Author: Siri
•Wednesday, April 22, 2009
నా జీవితంలో సంతోషకరమైన రోజు ఇలా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. సంతోషం ఎక్కడా కనిపించలేదు. అందరం ఒకరినొకరు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాము.

అన్నిటి కన్నా నాకు రఘు మీద ఎప్పుడు లేనంత కోపం వచ్చింది. "అసలు అలా ఎలా చెయ్యగలిగాడు. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను నేను ఎంత బాధపడతాను అని కొంచెం కూడా ఆలోచించలేదు. పెళ్ళికి ముందు పన్నెండు పేజీలు ఉత్తరాలు రాసి ప్రేమంతా ఒలకబోసాడు. ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమయ్యినట్టు. చిన్న విషాయనికి ఇంత రాద్దాంతం చేసి నా తండ్రిని అంత మందిలో అవమానించాల్సిన అవసరం ఏంటి."

అప్పటికప్పుడు ఆ పెళ్ళి పందిరి లోంచి పారిపోవాలి అనిపించింది, ఎక్కడికైనా దూరంగా. కానీ ఇప్పటికే అవమాన భారం మోస్తున్న నా తల్లితండ్రులను చూసి ఏమి చెయ్యలేని పరిస్దితి. అప్పుడు కాదు అంటే నష్టపోయేది తను తన వాళ్ళు మాత్రమే అని అన్నీ విషయాలు దిగమింగుకొని మరునాడు జరగబోయే తతంగానికి తయారయ్యాను.

మొదటిసారిగా రఘు తల్లితండ్రుల మీద తెలియకుండానే ఏహ్య భావం కలిగింది. నాకే తెలియకుండా ద్వేషించడం మొదలు పెట్టాను. నా అత్తగారి మొదటి పరిచయంలోనే నాకు సదభిప్రాయం లేకుండా పోయింది. పెళ్ళి కాస్తా అయిపోయింది. రఘు మాత్రం హుషారుగా నవ్వుతూనే ఉన్నాడు. తను మాత్రం మొద్దుబారిపోయినట్టు ఈ లోకంలోనే లేనట్టు ఉండిపోయింది. పెళ్ళి అయ్యి అప్పగింతలు అయిపోయాయి. అమ్మా నాన్నలకు ఇంక కూర్చునే ఓపిక లేదు. ఒక్కసారిగా పదేళ్ళ వయసు మీద పడినట్టు అయిపోయారు. వాళ్ళను వాళ్ళ బాధలతో వదిలేసి తను మాత్రం రంగుల ప్రపంచంలోకి వచ్చేసింది. పెళ్ళికి వాళ్ళు చేసిన అప్పులు, బాధలు ఇంక నావి కావు అని అనుకొని రఘు వెంట వచ్చేసాను.

ఎన్నో రోజుల నుండి ఎదురు చూసిన క్షణాలు వచ్చేసాయి. అత్తగారింటికి వచ్చాను. పెళ్ళిలో జరిగిందంతా పీడకలలా మర్చిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడి మంచి పేరు తెచ్చుకోమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

ఇంటికొచ్చిన దగ్గర నుండి ఒకటే హడావుడి, ఒకటే నవ్వులు. అందరూ సంతోషంగానే ఉన్నారు. రఘు మధ్య మధ్యలో ఏదో అని అందరిని నవ్వించాడు. నాకు మాత్రం ఎంత ప్రయత్నించినా నవ్వు రాలేదు. అమ్మా నాన్నా అంతా సర్దుకున్నారో లేదో. అసలు కంటి నిండా నిద్రపోయారా అనే ధ్యాశ. అంతా కొత్తగా ఉండింది. రఘు తప్ప నాకు ఎవ్వరు పరిచయం లేదు. అమ్మా నాన్నాకు పనులు ఉండడంతో ఎవరో చుట్టాలావిడను పంపించారు నాకు తోడుగా. ఆవిడ ఎక్కడ ఉందో కూడా వచ్చినప్పటి నుండి కనిపించలేదు. సొంత పిన్నులు, బాబాయిలు పెళ్ళిలో జరిగిన గొడవకు భయపడి నాతో రావడం ఇష్టం లేక ఎవరికి వారు తప్పించుకున్నారు. నేను ఒంటరిగా అమ్మా నాన్నలను వదిలి పెట్టి వచ్చిన దిగులులో ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా ఉండిపోయాను.


సాయంత్రం ఊరిలో వాళ్ళందరిని భోజనాలకు పిలిచారు. ఇంటికి చుట్టుపకల ఆడవాళ్ళంతా మధ్యాహ్నం నన్ను చూడటానికి వచ్చారు. అందరూ మెడల నిండా బంగారం నింపుకొని దొర్లుకుంటూ వచ్చారు. వచ్చిన దగ్గర నుండి "పెళ్ళిలో ఏం పెట్టారు, ఏం తెచ్చారు?" అనే వాళ్ళ ద్యాస. ఒళ్ళంతా తడిమి చూసేసారు. ఎవరి కొడుకు పెళ్ళిలో ఎవరు ఎంత పెట్టారు అని ఒకరినొకరు పోల్చుకొని చూసుకోవడమే సరిపోయింది. నన్ను లోపలకు వెళ్ళమని అత్తగారు కబుర్లలో పడింది.

"ఏం పెట్టారు అంటే ఎం చెప్పాలి. నలుగురుని పిలిచి పెళ్ళి చేసారు, అదే మహా భాగ్యం. అడుక్కునే వాళ్ళు కూడా ఇంత కన్నా బాగానే చేస్తారు. ఏదో మా వాడు ఇష్తపడ్డాడని చేసాం కాని, ఒక సరదానా పాడా. భోజనం అయితే ముద్ద నోట్లో పెట్టుకోలేక పోయాము" అని చెప్పుకుంటూ పోయింది.

నాకు ఒక్క నిముషం గుండె కొట్టుకోవడం ఆగి మళ్ళి వేగంగా కొట్టుకో సాగింది. నేను విన్నది నిజం కాకుండా కల అయ్యి ఉంటే బాగుండేది. కాని కల కాదు వాస్తవమే. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా పెళ్ళికి డబ్బులు సమకూర్చి, తమ్ముడు ఒంటి మీద సరైన బట్టలు లేకపోయినా ఫర్వాలేదు నాకు పట్టుచీరలు కొంటే చాలు అని ఎంతో కష్ట పడిన నాన్న కష్టాన్ని ఇంత నీచంగా నలుగురు ముందు అవమాన పరచడం నాకు రక్తం పొంగుకు వచ్చింది. పంటి చివరన కోపాన్ని బిగించి ఉండిపోయాను.
This entry was posted on Wednesday, April 22, 2009 and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: