Author: Siri
•Thursday, April 23, 2009
అలా మొదలయ్యిన మా పరిచయం, బంధం ముళ్ళమీదే సాగింది. అడు గడుగునా ఆవిడ అక్కసు అంతా ఎదో రూపంగా నా మీద మాటలతో తీర్చుకుంది. నేను అక్కడే ఉన్నాను అన్న ధ్యాశ కూడా లేకుండా మామగారితో "అందరికి మంచి సంబంధాలే కుదురుతాయి. మనకు మాత్రం ఇలాంటి సంబంధం వచ్చి కుదిరింది. పిచ్చి వెధవ ఒక్క సరదా తీరలేదు. దేనికది కక్కుర్తిగానే కానిచ్చేసారు" అని సణగడం మొదలుపెట్టేది ఆవిడ.

పెళ్ళి అయిన పదిరోజులకు ఇద్దరం కేరళా వెళ్ళాము. పెళ్ళీకి ముందే అంతా ప్లాన్ చేసి ఉంచాడు. అప్పటి వరకు ఒంటరిగా మాట్లాడలేని నేను రఘుతో గొడవ పెట్టుకున్నాను. విహారానికి వచ్చామనే కాని పది రోజులు ఇద్దరి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. సంతోషమన్నదే లేదు. చివరకు ఏమనుకున్నాడో కానీ క్షమించమని ప్రాధేయ పడ్డాడు.

"ఇక నుంచి నాకు తోచినంత సహాయం మీ నాన్నగారికి చేస్తాను. ఇప్పుడు హాయిగా ఉన్న సమయంలో అవన్నీ గుర్తు చేసుకొని మూడ్ పాడు చెయ్యకు" అని వేడుకున్నాడు.

మరీ మొండితనంగా ఉంటే బాగుండదని కొన్ని రోజులు అన్నీ మర్చిపోవాలని అనుకున్నాను.

ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీర్వచనం మా ఇద్దరి జీవితం మరింత పటిష్టం చేస్తుందని నమ్మాను. కానీ నా విషయంలో దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అత్తగారి ప్రవర్తన మా మధ్య ఎప్పుడూ ఏదో గొడవలు రేపుతూనే ఉంది. కొంత వరకు ఆవిడ చేసిన మానసిక హింస నుండి నన్ను కాపాడలేకపోయినందుకు రఘుని క్షమించలేకపోయాను. అతని ప్రేమ కేవలం శారీరకమైనది మాత్రమే అని తన మీద నిజమైన ప్రేమ లేదు అని ఎన్నో సార్లు నిందించాను. నెమ్మదిగా రఘుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాను. ఇద్దరికి మధ్య చనువు పెరగడంతో రఘు మరీ తాను ఊహించినంత చెడ్డవాడు కాదు అని అర్ధం చేసుకున్నాను. మళ్ళీ మాలో ప్రేమ చిగురించింది. కానీ పెళ్ళి తాలూకు చేదు జ్ఞాపకాలు మాత్రం చాలా ఘాడంగా నాటుకుపోయాయి. రఘుని తప్ప ఇంకెవరిని దగ్గర చేసుకోలేకపోయాను. ఎంత ప్రయత్నించినా ద్వేషం పెరుగుతూనే పోయింది.

అత్తగారికి దగ్గరయ్యే కొద్ది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పదేళ్ళుగా ఆవిడకు దగ్గరయ్యే అవకాశమే రాలేదు. ఇంట్లో ఏ విశేషం జరిగినా ఏదో గొడవ పెడుతూనే ఉంది అత్తగారు. మొదటి సారిగా కూతురు పుట్టినప్పుడు బారసాల కని ఎవరినెవరినో వెంటపెట్టుకెళ్ళారు నా పుట్టింటికి. వచ్చిన వాళ్ళకు సరైన చీరలు ఇవ్వలేదని అలిగి కూర్చుంది. ప్రతీసారీ బతిమాలుకోవడమే ఆనవాయితీ అయ్యింది మా ఇంట్లో. ప్రతీసారీ చేతులు కట్టుకొని నిల్చొడం అలవాటు అయిపోయింది అమ్మా నాన్నకు. ఇంట్లో ఏ పండుగా కన్నీళ్ళు పెట్టకుండా జరగలేదు. అత్తగారింట్లో ఏ విశేషం జరిగినా అత్తగారు కనీసం వచ్చినవాళ్ళను మర్యాదకు పలకరించడానికి వచ్చేది కాదు. అక్కడకు వచ్చినా మాదే భాద్యత అన్నట్టు ఉండేవారు అమ్మా నాన్న. ఎవరినైనా పిలవడానికి భయం వేసేది. ఏదోక రాద్దాంతం చేసి వచ్చిన వాళ్ళను హడలకొట్టేది ఆవిడ. నా మనసులో ఆవిడ మీద ఉండాల్సిన అభిమానం తగ్గుతూనే పోయింది. ముఖ్యంగా ఏదోక రకంగా మాటలు విసురుతూ మానసికంగా నన్ను మరింత క్రుంగదీయటంలో ఎప్పుడూ వెనుకంజ వెయ్యలేదు ఆవిడ.

