•Friday, September 03, 2010
మూడు రోజుల్లో కావ్య తండ్రికి స్పృహ రాగానే అందరి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆయన ముందుగా కావ్య కోసం అడిగారు.
"నీ కూతురు చాలా పెద్దదయిపోయిందిరా. ఇప్పటి వరకు చిన్నపిల్ల అనుకున్నాము. కానీ, అదే అంతా సంబాళించుకుంది. నీలాగే స్వాభిమానం కల పిల్ల" అని రాజారాం పొగుడుతుంటే కిరణ్ కావ్య వంకే చూస్తూ ఉండిపోయాడు.
అందరి పలకరింపులు అయిపోయాక అప్పటివరకు అక్కడే ఉన్న అందరిని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని రాజారాం తన స్నేహితునితో మాట్లాడుతూ ఉండిపోయాడు.
"కావ్యను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇలాంటి కూతురు నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది" అన్నారు రాజారాం.
"నేను ఏదో చెయ్యాలని ఆశ పడ్డాను. అది అంతా ఎదురు తిరిగింది. ఇప్పుడు దానికి పెళ్ళి కూడా చెయ్యలేనేమో అనిపిస్తుంది" అని కావ్య తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నారు.
"ఛ! ఆపరేషన్ అయ్యి ఇప్పుడే కోలుకుంటున్నావు. ఇపుడు ఇలాంటి వన్నీ గుర్తు చేసుకొని బాధపడకు" అని మందలించారు రాజారాం.
"లేదురా నా గుండెల్లో పిండేసే బాధ ఆపరేషన్ చేస్తే పోతుందా? అందరి ముందూ ఏదో పెద్ద సంబంధం చెయ్యాలని అనుకున్నాను" అని వాపోయారు కావ్య తండ్రి.
"నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. నాకూ కొడుకు ఉన్నాడు. పెద్ద ఆస్తి లేకపోయినా ఎంతో కొంత సంపాదిస్తాడు. మీకూ, కావ్యకు సరే అంటే నా కోడలిగా చేసుకోవాలని ఉంది" అని సంశయంగా రాజారాం తన మనసులో మాట చెప్పారు.
తన మనసులోని భారం ఒక్కసారి తగ్గినట్టు అనిపించింది కావ్య తండ్రికి. ఎవరికో తెలియని వాళ్ళతో పంపిచడం కన్నా మంచి మనుషుల మధ్య తమకు దగ్గరగా ఉంటుంది అని సంతోషంగా ఆమోదం తెలిపారు. పిల్లలతో కూడా ఈ విషయమై మాట్లాడాలి అని వారికి ఈ విషయం చెప్పారు. కిరణ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కావ్య ముఖంలో ఏ భావన కనిపించలేదు.
"మీరు సంపూర్ణంగా కోలుకోండి నాన్నా అప్పుడు చూద్దాం " అని అంది కావ్య.
"అది కాదమ్మా నా ప్రాణానికి ఎప్పుడు ముగింపో ఎవరికీ తెలియదు. నాకు ఈ చిన్న సంతోషాన్ని కలిగించు కావ్యా. నాకు అదే వెయ్యేనుగుల బలం" అన్నారు కావ్య తండ్రి.
"మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ అప్పుడే పెళ్ళి వద్దు నాన్నా. కొన్ని రోజులు సమయం కావాలి" అంది కావ్య దీనంగా.
"నీ ఆవేదన నాకు తెలుసు కావ్యా. కానీ నేను తీసుకున్న నిర్ణయాలన్నింటిలో ఇదే సరి అయినది. నన్ను నమ్ముతావా ? నీకు తెలియకుండానే అపకారం తలపెట్టాను. నీ అదృష్టం బతికి బయటపడ్డావు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోనీ. నలుగురిలో అవమానం పడకుండా ఇప్పుడు కిరణ్ మాత్రమే కాపాడగలడు. నాకు మనశ్శాంతిగా ఉంటుంది" అని అన్నారు ఇంక కూతురు ముఖంలోకి చూడలేక.
"నాన్నా పెళ్ళి చేసుకుంటాను. కానీ మీరు ఎప్పుడు ఇలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను" అని తలవాల్చి తండ్రి పక్కన ఉండిపోయింది కావ్య.
ఆయన కోలుకోగానే పది రోజుల్లో ఇంటికి తీసుకొచ్చేసారు. అనుకోవడమే తడవుగా కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే వెళ్ళి పెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించారు. కిరణ్ కూడా అన్ని ఖర్చులు తానే చూసుకుంటాను అని చెప్పాడు. రిజిష్టర్ ఆఫీసులో పెళ్ళి చేసి ముఖ్యమైనవాళ్ళకి నలుగురికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్నారు.
"నీ చెల్లెలికి ఒక్కసారి చెప్పకూడదా? ఇలా హడావుడిగా పెళ్ళి చెయ్యటం నాకు నచ్చలేదు" అని తల్లి ఎంత అరిచినా ఉపయోగం లేక పోయింది. ఎవరి ప్రమేయం లేకుండానే అన్ని నిర్ణయాలు తీసేసుకున్నారు. చివరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కావ్య తండ్రి హరిణికి ఫోన్ చేసారు. హరిణి ఎంతో సంతోషించింది కావ్య పెళ్ళి అయిపోతున్నందుకు. పనులు ఉండడం వల్ల రావడం వీలు కాదు వెయ్యి నూట పదహార్లు చదివించమని చెప్పింది.
"అన్నయ్య ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వు" అని అడిగి తీసుకొని సింగపూర్ కి ఫోన్ చెయ్యాలని చూసారు. కానీ అప్పటికే వెంకట్ వాళ్ళు బయలుదేరిపోయారు అని సాయంత్రానికి ఇండియా చేరుకుంటున్నారు అని చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ ఇప్పుడు కాదు అంటే ఏం అడ్డంకి వస్తుందో అని పెళ్ళి చేసెయ్యడానికి నిర్ణయించారు.
నిన్న ఒకరితో పెళ్ళి అనుకున్న కావ్యకు ఈ రోజు ఇంకొక మనిషితో జీవితం గడపడానికి సిద్దపడటం వింతగా తోచింది.అం తా భ్రమలా అనిపించింది. బావకి చెప్పకుండా, పిలవకుండా పెళ్ళి చేసుకోవడం కావ్యకు నచ్చలేదు. కానీ తండ్రి ఎదురుగా చెప్పే ధైర్యం లేదు. అసలే అనారోగ్యంగా ఉన్న ఆయనకు బాధ కలిగించకూడదు అని మౌనంగా ఉండిపోయింది.
"కనీసం ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు. అసలు నిజంగా నా మీద ప్రేమ ఉంటే కనీసం పలకరించడానికి చేసి ఉండవచ్చు కదా?" అని రోషంగా తను దొంగిలించి తెచ్చుకున్న తన చిన్నప్పటి ఫోటో వంక చూస్తూ.
కానీ కావ్యకు తెలియని ఒక విషయం ఉంది. వెంకట్ ఎన్నో సార్లు పోన్ చేసాడు, కావ్య పేరున ఉత్తరాలు రాశాడు. కాని కావ్య తండ్రి కావ్యకు ఇవేమి తెలియనివ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగితే అది ఇరువురి కుటుంబాలలో కలతలు రేపుతాయి అని ఆయన కావ్యకు ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కావ్య తనకి జవాబు కూడా ఇవ్వలేదు అని వెంకట్, కనీసం ఇన్ని రోజుల్లో తనను కనీసం గుర్తుచేసుకోలేదు అని కావ్య ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
పెళ్ళి చాలా సింపుల్గా ముగించేసారు. కావ్య మెడలో ఆమె తండ్రి ఎదురుచూసిన మూడు ముళ్ళు పడిపోయాయి. కావ్య తల్లి తండ్రులు సంతోషానికి అవధుల్లేవు. కిరణ్ ని, కావ్యను మనసారా దీవించి గుండెలకు హత్తుకున్నారు. ఇప్పటి వరకు తలెత్తుకోలేకపోయిన కావ్య తండ్రి ఇప్పుడు గర్వంతో తన కూతురు అల్లుడుతో తన ఇంటిలోకి ప్రవేశించారు. చుట్టుపక్కల వాళ్ళందరిని సంతోషంగా భోజనాలకు పిలిచారు. కావ్య ఇంట్లో అలుముకున్న విషాదం తొలగిపోయి ఆనందం పొంగి పొర్లింది. కిరణ్ తన స్నేహితులను పిలిపించి అప్పటి కప్పుడు పందిరి వేయించి భోజనాలకు ఏర్పాటు చేయించడంలో మునిగిపోయాడు.
సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి కావ్య తయారు అవబోతుండగా ఎవరో వచ్చిన అలికిడి అయ్యి గుమ్మం దగ్గరకు వచ్చింది. చేతి నుండా గోరింటాకు, నుదిటి నిండా సింధూరం, ఎర్రని పట్టుచీరతో, మెడలో మంగలసూత్రంతో మెరిసిపోతున్న కావ్యకు ఆ వచ్చిన వ్యక్తిని చూసేసరికి గుండె లయ తప్పినట్లు అయ్యింది.
"బావా..." అని మాత్రం అనగలిగింది.
ఎదురుగా నిల్చున్న వెంకట్ ను చూసి అతని కళ్ళల్లోకి చూడలేక ముఖం దించుకుంది కావ్య. వెంకట్ తాను చూసినది నిజమేనా అన్నట్టు చూస్తూ ఉండిపోయాడు. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కానీ ఏమి మాట్లాడలేకపోయాడు.
"కావ్య పెళ్ళెప్పుడు అయ్యింది. కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు మాకు?" అంటూ వెంకట్ వెనకాలే అతని తల్లి కృష్ణవేణి వచ్చింది.
"కావ్యా, నువ్వు వెళ్ళి తయారవ్వు అందరూ వచ్చే వేళ అయ్యింది" అని కావ్య తండ్రి రావడంతో నెమ్మదిగా లోపలకు వెళ్ళిపోయింది కావ్య.
"రా కృష్ణా ఎప్పుడు వచ్చావు?" అని చెల్లెలిని చూసి పలకరించారు కావ్య తండ్రి.
"ఏమిటిది అన్నయ్యా? పెళ్ళి కూడా అయిపోయింది. మాకు మాటవరసకైనా చెప్పలేదు. మేము రాగానే హరిణి ఫోన్ చేస్తే తెలిసింది నీకు అపరేషన్ కూడా చేసారు అని. వచ్చీ రాగానే రాజమండ్రిలో సామాన్లు పడేసి ఇలా వచ్చాము. నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు" అని అర్థం కానట్టు చతికిలపడిపోయింది.
"అంతా అనుకోకుండా అయిపోయింది. మీకు చెప్పటానికి ఫోన్ చేసాను. కానీ అప్పటికే బయలుదేరిపోయారు అని తెలిసింది. తప్పనిసరి పరిస్థితిలో చెయ్యాల్సి వచ్చింది" అని జరిగింది చెప్పారు.
"అన్నీ మర్చిపోయి సాయంత్రం మా సంతోషంలో పాలుపంచుకోవాలి. ఈ మామయ్యను క్షమించాలి" అని వెంకట్ చేతులు పట్టుకున్నారు కావ్య తండ్రి.
"అయ్యో మావయ్యా! పెళ్ళి జరిగితే శుభమే కదా? దీనికి మీరు ఇలా బాధపడకూడదు" అని ఎదురు తనే ధైర్యం చెప్పాడు వెంకట్.
కావ్య నానమ్మ వస్తూనే వెంకట్ ని హత్తుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇద్దరినీ గదిలోకి తీసుకెళ్ళి అంతా కథలా చెప్పుకొచ్చింది.
"ఇంత జరిగినా మాకు ఒక్క విషయం తెలియనివ్వలేదు. ఒక్క మాట చెపితే పరిగెత్తుకొని వచ్చేవాడు కదా వెంకట్. వాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పైకి చెప్పడు కానీ నాకు, వాడి మనసు తెలుసు. మీ అల్లుడు గారికి నచ్చచెప్పి అన్ని సవ్యంగా జరిగే సమయంలో ఇలా అయ్యింది. వాడినెలా ఓదార్చేది?" అని తల పట్టుకొని కూర్చుంది కృష్ణవేణి.
"అత్తయ్యా?" అని కావ్య వచ్చి ఆవిడను చుట్టేసింది.
"ఏమిటే కావ్యా ఇలా తొందర పడిపోయావు? ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. వాడు ఎప్పటికీ చెప్పలేడు. కానీ వాడు మనసులో దాచుకున్న ప్రేమ నాకే తెలుసు. ఇప్పుడు ఇలా అన్నయ్య వాడికి అన్యాయం చేసారు. ఎలా తట్టుకోగలడు?" అని బాధనంతా బయటపెట్టింది.
వెంకట్ ఇంక అక్కడ ఉండలేక బయట వరాండాలోకి వెళ్ళి నిల్చున్నాడు.
"సరే అయిపోయిందేదో అయ్యింది. ఇపుడు ఇక్కడ ఇలా మాట్లాడితే బాగోదు. అల్లుడు, వాళ్ళ నాన్నగారు రావచ్చు. వాళ్ళ చెవిన ఇదంతా పడితే వాళ్ళ మనసులో లేనిపోని అనుమానాలు రావచ్చు. కళ్ళు తుడుచుకొని దాన్ని మనసారా దీవించు" అని కావ్య నానమ్మ అనేసరికి అందరూ కళ్ళు తుడుచుకొని లేచారు.
కావ్య నెమ్మదిగా వెంకట్ దగ్గరకు వచ్చి నిల్చొంది. దీర్ఘంగా ఆలోచిస్తున్న వెంకట్ ని చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా లేనంత వరకు అన్నీ మర్చిపోయింది. కానీ వెంకట్ ఎదురు పడేసరికి ఏవేవో భావాలు పొంగుకుంటూ వచ్చాయి. దగ్గరగా వెళ్ళి అతను పడుతున్న బాధనంతా తుడిచెయ్యాలి అనిపించింది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది. మొదటిసారిగా తను చేసినది తప్పు ఏమో అన్న భావన కలిగింది. ఇప్పటివరకు తండ్రి గౌరవం గురించే ఆలోచించింది కానీ తన జీవితంతో ముడిపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి అని ఆలోచించలేకపోయింది.
చిన్నగా గాజుల శబ్ధం వినిపించి వెనక్కి తిరిగి చూసాడు వెంకట్. అదే చిరునవ్వుతో మనసులోని బాధను తెలియనివ్వకుండా కావ్య వంక చూసాడు. చక్కగా ముస్తాబై బేలగా చూస్తున్న కావ్యను చూసి చిన్నగా నవ్వాడు.
"నువ్వు అలా మూతి ముడుచుకుని ఉంటే నాకు చిన్నప్పుడు కావ్యే గుర్తుకు వస్తుంది" అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ.
"నా మీద కోపం లేదుగా?" అని అంది వెంకట్ చూపుల్లోంచి తప్పించుకుంటూ.
"ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది. నువ్వు నన్ను పిలవకుండా చేసుకున్నందుకు కొంచెం కోపం" అన్నాడు వెంకట్ పిట్ట గోడ మీద ఎక్కి కూర్చుంటూ.
"నన్ను క్షమించు బావా" అంది కావ్య వెంకట్ కళ్ళల్లోకి చూస్తూ.
"కావ్యా నువ్వు ఏం తప్పు చేసావని నిన్ను క్షమించాలి? ఎటువంటి పరిస్థితిలో పెళ్ళి జరిగిందో మావయ్య చెప్పారు. ఇలా నువ్వు బేలగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఎప్పుడైనా ఈ బావ అవసరం వస్తే మాత్రం నేను ఉన్నానని మర్చిపోకు. మావయ్య అంత కష్టంలో ఉంటే నాకు ఒక్క మాట చెప్పలేదు. నాకు అదే బాధగా ఉంది. ఇకముందైనా ఏదైనా అవసరం అయితే ఒక్కసారి ఈ బావను తల్చుకో" అన్నాడు బాధగా.
ఏదో చెప్పాలని అనుకున్నా కిరణ్ మాటలు వినిపించడంతో చెప్పడానికి ఇది సరైన సమయం కాదు అని ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కిరణ్ పిలవడంతో కావ్య లోపలకు వెళ్ళిపోయింది. వెంకట్ కావ్య వెళ్ళిపోయిన వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటి వరకు కావ్య తన సొంతం అనుకున్నాడే కానీ ఇంకొకరు కూడా కావ్యను సొంతం చేసుకోగలరు అని కలలో కూడా ఊహించలేకపోయాడు. తన కళ్ళ ముందే ఇంకొకరి చేతిని పట్టుకొని వెళ్ళిపోతున్న కావ్యను చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమి చెయ్యలేకపోయాడు. ఇప్పటివరకు చిన్న పిల్లలా తోచిన కావ్య ఒక్కసారిగా ఎంతో ఎదిగిపోయినట్టు అనిపించింది. చదువు, జీవితం గురించి ఎన్నో చెప్పాడు కావ్యకు, కానీ మనసులో ఉన్న ప్రేమను మాత్రం చెప్పలేకపోయాడు. మనసు మాత్రం రోదిస్తోంది. కానీ పైకి లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న వెంకట్ తల్లి దగ్గరకు వచ్చింది.
"వెంకట్ నీకు ఇబ్బందిగా ఉంటే మనం ఇప్పుడే రాజమండ్రి వెళ్ళిపోదాము. నిన్ను చూడలేనురా ఇలా. అన్నయ్యకు చెప్పి వస్తాను. మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం. మీ నాన్నగారు ఒక్కరే ఉన్నారు అక్కడ " అని అంది భుజం మీద చెయ్యి వేసి.
"లేదమ్మా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోదాము. లేదంటే కావ్య బాధపడుతుంది" అని అన్నాడు వెంకట్.
"నీ పిచ్చి నీది. ఎవరు వారు వాళ్ళ జీవితాలు చూసుకున్నారు. నువ్వు మాత్రం నీ గురించి నువ్వు ఆలోచించుకోవు. సరే నీ ఇష్టం. కానీ సాయంత్రం భోజనాలు అవ్వగానే వెళ్ళిపోవాలి" అని చెప్పేసి వెళ్ళిపోయింది.
కావ్య వచ్చి కిరణ్ ని పరిచయం చేసింది వెంకట్ కి.
"మీరేనన్న మాట వెంకట్? మిమ్మలిని చూడాలి అని చాలా ఆసక్తిగా ఎదురుచూసాను. బామ్మగారు చాలా చెప్పారు మీ గురించి. ఏమి అనుకోకండి కావ్యను మీ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతున్నందుకు" అని చమత్కారం చేసాడు.
చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వెంకట్.
*** *** *** ***
కిరణ్, కావ్య జోడీగా నిల్చొని అందరి ఆశీస్సులు తీసుకున్నారు. అంత మంది ఉన్నా కావ్యకు వెంకట్ మాత్రమే కనిపించాడు. తనలో ఇలా మార్పు రావడానికి కారణం అర్థం కావటం లేదు కావ్యకు. ఎందుకో వెంకట్ ని చూస్తున్న కొద్దీ చెప్పలేని బాధ గుండెల్లో పిండేస్తోంది. ఒక్కసారి ఈ బంధాలన్నీ తెంపేసుకొని బావ దగ్గరకు వెళ్ళిపోవాలని అనిపించింది కావ్యకు. జీవితం అంటే ఏమిటో అర్థమయ్యేలోపు ఎన్నో అనుభవాలు. తన ప్రమేయం లేకుండానే కిరణ్ తో జీవితం ముడిపడిపోయింది. తన మనసులో తనకే తెలియకుండా బావ మీద ఏర్పడిన ప్రేమ ఎంత ముఖ్యమైనదో తెలిసే లోపే జీవితం ఇంకో వైపు మళ్ళింది. ఒక్కసారి వెంకట్ కళ్ళ ముందు కనిపించేసరికి ఏదో అలజడి. ఆలోచనల్లో ఉన్న కావ్యకు కిరణ్ చేతి మీద గిచ్చడంతో ఈ లోకంలోకి వచ్చింది.
"నేను ఇక్కడుంటే నువ్వెక్కడున్నావు?" అని అన్నాడు సరదాగా.
కిరణ్ సరదాగా అన్నా కావ్యకు మాత్రం తను తప్పు చేసినట్లు అనిపించి తల దించుకొంది. అందరూ ఒక్కొకరుగా వెళ్ళిపోయారు.
చివరిసారిగా వెంకట్ తో మాట్లాడాలి అని చూసినా కావ్యకు అవకాశం దొరకలేదు. కావ్య అత్తయ్య మాత్రం ఇద్దరిని రాజమండ్రి వచ్చి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ కలిసే అవకాశం వస్తుందో రాదో అని బాధపడింది కావ్య. ఒక్కసారిగా వెంకట్ తనకు ఎంత ముఖ్యమైనవాడో చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయాడు. కావ్య ఒంటరిగా ఉండడం చూసి కావ్య నానమ్మ వచ్చింది.
"ఇదిగో కావ్య, బావ నీకు ఇమ్మని ఇచ్చి వెళ్ళాడు. ఇంక అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి" అని చెప్పేసి కావ్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది.
వెంకట్ ఇచ్చిన ప్యాకట్ విప్పి చూసింది. అందులో చిన్న ఫోటో అల్బమ్, చిన్న గుండ్రని డబ్బా ఉన్నాయి. ఫోటో ఆల్బం తీసి చూసింది. అందులో తను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడెప్పుడో తీయించుకున్న ఫోటోలు. అన్నిటికీ తారీఖులతో రాసి అందంగా అలంకరించాడు. తను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఉయ్యాల బల్ల మీద తీయించుకున్నది, చిన్నప్పుడు అంతా కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు తీయించుకున్నవి, ఇలా ఎన్నో అనుభూతులు, ఙ్ఞాపకాలు. తన ఇరవై యేళ్ళ జీవితం, మధురమైన క్షణాలు అందులో పెట్టి ఇచ్చాడు. కావ్య కళ్ళల్లో ఆనందంతో పాటూ కన్నీరు నిండింది. తన దొంగిలించి తెచ్చుకున్న ఫోటోని అలమార లోంచి తీసి ఆల్బంలో పెట్టింది. పక్కనే ఉన్న డబ్బా విప్పి చూసింది. బంగారు గొలుసు చిన్న లాకెట్ తో అందంగా మెరిసిపోతోంది. తీసి మెడలో వేసుకుంది. ఆప్యాయంగా తడిమి అద్దంలో చూసుకొంది. ఆల్బం లోపల పెట్టబోతుండగా ఏదో ఉత్తరం కనిపించింది. వెంకట్ రాసిందే. విప్పి చదవడం మొదలు పెట్టింది.
2 comments:
ee part naku nachaledu andi.
venkat ni kavya ni veru chesaru ):
జీవితంలో ఎన్నో మలుపులు, భందాలు. ఏ మలుపు ఎప్పుడొస్తుందో, ఏ భందం ఎప్పుడు ఎర్పడుతుందో ఎవరూ చెప్పలెరు అది వచ్చెవరకు. జీవితం అంటే అంతే కద.
కావ్య పెళ్ళి కిరణ్ తో చెసెసారు అనుకున్నట్టే. తరువాయి టపాల కొసం...!