Author: Siri
•Friday, April 24, 2009


అత్తగారిలో నాకు నచ్చే ఒక్కే ఒక్క గుణం రఘుని అమితంగా ప్రేమించడం. రఘు మీద అమితమైన ప్రేమను కలిగిన ఆవిడలో ఎక్కడో ఒక మూల మంచితనం దాగే ఉండి ఉంటుంది అనే పిచ్చి నమ్మకం. అదొక్క కారణం మాత్రమే మనసుకు నచ్చ చెప్పుకొని ఆవిడతో కొన్ని రోజులు గడపగలిగింది. కానీ వచ్చే ఏడాది అందరం తిరిగి ఇండియా రాబోతున్నాము. పెద్ద కొడుకుగా తల్లి తండ్రులను చూసుకొనే బాధ్యత రఘుదే. ఒక్కే ఇంటిలో కలిసి ఉండబోతున్నాము. మనసులో భావాలని పైకి రాకుండా, ఏ గొడవలూ లేకుండా స్వచ్చమైన అభిమానంతో, ప్రేమతో ఉండగలనని రఘుకి ఎలా ప్రమాణం చెయ్యగలదు? తన సొంత తల్లితండ్రులుగా చూసుకుంటాను అని చేసిన ప్రమాణం ఎలా నెరవేర్చగలదు?.

అత్తగారిలో తల్లిని చూసుకోవాలని అనుకున్న నా కలలన్ని ఒట్టి కలలుగానే మిగిలిపోయాయి. ప్రేమ, అభిమానం అన్నది మొదటి పరిచయంలో, మొదటి మాటలో నుండి రావాలి. అభిమానం, ప్రేమ అన్నది కావాలన్నప్పుడు తెచ్చుకోడానికి బజారులో దొరికే వస్తువా? ఓపిక ఉన్నప్పుడు మాటలతో చిందరవందర చేసి దూరం చేసుకున్న మనుషులు, ఓపిక అంతా అయిపోయినప్పుడు మళ్ళి వారే తమను ప్రేమతో చేరదీయాలి అని ఆశించడం ఎంత వరకు సమంజసం. కొత్తగా పెళ్ళి అయ్యి భయంగా ఆ ఇంట అడుగుపెట్టిన నాకు, చల్లని చూపు, తియ్యని పలకరింపు కోసం తరించిపోయిన నాకు ఆ ఇంట్లో దొరికింది ఏమిటి?

ఒక విషపు చుక్క, గిన్నెడు పాలను కలుషితం చేసినట్టు ఆవిడ అన్న మాటలు ఒక్కొక్కటి నా మనసుని ముక్కలు ముక్కలు చేసాయి. వాటిని అతికించి మళ్ళీ ప్రేమ పుట్టించ గలదా? లేకపోతే రఘు చెప్పినట్టు లౌక్యం నేర్చుకొని చాలా కుటుంబాలలో జరుగుతున్నట్లుగా నాటకపు జీవితం బతకగలదా? ఎంత మంది మనసులను మంచితనాన్ని చంపుకొని అత్తగారు ముందు ఒకరకంగా నటించి, మళ్ళీ ఇటు తిరిగి పుట్టింటి వాళ్ళ దగ్గర ఆవిడనే హేళన చేసి అబద్దపు జీవితాలు బతకటం లేదు? ఒకే ఇంట్లో ఉంటూ సంపూర్ణంగా ప్రేమాభిమానాలతో ఎంత మంది బతుకుతున్నారు? తను వారిలా అలా బతకగలదా? ప్రపంచంలో ఎన్నో రోగాలు మందు కనిపెట్టగలిగారు. మనసులోని మలినాలని పొగొట్టే మందు ఎందుకు కనిపెట్టరు? స్వార్ధం లేని నిజమైన ప్రేమను పుట్టించే మందుని ఎందుకు పుట్టించలేరు? దుఃఖం పంచుకుంటే తరుగుతుంది, సంతోషం పంచుకుంటే పెరుగుతుంది. కానీ అవమానం ఎవరితో పంచుకుంటుంది.

*** *** ***


"సంధ్యా ..సంధ్యా?" అని ఎవరో పిలిస్తున్నట్టు వినిపించి కళ్ళు తెరవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. రాత్రంతా డాబా మీదే ఉండిపోయాను అని అర్ధం అయ్యింది సంధ్యకు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. "ఏమిటి రాత్రంతా ఇక్కడ మంచులో నిద్రపోయావా. ఒంటికి ఏదన్నా అయితే ఎలాగే. పిల్లలు లేచి నీ కోసం అడుగుతున్నారు పద" అని వచ్చింది అమ్మ.

"లేదమ్మా! నిద్ర పట్టక ఇలా వచ్చాను. తెలియకుండానే నిద్రపట్టేసింది." అని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది.

పిల్లల గొడవలో పడిన సంధ్యకు ఫోన్ మ్రోగటంతో రఘు ఏమో అని తొంగి చూసింది. ఫోన్ ఎత్తిన సంధ్య తండ్రి కంగారు పడటంతో ఏం జరిగిందా అని ఇవతలకు వచ్చింది సంధ్య.

"ఏం జరిగింది నాన్నా?" అని సంధ్య కూడా కంగారుపడింది.

