Author: Siri
•Monday, September 13, 2010
  "ప్రియమైన కావ్యకు, 
         నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు క్షమించు. చెప్పే ధైర్యం చాలలేదు. ఎదురుగా చెప్ప లేక ఇలా అక్షరాల సహాయంతో రాస్తున్నాను. నేను ఇచ్చిన బహుమతి నీకు నచ్చిందనుకుంటాను. ఎప్పటి నుండో నీకోసమే చేసింది. ఎప్పుడోకప్పుడు ఇవ్వాలని ఉంచాను. ఇప్పుడు సరైన సమయం వచ్చిందనుకుంటాను.

         అమ్మా, అమ్మమ్మ అందరూ చెప్పే మాటలు నువ్వు పట్టించుకోకు. అమ్మ నిన్ను బాధపెడితే ఆవిడ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంక నా విషయానికి వస్తే, నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు.

         నేను కొంచెం బాధపడింది నిజమే. కానీ మళ్ళీ ఆలోచించాను. నా ప్రేమ ఆత్మకు సంబంధించింది కానీ శరీరానిది కాదు. మనిద్దరం ఒకటి కాకపోవడం వల్ల అందులో ఏ మాత్రం మార్పు రాదు. ప్రేమకు పెళ్ళే సమాధానమా? కాదు కదా?

         నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే ఆత్మ ఒకటుందని అది ఏ స్వార్థాన్నీ కోరుకోదని గుర్తు ఉంచుకో. నువ్వు సంపూర్ణంగా, సంతోషంగా జీవితం గడపాలి. ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడే నాకు సంతోషం.

         నువ్వూ, నీ జీవితంలో ఉన్న మనుషులు నాకు ముఖ్యమైనవారే. ఇప్పుడు నీతో పాటు కిరణ్, నీకు పుట్టబోయే పిల్లలు, ఇలా ఇంకా నాకు ఎంతో మంది ప్రేమించేవాళ్ళు దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి. మీరు ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

         మీ కష్ట సుఖాల్లో నన్ను ఎప్పుడైనా తలచుకుంటారని ఆశిస్తూ...

వెంకట్ 





 అని రాసి ఉంది.

         అలా చదువుతూ ఉండిపోయింది కావ్య. ఎన్ని సార్లు చదివినా ఇంకా చదవాలనిపించింది. ఎప్పుడు వచ్చాడో కిరణ్ వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న కావ్య చేతిలోంచి ఉతరాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. 



 ఇలా అనుకోకుండా వచ్చి పక్కనే కూర్చున్న కిరణ్ ని చూసి కావ్య ఉలిక్కి పడింది. ఉత్తరం చదివి ఏమనుకుంటాడో అని కంగారు పడింది.

         "మీ బావ మనిషే అందగాడు అనుకున్నా, మనసూ అంత కంటే అందమైనదని ఈ ఉత్తరం చెప్తోంది. ఇలాంటి మనిషి మనకు ఉన్నందుకు మనమే అదృష్టవంతులం. నిజంగా నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి మనసున్న మనిషిని" అన్నాడు నవ్వుతూ.

         తేలికగా ఊపిరి పీల్చుకుంది కావ్య. అలమార లోంచి ఫోటో ఆల్బం తీసి చూపించింది. కిరణ్ ఒక్కొక్క ఫోటో గురించి అడుగుతున్నాడు. కావ్య ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోయింది. ఇద్దరూ నవ్వుతూ ఒకరికొకరు దగ్గరయ్యిపోయారు.

***        ***        ***        ***

         కావ్య, కిరణ్ ఇద్దరూ జీవితంలో సర్దుకుపోయారు. వెళ్ళిన కొత్తల్లో కావ్యను ఏ పని చేయనివ్వలేదు రాజారామ్ గారు కిరణ్ కలిసి. కొద్ది రోజుల్లోనే తల్లితండ్రులను వదిలి వచ్చానన్న బాధ నెమ్మదిగా పోయింది. ఒకే ఊరిలో ఉండడం వల్ల ఆదివారాలు అందరూ కలిపి గడిపేవారు.

         కావ్య కూడా రాజారాంని తండ్రిలా చూసుకోవడం, కిరణ్ కి అన్నీ ఎప్పటికప్పుడు చేసి పెట్టడం చూసి కావ్య తల్లి తండ్రులు మురిసిపోయారు. కిరణ్ కూడా కొడుకులా అన్ని విషయాలు చూసుకోవడంతో కావ్య తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశ్రాంతి తీసుకున్నారు. వెంకట్ కి కూడా కిరణ్ తో మంచి స్నేహం ఏర్పడడంతో అపుడప్పుడు కలుసుకునేవారు.

         కిరణ్ ఒక కంపెనీలో ప్యాకింగ్ విభాగంలో మేనేజర్ గా పనిచేసేవాడు. వెంకట్ సలహా మేరకు అప్పు తీసుకొని సొంతంగా తనకు తెలిసిన ప్యాకింగ్ కంపెనీ ఒకటి పెట్టాడానికి పూనుకున్నాడు.

         "మీ బావ అద్భుతమైన సలహా ఇచ్చాడు. నువ్వు రావడంతో నా జీవితం మారిపోయింది" అని సంతోషంగా కావ్య ను ఎత్తి గిరగిరా తిప్పేసాడు కిరణ్.

         కావ్య ముఖంలో సంతోషం కనపడకపోవడంతో ఏమిటని అడిగాడు కిరణ్.

         "నా జాతకం మావయ్య, హరిణి చూపించినప్పుడు నాది అంత మంచి జాతకం కాదు అని చెప్పారు. నాకు అత్తగారు లేరు లేదంటే ఆవిడకు ప్రాణ గండం అని కూడా చెప్పారు. ఇది నా వల్ల కాదు అంతా మీ అదృష్టమే" అని అంది కావ్య.

         "పిచ్చీ! నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు" అని అన్నాడు కిరణ్ కావ్య నెత్తి మీద చిన్న మొట్టికాయ మొడుతూ.



 "అంటే జాతకాలు ఇవేమి నిజం కాదూ అంటారా?" అని అంది కావ్య మూతి తిప్పుతూ.

         "నిజం అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. అస్సలు నిజంలేదు అనడం లేదు. కానీ ముందే తెలుసుకొని జీవితం అంతా బాధపడటం ఎందుకు అంటాను. ఒకరి ఉనికి వల్ల ఇంకొకరికి నష్టం అని చెప్పడం నిజంగా తెలివి తక్కువతనమే. ఇప్పుడు నా జాతకంలో నేను రేపో మాపో పోతాను అని రాసి ఉంది అనుకో, అది తెలుసుకొని రోజూ చావు భయంతో బతకడం కన్నా తెలియకుండా ఒక్కరోజైనా సంతోషంగా ఉండడం మేలు. అలాగే ఎవరో చెప్పిన జాతకాన్ని గురించి ఆలోచించి అన్నిటికీ వెనకడుగు వెయ్యడం కన్నా, నీ ఉనికి వల్ల ఎంత మందికి సంతోషాన్నీ, ప్రేమను పంచావో తెలుసుకొని ఆనందంగా గడపడం ముఖ్యం అంటున్నా. అందుకే హాయిగా మనో ధైర్యంతో, ఆనందంగా ఉన్న కొన్ని క్షణాలు గడపాలి. ఈ క్షణం మళ్ళీ రేపు రమ్మని బ్రతిమాలినా రాదు" అని అన్నాడు కావ్య బుగ్గ గిల్లుతూ.

         కిరణ్ మాటలతో ఏదో కొత్త ఊపిరి వచ్చినట్లు అనిపించింది కావ్యకు.

         "మీతో పాటూ నేను సహాయం చెయ్యనా మీ పనిలో?" అని అడిగింది కావ్య.

         "సహాయం ఏంటి? సర్వం నీదే. నువ్వే దానికి అధిపతివి" అని అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         "అన్నట్టు మర్చిపోయాను సాయంత్రం మనం ఒకరి ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసిన వాళ్ళు. లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం కదా. దాని సంబంధించి మాట్లాడాలి. నువ్వు తయరవ్వు, ఇద్దరం కలిసి వాళ్ళింటికి వెళ్ళి వద్దాం" అని అన్నాడు.

         "సరే" అని లేచింది కావ్య.

***        ***        ***        ***

         సాయంత్రం ఇద్దరూ తయారయ్యి బయలుదేరారు. ముచ్చటగా ఉన్న చిన్న ఇల్లు. అందంగా చుట్టూరా మొక్కలు ఉన్నాయి.

         వెళ్ళి తలుపు కొట్టగానే "ఆఁ వస్తున్న" అన్న అడ గొంతు వినిపించింది.

         ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది కావ్యకు. తలుపు తీసి ఎదురుగా నిల్చొన్న అమ్మాయిని చూడగానే కావ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది.



ఎదురుగా పావని నోరు వెళ్ళబట్టుకొని చూస్తూ ఉండిపోయింది.

         "నేను చూసేది నిజమేనా? కావ్యా ఎలా ఉన్నావు? రా లోపలకు. ఎన్ని రోజులయ్యిందే నిన్ను చూసి" అని లాక్కొని వెళ్ళిపోయింది.

         కిరణ్ విచిత్రంగా చూస్తుండిపోయాడు వాళ్ళిద్దరి వంక.

         "నువ్వు ఇక్కడ ఎలా?" అని ఎన్నో ప్రశ్నలతో నిండిన ముఖంతో చూసింది కావ్య.

         "అదంతా పెద్ద కథ. అన్నీ చెప్తాను కానీ, నీ వెనకాల ఉన్నతను ఎవరు?" అని చెవిలో గుసగుసలాడింది పావని.

         "అతను నా భర్త కిరణ్ " అని అంది కావ్య కిరణ్ ను పరిచయం చేస్తూ.

         "నమస్కారం అండి. మీకూ కావ్యకు పరిచయం ఉన్నట్టు ఉంది. నేను రమణ గారికి తెలుసండి. ఆయన్ని కలవడానికే వచ్చాము" అన్నాడు కిరణ్ కావ్య పక్కగా వచ్చి నిల్చొని.

         "అవును, పావని నేను చిన్నప్పటి నుండి స్నేహితులం" అని అంది కావ్య పావని వంక సంతోషంగా చూస్తూ.

         ఇంతలోపు లోపల నుంచి వచ్చిన వ్యక్తిని చూసి పావని చిన్నగా నవ్వింది. అతని వెనకాలే తొమ్మిది సంవత్సరాల పాప పరిగెట్టుకొని వచ్చింది.

         "ఇదిగో ఈయనే మా వారు" అని పరిచయం చేసి కావ్య గురించి చెప్పింది.

         పాప వచ్చి "ఆమ్మా" అంటూ పావనిని కౌగలించుకొని కూర్చుంది.

         కావ్య నోట మాట రానట్టు ఉండిపోయింది.

         "మీరు మాట్లాడుతూ ఉండండి. నేనూ, కావ్య లోపలకు వెళ్ళి మాట్లాడుకుంటాము" అని కావ్యను లోపలకు తీసుకెళ్ళింది పావని.

         "కావ్యా అంతా అయోమయంగా ఉందే. నీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది? అయినా మీ బావ ఏమయ్యాడు? ఎన్ని చెప్పేదానివి మీ బావ గురించి" అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది పావని.

         "నా సంగతి అలా ఉంచు. నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోయావని మీ వాళ్ళు ఎంత బాధపడ్డారో. మళ్ళీ వెళ్ళి కలవడానికి భయం వేసింది. పెళ్ళికి పిలుద్దామని వెళితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా?" అని అంది కావ్య బాధపడుతూ.

"ముందు నీ కథ చెప్పు నాకు. మీ బావ గురించి చెప్పకపోతే నాకు బుర్ర పగిలేలా ఉంది" అంది పావని ఆత్రుతగా.

         కావ్య అంతా చెప్పుకొచ్చింది. రాజమండ్రి వెళ్ళినప్పుడు జాతకం చూడటం నుంచి తండ్రి గుండెపోటు రావడం, కిరణ్ తో పెళ్ళి జరగడం వరకు అన్నీ చెప్పింది.

         "పాపం మీ బావ. అలాంటి బావ నాకు ఉంటేనా, అస్సలు వదిలేదాన్ని కాదు. మనస్పూర్తిగా మనలని ప్రేమించేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. చాలా మంది ఏదొక స్వార్థంతోనో లేక అవసరం కోసమో బంధాలను ఏర్పరుచుకుంటారు. నీ జీవితంలో అలాంటి మనిషి ఉండి కూడా నువ్వు దూరం చేసుకున్నావు" అంది పావని కోపం నటిస్తూ.

         "కిరణ్ కూడా ఏమంత చెడ్డావాడు కాదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగదు కదా జీవితంలో. నేను సంతోషంగానే ఉన్నాను" అని అంది కావ్య కిందకు చూస్తూ.

         "నువ్వు బాగానే ఉన్నావు. పెళ్ళి భర్త అని. కానీ పాపం మీ బావ?" అని అంది పావని వెంకట్ ని వెనకేసుకొస్తూ.

         "నువ్వు కూడా అలా అనకే. నాకు బాధగా ఉంటుంది. ఏదో నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇప్పుడు ఎంత దాని గురించి మాట్లాడినా మారేది ఏమీ లేదు. నీ సంగతి చెప్పు అంత పెద్ద కూతురు ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది?" అంది కావ్య పావని పక్కన కూర్చుంటూ.

         "ఏం చెప్పమంటావు కావ్యా? నీకు తెలుసుగా? ఎంత మంది ఏం చెప్పినా నాకు సుబ్బరావు పిచ్చి బాగా ఎక్కేసింది. ఇంట్లో రోజువారీ గొడవల నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. ప్రేమను వెతుక్కుంటూ వాడి వెనకాలే వెళ్ళిపోయాను. రెండు వారాలు బాగానే ఉన్నాడు. పెళ్ళి కూడా చేసుకుంటాను అని చెప్పాడు. నన్ను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంచాడు. నన్ను లోపల ఉంచి తాళం వేసి ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేవాడు. కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఉండడం మంచిది అని నేనూ సర్దుకుపోయాను. కానీ సమయం గడిచే కొద్దీ రావడం తగ్గించేసాడు. ఒక్కొక్కసారి వారం రోజులు కనిపించకుండా పోయేవాడు. నాకు భయం వేసి నిలదీసాను. వాడికి విపరీతంగా కోపం వచ్చింది. ' ఇంత ధైర్యం లేని దానివి ఇల్లు వదిలి ఎందుకు వచ్చావు ' అని అన్నాడు. ఇంతకు ముందు ఎంతో ప్రేమ ఒలకబోసిన వాడు కొంచెం కొంచెం మారిపోయాడు" అంది మాట తడబడుతూ.

         మళ్ళీ అంతలోనే సర్దుకొని చెప్పడం ప్రారంభించింది... 



"అలా వారాలు నెలలు గడిచిపోయాయి. అక్కడ ఒక బందీ లాగా ఉండిపోయాను. చివరకు ఒకరోజున పెద్ద గొడవ పెట్టుకున్నాను. తనకు పెళ్ళి కుదిరిందని, అమ్మాయి బాగా చదువుకున్నది అందమైనది అని చెప్పాడు. తల్లి తండ్రులను మీరి తాను ఏమీ చెయ్యలేను అని తేల్చి చెప్పేసాడు. పెద్దగా ఏడ్చాను, అరిచాను ఏదేదో చేసాను. కాని ఫలితం లేకపోయింది. చివరకు నన్ను మా తల్లి తండ్రుల దగ్గరకు వెళ్ళిపొమ్మని చెప్పి నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు. ఎటూ దిక్కుతోచని నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవస్థపడ్డాను. చేతిలో రెండు వందల రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. రోజంతా పిచ్చిదానిలా తిరిగాను. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక చచ్చిపోవాలని అనిపించింది. కానీ ఎందుకో ఎంత తిట్టినా అమ్మా, నాన్నా గుర్తుకు వచ్చారు. అక్కడ గడిపిన రోజులు మరీ అంత బాధాకరం కాదూ అనిపించింది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక అసలైన నరకం అనుభవించాను. ఎవరికి నన్ను చూడాలని అనిపించలేదు. ఒక రోగిష్టిలా ఇక మూల పడి ఉండమన్నారు.

         అమ్మ కాస్త ప్రేమ కనిపించినా నాన్న కోపం చాలా ఎక్కువయ్యింది. ఇంకా తాగి గందరగోళం చేయడంతో ఇల్లు కూడా ఖాళీ చెయ్యాల్సివచ్చింది. ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేసి ఊరి చివరకి వెళ్ళిపోయాము. ఒక రోజు తాగి వచ్చి ఎప్పుడు వచ్చారో తెలియదు నాన్న, పొద్దున్న చూసేసరికి మనిషి ప్రాణం పోయింది. ఇంకా అంతా అయోమయం. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అప్పుడే రమణ గారితో పరిచయం ఏర్పడింది. నాన్నకి తెలిసినవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఒక మంచి మనిషి ఆయన. నాకు ఎలాగోలా నాన్న ఉద్యోగం వచ్చేలా కష్టపడ్డారు. డిగ్రీ కూడా పూర్తి చెయ్యడానికి సహాయం చేసారు. ఆయన వల్లే ఇప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. అన్నీ మర్చిపోయి జీవితం గడపగలుగుతున్నాను" అంది కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళను ఆపుకొంటూ.

         "ఎన్ని బాధలు అనుభవించావే. నీ బాధల ముందు నావి చాలా తేలికగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతలో అంత పెద్ద పాప ఎలా వచ్చింది అని చెప్పలేదు నువ్వు" అని కుతూహలంగా అడిగింది కావ్య.

         "రమణ గారి భార్య పాప పుట్టగానే చనిపోయింది. అప్పటి నుండి ఆయనే తల్లిగా పెంచారు. మాకు పరిచయం పెరిగి పాప నాకు దగ్గర అయ్యింది. తెలియకుండానే ఆయన మీద, పాప మీద నాకు తెలియని ప్రేమ ఏర్పడింది. కానీ ఇది ఇదివరకు లాంటి ప్రేమ కాదు. అమ్మ ఆశీర్వచనంతో పెళ్ళి చేసుకున్నాను. ముందు ఆయన దీనికి ఇష్టపడలేదు. కానీ నా మొండితనం నీకు తెలుసుగా? అదీ కాక నా సంగతి అంతా తెలిసి కూడా నాకు ఎంతో విలువనిచ్చిన మనిషిని ఎలా దూరం చేసుకునేది? అమ్మ కూడా చాలా సంతోషించింది. నా జీతం అంతా అమ్మకు చెల్లాయికే ఇచ్చేస్తున్నాను. చెల్లెలినైనా మంచిగా చదివించి పైకి వచ్చేలా చెయ్యాలి. అదే నా ఆశ. నాన్న బతికి ఉన్నంతకాలం మాకు ఎప్పుడూ ఏదీ చేసింది లేదు. కానీ ప్రాణం పోయాక మాత్రం మాకు ఒక మంచి దారిని చూపించాడు. ఆయన ఉద్యోగం నాకు రావడంతో ఇప్పుడు అమ్మకు, చెల్లాయికి ఆయన స్థానంలో ఉండి అన్నీ చెయ్యగలుగుతున్నాను" అని అంది పావని హాయిగా ఊపిరి పీల్చుకొని. 



"మనం ఎన్ని కలలు కన్నాము. పెళ్ళి అయ్యాక అందరం కలసుకోవాలని సరదాగా గడపాలని ఎన్నో అనుకున్నాము. కానీ మన జీవితాలు ఎలా మారిపోయాయో చూడు. నీ పెళ్ళికి నేను నా పెళ్ళికి నువ్వు లేకుండానే అయిపోయాయి" అంది కావ్య బాధగా.

         "నీకు వచ్చి చెప్పాలనే అనిపించింది. కానీ అప్పటికే నా విషయం మీ తల్లి తండ్రులకు తెలిసి ఉంటుంది. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ఉండిపోయాను" అని అంది పావని.

         ఇద్దరూ మాట్లాడుతుండగా పాప పరిగెత్తుకొని వచ్చింది, "అమ్మా ఆకలి వేస్తుంది" అని.

         "చూసావా నీతో కబుర్లలో పడి వచ్చినవాళ్ళకు ఏదైనా చెయ్యాలి అని ధ్యాసే లేకపోయింది" అని కంగారుగా లేచింది పావని.

         "పద నేనూ సహాయం చేస్తాను. వంట త్వరగా అయిపోతుంది" అని పావని వెనకాలే వెళ్ళింది కావ్య.

         అందరూ కలిసి భోజనాలు ముగించారు.

         "వంట చాలా బాగుంది. కాస్త కావ్యకు నేర్పించండి" అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         కోపంగా చూసింది కావ్య కిరణ్ వైపు.

         "మీరు తమషా చేస్తున్నారు అని తెలిసు. కావ్య వంట చెయ్యడం బాగోకపోవడం అని ఉండనే ఉండదు. కావ్య అన్నిట్లోను బెస్ట్. అయినా మీరు మాత్రం ప్రతి ఆదివారం మా ఇంట్లోనే భోజనం చేయ్యాలి. సరేనా?" అని అంది పావని.

         "సరే తప్పకుండా, మీరు చెప్పేసారుగా. ఇంక ప్రతి ఆదివారం మీతోనే భోజనం" అన్నాడు కిరణ్ నవ్వుతూ.

         సరే ఇంక చాలు అన్నట్టు చిన్నగా గిల్లింది కావ్య. రమణ గారికి, పావనికి బాయ్ చెప్పి ఆటోలో బయలుదేరారు కావ్య, కిరణ్ లు. కిరణ్ సంతోషంగా ఉండడం చూసి కావ్య ఏమిటి అని అడిగింది.

         "ఏమి లేదు కావ్యా. ఇంక లోన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. రమణ గారు తప్పకుండా సహాయం చేస్తాను అన్నారు. ఇంక మనకి అంతా మంచి రోజులే. బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలి. ఒక పెద్ద ఇల్లు కట్టాలి. అందులో నాన్న, నువ్వు, నేను, మీ అమ్మా నాన్న అందరం కలిసి సంతోషంగా ఉండాలి. చిన్న కావ్య రావాలి" అని చెప్పుకుంటూ పోయాడు కిరణ్.

 "అయ్యో చిన్న కావ్య ఎవరు?" అని అంది కోపం నటిస్తూ కావ్య.

         "నువ్వూ" అంటూ కావ్యను గట్టిగా పట్టుకోబోయాడు.

         "ఇల్లు వచ్చేసిందండి. అదిగో మామయ్య" అని అనేసరికి సర్దుకొని నవ్వాడు కిరణ్.

         "నీ సంగతి తరువాత చెప్తాను" అని లోపలకు వెళ్ళిపోయాడు.

         నవ్వుతూ కావ్య వెనకాలే నడిచింది.

***        ***        ***        ***

         వెంకట్ తల్లి తండ్రులకు షష్టిఫూర్తి నిశ్చయించారని శుభలేక వచ్చింది. కావ్య వాళ్ళ అత్తయ్య, వెంకట్ కూడా ఫోన్లో పదే పదే చెప్పడంతో కిరణ్ కావ్యను రెండురోజులు ముందు వెళ్ళి రమ్మని చెప్పాడు. అత్తయ్య అడగగానే పరుగెత్తుకెళ్ళే కావ్యకు ఇప్పుడెందుకో వెళ్ళడానికి మనస్కరించలేదు. ఎంత ప్రయత్నించినా ఎందుకో కావ్యకు అత్తయ్యను, హరిణిని అందరినీ ఎదుర్కునే ధైర్యం చాలలేదు.

         "మీతో వెళ్ళి మీతోనే వచ్చేస్తాను" అని అంది కావ్య ఆలోచిస్తూ.

         "అదేమిటి కావ్యా. అక్కడ అందరూ మీ వాళ్ళు. అన్ని సార్లు పదే పదే చెప్పారు కదా. ఏదైనా అవసరం ఉంటుంది. సహాయం చేసినట్టు ఉంటుంది కదా? వెళ్ళిరా" అని అన్నాడు కిరణ్, కావ్య ముఖంలోని భావాలని గమనించకుండా.

         "అమ్మా, నాన్న, నానమ్మా కూడా యాత్రలకు వెళ్ళారు కదా. ఎవరూ లేకుండా ఎలా వెళ్ళేది" అని అంది కిరణ్ చేతిలోంచి దువ్వెన తీసుకొని తల దువ్వుతూ.

         "దానిదేముంది వెంకట్ ని వచ్చి తీసుకెళ్ళమంటాను నీకు భయం అయితే. మీ అమ్మా, నాన్నా వచ్చాక మేము అందరం కలిసి వస్తాము" అని అన్నాడు కావ్య వంక చూస్తూ.

         కొంచెం సేపు ఆలోచించి "వద్దులేండి నాకేం భయం లేదు. నేనే వెళ్ళగలను ఒంటరిగా" అని అంది కావ్య మూతి ముడుచుకుంటూ.

         కావ్య వెళ్ళాడానికి అన్నీ ఏర్పాట్లు చేసి వెంకట్ కి ఫోన్ చేసి చెప్పాడు కిరణ్.



(ఇంకా ఉంది )
This entry was posted on Monday, September 13, 2010 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

On September 13, 2010 at 11:24 AM , వంశీ కిషోర్ said...

కావ్య కి వెంకట్ రాసిన ఉత్తరం మనసుకి హత్తుకుంది. పావని పాత్ర అంత త్వరగా కథలోకి మళ్ళి వస్తుందని అనుకోలేదు. బాగుంది :)

 
On September 18, 2010 at 5:01 AM , satish said...

siri garu .. last 2 parts meda koncham kopam tho reply evvaledu :) ... vamsi annatu ga.. naku a venkat letter baga nachindi ..

 
On September 20, 2010 at 10:26 AM , Siri said...

వంశీ ...Thank you ...నాకు ఇంత పెద్ద కధ రాయటం కొంచెం కష్టం గానే అనిపించింది ...మొదలు అయితే పెట్టాను కాని దానిని అందరికి నచ్చెలా మలుచుకు వెళ్ళడం ఎంత కష్టమో తెలిసింది...నాకు నిజంగానే కధలు రాయడం గురించి తెలియదు .. ఈత తెలియని వాళ్ళు అలా దూకేసి ఎలాగో ఒడ్డు చేరినట్టు, నేను మొత్తానికి పూర్తి చేసాను :)

 
On September 20, 2010 at 10:40 AM , Siri said...

సతీష్ ... మీకే కాదు చదివి చాలా మందికి అలానే కోపం వచ్చింది ...దాని అర్ధం మీరు కధలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు ...నాకు అంతకంటే మంచి compliment ఇంకేం కావాలి :)