Author: Siri
•Sunday, September 19, 2010
కావ్య ట్రైన్ దిగేసరికి వెంకట్ ఎదురొచ్చాడు. 

         "ఎలా ఉన్నావు కావ్యా?" అని అడిగాడు చేతిలో సామాన్లు తీసుకొని. 

         అన్నీ కుశల ప్రశ్నలడిగాక వెంకట్ వెనకాలే వెళ్ళింది కావ్య. కావ్యను కార్ ఎక్కించి డ్రైవర్ కి చెప్పి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. 

         "ఏం బావా నువ్వూ రావచ్చుగా" అని అంది వెంకట్ చేతిని పట్టుకోబోయి. 

         "లేదు కావ్యా నాకు కొంచెం పని ఉంది. చూసుకొని వస్తాను నువ్వు వెళ్ళు" అని అన్నాడు నెమ్మదిగా చేతిని వెనక్కి తీసుకుంటూ. 

         డ్రైవర్ వంక తిరిగి చూసి "అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇందాక వచ్చిన రోడ్డు బాగాలేదు. ఇంకో దారిలో తీసుకెళ్ళు" అని జాగ్రత్తలు చెప్పాడు. 

         కార్ ముందుకు కదలడంతో కావ్య సర్దుకొని కూర్చుంది. ఇదివరకు ఎప్పుడొచ్చినా ఒక్క క్షణం కూడా ఎక్కడికీ వెళ్ళకుండా చుట్టూరా తిరిగేవాడు. కానీ వెంకట్ లో ఏదో మార్పు కావ్య గమనించింది. కిరణ్ తో ఎంతో చనువుగా ఉన్నా కావ్యను మాత్రం తప్పించుకొని తిరుగుతున్నట్టు కావ్యకు అనిపించింది. 

         "అయినా తన పిచ్చి కానీ, తను పెళ్ళి చేసుకొని హాయిగా తనకంటూ ఒక ప్రపంచం ఏర్పరుచుకొని, బావ ఇంకా తననే తలుచుకోవాలని తనకే తెలియకుండా మనసులో ఆశించడం ఎంత పొరబాటు?" అని తనను తాను విశ్లేషించుకుంది. అసలు అలా ఊహించుకునే హక్కును కోల్పోయింది అన్న విషయం గుర్తుకు రాగానే గుండె ఝల్లుమంది. 

         "ఇప్పటివరకు ఏదో ప్రవాహంలా అన్నీ సంఘటనలు జరిగిపోయాయి. ఏదీ పూర్తిగా ఆలోచించే సమయం కూడా లేకపోయింది. ఎవరైనా దూరం అయినప్పుడే వారి విలువ తెలిసొస్తుంది. ఇప్పుడు అదే ఊరిలో చిన్నప్పటి ఙ్ఞాపకాలు కలవరపెడుతున్నాయి. మెదడు పరిస్థితులకు అలవాటు పడినా వెంకట్ కళ్ళ ముందుకు రాగానే మనసే మొండికేస్తుంది" అని ఆలోచనల్లో ఉన్న కావ్యకు హారన్ శబ్దం వినిపించి ఉలిక్కిపడింది. 

         తాను ఇదివరకటికన్నా ఇప్పుడే వెంకట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని అనిపించింది కావ్యకు. "ఇక నుంచి కాస్త మనసుని అదుపులో పెట్టుకోవాలి" అనుకుని లోపలకు వెళ్ళింది. 

         కావ్య వాళ్ళ అత్తయ్య ఎదురు వచ్చి కావ్యను కౌగలించుకొంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. 


"పెళ్ళి అయ్యాక ఇంకా అందంగా తయారయ్యావు నువ్వు. నా దిష్టే తగిలేలా ఉంది" అని లోపలకు తీసుకెళ్ళింది.

         "ఇంట్లో ఎవ్వరూ లేరా అత్తయ్యా? అంతా నిశ్శబ్దంగా ఉంది" అని చుట్టూరా చూసింది.

         "ఎవరు ఉంటారు. అందరికి పనులు. అందరూ చివరి నిముషంలో వస్తారు. నువ్వు నా మీద అభిమానంతో ముందు వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

         "ఛ! అదేంటి అత్తయ్య ఎందుకు బాధపడతావు? ఎక్కడెక్కడ నుండో రావాలి అంటే సమయం పడుతుంది కదా. ఈ రెండు రోజులు నీతో పూర్తిగా గడిపే అవకాశం నాకు ఉంటుంది కదా" అని అంది కావ్య ప్రేమగా.

         "సరే స్నానం చేసిరా, వేడిగా పెసరట్టు ఉప్మా తిందువు గానీ" అనేసరికి ఉత్సాహంగా చూసింది కావ్య.

         "ఈ రెండు రోజులు నీ చేత అన్ని రకాలూ చేయించుకుంటాను" అని అంది చిన్న పిల్లలాగా.

         "నీకు కాకపోతే ఇంకెవరకు చేస్తాను. నాతోనే ఉండిపోతావనుకున్నా. నువ్వు పెళ్ళి చేసుకొని మమ్మలిని అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోయావు" అని అంది బాధగా.

         కావ్య చిన్న బుచ్చుకోవడం చూసి అలా అని ఉండకూడదు అని అనుకుంది ఆవిడ.

         "ఛా! నేను ఒకదాన్ని ఏదో ఒకటి అనేస్తాను. అన్నీ మర్చిపో. హాయిగా ఉండూ. నీకు కావలిసినవన్ని చేసిపెడతాను. అందరూ వెళ్ళిపొయినా నువ్వూ కిరణ్ ఇంకో పదిరోజులు ఉండివెళ్ళాలి సరేనా?" అని అంది నవ్వుతూ.

         పొద్దున్నంతా అత్తయ్యతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేసింది. సాయంత్రం అయినా వెంకట్ జాడ కనిపించలేదు. తోచక వెంకట్ పెంచుకున్న పావురాలు చూసి వద్దామని వెళ్ళింది కావ్య. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. ఇదివరకు ఎంతో అందంగా పెంచి ఉన్న మొక్కలు వాడిపోయి సంరక్షణ లేకుండా కనిపించాయి. కావ్య మనస్సు చివుక్కుమంది. లోపలకు పరుగెత్తుకెళ్ళింది కావ్య.

         "అత్తయ్యా పావురాలు ఏమయ్యాయి? అన్నీ అలా చిందర పందరగా ఉన్నాయి ఏంటి?" అని అడిగింది.
 "ఏం చెప్పేది కావ్యా? వెంకట్ లో ఇదివరకు ఉత్సాహం లేదు. అసలు పొద్దున్న వెళ్ళిన వాడు ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. వాడిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. పైకి ఏమి చెప్పడు. మాకు షష్టిపూర్తి చెయ్యాలని ఆశపడుతున్నాడు. కానీ వాడికి ఒక పెళ్ళి చేసి చూసి సంతోషించాలి అన్న నా ఆశ ఆశగానే ఉండిపోతోంది. పెద్దవాడు రఘు మమ్మలని వచ్చేయ్యమని అడుగుతున్నాడు. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే రేపు పిల్లలు వస్తే చూసేవాళ్ళు ఉండరూ అని. కాని ఇక్కడ వీడిని ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళేది? వాడిని ప్రేమతో చూసుకునే ఒక మనిషి కావాలి కదా? కానీ పెళ్ళి మాట ఎత్తితే ఇప్పుడప్పుడే వద్దు అంటాడు. వాడి స్నేహితులందరికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలతో సుఖంగా ఉన్నారు. వీడు మాత్రం పెళ్ళి లేకపోతే బతకలేనా అని అంటూ వేదాంతం చెప్తాడు. దేని మీదా అమితంగా ప్రేమను పెట్టుకోకూడదూ మళ్ళీ వదిలి వెళ్ళిపోతే తట్టుకోలేను అని ఆ పావురాలను విడిచిపెట్టేసాడు. ఏదో తన పని, తన పుస్తకాలతో కాలం గడుపుతూ ఉంటాడు. నువ్వైనా కాస్త చెప్పి చూడు. నువ్వు అడిగితే కాదూ అని అనడని నా అభిప్రాయం" అని అంది కావ్య చేయి పట్టుకొని అభ్యర్ధనగా.

         "సరే అత్తయ్య నేను మాట్లాడతాను. నువ్వు బెంగ పెట్టుకోకు" అని సర్ది చెప్పింది కావ్య.

         వెంకట్ తండ్రి రావడంతో ఇద్దరూ లేచారు.

         "ఏమ్మా కావ్యా ఎలా ఉన్నావు? కిరణ్ రాలేదా?" అని బాగానే పలకించారు కావ్యను చూసి.

         మామయ్య ఆప్యాయంగా పలకరించడంతో ఎంతో ఆనందంగా అనిపించింది కావ్యకు.

         "పద కావ్యా, నీకు మామయ్యకూ భోజనం వడ్డిస్తాను" అని అంది కావ్య వాళ్ళ అత్తయ్య.

         "లేదు అత్తయ్య ఆకలి లేదు. బావ వచ్చాక తింటాను" అని కూర్చుండి పోయింది కావ్య.

         "సరే" అని వెళ్ళిపోయారు లోపలకు ఇద్దరూ.

         వెంకట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కావ్య. చల్లగా ఉండడంతో కావ్యకు చిన్నగా కునుకు పట్టేసింది.

         ఏదో అలికిడి వినిపించి ఉలిక్కిపడి లేచింది కావ్య. గేట్ తీసుకొని వెంకట్ లోపలకు వస్తూ కనిపించాడు. ఆవులిస్తూ లేచింది కావ్య.

         "ఏమిటి బావా ఇంతసేపు ఏం చేస్తున్నావు?" అని అంది విసుగ్గా.

         "స్నేహితులు ఉండిపొమ్మంటేను ఉండిపోయాను. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు?" అని అడిగాడు కావ్య వంక చూస్తూ.

         నిద్ర మత్తుతో ఉన్న కావ్య ఇంకా అందంగా కనిపించింది. చీరలో కావ్యను మొదటి సారి చూస్తున్నట్టు అనిపించింది. పెళ్ళి అలంకారంలో ఆనాడు చూసాడు కానీ, ఏ అలంకారం లేకుండా విశ్వనాథ్ సినిమాలో నాయికలా ఎప్పుడూ లేనంత అందంగా అనిపించింది వెంకట్ కి. అలా చూడడం తప్పని గ్రహించి చూపులు మరల్చుకున్నాడు.

         "పదా అందరూ నిద్రపోయారు. నువ్వూ నేను కలిసి తిందాము" అని లోపలకు వెళ్ళబోయింది కావ్య.

         "నాకు ఆకలి లేదు. అక్కడ తినేసి వచ్చాను. నువ్వు వెళ్ళి తినేసి పడుకో" అని అన్నాడు తన గదిలోకి వెళ్ళిపోతూ.

         "నేను ఒక్కదాన్నీ తినాలా? నేను పడుకుంటాను పోయి. అయినా మీ ఇంటికి వచ్చి నిన్ను బతిమాలుకోవాల్సి వస్తోంది" అని అంది కోపంగా.

         "అంటే మా ఇంట్లో నీకు మర్యాదలు చెయ్యాలా? లేకపోతే ఏం చేస్తారు అమ్మగారు?" అని అన్నాడు వెంకట్ తలుపు దగ్గర చేతులు కట్టుకొని నిల్చొని.

         "ఏం చేస్తాము? అయ్యో అంత దూరం నుండి వస్తే ఎవరూ పట్టించుకోలేదే అని మంచినీళ్ళు తాగి పడుకుంటాను. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది" అంది కావ్య నీరసంగా మొహం పెట్టి.

         "సరే నాకు ఆ పాపం వద్దు కానీ కొంచెం తింటాను పదా" అని అన్నాడు వెంకట్ వెనకాలే నడుస్తూ.

         గబగబా ఇద్దరికి వడ్డించి కూర్చుంది కావ్య. పక్కనే కూర్చొని కావ్య వంకే చూస్తూ ఉండిపోయాడు వెంకట్.

         "తిను బావా ఏంటి ఆలోచిస్తున్నావు?" అని కావ్య అనేసరికి తినడం ప్రారంభించాడు.

         భోజనం అయ్యేవరకు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. చేయి కడిగేసుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోబోయాడు వెంకట్.

 "బావా నీతో కొంచెం మాట్లాడాలి" అని పిలిచింది కావ్య.

         "రేపు అందరూ వస్తే మళ్ళీ మాట్లాడే సమయం దొరకదు" అంది.

         "సరే చెప్పు ఏంటి సంగతి?"అని అన్నాడు వరండాలోకి వెళ్తూ.

         కావ్య కూడా వెనకాలే వెళ్ళి గోడకు ఆనుకొని నిల్చొంది.

         "ఏంటి ఎదో చెప్పాలని అన్నావు? ఏమి చెప్పకుండా అలా నిల్చొన్నావు?" అన్నాడు కావ్య వంక చూస్తూ.

         "ఇదివరకులా ఎందుకో నాతో నువ్వు మాట్లాడడం లేదు, తప్పించుకొని తిరుగుతున్నావు" కంప్లెయింట్ చేస్తున్నట్టు అంది కావ్య.

         "నీకలా అనిపిస్తోందా?" అని అన్నాడు వెంకట్ తిరిగి ఇంకో వైపు చూస్తూ.

         "అనిపించడం కాదు అదేగా నిజం? కోపం ఏమి లేదు అని పెద్ద ఉత్తరం రాసావు. మరి పొద్దున్న నుండి నన్ను అలా పంపించేసి ఎక్కడికి వెళ్ళిపోయావు?" అంది కావ్య కోపంగా.

         ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు వెంకట్.

         "ఏం బావా నువ్వు ఇంటికి కూడా రావడం లేదంట కదా? అత్తయ్య ఎంత బాధపడిందో తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావు, ఇది నీకేమైనా బాగుందా? అత్తయ్య చెప్పిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని నువ్వూ హాయిగా ఉండొచ్చుగా?" అని కోపంగా చూసింది కావ్య.

         "ఎక్కడ నుంచి నేర్చుకున్నావు ఇన్ని మాటలు? మీ అమ్మాయిలు పెళ్ళి అవ్వగానే ఎవ్వరికి పెళ్ళి చేద్దామా అని చూస్తుంటారు. అదేం లేదు కావ్యా, అమ్మ అలానే అంటుంది. ఆవిడకు నా మీద అమితమైన ప్రేమ. ఏమి లేకపోయినా ఏదో ఉంది అని బాధపడుతుంది" అని అన్నాడు వెంకట్ నవ్వుతూ.

         "మరి పొద్దున్న వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడం?" అని చురుగ్గా చూసింది కావ్య.

         "ఇదిగో నీ పెత్తనం ఇక్కడ చెల్లదు. ఇంక కిరణ్ మీద చలాయించుకో" అని అన్నాడు వెంకట్ ఆటపట్టిస్తూ.

         చివుక్కున తలెత్తి చూసింది కావ్య. ఒక్కసారి ఇద్దరి చూపులు కలిసి విడిపోయాయి. కావ్య తల దించుకొని మౌనంగా ఉండిపోయింది. కళ్ళల్లో కనీ కనిపించని కన్నీటి పొర కదలాడింది. అది వెంకట్ గమనించనే గమనించాడు. దగ్గరగా వచ్చి నిల్చొన్నాడు.

 "ఆ కళ్ళల్లో కన్నీళ్ళు తట్టుకోవడం నా వల్ల కాదు. ఇదిగో లెంపలు వేసుకున్నా చూడు" అని లెంపలు వేసుకున్నాడు వెంకట్.

         చిన్నగా నవ్వింది కావ్య.

         "ఇప్పుడు ఇలా మాట్లడుతావు, మళ్ళీ కనిపించకుండా పోతావు. ఎప్పుడైనా వచ్చినా కిరణ్ తో మాట్లాడి వెళ్ళిపోతావు. నీకు నా మీద కోపం లేకపోతే ఎందుకలా చేస్తావు?" అని సూటిగా చూసింది కావ్య.

         మళ్ళీ దూరంగా వెళ్ళి నిల్చొన్నాడు వెంకట్.

         "ఏం బావా నేను ఏదన్నా తప్పుగా అడిగానా?" అని అడిగింది కావ్య.

         "లేదు కావ్యా ఏమి తప్పు లేదు. నీకు తెలుసా కావ్యా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను దేని మీద ఎక్కువ ప్రేమ ఆశ పెట్టుకోలేదు. చిన్నప్పుడు కుక్క పిల్ల కావాలి అని అన్నప్పుడు, ఎక్కడికైనా వెళితే అది బెంగ పెట్టుకుంటుందిరా వద్దు అని చెప్పింది అమ్మ. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డ అమ్మ కూడా నీ విషయంలో ఏం చెప్పాలో తెలియక తిక మక పడుతోంది. నాకే తెలియకుండా నువ్వు నా మనసంతా నిండిపోయావు. నువ్వు ఎదురు పడినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతాను. నా మనసులోని భావాలు ఎవరి కళ్ళల్లోనైనా పడితే, దానివల్ల నిన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నా, లేదా నీకు ఏదన్నా ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేను. అందుకే దూరంగా ఉన్నానే తప్ప నీ మీద అభిమానం తగ్గి కాదు. నా మనసులో ఉన్నది అంతా సమయం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నా. కానీ సమయం నాకన్నా వేగంగా పరిగెడుతుంది అని దానిని అందుకోలేనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నాకు కొంచెం సమయం పడుతుంది. నా పెళ్ళి ఇప్పుడు ముఖ్యం కాదు. ఏదో చేసుకోవాలి కదా అని తొందరపడి చేసుకొని ఆ వచ్చే వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక అమ్మ మాట కాదన్నాను. నీకు ,అమ్మకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. నీకు, అమ్మకు అందులోనే సంతోషం ఉంటే అలానే చేస్తాను. సరేనా? ఇంక చాలా పొద్దు పోయింది. వెళ్ళి పడుకో" అని అన్నాడు వెంకట్.

         "అయితే నా మీద ప్రమాణం చెయ్యి" అని చెయ్యి ముందుకు చాచింది కావ్య.

         "ఏమిటి చిన్న పిల్లలాగా" అని వెంకట్ అన్నా కావ్య ఊరుకోలేదు.

         "సరే నేను పెళ్ళి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు అని అంటే తప్పకుండా చేసుకుంటాను, సరేనా? ఇంక హాయిగా పడుకో" అని ప్రమాణం చేసాడు వెంకట్.

         "అబ్బా నిద్ర రావడం లేదు. కాసేపు కబుర్లు చెప్పు. నీతో ఇలా మాట్లాడే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో" అని కూర్చుంది కావ్య.

కిరణ్ బిజినెస్ చేసే విషయం, తన స్నేహితురాలు గురించి అన్నీ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోయింది కావ్య. తన ఆశలను, సంతోషాలను చెప్తుంటే వెంకట్ వింటూ ఉండిపోయాడు.

***        ***        ***        ***

         రెండు రోజుల్లో ఒక్కొక్కరుగా రావడంతో హడావుడి మొదలు అయ్యింది. అత్తయ్యకు చేదోడు వాదోడుగా కావ్య అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. హరిణి పిల్లలు రావడంతో ఇల్లంతా ఒకటే సందడి.

         కావ్యకు ఎన్నో రోజుల తరువాత ఇలా నవ్వుతూ గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పెళ్ళి అయిపోయినందుకో ఏమో హరిణి కూడ కావ్యను కాస్త నవ్వుతూనే పలకరించింది. ఆలా కాస్త నవ్వుతూ మాట్లాడినందుకే కావ్య పొంగిపోయింది. ఎప్పుడూ లేనిది మొదటి సారిగా తనకూ తోబుట్టువులు ఉండి ఉంటే బాగుండు అనిపించింది. అందరిని చూస్తూ గడిపేసింది. కిరణ్ జ్ఞాపకం రావడంతో గదిలోకి వెళ్ళి ఫోన్ చేసింది.

         "ఏంటీ నేను ఇక్కడ ఒకడిని ఉన్నాను అని మర్చిపోయావా?" అని ఆట పట్టించాడు కిరణ్.

         "అందుకే నేను రాను అన్నాను. మీరే బలవంతంగా పంపించారు" అని అంది కావ్య కోపగించుకుంటూ.

         "అబ్బా నీకు కోపం వెంటనే వచ్చేస్తుంది కదా? ఊరికే అన్నాను. హాయిగా సంతోషంగా ఉండు. రేపు సాయంత్రం బయలుదేరి వస్తున్నాము. మీ అమ్మగారిని, నాన్నగారిని, బామ్మగారిని జాగ్రత్తగా తీసుకొని వస్తాను. మీ నాన్నగారు ఇందాకే వచ్చి వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఫోన్ పనిచెయ్యటం లేదు అని చెప్పారు. నువ్వేదైనా చేస్తావేమో అని చెప్పమన్నారు. ఇంకేమన్నా తేవాలంటే చెప్పు తెచ్చేస్తాను" అని అన్నాడు కిరణ్.

         "మరి మామయ్యగారు ఒక్కరిని వదిలేసి వస్తారా? పాపం ఒక్కరు ఏం చేస్తారు? ఎలాగోలా చెప్పి ఆయన్ను కూడా తీసుకు రండి" అని అంది కావ్య.

         "నాన్నకు ఇదంతా అలవాటే కదా కావ్య? నేను చదువుకున్నన్ని రోజులూ ఒక్కరే ఉన్నారు. నువ్వేమి బెంగ పెట్టుకోకు. ఇదిగో నాన్న కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడు" అని తండ్రి చేతికిచ్చాడు కిరణ్.

         "కావ్య మీ మీద బెంగ పెట్టుకుంది నాన్నా" అని నవ్వాడు కిరణ్.

         "కావ్యా! ఏమి పర్వాలేదు తల్లీ. నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది. అందుకే ఉండిపోయాను. బెంగ పెట్టుకోకు. రెండు రోజుల్లో వచ్చేస్తారుగా?" అని చెప్పి పెట్టేసాడు.
  రాజారాం మనసులోనే పొంగిపోయారు. భార్య పోయిన తరువాత ఇంత ప్రేమగా ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కావ్య చూపించే ప్రేమ ఆప్యాయతలో జీవితంలో కొత్త సంతోషం కనిపించింది. పెళ్ళితో కొడుకు జీవితమే కాకుండా తన జీవితం కూడా కొత్త మలుపు తిరిగిందని ఆయనకు అనిపించింది. ఇప్పటివరకు జీవితంలో ఒక్కో క్షణం ఎంతో భారంగా గడిచింది. కావ్య రాకతో ప్రతీ ఉదయం ఒక్క కొత్త ఆశతో ఎదురు చూస్తునట్టు అనిపించింది. కూర్చుని పత్రిక చదువుతున్న కిరణ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తట్టారు. తలపై చేయి ఉంచి దీవించారు. తండ్రి సంతోషంగా ఉండడం గమనించిన కిరణ్ కూడా తండ్రి వంక చూసి నిర్మలంగా నవ్వాడు. ఒకరికొకరికి ఏమి చెప్పుకోకుండానే మనసులోని ఆనందాన్ని చిన్న నవ్వుతో పంచుకున్నారు ఇద్దరూ.

***        ***        ***        ***

         పొద్దున్నే లేచి తయారయ్యింది కావ్య. ఏమిటో కిరణ్ ని వదిలేసి వచ్చి ఒక నాలుగు రోజులే అయినా ఏదో ఎన్నో రోజులయినట్టు అనిపించింది. అందరూ ఆ రోజు పట్టిసీమ వెళ్ళాలని అనుకొని ప్రయాణం అయ్యారు. కావ్య పెద్ద బావా వాళ్ళు అందరూ రావడంతో సరదాగా తిరిగి రావాలని కావ్య అత్తయ్య అందరికీ తినడానికి పులిహోర, దద్దోజనం తయారు చేసింది. కావ్యకు ఎందుకో కాస్త నలతగా ఉండడంతో వెళ్ళ బుద్ది కాలేదు. అదే విషయం కావ్య అత్తయ్యకి చెప్పింది. ఆవిడ కూడా కావ్యకు తోడుగా ఉండిపోడానికి నిశ్చయించుకుంది.

         "లేదు అత్తయ్య నేను ఒక్కదాన్నే ఉండగలను. మీరు అందరూ సరదాగా వెళ్ళి రండి" అని కావ్య బ్రతిమాలినా ఆవిడ ఒప్పుకోలేదు.

         వెంకట్ కూడా ఉండిపోతాను అనడంతో హరిణి చిరాకు పడింది.

         "ఏదోక నాటకం చెయ్యకుండా ఉండదు మహా తల్లి. అందరం సరదాగా వెళ్ళాల్సింది కాస్తా ఇలా తగలడింది" అని పళ్ళు నూరింది.

         "అబ్బా రాద్ధాంతం చెయ్యకు" అని హరిణి భర్త సముదాయించాడు.

         "నేనా రాద్ధాంతం చేస్తున్నది. అక్కడ చూడండి" అని కావ్య వైపు గుర్రుగా చూసింది.

         కావ్యకు ఇంక కళ్ళనుండి జల జలా కన్నీళ్ళు రాలడమే తరువాయి. కావ్య అత్తయ్య అది గమనించింది.

         "ఒరే వెంకట్ నువ్వూ వెళ్ళు. లేదంటే అది ఇంకా రాద్ధాంతం చేస్తుంది. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను" అని చెప్పడంతో వెంకట్ కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు.వాళ్ళు వెళ్ళిన రండు గంటలకు కావ్యకు తిన్నది ఇమడక వాంతులు అవుతుండడంతో గాభరా పడి కావ్య అత్తయ్య వెంకట్ కి ఫోన్ చేసింది.

         వెంకట్ రాగానే అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు. వెంకట్ ఇద్దరినీ లోపలకు పంపించి బయటే ఎదురు చూశాడు. కొంచెం సేపటికి కావ్య, తల్లీ రావడం చూసి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు.

         "ఏమి కంగారు లేదు. అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే అంతా తగ్గిపోతుంది" అని నవ్వింది కావ్య వైపు చూస్తూ.

         "అదేమిటి మందులు ఏమి రాయకుండా, ఏమి చూడకుండా ఇలా పంపించేసారు? నేను మాట్లాడి మందులేమైనా ఇస్తారేమో అడిగి వస్తాను" అని వెళ్ళబోయాడు వెంకట్.

         "అవేమి అక్కర్లేదు.నువ్వు పదా" అని వెంకట్ తల్లి చెయ్యి పట్టి ఆపింది.

         ఏం చెప్పినా వినిపించుకోకుండా హడావుడి చేస్తున్న వెంకట్ పక్కనే నర్స్ వచ్చి నిల్చొంది.

         "ఈయనేనా కాబోయే తండ్రి? ఇప్పుడే ఇంత హడావుడి చేస్తున్నారు, ఇంక ముందు ఎంత చేస్తారో?" అని నవ్వేసి కావ్య చేతిలో ఒక సీసాని ఉంచింది.

         "ఇవి బలానికి టాబ్లేట్లు, వేసుకోమన్నారు డాక్టర్ గారు" అని చెప్పేసి వెంకట్ వైపు చూసి నవ్వేసి వెళ్ళిపోయింది నర్స్.

         విచిత్రంగా చూస్తున్న వెంకట్ ని చూసి కావ్య, అతని తల్లి ఒక్కసారి ఫక్కున నవ్వారు. వెంకట్ కూడా వాళ్ళ నవ్వుతో జత కలిపాడు.

***        ***        ***        ***

         సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు కిరణ్ కి తను తండ్రి కాబోతున్న సంగతి చెప్పాలా అని ఎదురు చూసింది కావ్య.

         "విషయం తెలిస్తే అమ్మా నాన్నా కూడా ఎంత ఆనందిస్తారో" అని ఊహల్లో తేలిపోతోంది కావ్య.

         సాయంత్రం ట్రైన్ కి వస్తున్న వాళ్ళను తీసుకు రావడానికి వెంకట్ వెళ్ళాడు. వచ్చే వాళ్ళ కోసం కావ్య వసారాలోనే కూర్చొంది.


( ఇంకా ఉంది )

This entry was posted on Sunday, September 19, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 comments:

On September 20, 2010 at 4:13 AM , వంశీ కిషోర్ said...

కథ చాల త్వరగ పరుగులు తీస్తుంది :)

 
On September 20, 2010 at 10:20 AM , Siri said...

అవును వంశీ .....ఇది చాలా రోజులు క్రితం ఒక వెబ్ పత్రిక కోసం రాసింది ...నేను అప్పట్లో కాస్త బిజీ అయిపోవడం వల్ల వాళ్ళు మొత్తం రాసి ఇచ్చెయ్యమంటే తొందరగా ముగించేసాను .... Thanks for commenting :)

 
On September 22, 2010 at 10:31 PM , Unknown said...

next part kosam waiting andi.Thvaraga
post cheyandi please

 
On October 1, 2010 at 7:56 AM , వంశీ కిషోర్ said...

next part ekkada!!!!
vaaram rojulanunchi waiting :)

 
On October 5, 2010 at 2:46 AM , Raja said...

పార్ట్ 13 కోసం ఎదురుచూస్తున్నాం ఎప్పుడు వేస్తున్నారు మేడం