Author: Siri
•Friday, April 24, 2009
"నిజమే చాలా మంది మగవాళ్ళకు తెలియదు ఇదంతా? ఆడవాళ్ళు అందించిన టిపిన్లు తిని టీవీ చూసుకోవడం తప్ప. అటు అత్తగారింట్లోనూ, ఇటు తన ఇంట్లోనూ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని అతిధుల్లా ఉంటారు. ఇప్పుడు నాన్నకు కూడా నానమ్మకు ఏదన్నా చెయ్యాలంటే అమ్మే రావాలి, చెయ్యాలి. అమ్మకు ఆవిడ మీద ప్రేమా, ఆప్యాయత నిండి ఉంటే ఇప్పటికి పరుగెత్తుకెళ్ళేది కాదు?" అనుకున్న సంధ్యకు ఒక్కసారిగా తన పరిస్దితి తన తల్లి పరిస్దితి ఒక్కటిగానే తోచింది. తరాలు మారినా చాలా కధలు ఒక్కలాంటివే.


ప్రేమను పెంచుకోవాల్సిన సమయంలో ఎదోక కారణంతో మనసులను దూరం చేసుకోవడం, మళ్ళీ జీవితంలో అలసిపోయాక ప్రేమాభిమానాలు ఆశించడం. సంధ్య నానమ్మకు కాస్త ఓపిక రావడంతో అందరితో మాట్లాడాలి అని ఆవిడ ఫోన్ చేయించింది. ఆవిడ ప్రతి మాటలో ఆప్యాయత, ప్రేమ మాత్రమే వినిపించాయి సంధ్యకు.

"ఎలా ఉన్నావమ్మా సంధ్యా? మళ్ళీ చూస్తానో లేదో అనుకున్నా తల్లీ. ఒక్కసారి వెళ్ళే ముందు చూసి వెళ్ళు. మళ్ళీ రెండేళ్ళకు వచ్చేసరికి ఈ ముసలి నానమ్మ ఉంటుందో లేదో? వీలైతే అమ్మను నాన్నను ఒక వారం ఉండి వెళ్ళమను. అందరిని చూడాలని ఉంది." అని కన్నీళ్ళు పెట్టుకొంది.

సంధ్య మనసు భారమయిపోయింది.

"కానీ నానమ్మ మాటలు తల్లిని కదిలించగలదా? రేపు తనకూ ఈ పరిస్దితి వస్తే తను ఎలా స్పందిస్తుంది? తనను అత్తగారు శత్రువులా చూసినా ఆవిడ రఘు మీద, పిల్లల మీదా చూపించే ప్రేమ స్వచ్చమైనదే. రఘు కోసం తను మారగలదా? మనసులో ఎలాంటి ద్వేషం లేకుండా చూసుకోగలదా ?" అని అనుకుంది.

ఏదో స్పురించినట్లు తల్లి పక్కన కూర్చుంది.

"చూడు అమ్మా! నానమ్మ అంత మంది ఉండగా నిన్నూ, నాన్నను చూడాలనుకుంటోంది అంటే నీ చేత చాకిరి చేయించుకోవాలని కాదు. నానమ్మ నీ మంచితనం అర్ధం చేసుకుంది కాబట్టే ఇలాంటప్పుడు మీరు దగ్గర ఉండాలని కోరుకుంటోంది. నానమ్మ అని కాకపోయినా ఒక ఆపదలో ఉన్న మనిషికి సేవ చేసినట్లు అనుకొని ఒక వారం ఉండి వచ్చేయి. ఆపైన బలవంతం చెయ్యొద్దు అని నాన్నకు చెప్తాను" అని తల్లికి సర్ది చెప్పడానికి చూసింది సంధ్య.

తల్లికి చెప్పిన మాటలు తన కోసం కూడా చెప్పుకునట్టు అనుకుంది సంధ్య. తల్లి వెళ్ళడానికి ఆమోదం తెలపడంతో సంధ్య తండ్రితో అత్తగారింటికి బయలుదేరింది.

"వారం రోజులు ఉండి వచ్చేయి సంధ్యా. మళ్ళి రెండు వారాల్లో వెళ్ళిపోతారు. అప్పుడే రావడం వెళ్ళిపోవడం అయిపోతోంది." అని కళ్ళు తుడుచుకుంది తల్లి.

"మీరెప్పుడు చిన్నపిల్లలుగా ఉండిపోతే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. అందరం డాబా పైన కూర్చొని భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. హాయిగా గడిచిపోయేది" అన్నారు సంధ్య తండ్రి పాత రోజులు గుర్తు తెచ్చుకొని.

"నిజమే నాన్నా. కానీ అప్పుడు మనం కుటుంబంగా ఒకటిగా ఉన్నప్పుడు ఉన్న సంతోషం ముందు మనకున్న బాధలు పెద్దవిగా అనిపించేవి కావు. ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఎక్కడో ఉండడం వల్ల చిన్నవి కూడా పెద్దవిగా కనపడుతున్నాయి." అని ఇద్దరికి నమస్కరించింది.

పిల్లలను తీసుకొని తండ్రితో పాటు బయలుదేరింది. స్టేషన్ చేరుకొని ట్రైన్ ఎక్కేదాకా కూడా సంధ్య తన తండ్రి ఆలోచనలో ఉండడం గమనిస్తూనే ఉంది.

"బాధపడకు నాన్నా. నానమ్మ తొందరగానే కోలుకుంటుంది. అదే ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడుచేసుకోకు." అంది ధైర్యం చెప్తూ.

"అన్ని విషయాల్లో నాకు సహకరించే అమ్మ, ఈ విషయాల్లో ఎందుకు మొండిగా ప్రవర్తిస్తుందో అర్ధం కాదు" అన్నారు ఒక్కసారిగా.

"అది చాలా చిక్కు ముడులున్న ప్రశ్న నాన్నా. అమ్మ అలా ప్రవర్తించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీకు గానీ రఘుకి గానీ అర్ధం కాకపోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాను నేను." అని చిన్నగా నవ్వింది.

ఆయన అర్ధం కానట్టు చూసారు. మళ్ళీ ఏదో అర్ధం అయినట్టు మౌనంగా ఉండిపోయారు. పిల్లలు ఇద్దరూ ఆయన పక్కన చేరారు.

"ఎక్కడికి వెళ్తున్నాము తాతయ్యా" అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసారు. సంధ్య కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉండిపోయింది.

"కుటుంబంలో స్వచ్చమైన ప్రేమ ఉన్నప్పుడే సంతోషం వెల్లి విరిస్తుంది. స్వార్ధాలతో, అసూయ ద్వేషాలతో ఉన్నప్పుడు అన్నీ కష్టాలుగానే ఉంటాయి. తను ఎలాగూ అత్తగారి నుండి విడాకులు తీసుకోలేదు. నచ్చలేదని వదిలి వెళ్ళిపోడానికి ఆవిడ ఎవరో కాదు. రఘు కన్న తల్లి. నాకున్న ఈ జీవితాన్ని విడిచి ఎక్కడకు వెళ్ళలేను .ఆవిడను ద్వేషిండం తేలిక. ద్వేషంతో ప్రవర్తిస్తే ఆవిడకు నాకు తేడా ఏముంది? ఎలాగైనా ఆవిడలో మార్పు వచ్చేలా చూడాలి. లోపల ఒకటి పైన ఇంకొకటిగా బతకలేదు. నిజమైన అభిమానంతో సంతోషంగా బతకాలి. ఆవిడతో మనస్పూర్తిగా మనసు విప్పి మాట్లాడాలి. ఇది ప్రతీ ఆడపిల్ల తనకు తానుగా పోరాడవల్సిన యుద్దం. ఇందులో ఏ తండ్రి, ఏ రఘు సహాయం చెయ్యరు చెయ్యలేరు" అని అనుకొంది.

"సంధ్య ఊరు వచ్చేసింది అమ్మా సామాన్లు తీసుకో" అని తండ్రి పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చింది.

"నేను వెంటనే మళ్ళీ మన ఊరు తిరిగి వెళ్ళిపోతాను. మీ అత్తగారు, మామగారు ఏమన్నా అనుకుంటారేమో. ఎలా సంబాళించుకుంటావో మరి జాగ్రత్త" అన్నారు ఆందోళన చెందుతూ.

"ఫర్వాలేదు నాన్నా నా గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. నేను చూసుకుంటాను." అని ధైర్యం చెప్పింది. రాబోయే కాలం ఎలాంటి మార్పును తెస్తుందో తెలియదు. అప్పటి వరకు ఆశతో జీవించడం తప్ప తాను చేయగలిగింది ఏమి లేదు అని అడుగు ముందుకు వేసింది సంధ్య.


This entry was posted on Friday, April 24, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 comments:

On October 29, 2009 at 3:53 PM , Rani said...

మీ కథ ఇప్పుడె చదివాను. బావుంది :)
keep writing.

 
On October 29, 2009 at 5:52 PM , Mauli said...

మంచి నిర్ణయం. కానీ తలదించుకొని వుండవద్దు. మీరు మీ వాదన మీ అత్తయ్య గారికి వినిపిస్తేనే ఆమె లో మార్పు వచ్చేది. ఇటువంటి ఇబ్బందులు ఉన్నచోట యుద్ధం చెయ్యాల్సిందే.

చాల మంది మగపిల్లలకి తల్లి దైవం. అందులో తప్పులేదు. అది పిల్లల తప్పు కాదు. మన దేశం లో ఎంతో మంది స్త్రీలు ఎన్నో కారణాల వల్ల భర్త ని నమ్మరు. కొడుకుని నమ్ముతారు. తన రక్తం అయిన కొడుకుని తనకి దేవుడు ఇచ్చిన అండ అనుకొంటారు. తన ప్రేమతో ఆ కొడుక్కి బంధం వేస్తారు. బయట ఎంతో సమర్ధుడైన వ్యక్తి గృహవసరమైన కొన్ని విషయాల్లో తల్లి మాట తు . చ తప్పక పాటిస్తాడు. తల్లి చెప్పినదే కరెక్ట్ అనుకొంటాడు.


అతను మంచివాడే కావచ్చు. తల్లి తన కోసం యెంత కష్టపడిందో చిన్నప్పటి నుంచీ చెప్పడం వల్ల అతనికి తనకోసం తల్లిలా కష్ట పడే వ్యక్తి ఇంకెవ్వరూ లేరనే నమ్మకం తెలియకుండానే ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ భార్యని పరాయి వ్యక్తి గ 'నువ్వు మా ఇంటికి వచ్చిన మనిషివి' అన్నట్లే చూస్తారు . ఇది అతని లో బలహీనత. అర్ధం చేసికొంటే బాగానే ఉంటుంది. కానీ చాల శ్రమ ఓర్పు అవసరం. ఆవిడకి ఇది ఒక స్వార్ధం అనే విషయం అర్ధం అయ్యేలా చూడాలి. దీనికి కాస్త యుద్దమే జరుగుతుంది.

తప్పదు మరి. పెళ్లి అంటే సరియైన వ్యక్తి జత రాకుంటే యుద్దమే మరి. యుద్ధం లో గెలిస్తేనే కదా శాంతి వచ్చేది మరి.

 
On October 29, 2009 at 6:47 PM , swathi said...

మీ కథ ఇప్పుడె చదివాను. బావుంది :)

 
On October 30, 2009 at 6:33 AM , Mauli said...

idi kadha annamaata :)

 
On November 2, 2009 at 10:46 AM , Siri said...

Thank you Rani ,Mauli ,Swathi :)

@Mauli

అవునండి ఇది కధ .....కానీ కొన్ని నా చుట్టు నేను చూసిన విషయాలు ఆధారంగానే రాసాను ....

Thank you for you good words :)