"నానమ్మకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ లో చేర్చారు. మళ్ళీ ఏ విషయం బాబాయి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు" అని అన్నారు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ.అవసరమైతే వెళ్ళాల్సి వస్తుంది ఏమో అని ఏర్పాట్లలో పడ్డారు అందరు. మళ్ళీ ఫోన్ కోసం ఎదురు చూస్తుండగా మళ్ళీ ఫోన్ మొగింది.

"కంగారు ఏమీ లేదు ఇప్పుడు కొంచెం తేలికగా ఉంది అని" చెప్పేసరికి అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సంధ్య నానమ్మ చాలా రోజుల నుండి వాళ్ళ బాబాయి ఇంట్లోనే ఉంటోంది. అందరూ ఉద్యోగాలు చెయ్యడంతో ఇప్పటివరకు ఆవిడే అంతా చూసుకునేది. ఇప్పుడు నెల రోజులు కదలడానికి వీల్లేదు అనేసరికి అక్కడ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఆవిడను అక్కడ నుండి ఎక్కడకు పంపడం వీలుకాదు కాబట్టి సంధ్య తల్లి తండ్రులను ఒక నెల ఉండేలా రమ్మని కబురు పెట్టారు సంధ్య బాబాయి వాళ్ళు.

"అక్కడ ఇల్లు చిన్నది. సంధ్య పిల్లలు అందరం ఎలా వెళ్ళి ఉండేది. మీరు మాత్రం వెళ్ళి చూసి వచ్చెయ్యండి." అని సంధ్య తల్లి సలహా ఇచ్చింది.

"సహాయానికి రమ్మంటే నేను మాత్రం వెళ్ళి వచ్చేస్తే ఎలా? నువ్వు కూడా వస్తే బాగుంటుంది." నాన్న అభ్యర్దన.

"అవునమ్మా! బాబాయి పిన్ని మాత్రం ఎన్ని రోజులు సెలవు పెట్టుకొని కూర్చుంటారు? వెళ్ళి కాస్త సహాయం చేసి వచ్చేయండి. నేను ఈ లోపు మా అత్తగారింటికి వెళ్ళి వచ్చేస్తాను. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు కదా" అంది సంధ్య తండ్రితో ఏకిభవిస్తూ.

సంధ్య తల్లికి ఇప్పుడు అక్కడకు వెళ్ళడం ససేమిరా ఇష్టం లేదు. తన ఇంటికి వస్తే స్వతంత్రంగా ఏదైనా చెయ్యగలదు కానీ, ఇంకొకరి ఇంటికి వెళ్ళి అక్కడి ఇంటి బాధ్యత తీసుకోవడం అంటే కష్టమైన పని అని ఆవిడ ఉద్దేశం. అది ఎంత మరిది ఇల్లు అయినా సరే.


"మీ నాన్నకేం? ఎన్నైనా చెప్తారు. ఆయన అందించిన కాఫీ తాగి వేడుక చూస్తారు. నాకసలే కాళ్ళు నెప్పులు. అంత చాకిరి నేనేగా చేసుకోవాలీ. అయినా, ఇన్నిరోజులు అవసరైనప్పుడల్లా పరిగెత్తుకొని వెళ్ళలేదా. మీ చిన్నప్పుడు నెలలు తరబడి ఉండి అన్నీ చేసేదాన్ని. మీ అత్తయ్యలు అందరు అక్కడే ఉండగా ఇప్పుడు పని అనేసరికి నేను గుర్తుకొచ్చాను కామోసు. పిల్లలూ రెండేళ్ళకు వచ్చారు. వాళ్ళకే చేసి పెట్టలేక అవస్దపడుతున్నా. ఇప్పుడు అక్కడ అందరు ఉద్యోగాలు అని వెళ్ళిపోతే అంత చాకిరి నేను చెయ్యలేను" అని అంది ముక్కు తుడుచుకుంటూ.

సంధ్యకు చిన్నప్పుడు తల్లి ఎప్పుడూ నాన్న వైపు వాళ్ళ మీద చాడీలు చెప్పినప్పుడు కోపం ముంచుకొచ్చేది. తల్లి అనవసరంగా రాద్దాంతం చేస్తుంది అని విసుక్కునేది. సంధ్యతో ఎప్పుడూ అందరూ ఆప్యాయంగా ఉండడం వల్ల తల్లి చెప్పేవన్నీ తప్పుగానే తోచేది. ఆవిడకు తన లాగే ఎన్నో కధలు మనసులో గూడుకట్టుకుని ఉన్నాయి అని సంధ్యకు ఇప్పుడిప్పుడే అర్ధమయ్యింది. ఆవిడ అక్కడకు వెళ్ళడానికి ఇష్టపడకపోడానికి కారణం కాళ్ళ నెప్పులు కాదు, ఆవిడ మనుసులో ఏర్పడిన గాయాలు అని సంధ్యకు మాత్రమే అర్ధం అయ్యింది. ఇన్నేళ్ళు కాపురం చేసిన సంధ్య తండ్రి కూడా ఆవిడ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అని తల పట్టుకొని కూర్చున్నారు.


This entry was posted on Friday, April 24, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: