Author: Siri
•Saturday, August 21, 2010
 కావ్య చేతిలోంచి పువ్వులన్నీ కింద పడ్డాయి. పరుగున తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పేసరికి భయంతో బిగుసుకు పోయింది తల్లి. అందరు కలిసి హడావుడిగా శ్రీను వెంట బయలుదేరారు. హాస్పిటల్ వెళ్ళేసరికి నీరసంగా పడుకొన్న తండ్రిని చూసి బావురుమంది కావ్య. 

         "ఏమయ్యింది నాన్నా?" అంటూ తండ్రి భుజం చుట్టూ చేతులు వేసింది కావ్య. 

         "ఎం లేదు కాస్త కళ్ళు తిరిగాయి అంతే" అన్నారు ఆయన నీరసంగా. 

         "కాస్త మైల్డ్ గా గుండెపోటు వచ్చింది. ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి" అని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. 

         ఆ తరువాత జరిగినది అంతా కావ్య జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. తండ్రికి గుండెపోటు అని తెలిసిన దగ్గర నుంచి అందరి మనసుల్లో ఆయనకు ఏదైనా అయితే ఎలా అన్న విషయం పదే పదే తొలచి వేసింది. అదే బాధ కావ్య తండ్రిని స్దిమితంగా ఉండనివ్వలేదు. మానసికమైన ఆవేదనని, ఎవరికి చెప్పుకోలేని బరువుని మోస్తూ చివరకు కావ్యకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు. 

         కావ్య తండ్రి ఉన్న స్థితిని చూసి మరు మాట చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తల్లి తండ్రి తన గురించి పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకోడానికి ఎంతో సేపు పట్టలేదు కావ్యకు. చిన్నదైన రెండు గదుల ఇంటిలోని మాటలను గోడలు రహస్యంగా దాచలేకపోయాయి. తండ్రి ఒకరోజు తల్లితో అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. 

         "పద్మా నీకు జీవితంలో బాధలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు. నాతో పాటు ఈ జీవితం నిన్నూ రంగులరాట్నంలా తిప్పింది. నాకంటూ ఒక ఆనందం కేవలం నువ్వు ఇచ్చిన నా కావ్య మాత్రమే. ఇదిగో చూడు చీటీలు కట్టిన డబ్బుతో కావ్య పెళ్ళి ఒక మంచి చోట చేసేద్దాం. ఈ ఇల్లు మిగిలిన కాస్త డబ్బు నీ పేరున రాసాను. నాకేదైనా అయితే అమ్మను నువ్వే చూసుకోవాలి. అన్నీ ఈ పుస్తకంలో నీకోసం రాసి ఉంచాను. నీకసలు లోకం తెలియదు. ఎలాగో ఏమిటో?" అని అంటున్న తండ్రి మాటలు తూటాల్లా గుచ్చుకున్నాయి కావ్యకు. 

         ఆయన తాపత్రయం రోజురోజుకి పెరిగిపోయింది. కనిపించిన వాళ్ళందరికి కావ్యకు మంచి సంబంధం చూడమని చెప్పడం ప్రారంభించారు. కావ్యని కాలేజ్ కి వెళ్ళ వద్దని వారించారు. "చదువుకోవాలని ఉంటే పెళ్ళి అయ్యాక చదువుకుందువు తల్లి" అని ముద్దుగానే మందలించారు. ఇక కావ్య తండ్రిని స్కూలుకి తీసుకెళ్ళడం, ఆయనకు వేళకు భోజనం పట్టుకెళ్ళడం, ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పడం తన బాధ్యతగా తీసుకుంది. 


 "నాకు ఇద్దరు తల్లులు. ఇంక నాకేంటి" అని అందరితో గొప్పగా చెప్పుకొని పొంగిపోయారు కావ్యని చూసి.

         ఆయనకు కాస్త ఓపిక రాగానే వరసగా సంబంధాలు చూడడం ప్రారంభించారు. తన పరిస్థితి ఎలా ఉండనీ కావ్యకు గొప్పింటి సంబంధం తేవాలని ఆయన కోరిక.

         దాని కోసం తన తాహుతాకు మించిన సంబంధాల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ కొద్ది రోజుల్లోనే తెలిసి పోయింది అది అంత సులభమైన పని కాదు అని.

         కొంతమంది కట్నం వద్దూ అంటూనే లాంచనాలు చిట్టా చదివారు. ఇంకొంత మంది మాకేమి అక్కర్లేదు మీ అమ్మాయి పేరున మాత్రం ఇంత డబ్బు బ్యాంక్ లో వెయ్యండి అన్నారు. కావ్య తండ్రికి మాత్రం తన కూతురు బంగారు బొమ్మ, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది అనే నమ్మకం. ఎక్కడో అక్కడ మంచి మనుషులు ఉండకపోతారా అని ఆయన ఆలోచన. పెళ్ళి సంబంధాలు చూసే మూర్తిగారి దగ్గరకు వెళ్ళారు. ఆయన కావ్య ను తేరి పారి చూసి మరీ నిరాడంబరంగా ఉంది అని కాస్త ఈ రోజు పిల్లలాగా బట్టలు వేసుకొని ఫోటో తీయించమని సలహా ఇచ్చారు.

         "అయ్యా ఈ రోజుల్లో అబ్బాయిలకు ఆలోచనలలో పాత కాలపు అమ్మయిలా ఉన్నా పర్వాలేదు. కానీ చూడడానికి మాత్రం రెండడుగులు ముందే ఉండాలి. అలా చేసి చూడండీ" అని ఓ చిన్న సలహా పారేసారు. ఆయన చెప్పినదేమిటో అర్ధం కాలేదు కావ్య తండ్రికి.

         "పెళ్ళి కావాలంటే ఇదంతా చెయ్యాలా? నా కూతురుకు ఏం తక్కువ?" అని అడిగారు.

         "తక్కువని కాదు. ఇప్పుడు పోకడ వేరేగా ఉందండి. మరి గొప్ప సంబంధాలు కావాలి అంటే తిప్పలు పడక తప్పవు. మొన్ననే ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. పదిహేను రోజుల్లో వచ్చి వెళ్ళిపోవాలి అన్నాడు. మరి రాగానే ఒకే రోజులో ఒక అరడజను పిల్లలను చూసాడు. వాళ్ళల్లో ఒక పిల్లను చేసుకొని వెళ్ళిపోయాడు. మరి అంత మందిలో మనం ప్రత్యేకంగా కనపడితేనే కదా వాళ్ళు మన దాకా వచ్చేది" అని గుక్క తిప్పకుండా చెప్పేసారు మూర్తిగారు.

         "చూడు, నీకు ఏదైనా మంచి సంబంధం తెలిస్తే చెప్పు. లేదంటే లేదు. ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు. నా కూతురుని టీవీ లాగా, వాషింగ్ మెషిన్ లాగా అమ్ముకోవాలని అనుకోవడం లేదయ్య. ఒక మంచి కుటుంబం ఉంటే చూడు" అని అన్నారు కావ్య తండ్రి. 



  "ఉన్నది చెప్పాను తరువాత మీ ఇష్టం. ఏదైనా ఉంటే కబురు పంపుతాను" అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన.

***        ***        ***        ***

         ఇంటికి రావడంతోనే దిగాలుగా కుర్చీలో కూర్చున్న తండ్రిని చూసింది కావ్య.

         "ఎందుకింత తాపత్రయం తండ్రికి? తాను కూతురినై పుట్టడం వల్లే కదా?" అని అనుకుంది కావ్య మనసులో. చల్లని మజ్జిగ తీసుకెళ్ళి ఇచ్చింది. ఆయన కావ్య వంక ప్రేమగా చూసారు. లోపల నుంచి నానమ్మ వచ్చింది. ఏదో చెప్పాలి అన్నట్టు చిన్నగా దగ్గింది.

         "కావ్యా దండెం మీద వేసిన బట్టలు మడత పెట్టి తీసుకురా" అని పురమాయించింది నానమ్మ.

         కావ్య వెళ్ళగానే కొడుకు పక్కగా చేరి మొదలు పెట్టింది. "చూడరా నీ మొండి పట్టుదల నాకేమి నచ్చలేదు. పిల్లాడిని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. మన వెంకట్ ఉండగా కావ్యకు, నువ్వు వేరే పెళ్ళికొడుకుని చూడడం నాకు నచ్చలేదు" అంది రోషంగా.

         "అమ్మా! మళ్ళీ మొదలు పెట్టావా? అది జరిగే పని కాదు అని చెప్పానుగా" అన్నారు కావ్య తండ్రి.

         "అది కాదురా వాడికేం తక్కువ? ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఇంక మీ బావ సంగతి అంటావా, అందరు కలిసి నచ్చ చెప్పితే ఆయనే వింటాడు" అంది నానమ్మ.

         "అది కాదమ్మ వెంకట్ మంచి వాడు కాదు అని నేను అన్నానా? నాకు వాడంటే అభిమానమే. కానీ పెళ్ళి అయితే వాడొక్కడితోనే కలిసి ఉంటే పర్వాలేదు. ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ముందే అది పెరిగిన పరిస్థితులని అవమాన పరిచిన వాళ్ళు పెళ్ళి తరువాత ఏం గౌరవం ఇవ్వగలరు? నా చెల్లెలు ఎలాగు ఆ మనుషుల మధ్య బ్రతక నేర్చుకుంది. నా కూతురుని కూడా అలాంటి మూర్ఖపు మనుషుల్లోకి పంపలేను. వాళ్ళకి తెలిసేలా రాజాలాంటి సంబంధం తెస్తాను. నువ్వు కావ్య మనసు పాడు చెయ్యకు అనవసరమైనవి అన్నీ చెప్పి" అని వెళ్ళిపోయాడు ఆయన విసురుగా.

         కొడుకు మొండితనంగా అలా చెప్పి వెళ్ళిపోవడం చూసి నిట్టూర్చింది నానమ్మ. తన మనవడిని మనవరాలిని కలిసి చూడాలి అని ఆవిడకున్న చివరి కోరిక. కాని కొడుకు, అల్లుడు మొండితనం,పట్టుదల ముందు ఆవిడ పెద్దరికం గెలవలేకపోయింది. ఆమె జీవితంలో ముందు తండ్రి, తరువాత భర్త, ఇపుడు కొడుకు. ముగ్గురూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చూపించుకున్నారు. ఒకప్పుడు తాను చేసుకుంటే పద్మావతినే చేసుకుంటాను అని మొండిగా పట్టుపట్టిన కొడుకు ఇప్పుడు తన కూతురు విషయంలో ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడో ఆవిడకు అర్ధం కావటంలేదు.



 చివరకు ఒక సంబంధం రానే వచ్చింది. బాగా సంపన్నుల కుటుంబం. పెళ్ళి కొడుకు అబుదబిలో పనిచేస్తున్నాడు. అన్ని విధాలా బాగుంది అని నిర్ణయించుకున్నాకే కావ్య తండ్రి వాళ్ళను ఇంటికి రమ్మని కబురు పంపారు. ఆయన ఆశించినట్టే వాళ్ళు ఎలాంటి కట్నం ఎదురుచూడలేదు. చాలా మర్యాద తెలిసిన మనుషులు అని తెగ పొంగిపోయారు కావ్య తల్లి తండ్రులు. వచ్చిన వాళ్ళకు కావ్య చూడగానే నచ్చింది.

         "మా అందరికి మీ అమ్మాయి బాగా నచ్చింది. అమ్మాయికి కూడా నచ్చాలి కదా. మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని మాకు కబురు పంపండి. మిగతా అంతా మేము చూసుకుంటాము" అని చెప్పి వెళ్ళిపోయారు.

         "అబ్బాయి బాగానే ఉన్నాడు. అసలు ఇంటికి వెళ్ళి కబురు పంపుతాము అనవలసింది వాళ్ళు. కాని మనకు ప్రాముఖ్యం ఇచ్చి మన అమ్మాయి మనసు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు అయ్యి ఉంటారు" అని సంతోష పడ్డారు కావ్య తల్లి తండ్రులు.

         "ఏం బాగున్నాడు. మలేరియా వచ్చిన మనిషిలాగా. నీ చెల్లెలు సింగపూర్లో ఉంది కదా. అది వచ్చాక ఒక మాట చెప్పి ఇదంతా చేస్తే బాగుంటుంది కదా" అని సణుక్కుంది ముసలావిడ.

         "వాళ్ళన్నీ మనలని అడిగే చేస్తున్నారా? పెద్దవాడిని కదా అని ఒక్కసారైనా మర్యాద ఇచ్చారా? అంతా అయ్యాక శుభలేఖ ఇస్తే సరిపోతుంది" అని కావ్య వంక చూసాడు ఆయన. "అదంతా మర్చిపో. నీకు నచ్చాడా లేదా అబ్బాయి?" అని అడిగారు కావ్యకు దగ్గరగా వచ్చి ఆత్రుతగా.

         తండ్రి ముఖంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు కావ్య. చిన్నపిల్లాడిలా గంతులు వేసేలా ఉన్నారు.

         "మీకు నచ్చితే నాకు సరే నాన్నా. కానీ... " అని సణిగింది కావ్య.

         "ఏమ్మా ఏమిటి నీ సందేహం?" ఆత్రంగా అడిగారు కావ్య తండ్రి.

         "అది కాదు నాన్నా, ఎక్కడో అంత దూరం వెళ్ళి ఉండాలి అంటే నా వల్ల కాదు. మిమ్మలిని వదిలి వెళ్ళలేను. పెళ్ళే చెయ్యాలి అని అంటే ఇదే ఊరిలో చూడండి నాన్నా" అంది నేల వంక చూస్తూ.

         "పిచ్చి పిల్లా ఇంతేనా? కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. నీకే అలవాటు అయిపోతుంది. హాయిగా మహారాణిలా ఉండచ్చు. మీ అమ్మ నాతో పడ్డ బాధలు నీకు రాకూడదు" అని అన్నారు నవ్వేస్తూ.

 "నిజమేనండి నాకు ఆలోచన రాలేదు. అంత దూరం పంపించి ఉండగలమా?" అని అంది కావ్య తల్లి.

         "ఏదో నీ కూతురు ఒక్కత్తే ఈ ప్రపంచంలో అత్తవారింటికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. కొత్తల్లో అలానే ఉంటుంది. నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. అదేమి పెద్ద విషయం కాదు" అని కొట్టిపారేసారు.

         "సరే మీకు ఏది సరే అనిపిస్తే అది చెయ్యండి నాన్నా" అని కావ్య అనేసరికి ఊపిరి పీల్చుకున్నారు.

         ఆడపిల్ల పెళ్ళి అవ్వడం వేరే ఇంటికి పంపించడంలో కష్టం కన్నా అమ్మాయి సంతోషంగా ఉండాలి అని ఒకే ఆశ కోసం ఎంత ఖర్చునైనా భరించి దూరంగా పంపించడానికి వెనుకాడరు కావ్య లాంటి మధ్య తరగతి అమ్మాయిల తల్లి తండ్రులు.

         మొదటి సారిగా కావ్య "నేను నా తండ్రికి మగబిడ్డగా పుట్టి ఉంటే ఎంత బాగుండు" అని అనుకుంది. "తన సొంతం అనుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఉన్న ఒక్క స్నేహితురాలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంక బావా ,అత్తయ్య. వాళ్ళ మీద అభిమానం చూపిస్తే తండ్రిని ఎదిరించినట్టు అవుతుంది అని బలవంతంగా దూరం చేసుకుంది.ఇప్పుడు ఆ తల్లి తండ్రులను వదిలి ఇంకో కొత్త బంధం. ఎందుకు ఆడపిల్లకే ఇలాంటి సర్దుకు పోవడం, పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవడం? తను ఎప్పుడూ అందరి మగ పిల్లల్లా తన తల్లి తండ్రి దగ్గరే ఉండిపోకూడదా?" చాలా మంది ఆడపిల్లల్లో రేగే ఆలోచనే కావ్యను పట్టి పీడిస్తోంది.

         ఆలోచనలతో సతమతమవుతున్న కావ్యకు నానమ్మ రావడంతో అడ్డుకట్ట పడింది.

         "కావ్యా కాస్త స్వార్ధం కూడా ఉండాలే మనిషికి. నువ్వు ప్రతీది ఇలా ఒప్పేసుకుంటే ఎలా చెప్పు?" అంది చివరి ప్రయత్నంగా.

         "ఎవరైనా చెప్పిన మాట వినమని చెప్తారు కానీ, ఇలా పెద్దల మాట వినొద్దు అని చెప్తారా?" అంది కావ్య నానమ్మ భుజం మీద వాలి.

         "బావ గురించి ఆలోచించావా? తెలిస్తే బాధపడతాడు" అంది నానమ్మ.

         "అంత బాధపడేవాడైతే అంత దూరం వెళ్ళి కూర్చుంటాడా? ఇప్పటికి అందరిని ఒప్పించి ఉండేవాడు. అయినా పెద్దవాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఎవరికీ సంతోషం లేకుండా ఉండడం కన్నా మనసు నిండా అభిమానంతో దూరంగా ఉండడం మంచిది కద నానమ్మా?" అంది కావ్య.

"నీకు ఉన్న ఆలోచనలో ఒక వంతు అయినా వాళ్ళకు ఉంటే బాగుండేది. చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసుకొని మనసులు దూరం చేసుకోవడం తప్ప మనసులు దగ్గర చెయ్యడం తెలియని వాళ్ళు. సరే ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నేను తాపత్రయ పడి ఏం లాభం?" అని పక్కకు తిరిగి పడుకుంది నానమ్మ.

         కావ్య చిన్నగా నవ్వింది. ఎందుకో కాస్త ప్రశాంతంగా అనిపించింది. "తండ్రి అనుకునట్టు అన్నీ జరుగుతున్నాయి. ఆయన ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంక బావ తెలివైనవాడు. తన పెళ్ళి అయ్యింది అని తెలిస్తే తను పెళ్ళి చేసుకొని రాజీ పడిపోతాడు. తనకు బావ మీదున్న ప్రేమ ఎప్పటికి ఉంటుంది. దానిని కేవలం పెళ్ళితో ముడిపెట్టడం తనకు ఇష్టం లేదు" అని మనసులో అనుకుంది. మంచు తెరలు తొలగి కాంతి ప్రసరించినట్టు ఆమె ఆలోచనలు అన్నీ తొలగిపోయాయి. కొత్తగా ప్రారంభమవ్వబోయే జీవితంతో రాజీపడిపోవడానికి సిద్ధమయ్యింది. 



( ఇంకా ఉంది )
This entry was posted on Saturday, August 21, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

On August 21, 2010 at 9:20 PM , Lathanjal said...

8వ పార్ట్‌ చాలా బాగుంది.. ఉత్కంఠకు తెరలేపారు. ఏం జరుగుతుందో తెలిసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నది. కానీ మీ రాసాన ఈ వాక్యాన్ని చూస్తూ కావ్యకు, వెంకట్‌కి పెళ్లి జరగదన్నట్లు అనిపిస్తుంది..? ఎందుకంటే
కొడుకు, అల్లుడు మొండితనం,పట్టుదల ముందు ఆవిడ పెద్దరికం గెలవలేకపోయింది.గెలవలేకపోయింది అంటే ఓడిపోయినట్లే కదా..? ఆమె పెద్దరికం గెలవలేకపోతున్నది అంటే సరైన అర్థమొచ్చేదేమోనని నా అభిప్రాయం.