Author: Siri
•Saturday, April 18, 2009
సంధ్య నిదరపట్టక డాబా మీదకు వెళ్ళి కూర్చుంది. చల్లగాలి వీస్తున్నా మనసు అల్లకల్లోలంగా అనిపించింది.

"తనకు రఘు అంటే అమితమైన ప్రేమ ఉన్నా అతని తల్లిని మనసుకు దగ్గర చేసుకోలేకపోయింది. అందరి ఆడపిల్లలాగే తను ఎన్నో కలలు కంది. తన పేరు పక్కనే రఘు ఇంటి పేరు జత చేసుకొని చూసి మురిసిపోయింది. మార్పుని మనస్పూర్తిగా ఆహ్వనించే కదా తను అలా చేసింది. రఘుతో పాటు అతని ఇంటి పేరుని ప్రేమించింది. ఎప్పుడు చూడని అతని తల్లి తండ్రులను ప్రేమించింది."

రఘు ఎప్పుడూ "నా తల్లితండ్రులను నీ తల్లితండ్రులుగా చూసుకోవాలి" అన్నప్పుడు తను ఎంత సంతోషంగా రఘుకి ధైర్యం చెప్పింది. మరి అంతగా తనలో మార్పు రావడానికి కారణం ఏంటి? ఒక్కసారిగా ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళి గతమంతా కధలా కళ్ళ ముందు మెదిలింది.

*** *** ***

తను ఇంటర్ చదివే రోజుల్లో ఒక దూరపు బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు పరిచయమయ్యాడు రఘు. మొదటి చూపులోనే ఆకర్షించాడు. పెళ్ళిలో పదే పదే తన చుట్టూ తిరగడం తననెంతో కలవర పెట్టాయి. లేత వయసు, కొత్తగా వచ్చిన ఊహలు ఉక్కిరి బిక్కిరి చేసాయి. అబ్బాయి ఎవరో ఏంటో కూడా తెలియదు. అయినా మనసిచ్చేసింది. పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంటే ఎదో విడిచి వెళ్ళిపోతున్న బాధ. చివరగా ఇద్దరూ చిరునామాలు ఇచ్చి పుచ్చుకొన్నప్పుడే కొంత ఊరట కలిగింది. ఇంక ఏముంది మనసు మాట వింటుందా? ఉత్తరం రాయనే రాసింది. అలా మొదలయ్యింది ప్రేమాయణం.

చాలా రోజుల వరకు పెద్దవాళ్ళు గమనించనే లేదు. ఒక రోజున తన సైన్స్ పుస్తకంలో నుండి పడిన రఘు ఫోటొ చూసారు. అతని ఫోటో ఇక్కడికెలా వచ్చింది అని ఆరా తియ్యగా తెలిసింది మొత్తం తతంగమంతా. ఇంకేముంది పెద్ద బాంబు పేలినట్టు బిగుసుకుపోయారు అమ్మా నాన్నా. వెంటనే చిన్నాన్నను వెంట పెట్టుకోని వెళ్ళిపోయారు రఘు తల్లి తండ్రుల దగ్గరకు. అప్పుడు కూడా కలల్లో తేలిందే కానీ దేని గురించి ఆలోచించలేదు, అంతా రఘు చూసుకుంటాడు అనే ధైర్యంతో.

కానీ వెళ్ళిన వాళ్ళు డీలా పడిపోయి వచ్చారు. "మా వాడి చదువు ఇంకా ఉంది. ఈ లోపు ఎవరి మనసు ఎలా మారుతుందో ఏం చెప్పగలం . వాళ్ళ చదువు అయ్యాక మనసు మారకుండా ఉంటే అప్పుడు చూద్దాం" అని చెప్పి పంపించేసారు అని చెప్పింది అమ్మ.


ముందు కొంచెం నిరాశ పడినా, తరువాత ఆలోచిస్తే నిజమే కదా అని తోచింది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అంతకు మించి రఘు ప్రేమ మీద. ఇంక రఘు చదువు కూడా ముఖ్యమే. మిగిలిన రెండు మూడు సంవత్సరాలూ ఉత్తరాలు రాసుకుంటూ, తను మాత్రం ఊహాలోకంలోనే గడిపింది. ప్రేమ మైకంలో పడి తనకూ చదువు ముఖ్యమని, జీవితంలో ఏదైనా సాధించాలీ అనే విషయం మర్చిపోయింది. కాలక్షేపానికి మాత్రమే చదివింది. అమ్మా నాన్నా మాత్రం ఎంత ఆవేదన చెందుతున్నారో అర్ధం చేసుకో లేక పోయింది.

ఒక ఆడపిల్లను కన్న వాళ్ళుగా ఎంత ఆరాటం అనుభవించారో చివరకు గానీ అర్ధం కాలేదు. రఘుకి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది అని తెలియగానే, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు నాన్న. ఈ సారి ముహూర్తాలు పెట్టుకి వచ్చేయాలి అని ఉత్సాహంగా బయలుదేరారు. కానీ అక్కడకు వెళ్ళాక కధ ఇంకో రకంగా అయ్యింది. ఇంటికి వచ్చినవాళ్ళని కనీసం "వచ్చారా? కాఫీ తాగుతారా?" అని అడిగేవారు లేకపోయారు. రఘు తల్లి ఒక గంట వరకు బయటకే రాలేదు. వచ్చినా ముక్తసరిగానే మాట్లాడారు. ఆర్ధికంగా రెండు కుటుంబాలలో పెద్ద తేడా లేకపోయినా మగపిల్లాడిని కన్న ఓకే ఒక కారణం వారిని అంత ఎత్తులోనూ నా తల్లితండ్రులను చేతులు కట్టుకొని వినయంగా, ఆత్రుతగా, భయపడేలా చేసింది. ప్రేమలో రఘుకి నాకు ఎక్కువ తక్కువ లేకపోయినా పెళ్ళి విషయంలో మాత్రం నా తల్లి తండ్రులు గుండెల్లో కుంపటి పెట్టుకొని బతకాల్సి వచ్చింది.

అలా మొదలయ్యిన పెళ్ళి మాటలు ఆరు నెలలు దాకా సాగాయి. ప్రతిసారి వాళ్ళు కబురు పంపడం ఆమ్మా నాన్నా వెళ్ళడం ఇదే విధంగా నడిచింది. ముందు కలిసినప్పుడు మాట్లాడుకున్నవి విచిత్రంగా వాళ్ళు మర్చిపోవడం "అలా అన్నామా? కాదు ఇది ఇలాగే చెయ్యాల్సిందే" అని చెప్పి అయోమయంలో పడేసారు. మా ప్రేమ విషయం నలుగురికి తెలిసి పెళ్ళి జరగబోతోంది అని అందరికి తెలిసిన తరువాత అడుగు వెనక్కి వేసేది ఎలా? పట్టువదలని విక్రమార్కుల్లా పెళ్ళి జరిగే వరకు ధైర్యాన్ని విడవకుండా ఉన్నారు. చివరకు పెళ్ళి ముహూర్తం పెట్టాలి రమ్మని కబురు వచ్చింది. దీనికంతటికి ఒక ముగింపు రాబోతోందని సంతోషంతో ఉండగా మాకు తెలిసిన రఘు తరపు చుట్టాలావిడ ఒకావిడ ఇంటికి వచ్చింది. ఆవిడ చెప్పిన మాటలు నాకు కోపాన్నే తెప్పించాయి.

"రఘు వాళ్ళ అమ్మగారికి చాలా ఆశ ఎక్కువని. దాని వల్ల నా జీవితం అంత సాఫిగా నడవదని. అక్కడ పిల్లని ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించుకోండి" అని చెప్పింది. ఆవిడకు తెలిసిన ఇంకో మంచి సంబంధం ఉంది అని ఎదేదో చెప్పింది. ముందు ఆలోచించినా అమ్మా నాన్నా దానిని పెద్దగా పట్టించుకోలేదు. "ఒక మంచి సంబంధం వస్తే ఇలానే చెడగొట్టేవాళ్ళు ఉంటారు" అని కొట్టిపారేసారు నాన్నగారు.
This entry was posted on Saturday, April 18, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: