సంక్రాంతి అంటేనే చలి మంటలు, భోగిపళ్ళు, ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులు, పిండివంటలు. ఇది ప్రధానం గా ధాన్యాలు, పంటల పండుగ అనేమో, పల్లెటూళ్ళలోనే బాగా జరుగుతుంది. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంట రైతు కి చేతికి అంది వచ్చి ఇంటికొచ్చే సమయం, అలాగే కొత్తసంవత్సరం తో పాటుగా కొత్త కొత్త ఆశలతో సంక్రాంతి లక్ష్మి ఘల్లు ఘల్లుమంటూ విచ్చేస్తుంది. ఈ పండుగ మూడు రోజుల పండుగ.
భోగి ( పాత చెక్క సామాన్లతో, కట్టెలతో భోగిమంటలేస్తారు, చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు )
సంక్రాంతి ( ఇది ప్రధానమైన రోజు )
కనుమ ( పసువులకు కొమ్ములకు రంగులు వేసి, పసుపు కుంకుమ చల్లి పూజ చేస్తారు, అలాగే ఈ రోజు మాంసం వండుకుని తింటారు. తమిళనాడు లో ఈ రోజే ఆయుధపూజ చేస్తారు.నాగళ్ళకు, దుక్కి దున్నే సామానులకు, ట్రాక్టర్లకు పసుపు రాసి కుంకుమ చల్లుతారు.)
ఇక నా జ్ఞాపకాల లోగిళ్ళలోకి వెళ్తే...
మా ఊరూ పక్కా పల్లెటూరికి, టౌన్ కి మధ్యరకం గా ఉంటుంది. అయినప్పటికీ పల్లెటూరి వాతావరణం ఎక్కువే కనిపిస్తుంది. సంక్రాంతి మాసం మొదలవ్వగానే ఆడవాళ్ళు వారపత్రికలలోవో లేక నోట్ బుక్కులలోవో వేసిన స్పెషల్ ముగ్గుల ని స్టడీ చేస్తూ రంగం లోకి దూకుతారు. డిసెంబర్ మాసం, చలికాలం కావటం తో పొద్దున్నే లేచి చలిలో వేసేవాళ్ళు కాస్త తక్కువే ! మా వీధి అంతా రాత్రి భోజనాలయ్యాక, యుద్దం లోకి దిగినట్లు, ముగ్గు గిన్నెలని చేత బట్టుకుని, నడుము చుట్టూ చెంగులని చుట్టుకుని పోటీలు పడి ముగ్గులేస్తారు. మా ఇంట్లో నేనొక్కణ్ణే అబ్బయిని కావటం వలన, నాకూ అలా ముగ్గులని చూడటం ఇష్ఠం. జనవరి ఫస్ట్ కు, భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులూ స్పెషల్ ముగ్గులకి రంగులద్ది, Welcome New Year అంటూ వ్రాసేవాణ్ణి.
ఇక ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ఇవి ఆవు పేడతోనే చెయ్యాలి, మా ఊళ్ళో ఏమో ఆవులు తక్కువ. అందుకని పండక్కు మాత్రమే ఆ ఆవు గల వాళ్ళని బ్రతిమాలి తెచ్చి గొబ్బిళ్ళు పెట్టేవారు. ఆ గొబ్బిళ్ళ పైన పూలు పెట్టేవాళ్ళు.
ఈ మాసం అంతా, తెల్లవారు ఝామున 3 , 4 గంటల మధ్యలో భజన వచ్చేది హారతి తీసుకుని. అదే గుర్తు, లేచి చదువుకోవటానికి. ఇంక తెల తెల వారుతుండగా, హరిదాసు హరిలోరంగ హరీ అంటూ తల మీద కిరీటం లాంటి మెరుస్తున్న పాత్రతో, భజన చేసుకుంటూ వస్తాడు. తనకు, బియ్యం కానీ, పప్పు దినుసులు లాంటివి కానీ వేసేవాణ్ణి.
ఆ తరువాత గంగిరెద్దుల మేళం వచ్చేది. అయ్యవారికీ దణ్ణం పెట్టు, అమ్మగారికీ దణ్ణం పెట్టు అంటూ విచిత్రం గా ఆడించేవాడు గంగిరెద్దుని.
బాగా చిన్నప్పుడు అయితే ఈ మాసం లోనే మా తాతయ్య నాకు విల్లు చేసి ఇచ్చేవాడు వెదురు తో, దానికి గోగుపుల్లలని బాణాలు గా పెట్టుకుని కొబ్బరి ఆకులకి, చెట్లకీ వేస్తూ ఉండేవాణ్ణి. అలాగే పతంగులు కూడా, డాబా మీదకు వెళ్ళి మా మామయ్య తయారు చేసిన గాలి పటాలని పోటీలు పడి ఎగరేసేవాళ్ళం !
ఇక పండుగ దగ్గరకు వచ్చే సమయానికి, అమ్మ వాళ్ళు పిండి వంటల హడావిడిలో పడిపోయేవాళ్ళు. వాటికి నేను ఉడుత సహాయం గా, పిండి కొట్టటమో లేక పాకం రుచి చూడటమో, ఏదో చిన్న చిన్న పనులు చేసేవాణ్ణి. ఈ పండక్కి అరిసెలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అందులోనూ నేతి గారెలు అలా వేడి వేడిగా బాండీ లోంచి తీయగానే తింటూ ఉంటే ఉంటుందీ నా సామిరంగా !
పండుగకి కాస్త ముందుగానే కొత్త బట్టలు టైలర్ కి ఇచ్చి ఆ ముందు రోజూ తప్పకుండా కుట్టి ఇచ్చేట్టూ చూసుకునేవాళ్ళం. భోగి పండుగ రాగానే తలంటు పోసుకుని, దేవుడి పటాలన్నీ కడిగి, తుడిచి శుభ్రం చేసి వాటికి గంధం, పసుపు, కుంకుమ అద్దేవాణ్ణి. సంక్రాంతి రోజు పెద్దగా చేసేది ఏమీ ఉండేది కాదు, పూజ చేసుకోవటం దణ్ణం పెట్టుకోవటం. ఇక కనుమ రోజు, మా తాతయ్య వాళ్ళ గేదెలకి, వాటీ దూడల కొమ్ములకి రంగులు రాసి, వాటి మీద పసుపు కుంకుమ చల్లేవాళ్ళం. ఆ రోజు సుష్ఠిగా నాన్-వెజ్ లాగించి ఊరి మీద పడేవాళ్ళం. ఈ మూడు రోజూల్లో ఏదో ఒక సినిమాకి తప్పకుండా వెళ్ళేవాళ్ళం.
సంక్రాంతికో, దసరాకో సరిగా గుర్తులేదు కాని, ఎద్దుల పందాలు జరిగేవి మా ఊళ్ళో. ఇది చాల ఫేమస్! చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు, వేరే జిల్లాల నుంచి కూడా తమ ఎద్దులని తీసుకువచ్చి పోటీల్లో పాల్గొనేవాళ్ళు. ఈ పోటీల్లో ఒంగోలు నుంచి వచ్చింది ఎద్దులు చాలా బాగుండేవి. పగలంతా పందాలు, సాయంత్రానికి ఆ ఎద్దులను అలంకరించి వీధుల్లో తిప్పేవాళ్ళు. ఇది చాల సంబరం గా జరిగేది.
ఇలా సంక్రాంతి మాసం అంతా ఎంతో సరదాగా, ఉత్సాహం గా, సంతోషం గా గడిపేవాళ్ళం. నేను ఇండియాలో ఉన్నంత వరకు, సంక్రాంతికి తప్పకుండా ఇంటికి వచ్చేవాణ్ణి. ఇప్పుడు ఇవన్నీ చాల వరకు ఉండకపోవచ్చు. ఏదో మామూలు పండగలా గడిచిపోతుంది, అంతే !
చాలా రోజుల తరువాత దేవిశ్రీ నుంచి మంచి సంగీతం వచ్చింది. మొన్ననే వచ్చిన ఏక్ నిరంజన్ (మణిశర్మ) తరువాత ఈ ఆర్య-2 పాటలు బాగా నచ్చేసాయి. తెలుగులో ఈ తరం లో నాకు నచ్చిన సంగీత దర్శకులు ముగ్గురు, కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ. కీరవాణి తన పాటల్లో వయోలెన్ ని బాగా వాడుకున్నట్లు, దేవి తన పాటల్లో గిటార్ ని ఎక్కువగా యూజ్ చేస్తారనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాటలు మెలోడియస్ గా, కొన్ని ఫాస్ట్ బీట్స్ తో ఉన్నాయి. ఈ పాటల గురించి నా రివ్యూ ఇది.
1. కరిగే లోగా ఈ క్షణం .. గడిపేయాలీ జీవితం నా రేటింగ్ : * * * * *
ఈ పాట చాలా చాలా నచ్చేసింది. మొదట దేవి పాడిన వెర్షన్ విన్నాను. దేవి సంగీతం బాగున్నంతగా తన గొంతు ఉండదు. గీర ఎక్కువ ఉంటుంది. ఏంటో ఒక్క రెహ్మాన్ వాయిస్ తప్ప ఇంకే సంగీత దర్శకుడి వాయిస్ నచ్చదు. ఇళయరాజా కానీ, కీరవాణి కానీ, దేవిశ్రీ కానీ, చక్రి కాని, ఆర్.పి.పట్నాయక్ కాని, తమ గొంతులతో నానా హింస పెడతారనిపిస్తుంది జనాలని.
ఈ పాట రెండు వెర్షన్లు ఉంది. ఒకటి దేవి పాడితే మరొకటి కునాల్ మరియు మేఘ పాడారు. కునాల్ తన గొంతులో ఆవేదనని చాలా చక్కగా పలికించారు. ఆత్మ తో గొంతు కలిసి పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పాట.
2. ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో నా రేటింగ్ : * * * *
ఈ పాట కె.కె పాడారు. తన గొంతు పెక్యులియర్ గా బాగుంటుంది. ముందుగా చెప్పినట్లుగా ఈ పాటలో గిటార్ బాగా వాడుకున్నారు. సాహిత్యం కూడా చాలా బాగుంది ఈ పాటలో. ఈ సినిమా ప్రమోస్ లో ఈ పాట ఎక్కువ చూపిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజంగానే చాలా స్టైలిష్ గా ఉన్నారు ఈ పాటలో. విరహం తో పాడే పాటలా ఉంది ఇది.
3. Baby .. He loves you ..loves u .. loves u so much ! నా రేటింగ్: * * * *
మాటలు పాట కలిపి ఉన్న పాట ఇది. సరదాగా ఉంది. దేవి పాడారు ఇది. మధ్యలో పిల్లల వాయిస్ క్యూట్ గా ఉన్నాయి. ఎంత ప్రేమిస్తున్నాడో వేరే వాటితో పోలుస్తూ పాడే పాట ఇది.
మీరు కరెక్ట్గానే చూసారు. ఈ పాట 'slumdog millionaire' లోది కాదు. (Just kidding..) ఈ సినిమాలో ఐటం సాంగ్ లా ఉంది ఇది. ప్రియ అని ఎవరొ కొత్త సింగర్ లా ఉన్నారు. మాంచి ఘాటు మషాలా లా ఉన్నా తమాషాగా నవ్వుకునేలా ఉన్నాయి లిరిక్స్. మధ్య లో వచ్చే దేవి మాటలు భలే కామెడీగా ఉన్నాయి. ఏవరో గోరీ పిల్లతో డాన్సాడించినట్లున్నారు.
5. Mr.Perfect నా రేటింగ్: * * * 1/2
బాబా సెహ్గల్ దేవితో కలిసి పాడారు అంటేనే చెప్పొచ్చు ఇది పాప్ సాంగ్ అని. హీరో గురించిన పాట అది. హీరో ఎంత ఎదవో చెప్పే పాట. ఈ మధ్య సినిమాల్లో హీరో ఎంత పెద్ద ఎదవో వాడికే తెలీదుగా మరి.
6. My Love is Gone నా రేటింగ్: * * *
రంజిత్ పాడారు ఇది. మరో ఫాస్ట్ బీట్ సాంగ్. లవ్ పోతేనే హాయిగా ఉంది అని పాడుకునే పాట ఇది. అన్నీ పోతాయి ఎప్పుడో ఒకప్పుడు, లవ్ పోతే ఏంటంట ! పర్లేదు సో సో గా ఉంది.
దర్శకుడు : చైతన్య దంతులూరి తారాగణం : నారా రోహిత్ ,వేదిక ,రణధీర్ ,సయాజీ షిండే సంగీతం : మణిశర్మ
ముందుగా మెచ్చుకోవలసింది మాటల రచయితని, దర్శకుడిని, ఛాయాగ్రహకుడిని మరియు సంగీత దర్శకుడిని.
ఈ సినిమా ఒక సాంకేతిక పరమైన విజయం. మూస సినిమాలకు కొంత మేరకు భిన్నంగా వెళ్ళారనే చెప్పాలి. ఈ సినిమా గురించి విభిన్నమైన రివ్యూలు వచ్చాయి. కొంతమంది దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటే, మరి కొంతమంది, చెప్పిందంతా చెప్పి చివరికి మామూలు ప్రతీకారం తీర్చుకునే కధగా తేల్చేసారు. ఏవరు ఏమన్నప్పటికీ, నాకు మాత్రం ఈ సినిమా చూడాలని బలంగా అనిపించింది. మొత్తానికి ఇప్పటికి చూడటం వీలైంది. నా అంచనాలకి ఏ మాత్రం తప్పలేదు. నేను అనుకున్న్నట్టే ఉంది , నాకు నచ్చింది.
కధా పరం గా చూసినా, సాంకేతిక పరం గా చూసినా, ఇది ప్రత్యేకం గా నిలుస్తుంది. నారా రోహిత్, విలన్ గా వేసిన హాపీడేస్ అబ్బాయి రణధీర్ ఇద్దరూ బాగా చేసారు. బలమైన ప్రత్యర్ధి ఉన్నప్పుడే, హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేది. ఈ ఫార్ములాని నేను బాగా నమ్ముతాను. కొన్ని సన్నివేశాల్లో ( చాలా వరకు కూడా ) ప్రత్యర్ధి బలమే ఎక్కువ కనిపిస్తుంది. అలాగని ఆ విలనిజంకి ఫాసినేట్ అయ్యేలా అనిపించదు. హీరొ పాత్రని ఉదాత్తతో మలిచారు. సమాజానికి మంచి చెయ్యాలనే ఆశయం, పదిమందినైనా ఒంటరిగా ఎదొర్కొనగల ధీరత్వం, ముక్కుసూటిగా తను నమ్మినదాన్ని ఆచరించే మనస్తత్వం, తండ్రికి తను ఇచ్చే గౌరవం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మంచి లక్షణాలే !
హీరోకి హీరోయిన్ కి మధ్య ఉన్న సున్నితమైన ప్రేమ సన్నివేశాలు కాని, తండ్రీ కొడుకుల మధ్యన సిద్దాంతపరమైన మాటలు కానీ, విలన్ పాత్రలో ఉండే క్రూరత్వం కానీ, అన్నిట్లోనూ అతి ఏ మాత్రం కనిపించదు.
నాకు బాగా ముచ్చటేసింది ఈ సినిమాలోని 'సంభాషణలూ'. చాలా పొదుపుగా వాడుకుంటూ, తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్నీ చూపించగలిగారు రచయిత. అలానే నేపధ్య సంగీతం. చాలా చాలా బాగుంది. చాయాగ్రహకుడు వెలుగు నీడల్ని చక్కగా వాడుకున్నాడు. చాలా సన్నివేశాల్లో' శివ ' సినిమా గుర్తొచ్చింది. దాని ప్రేరణో మరేమో కాని, శివ మాత్రం చాల సార్లు గుర్తొచ్చింది.
ఇన్ని మంచి విషయాలున్నా, కొన్ని లోపాలు కూడా లేక పోలేదు.
ప్రతి సారీ హీరోదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది, ఒక్కసారి తప్ప. అంతమందినీ ఒక్కడే చితక బాదేస్తుంటాడు. రౌడీలు కూడా పెద్దగా తుపాకులకి కాని, కత్తులకి కానీ పని చెప్పరు. అంత వివేకంతో ఆలోచించే హీరో నాన్నగారు, మాజీ నక్సల్ ఉన్నట్టుండి విలన్ మీదకు ఒక ప్లానింగ్ లేకుండా వెళ్ళ్టడం వింతగా ఉంది.
చాలా మంది అన్నట్టు, ముందు అంతా నీతులు చెప్పి చివర్లో మామూలు పద్దతిలోనే ( అడ్డ దారిలోనే ) విలన్ని ఎదుర్కోవటమేంటీ అని. హీరో మాటల్లో " నువ్వొక సమస్యవి. కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు, వాటిని నాశనం చెయ్యటం తప్ప ". అది నిజమే అనిపిస్తుంది. అలాంటి సమస్యే ఈ శక్తి పట్నాయక్. అప్పటికీ పద్దతి ప్రకారమే, చట్ట పరిధి లోనే ( అంటే పై అధికారి అనుమతి తోనే ) ఇదంతా చేస్తాడు భగత్ ప్రాణిగ్రాహి.
ఈ సినిమాలోని పాత్రల పేర్లు కాని, కధ జరిగిన ప్రదేశం పేరు గాని ఏవో నవలలోని పేర్లు లా అనిపించాయి.
భగత్ ప్రాణిగ్రాహి శక్తి పట్నాయక్ సాహు రణస్థలి
మొత్తం గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఈ సినిమాని మలచిన తీరు బాగుంది. ఇలాంటి ప్రత్యేకం గా ఉండే సినిమాలు మరిన్ని రావాలి.అన్నీ చెప్పి ఇంకొక విషయం గురించి చెప్పకపోతే ఈ రివ్యూ అసంపూర్ణమే. అది ఈ సినిమా లోని పాటలు. చాలా చాలా బాగున్నాయి. వాటి తీసిన తీరు బాగుంది. హీరో హీరొయిన్లు ఆ పాత్రలకు చక్కగా సరిపోయారు. నాకైతే నారా రోహిత్ కనిపించలేదు భగత్ ప్రాణిగ్రాహి తప్ప !
ఈ టాపిక్ మీద ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా తమ బాధని బ్లాగు పోస్టుల రూపం లో వేళ్ళబోసుకునే ఉంటారు.అయినా కూడా నా ఫ్రస్ట్రేషన్ ని ఆపుకోలేక ఇలా పోస్ట్ చేస్తున్నా ! అలా కళ్ళముందు రింగులు తిప్పుకుంటే...అలా అలా 80 లలోకి వెళ్ళగానే డాబా పైకి ఎక్కి కొత్తగా కొన్న చిన్న టీవీకి వచ్చిన పెద్ద యాంటెనా ని బిగుస్తూ.." బొమ్మ కనిపిస్తుందా "అని నాన్న అరుపులు.. కింద నించి నిక్కర్లో టీవీ కేసి ఆశగా చూస్తూ చుక్కలు తప్ప బొమ్మ రావట్లేదని కంగారు పడుతూ "రావట్లేదు నాన్న" అని జవాబులు. యాంటెనా ని యుద్దం లో బల్లెం లాగా అటూ ఇటూ నానా రకాల విన్యాసాలు చేసి మొత్తానికి బొమ్మ కనిపించగానే అలానే గట్టిగా బిగించి కిందకి దిగగానే ఇక మా ఇంట్లో ఒక సందడి మొదలైంది.
నాకు పండగలప్పుడు వచ్చే స్పెషల్ ప్రోగ్రాములన్నా, ఆదివారం మేలుకొలిపే రంగోలి అన్నా, బుధవారం చిత్రహార్, శుక్రవారం చిత్రలహరి ( రాను రానూ అరగంట ప్రోగ్రాం లో 20 నిముషాలు యాడ్స్ తినేసేవి) చాలా ఇష్ఠం ! ఇంక క్రికెట్ సీజన్ సంగతి సరే సరి ! మా ఇంట్లో బాటరీ సౌకర్యం కూడా ఉండటం తో కరెంట్ కట్ ఉన్నా చక్కగా అందరూ మా ఇంట్లోకి చేరేవారు.
రామోజు రావు గారికి యే దుర్ముహూర్తాన బల్బ్ వెలిగిందో 24 గంటలూ తెలుగు ప్రసారాలు వచ్చేలా తెలుగు చానెల్ ఒకటి ప్రారంభించాలని. మొదట్లో సంబరపడ్డా ,ఈ సంతోషం ఈ సామెత అవుతుందని ఊహించలేదు .ఇప్పుడేముంది .. ముందుంది రియాలిటీ షోల ఫెస్టివల్ అని .
**** ఇక్కడ రింగులైపోయాయి ****
అమెరికాలో ఉన్న పాపానికి మొన్న మొన్నటివరకు జెమినీ తమిళ్ డబ్బింగ్ సీరియల్స్ తో.తేజా లో వచ్చే ఎప్పుడూ వినని, చూడని అత్యద్భుతమైన చిత్ర్రారాజాలతో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న టైం లో. ఎవరో మా టీవీ మీ అమెరికా వచ్చేసిందని చెప్పగానే ఇంద్రలో వీణ డాన్సేసినంత పని చేసా. మా ఊరి వంట, సూపర్ సింగర్, అమృతం, క్రొత్త క్రొత్త సినిమాలు ఇలా అన్నీ మంచి ప్రోగ్రాములే అని ఓ నాలుగు నెలలు హాయి హాయిగా చూసేసాను. ఇంక అప్పటి నుంచి నెమ్మదిగా రంగులు తొలగి 'రియాలిటీ ' కనిపించసాగింది నా కళ్ళకి.
మా టీవీ వాడు కొన్న 25 సినిమాలనే మరో పాతికేళ్ళు వేస్తాడని, అరిగిపోయిన అయిపోయిన సీరియళ్ళనే మార్చి మార్చి 'అరే ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసినట్టుందే ' అనిపించేలా హింసపెడతాడని ఊహించలేకపోయా.. ఈ లోపు సూపర్ సింగర్ అయిపోగానే, జూనియర్ మొదలు. అది అవ్వగానే 3 మొదలు. ఇలా మూడు సంవత్సరాలు ఈ ఒక్క ప్రోగ్రాం తోనే బండి నడిపించేసాడు మా టీవీ వాడు. కొంతలో కొంత నయం ఏంటంటే 'రేలారే రేల ' ద్వార జానపదులని పరిచయం చెయ్యటం.
కానీ ఈ రియాలిటీ షోలన్నీ సెల్ ఫోన్ కంపెనీలే ఎందుకు స్పాన్సర్ చేస్తున్నాయనేది నా పీత బుర్రకి అర్ధం కాలేదు మొదట ! ఎస్ ఎం ఎస్ లంటూ ప్రతి దానికి చావగొడుతుంటే వెలిగింది అప్పుడు. ఒక పక్క ఎస్ ఎం ఎస్ ల ద్వారా, ఒక పక్క కమర్షియల్స్ ద్వారా వీళ్ళకి డబ్బులే డబ్బులని. మరి ఇంతగా కళలు దిగజారిపోయాయా అనిపించేది. ప్రతి దాంట్లోకి డబ్బు జొచ్చుకొచ్చేసి, టాలెంట్ ఉన్నా లేకున్నా మళ్ళీ మళ్ళీ ఎలిమినేట్ అయినవాళ్ళే ' వైల్డ్ కార్డ్ ' మళ్ళీ వచ్చేసి మరో నాలుగు నెలలు ప్రోగ్రాంని సా...గ..దీసే వాళ్ళు. తమ బంధువులమ్మాయో, లేక తమ స్నేహితుడో, లేక తెలిసినవారో ఉంటే చాలు.. ఎస్ ఎం ఎస్ లు వేల కొద్దీ వరదలయ్యేవి.
ఇంక అలా ప్రతిభని ఎస్ ఎం ఎస్ లతో కొలిచే దౌర్భాఘ్యం మన సంస్కృతి లా మారిపోయింది. అటు హిందీ చానెళ్ళూ కానీ, ఇటు తెలుగు చానెళ్ళు కానీ అన్నిట్లోనూ ఇదే తంతు. లేని పోని కాంట్రవర్సీలు, అరుచుకోవటం, ఏడవటం , అయినదానికీ కాని దానికీ కాళ్ళ మీద పడిపోవటం.. ఇలాంటి డ్రామాలకి కొదవే లేదు. ఈ రియాలిటీ షో లకి, దిక్కుమాలిన అతి నిక్రుష్టపు ఏడుపుగొట్టు సాగతీత సీరియళ్ళకి పెద్ద తేడా లేకుండా పోయింది.
పాటల ప్రోగ్రాములు సరే సరి, ఇంక డాన్సులంటూ చేసే వెర్రి మొర్రి వేషాలకి కొదవే లేదు. భాష రాని జడ్జీలు, సినిమాల్లో కంటే మరీ ఘోరంగా వళ్ళంతా కనిపించేలా గెంతులేసే డాన్సర్లు,చిన్న పిల్లల చేత కూడా వాళ్ళ వయసుకు మించిన హావ భావాలతో కూడిన డాన్సులు, కేకలు, పిల్లి కూతలు.. అబ్బో ఎన్నని చెప్పను.ఈ మధ్య ఇవి పరాకాష్టకి చేరింది ఓంకార్ అనే మగానుభావుడు మా టీవీ లోకి లెగ్గెట్టాక. అదృష్ఠం, చాలెంజ్ అని రెండు కళా ఖండాలు నిర్మాతగా, దర్శకుడిగా మన మీదకు వదిలాడు. దొందూ దొందే.. వీటి గురించి వ్రాయాలంటే మరో రెండు పెద్ద పేద్ద పోస్టులయ్యేట్టున్నాయి.
చివరగా మీకో డౌట్ రావొచ్చు.. ఇంత తిట్టుకుంటూ చూడాల్సిన పనేంటని..
' గతి లేక .. '
ఉన్నవే రెండు మూడు తెలుగు చానెళ్ళు. తెలుగు భాష మీద, తెలుగు నేల మీద ఆశపోక, ఆ పరిసరాలని, మనుషులని, ఇలా చూసుకుందామంటే. ఈ చానెళ్ళ వాళ్ళేమో ఇలా బాదేస్తున్నారు. ఇవన్నీ చూసాక చిన్నప్పుడు నేను చూసిన ' దూర దర్శన్ ' అతి ప్రియం గా అనిపిస్తుంది. ఈ పిచ్చి టీవీలకి ప్రత్యామ్నయం గా నిజమైన వినోదాన్ని ఇచ్చే ఒక మంచి చానెల్ ఎవరైనా పెడితే 'మా ' మంచి చానెల్ అనుకుంటూ గర్వం గా చెప్పుకోవచ్చు !