్తొచింది.

 
On August 6, 2010 at 3:46 PM , Lathanjal said...

సింప్లీ... సూపర్‌..
కథ చదువుతుంటే... కళ్ల ముందు కదలాడుతున్నట్లే ఉందండి..

 
On August 8, 2010 at 5:03 AM , satish said...

siri garu .. e katha lo meeru relations gurinchi rasina bagam chala baga nachindi ...

 
On August 10, 2010 at 11:57 PM , రాధిక(నాని ) said...

బాగుందండి .ఇంకా అన్నీ చదవలేదుకాని ,నచ్చింది.మిగిలినవికూడా చదువుతాను.