చివరకు ఉన్న కాస్త గౌరవం కూడా కొంచెం కొంచెంగా హరించి పోయింది. అదృష్టవసాత్తు రఘుకి అమెరికా ఉద్యోగం రావడంతో మా జీవితం మారింది. రోజువారీ గొడవలు ఏమి లేకుండా హాయిగా రెండేళ్ళకు ఒకసారి వచ్చే వాళ్ళం. రఘు ఉన్నన్ని రోజులు అత్తగారింట్లో, మిగతా రోజులు అన్నీ పుట్టింట్లో గడిపి వచ్చేవాళ్ళం. రఘు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నా తల్లితండ్రులకు అప్పుడప్పుడు సహాయం చేసాడు. రఘు కొంచెం కొంచెం నన్ను నా బాధను అర్ధం చేసుకోవడం వల్ల తను ఉన్నప్పుడు నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు. రఘు లేకుండా అత్తగారింటికి వెళ్ళడం మాత్రం నాకు మహా కష్టంగా ఉండేది. ఏదో రకంగా తప్పించుకోడానికే చూసేది. వచ్చినప్పుడల్లా ఆవిడ ఏదన్నా అన్నా, మౌనంగానే భరించింది, ఉన్న నాలుగు రోజులు గొడవలు లేకుండ సంతోషంగా ఉండాలి అని.

రఘుకి చెప్పాలన్నా తల్లి మీద చాడీలు చెప్పడం తనకి బాధ కలిగిస్తుంది అని ఎన్నో తనలోనే దాచుకుంది. ఏదన్నా చెప్పినా "లౌక్యం నేర్చుకో సంధ్య. ఎంత మంది సంసారాలు చేసుకు రావటం లేదు. అమ్మని మచ్చిక చేసుకో" అనేవాడు. అంటే స్వాభిమానాన్ని చంపుకొని మనసులో ఒకటి ఉన్నా పైకి మాత్రం ప్రేమ నటించడమా లౌక్యం అంటే? మనిషి ఎదురుగా ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నట్టు నటించి వెనక చాడీలు చెప్పడమా లౌక్యం అంటే? కన్నవాళ్ళకు కూడా ఎప్పుడు తను ఏది తెలియనివ్వలేదు. అత్తగారి మీద చెడుగా చెప్పింది లేదు. జరిగిన వన్నీ అటు రఘు, ఇటు తల్లి తండ్రులు, అత్తగారు అందరూ మర్చిపోయారు. ఒక్క నేను తప్ప. నేను ఇన్ని రోజులూ మర్యదగా నడుచుకోడానికి కారణం, అత్తగారు ఎన్ని రకాలుగా మాటలు విసిరినా అన్నీ భరించి నవ్వుతూ మళ్ళీ అదే ఇంటిలోకి వెళ్ళడానికి కారణం రఘు కోసమే.
This entry was posted on Thursday, April 23, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

On April 23, 2009 at 2:51 PM , asha said...

మీ కధ అంతా చదివాను. నా పెళ్ళి ఇంతకంటే పెద్ద భిన్నంగా ఏమీ జరగలేదు. ఇందులో చాలా సంఘటనలు నాకు జరిగాయి. ఏదో నా కధే చదువుకుంటున్నట్లనిపించింది.

 
On April 23, 2009 at 5:35 PM , రాధిక said...

బాగుందండి.బాగా రాస్తున్నారు.

 
On April 24, 2009 at 3:07 PM , Siri said...

థాంక్స్ భవాని గారు కధ చదివినందుకు :) చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి అనుభవం కలిగి ఉంటుంది.

 
On April 24, 2009 at 3:08 PM , Siri said...

థాంక్స్ రాధిక గారు :)